• facebook
  • whatsapp
  • telegram

కృత్రిమ మేధ కొత్తపుంతలు

కృత్రిమమేధ ఆవిష్కరణలతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సాంకేతికత ఆధారంగా తాజాగా ఆవిష్కృతమైన చాట్‌ జీపీటీ... వెబ్‌ ప్రపంచాన్ని సమూలంగా మార్చివేస్తోంది. ముఖ్యంగా గణిత, వైద్య, న్యాయ, మానసిక శాస్త్రాలు, కోడింగ్‌కు సంబంధించి అడిగే కఠిన ప్రశ్నలకు వెంటనే సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తోంది. సమీప భవిష్యత్తులో సమాజానికి ఇది సవాలు విసరనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని కృత్రిమమేధ (ఏఐ) కొత్తపుంతలు తొక్కిస్తోంది. అమెరికాకు చెందిన ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల ఆవిష్కరించిన చాట్‌ జీపీటీ-4 మానవ మేధతో పోటీపడుతోంది. అన్ని రంగాల్లోనూ దీన్ని వినియోగించేందుకు రంగం సిద్ధమైంది. జీపీటీ రాకతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఇటలీ చాట్‌ జీపీటీని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకొంది.

విశేష ఆదరణ..

మనకు ఏ సమాచారం కావాలన్నా చాట్‌ జీపీటీలో టైప్‌ చేస్తే... వెబ్‌ ప్రపంచంలోని సమాచారాన్ని క్రోడీకరించి రెప్పపాటులో అది వినియోగదారులకు సమాధానం ఇస్తోంది. దాంతో ఈ అప్లికేషన్‌ విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న చాట్‌బాట్‌లను తలదన్నేలా అత్యాధునిక కృత్రిమమేధ (ఏఐ) పరిజ్ఞానంతో ఇది రూపుదిద్దుకొంది. దీని విశిష్టతను గుర్తించిన గూగుల్‌, మెటా వంటి సంస్థలు జీపీటీ రంగంలోకి వస్తున్నాయి. ఫొటోలను అనుకున్న రీతిలో డిజైన్‌చేసే ‘దాల్‌-ఈ2’, రాయడానికి దోహదపడే ఏఐ ఆధారిత అప్లికేషన్లు సంచలనాలకు తెరతీశాయి. ప్రభుత్వాలు, ఏఐ నిపుణులు కలిసి కార్యాచరణకు ఉపక్రమిస్తే- పాలనలో ఆదర్శప్రాయమైన సంస్కరణలను తీసుకొచ్చే అవకాశముంది.

చాట్‌ జీపీటీ-3 పదాల రూపంలో సమాచారం ఇవ్వగా, తరవాతి దశ అప్లికేషన్‌ ద్వారా చిత్రాల రూపంలోనూ సమాధానాలు పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. చాట్‌ జీపీటీ-5 వీడియోల రూపంలో సమాచారం ఇవ్వనుంది. పది లక్షల మంది వినియోగదారులను ఆకర్షించడానికి దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లకు పదినెలల నుంచి రెండేళ్ల సమయం పట్టింది. చాట్‌ జీపీటీ కేవలం అయిదు రోజుల్లోనే అంతమందిని చేర్చుకొంది. ఈ ఏడాది చివరినాటికి చాట్‌ జీపీటీ-5 విడుదలయ్యే అవకాశముంది. ఇందులో ఉపయోగించే కృత్రిమమేధ... మానవుడి సహజమేధ స్థాయిలో ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మనకు అవసరమైన అంశానికి సంబంధించి కీలక పదాలను (కీవర్డ్స్‌)ను ఇవ్వడం ద్వారా చాట్‌బాట్‌ల నుంచి మనం సమాచారం తీసుకుంటాం. అయితే, తదుపరితరం చాట్‌ జీపీటీ మనిషిలా ఆలోచించి సమాధానాలు ఇస్తుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఆధారిత యంత్రాలకు ఆ స్థాయి ఆలోచనా సామర్థ్యం చేకూరితే- సమాజానికి అవి సవాలుగా మారతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మలితరం జీపీటీ అభివృద్ధి, పరిశోధనలపై కనీసం ఆరు నెలల పాటు మారటోరియం విధించాలని ఎలాన్‌ మస్క్‌ సహా కంప్యూటర్‌ రంగానికి చెందిన ప్రముఖులెందరో డిమాండ్‌ చేస్తున్నారు.

నియంత్రణ లేమి..

అమెరికాలోని అసిలోమార్‌లో 2017లో నిర్వహించిన కృత్రిమమేధ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల జీవితాల్లో మార్పులకు నాంది పలికేలా, ప్రణాళికాబద్ధంగా ఏఐ అభివృద్ధి సాగాలని అప్పట్లో భావించారు. కానీ, ఇప్పుడు కృత్రిమమేధ ఆధారిత వ్యవస్థలను సృష్టించేందుకు జరుగుతున్న పోటీలో ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదు. పోటీ ఇలాగే కొనసాగితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్న నకిలీ వార్తల తరహాలో అవాస్తవమైన సమాచారం చాట్‌ బాట్లలో నిండిపోయే ప్రమాదముంది. చాట్‌ జీపీటీ సేకరించే వివరాలు ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటంతో పాటు కోట్లమంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అవి ఇతరులకు చేరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. మలితరం చాట్‌ జీపీటీపై పరిశోధనలకు ఆరు నెలలపాటు విరామం ఇస్తే- రక్షణ విధానాలను రూపొందించే అవకాశం కృత్రిమమేధా సంస్థలకు లభిస్తుందన్నది సైబర్‌ వర్గాల భావన. కీలక సమాచారాన్ని ఉగ్రవాదులకు చేర్చకుండా ఏఐ సాంకేతికత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సాఫ్ట్‌వేర్‌ రంగం సూచిస్తోంది. చాట్‌ జీపీటీ అందించే సమాచారం సమగ్రంగా ఉండటంలేదని, మానవ మేధతో ఏఐ పోటీపడటం ఎప్పటికీ జరగదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. కృత్రిమమేధ వంటి ఆధునిక సాంకేతికతలను ఎంతగా అభివృద్ధిచేసినా, అంతిమంగా అవి మనిషి నియంత్రణలో ఉండటమే క్షేమదాయకం.

- కొలకలూరి శ్రీధర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

‣ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ముందడుగు

‣ పులుల రక్షణలో ప్రాజెక్ట్‌ టైగర్‌

‣ రష్యాకు నాటో గుబులు

‣ మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం