• facebook
  • whatsapp
  • telegram

న్యాయవాద వృత్తిలో విదేశీ వకీళ్లు

భారత్‌లో విదేశీ న్యాయ వాదులు, న్యాయ సలహా సంస్థల నమోదు, నియంత్రణకు నిరుడు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పలు నిబంధనలు రూపొందించింది. వాటిని కేంద్రం ఇటీవల గెజెట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది. ఇండియాలో న్యాయవాద వృత్తిపై ప్రగాఢ ప్రభావం చూపే అంశమిది.

భారత్‌లో 1961 నాటి న్యాయవాదుల చట్టం వివిధ తరహా వకీళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. న్యాయవాద వృత్తికి కావాల్సిన అర్హతలేమిటో అది నిర్దేశించింది. అఖిల భారత, రాష్ట్రాల స్థాయిలో బార్‌ కౌన్సిళ్లను ఆ చట్టం ఏర్పరచింది. న్యాయవాదుల సభ్యత్వం, వారి విద్యార్హతలు, అనుసరించాల్సిన నైతిక ప్రమాణాలు, క్రమశిక్షణ, న్యాయ విద్య, సంక్షేమ కార్యకలాపాలు తదితరాలను నిర్దేశించే అధికారాన్ని ఆ చట్టం బార్‌ కౌన్సిళ్లకు ఇచ్చింది. రిజర్వు బ్యాంకు గతంలోనే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు చెందిన న్యాయ సంస్థలకు భారత్‌లో సమన్వయాధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. 1973నాటి విదేశ మారక ద్రవ్య నియంత్రణ చట్టంలోని 29వ సెక్షన్‌ కింద రిజర్వు బ్యాంకు ఇచ్చిన అనుమతిని 1995లో బాంబే హైకోర్టులో లాయర్స్‌ కలెక్టివ్‌ అనే సంస్థ సవాలు చేయగా, కోర్టు ఆ అనుమతిని కొట్టివేసింది.

రద్దుకు అవకాశం

మద్రాసు హైకోర్టు సైతం విదేశీ న్యాయ సంస్థలు, న్యాయవాదులు భారత్‌లో ఇతర దేశాల చట్టాలు, అంతర్జాతీయ సమస్యలకు సంబంధించి మాత్రమే తమ క్లయింట్లకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని 2012లో స్పష్టం చేసింది. వారు ఇక్కడ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదని, తాత్కాలిక ప్రాతిపదికపై భారత్‌కు వచ్చి పోవచ్చని సూచించింది. మధ్యవర్తిత్వం కోసం విదేశీ న్యాయవాదులు భారత్‌కు రాకుండా నిషేధించలేమని స్పష్టం చేసింది. ఇక 2018లో ఇచ్చిన తీర్పులో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) వద్ద రిజిస్టరైన విదేశీ న్యాయ సంస్థలు మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్‌ చేయవచ్చని సుప్రీంకోర్టు తేల్చింది. భారత పౌరుల పట్ల దుర్విచక్షణ కనబరచే దేశాలకు చెందిన న్యాయవాదులు, న్యాయ సంస్థలు మాత్రం ఇక్కడ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదని సూచించింది. అయితే, విదేశీ చట్టాలు, అంతర్జాతీయ న్యాయ సంబంధ వ్యవహారాలు, మధ్యవర్తిత్వ అంశాలపై విదేశీ లాయర్లు, న్యాయ సంస్థలు భారత్‌లో ప్రాక్టీసు చేసేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది. వాటికి సంబంధించి పలు నిబంధనలను రూపొందించింది. వాటిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని భారత్‌లో కొన్ని న్యాయ సంస్థలు వ్యతిరేకిస్తున్నా బీసీఐ మాత్రం సమర్థిస్తోంది. ఒక దేశం నుంచి ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళడం ఎక్కువైన ఈ రోజుల్లో న్యాయవాద వృత్తి సైతం కాలానుగుణంగా మారక తప్పదని బీసీఐ చెబుతోంది. 

బీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ వకీళ్లు, సంస్థలు ఇండియాలోని ఏ కోర్టు, ట్రైబ్యునల్‌, బోర్డు లేదా సాక్ష్యాధారాలు నమోదు చేసే మరే న్యాయసంస్థ ముందూ ప్రాక్టీస్‌ చేయకూడదు. వారు కంపెనీ చట్టానికి సంబంధించిన వ్యవహారాల్లోనే సలహాలు ఇవ్వాలి. కంపెనీల విలీనాలు, స్వాధీనాలు, మేధా హక్కులు, కాంట్రాక్టు పత్రాల రూపకల్పనకు సంబంధించి తమ సేవలను అందించవచ్చు. ఇవే సేవలను భారతీయ న్యాయవాదులు విదేశాల్లో అందించే వెసులుబాటు సైతం ఉండాలి. విదేశీ వకీళ్లు ఇక్కడి నిబంధనలను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించినా, అనుచిత వర్తనకు పాల్పడినా వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ అధికారం రాష్ట్ర కౌన్సిళ్లకు కాకుండా అఖిల భారత బార్‌ కౌన్సిల్‌కు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే- విదేశీ కంపెనీలు, వ్యక్తులు, సంఘాల తరఫున భారత్‌లో వకాల్తా పుచ్చుకోవడానికి మాత్రమే విదేశీ న్యాయవాదులకు అనుమతి ఉంటుంది. జాతీయ ప్రయోజనాలు, భద్రత దృష్ట్యా విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థల నమోదును, పునరుద్ధరణను రద్దు చేయాలని బీసీఐకి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయవచ్చు.

నిష్ణాతులకు గిరాకీ

విదేశీ న్యాయ సంస్థలు భారత్‌లో ప్రాక్టీస్‌ చేసినా దానివల్ల సాధారణ కేసుల్లో వాదించే మన న్యాయవాదులపై ప్రభావమేమీ ఉండదు. అగ్రశ్రేణి కంపెనీల తరఫున కోర్టు వ్యవహారాలను చూసే భారతీయ న్యాయ సంస్థలపైనే ప్రభావం ఉంటుంది. ఈ సంస్థల నుంచి న్యాయవాదులను విదేశీ సంస్థలు ఆకర్షించవచ్చు. ముఖ్యంగా కార్పొరేట్‌, అంతర్జాతీయ కంపెనీ చట్టాలు, మేధా హక్కులు, మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో నిష్ణాతులైన భారతీయ న్యాయవాదులకు గిరాకీ పెరుగుతుంది. అదే సమయంలో భారతీయ కంపెనీలు ఉన్నపళాన విదేశీ న్యాయ సలహా సంస్థల ఖాతాదారులుగా మారిపోయే అవకాశం లేదు. విదేశీయులకు సేవలు అందిస్తున్న భారతీయ న్యాయ సంస్థలు తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకోవలసి ఉంటుంది. అలాగే విదేశీ సంస్థలతో కలిసి సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయడమూ అధికం కావచ్చు. సంపన్న దేశాల చట్టాలు, చరిత్రాత్మక కేసుల గురించి అవగాహన కలిగిన భారతీయ న్యాయవాదులు, న్యాయ సలహా సంస్థలకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఆచి తూచి అడుగులు

భారత్‌లో ప్రాక్టీస్‌ చేయాలనుకునే విదేశీ న్యాయవాది తప్పనిసరిగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వద్ద నమోదవ్వాలి. ఇక్కడి నియమ నిబంధనలు, షరతులకు లోబడి పనిచేయాలి. అలాంటివారికి ఇండియాలో గరిష్ఠంగా అయిదేళ్లపాటు ప్రాక్టీస్‌ చేయడానికి అనుమతిస్తారు. ఆ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే లైసెన్సు పునరుద్ధరణకు దరఖాస్తు చేయాలి. విదేశాల నుంచి భారత్‌కు తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చి క్లయింట్లకు సలహాలిచ్చి తిరిగి వెళ్ళిపోయే విదేశీ న్యాయవాదులకు ఏడాదిలో 60 రోజులు మాత్రమే అనుమతి లభిస్తుంది. భారత్‌లో వ్యక్తిగత విదేశీ న్యాయవాది రిజిస్ట్రేషన్‌కు 25,000 డాలర్ల (రూ.20.50 లక్షల) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ న్యాయ సంస్థ అయితే 50,000 డాలర్లు (రూ.41 లక్షలు) చెల్లించాలి. లైసెన్సు పునరుద్ధరణకు వ్యక్తుల నుంచి 10,000 డాలర్లు, సంస్థల నుంచి 20,000 డాలర్లు వసూలు చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్‌, గ్యారంటీలకు అదనంగా 50,000 డాలర్లు చెల్లించాలి. విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థలు వ్యాపార, పారిశ్రామిక కంపెనీల మాదిరిగా స్వేచ్ఛగా భారత్‌కు వచ్చి కార్యకలాపాలు కొనసాగించవచ్చునన్నది ఈ రుసుముల ఉద్దేశం కాదు. విదేశీయుల వల్ల భారత న్యాయవాదులు, న్యాయ సంస్థల కార్యకలాపాలు విచ్ఛిన్నం కాకుండా చూడాలని బార్‌ కౌన్సిల్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధ కొత్తపుంతలు

‣ గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

‣ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ముందడుగు

‣ పులుల రక్షణలో ప్రాజెక్ట్‌ టైగర్‌

‣ రష్యాకు నాటో గుబులు

‣ మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం