• facebook
  • whatsapp
  • telegram

పులుల రక్షణలో ప్రాజెక్ట్‌ టైగర్‌

యాభై ఏళ్ల క్రితం 1973 ఏప్రిల్‌ ఒకటిన ప్రాజెక్ట్‌ టైగర్‌ను భారత్‌ చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన మాంసాహార జంతు సంరక్షణా కార్యక్రమంగా ఇది నిలిచింది. సరదా కోసం జరిగే పులుల వేట దశ నుంచి వాటి సంరక్షణ వైపుగా ఇండియా పయనించడానికి ప్రాజెక్ట్‌ టైగర్‌ తోడ్పడింది.

దేశంలోని తొమ్మిది రక్షిత ప్రాంతాల్లో పద్దెనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యాభై ఏళ్ల క్రితం ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం అది 53 పులుల అభయారణ్యాలతో (టైగర్‌ రిజర్వులతో) సుమారు 76 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య లక్ష ఉండేది. అప్పట్లో భారత్‌లో అవి నలభై వేలు. 1970ల నాటికి ఇండియాలో పులుల సంఖ్య దాదాపు పద్దెనిమిది వందలకు పడిపోయింది. ఆవాసాల నష్టం, పంటపొలాల విస్తరణ, అభివృద్ధి పనుల వల్ల ఆవాసాలు చెదిరిపోవడం, శాకాహార జంతువులు తరిగిపోవడం మొదలైనవి వ్యాఘ్రాల సంఖ్య క్షీణించడానికి ప్రధాన కారణాలు. నాటి బ్రిటిష్‌ పాలకులు, స్థానిక మహారాజులు పెద్ద సంఖ్యలో పులులను వేటాడేవారు. దేశీయంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న పులులను రక్షించడానికి నాటి ప్రధానిగా ఇందిరాగాంధీ మద్దతుతో అటవీ అధికారి, వన్యప్రాణి నిపుణుడు కైలాష్‌ సాంఖలా ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమానికి రూపకల్పన చేసి, మొదటి సంచాలకులుగా వ్యవహరించారు. ఇందులో భాగంగా పులుల రక్షణ, ఆవాస స్థితిగతుల మెరుగుదల కోసం చేపట్టిన కార్యక్రమాల వల్ల వ్యాఘ్ర జాతి తిరిగి కోలుకొంది. 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు పెరిగింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో డెబ్భై శాతం ఇండియాలోనే ఉండటం దేశీయంగా ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమం సాధించిన విజయానికి నిదర్శనం.

ఎన్నో ప్రయోజనాలు  

పెద్దపులి తన ఆధీన ప్రాంతంలో ఉండే అన్ని జీవరాశుల మనుగడకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతుంది. అందువల్ల వ్యాఘ్రాలను కాపాడటమంటే అడవులను, వాటిలోని జీవరాశిని, జీవవైవిధ్యాన్ని రక్షించడమే. పులుల అభయారణ్యాల వల్ల కలిగే ప్రయోజనాల విలువను భారత అటవీ నిర్వహణ సంస్థ (ఐఐఎఫ్‌ఎం), జాతీయ వ్యాఘ్ర సంరక్షణా ప్రాధికారసంస్థ (ఎన్‌టీసీఏ) సంయుక్తంగా లెక్కగట్టాయి. 2019లో కేవలం పది టైగర్‌ రిజర్వుల్లో జరిపిన అధ్యయనం ప్రకారం, వాటి నుంచి ఏటా రూ.5.96 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. టైగర్‌ రిజర్వుల వల్ల కలిగే ఉపాధి అవకాశాలు, కలప, కలపేతర ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం తదితరాలు ప్రత్యక్షంగా కంటికి కనిపించే లాభాలు. కర్బన నిక్షిప్తీకరణం, మంచినీటి సరఫరా, మృత్తికా సంరక్షణ, ఎన్నో జీవజాతులకు ఆవాసంగా ఉండటం, శీతోష్ణస్థితి నియంత్రణ తదితర కంటికి కనిపించని ప్రయోజనాలనూ పులుల అభయారణ్యాలు అందిస్తున్నాయి. టైగర్‌ రిజర్వుల్లో కోర్‌, బఫర్‌ జోన్ల వ్యూహమూ సత్ఫలితాలను ఇచ్చింది. కోర్‌ జోన్లలో మానవ సంచారం, ఇతర కార్యకలాపాలకు అవకాశం ఉండదు కాబట్టి పులులకు అధిక రక్షణ లభిస్తుంది. వాటి నిరాటంక జీవనానికి అవి తోడ్పడతాయి. కోర్‌ జోన్‌ చుట్టూ ఉండే ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా పిలుస్తారు. కోర్‌ జోన్‌లో పులుల సంఖ్య పెరిగి వాటిమధ్య పోటీ తలెత్తినప్పుడు అవి బయటకు వచ్చి నిలదొక్కుకోవడానికి బఫర్‌ జోన్లు తోడ్పడతాయి. బఫర్‌ ప్రాంతంలో పర్యావరణ పర్యాటకానికి (ఎకో టూరిజానికి) అనుమతిస్తారు. కార్బెట్‌ (ఉత్తరాఖండ్‌), కన్హా (మధ్యప్రదేశ్‌), తాడోబా (మహారాష్ట్ర) తదితర టైగర్‌ రిజర్వులు ఎకోటూరిజానికి పేరుగాంచాయి.  

ప్రపంచంలోనే విజయవంతమైన కార్యక్రమంగా పేరుపొందిన ప్రాజెక్ట్‌ టైగర్‌ పలు ఒడుదొడుకులనూ ఎదుర్కొంది. 2006లో ఇండియాలో పులుల సంఖ్య 1,411కు పడిపోయింది. అక్రమ వేట వల్ల 2005 నాటికి రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్‌ రిజర్వ్‌ నుంచి పులులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణ్‌ నేతృత్వంలో ఏర్పాటైన టైగర్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సు మేరకు చట్టబద్ధంగా జాతీయ పులుల ప్రాధికార సంస్థ ఏర్పాటైంది. 2008 నాటికి మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వులోనూ పులులు పూర్తిగా కనుమరుగయ్యాయి. సంరక్షణ చర్యల్లో భాగంగా పెద్దపులులను ఆయా టైగర్‌ రిజర్వుల్లోకి తిరిగి ప్రవేశపెట్టడం వల్ల పదేళ్ల కాలంలో అవి పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.

తప్పని సవాళ్లు

మానవ జనాభా పెరుగుదల వల్ల కలిగే ఒత్తిడి, వన్యప్రాణి ఆవాసాల నష్టం, అంతర్జాతీయ విపణిలో పులి శరీరభాగాలకు ఉన్న గిరాకీ కారణంగా జరుగుతున్న వేట తదితరాలు ప్రాజెక్ట్‌ టైగర్‌ కార్యక్రమానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయి. పులుల భద్రతను కట్టుదిట్టం చేయడం, వాటి ఆవాసాల నాశనాన్ని అరికట్టడం, శాకాహార జంతువుల రక్షణ, వ్యాఘ్రాలు సంచరించే ప్రాంతాల మధ్య ప్రత్యేక నడవాల ఏర్పాటు తదితర చర్యలు ప్రాజెక్ట్‌ టైగర్‌ సమర్థంగా ముందుకు సాగడానికి తోడ్పడతాయి. ఇందుకోసం స్థానికుల భాగస్వామ్యం, తగిన నిధుల కేటాయింపు అత్యావశ్యకం. అన్ని టైగర్‌ రిజర్వులు, అడవుల్లో పులుల సాంద్రత పెరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. పెద్దపులి-మానవ ఘర్షణ సమస్యను ప్రధాన సమస్యగా పరిగణించి పరిష్కరించాలి.

కంబోడియాకు మన పులులు

పదిహేను నెలల పాటు 2018-19లో చేపట్టిన పులుల గణనలో ఏకంగా 44 వేల మంది అధికారులు, వన్యప్రాణి, జీవ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 20 రాష్ట్రాల్లో రహస్య కెమెరాలు, ఇతర పద్ధతుల ద్వారా నిర్వహించిన ‘పులులు, ఇతర వన్యప్రాణుల గణన’ గిన్నిస్‌ రికార్డుకు ఎక్కింది. ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో నేడు జరగనున్న కార్యక్రమంలో తాజాగా నిర్వహించిన అఖిల భారత పులుల అంచనా నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి (ఐబీసీఏ)నీ ఆయన ప్రారంభిస్తారు. పులుల సంరక్షణ కార్యక్రమం విజయానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణేన్ని ప్రధాని విడుదల చేస్తారు. ఒకప్పుడు పులులకు ఆవాసంగా ఉండి, నేడు అవి అంతరించిపోయిన కంబోడియా దేశంలోకి ఇండియా నుంచి వ్యాఘ్రాలను తిరిగి ప్రవేశపెట్టనున్నారు.

- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రష్యాకు నాటో గుబులు

‣ మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

‣ రైతుకు తోడ్పాటుతోనే లాభసాటి సాగు

‣ ఎన్నికల సమరాంగణంలో కన్నడసీమ

‣ మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం