• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ముందడుగు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా పునర్వినియోగ అంతరిక్ష వాహకనౌక (ఆర్‌ఎల్‌వీ) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్‌ఎల్‌వీ దోహదపడుతుంది. దీనిద్వారా అంతరిక్ష రంగంలో భారత్‌ మరోసారి తన సత్తాను చాటుకుంది.

అంతరిక్ష రంగ పరిశోధనల్లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)- ఇటీవలే పునర్వినియోగ అంతరిక్ష వాహకనౌక ‘రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ అటానమస్‌ ల్యాండింగ్‌ మిషన్‌ (ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌)’ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ వద్ద ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భారత వైమానిక దళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌కు తాళ్ళ ద్వారా వాహకనౌకను కట్టి గాలిలోకి తీసుకెళ్ళి, 4.5 కిలోమీటర్ల ఎత్తున దాన్ని విడిచిపెట్టారు. ఈ తరహా వాహకనౌకను అంత ఎత్తుకు తీసుకెళ్లడం ఇదే తొలిసారి. హెలికాప్టర్‌ నుంచి విడిపోయిన తరవాత మిషన్‌ మేనేజ్‌మెంట్‌ కంప్యూటర్‌ కమాండ్‌ వ్యవస్థ సాయంతో ఈ వాహకనౌక నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా కిందకు దిగింది. తద్వారా మానవ రహితంగా భూమికి చేరుకునే విషయంలో ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌ తన స్వయం ప్రతిపత్తిని చాటుకొంది. ముందుగా సిద్ధం చేసిన ఇంటిగ్రేటెడ్‌ నావిగేషన్‌, గైడెన్స్‌, కంట్రోల్‌ వ్యవస్థలను ఉపయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. భిన్న పరిస్థితుల్లోనూ ఈ వాహక నౌకను సురక్షితంగా భూమిపైకి చేర్చేందుకు మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో అధినేత డాక్టర్‌ సోమనాథ్‌ వెల్లడించారు. సొంత పునర్వినియోగ వాహకనౌకను సమకూర్చుకోవడంలో భారత్‌ ఒక అడుగు దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తగ్గనున్న వ్యయం

పునర్వినియోగానికి అనువైన ‘ఫాల్కన్‌-9’ రాకెట్లతో ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ సంస్థ అంతరిక్ష రంగంలో దూసుకుపోతోంది. 2022లో 61 అంతరిక్ష ప్రయోగాలను ఆ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది. 2023లో ఈ ప్రయోగాలను వందకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి వినియోగించిన ఆర్‌ఎల్‌వీను రెండోసారి వినియోగించడం వల్ల 30శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. వేల కోట్ల రూపాయలున్న ప్రపంచ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీకి దిగి, తక్కువ ధరకే అంతరిక్ష వాహకనౌకల సేవలను అందించాలని ఇస్రో తలపోసింది. ఇందులో భాగంగానే దేశ, విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు వీలుగా పునర్వినియోగ వాహకనౌక రూపకల్పన, తయారీని చేపట్టింది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆర్‌ఎల్‌వీని పరీక్షిస్తోంది.

నిజానికి 2012లోనే పునర్వినియోగ వాహక నౌక సాంకేతిక సన్నాహక కార్యక్రమాన్ని (ఆర్‌ఎల్‌వీ-టీడీని) ఇస్రో చేపట్టింది. ఇందుకు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేసి 2016లో శ్రీహరికోట నుంచి ఆర్‌ఎల్‌వీ-ఆర్‌డీ వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ప్రధానంగా హైపర్‌సోనిక్‌ ఫ్లైట్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (హెచ్‌ఈఎక్స్‌)ను తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఆ సమయంలో వాహకనౌకలోని స్వయం ప్రతిపత్తిగల నావిగేషన్‌తో పాటు మార్గనిర్దేశక, నియంత్రణ వ్యవస్థల పనితీరును శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు. రెండో దశలో మానవ రహితంగా, స్వయం ప్రతిపత్తితో కూడిన ల్యాండింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేశారు. తదనుగుణంగా ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌ను రూపొందించారు. ఇందులో ముక్కు టోపీ, రెండు రెక్కలు, రెండు నిలువు తోకలు, క్రియాశీలంగా వ్యవహరించే ఉపరితల భాగాలను ఏర్పాటు చేశారు. ఈ క్రతువులో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన పలు విభాగాలు పాలుపంచుకున్నాయి.

అదనపు వ్యవస్థలు

ఇస్రో తాజాగా ప్రయోగించిన ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌ భారత పునర్వినియోగ వాహక నౌక కార్యక్రమంలో అత్యంత కీలకంగా నిలవనుంది. స్వయం ప్రతిపత్తితో కూడిన ల్యాండింగ్‌ సామర్థ్యాన్ని చాటుతున్నా- ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రయోగ పరీక్షలన్నీ పూర్తయిన తరవాత తయారయ్యే పునర్వినియోగ వాహకనౌక సామర్థ్యం పెరుగుతుంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన తరవాత దాన్ని సమర్థంగా, సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి మరిన్ని అదనపు వ్యవస్థలు అవసరమవుతాయి. వినియోగించే ప్రతిసారీ మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. తక్కువ దూరం ఉండే ప్రయోగాలను పూర్తిచేసేందుకు ఈ వాహకనౌక ఎంతగానో ఉపయోగపడుతుంది. పునర్వినియోగ వాహక నౌక ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేసిన రోజు- భారత సాంకేతిక సంపత్తి, అంతరిక్ష పరిశోధనా ప్రతిభ అంతర్జాతీయ యవనికపై మరోమారు మిరుమిట్లు గొలుపుతాయి.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పులుల రక్షణలో ప్రాజెక్ట్‌ టైగర్‌

‣ రష్యాకు నాటో గుబులు

‣ మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

‣ రైతుకు తోడ్పాటుతోనే లాభసాటి సాగు

‣ ఎన్నికల సమరాంగణంలో కన్నడసీమ

‣ మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం