‣ ఏపీ గ్రూప్-1 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జూన్ నెలకు వాయిదా పడటంతో అభ్యర్థులు నియామక పరీక్షకు సమగ్రంగా సన్నద్ధం కావడానికి తగిన వ్యవధి దొరికింది. అయితే ఈ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని మెరుగైన మార్కులు సాధించే అవకాశాలుఉన్నాయో పరిశీలిద్దాం!
తెలుగు, ఇంగ్లిషు భాషలపై నిర్వహించే క్వాలిఫైయింగ్ పరీక్షలు కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నర్సరీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదివిన చాలామంది అభ్యర్థులు తెలుగులో మాట్లాడగలుగుతున్నారు కానీ తెలుగులో రాయడాన్నీ, చదవడాన్నీ క్లిష్టంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు (టెకీలు) ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వీరు తెలుగు భాషలో అనర్హులయ్యే ప్రమాదముంది. అందుకని లభించిన ఈ సమయంలో తెలుగు భాష వేగంగా చదవడం, రాయడం సాధన చేయాలి.
గ్రామీణ అభ్యర్థుల్లో చాలామందికి ఇప్పటికీ ఇంగ్లిష్ భాషలో అతి కష్టమ్మీద మార్కులు వస్తున్నాయి. ఇటీవలికాలంలో సర్వీస్ కమిషన్ల ఇంగ్లిష్ ప్రశ్నలు క్లిష్టంగా వస్తున్నాయి. ప్రధానంగా వ్యాకరణం మీద ఆధారపడిన ప్రశ్నలు. అందుకని ఇంగ్లిషులో కూడా క్వాలిఫై అవ్వాలంటే తప్పనిసరిగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించి భాషపై పట్టు తెచ్చుకోవాల్సిందే. ప్రతిరోజూ రెండు భాషలకూ కనీసం గంట సమయమైనా వెచ్చించాలి. లేకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
‣ పేపర్-1లో మూడు వ్యాసాలు రాయాలి. ఒక్కొక్క వ్యాసాన్ని కనీసం ఎనిమిది వందల పదాల్లో రాయాలి. అభ్యర్థి భాషా పటుత్వం, సమగ్ర విషయావగాహన, భావ వ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాలు, పరిష్కార శక్తి మొదలైనవి వ్యాసం ద్వారా పరిశీలిస్తారు. దీన్ని గ్రహించి అందుకు అనుగుణంగా తయారవ్వాలి.. మిగతా పేపర్లలో విషయాన్ని గుర్తుంచుకుని మార్కులు సాధించవచ్చు కానీ వ్యాసరచన అనేది విభిన్నం. ఇందుకోసం నిర్దిష్టమైన ఫార్మాట్‌ని అనుసరించినప్పుడే ఎగ్జామినర్‌ని సంతృప్తి పరచగలుగుతారు. ముఖ్యంగా రిఫ్లెక్టివ్ ఎస్సేలు రాసేటప్పుడు కథనానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఆలోచన వ్యక్తీకరించినప్పుడే మార్కులు వస్తాయి. ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని యోజన, న్యూ ఇండియా సమాచార్, ప్రముఖ దినపత్రికల ఎడిటోరియల్స్ మొదలైనవి చదివి సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి.
‣ పేపర్-2లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలతో పాటు భారతదేశ భౌగోళిక అంశాలు సిలబస్‌గా ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీ నేపథ్యమున్న అభ్యర్థులకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటివరకు ఛాయిస్ మెథడ్‌లో చదివి ఉన్నట్లయితే ఛాయిస్‌కి అదనంగా మరికొన్ని టాపిక్స్‌ను కూడా చదువుకోడానికి ఈ సమయాన్ని కేటాయించవచ్చు. లేదనుకుంటే వాటినే బలంగా రివిజన్ చేయవచ్చు. భారతదేశ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోని ప్రశ్నలకు తాజా భారత సర్వే, ఆంధ్రప్రదేశ్ సర్వేలను అనుసంధానించుకుని రాస్తే మార్కులు పెరిగే అవకాశం ఉంది.
‣ పేపర్-3లో ప్రధానమైన సమస్య- ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోవడం. ప్రశ్న చివరిచ్చే టాగ్‌లను బట్టి సమాధానం రాయాలి. పాలిటీలో సిలబస్ సాధారణమే అయినప్పటికీ ప్రశ్నలను బట్టి ఎగ్జామినర్ ఏం ఆశిస్తున్నాడో విశ్లేషించుకుని రాయటం అవసరం. గవర్నెన్స్‌లో ఉన్న చాప్టర్స్‌ను తాజా విధానాలతో, వర్తమానాంశాలతో అనుసంధానించాలి. అదేవిధంగా ఆర్థిక సంస్కరణ అనంతరం పరిపాలనలో వచ్చిన వివిధ ప్రక్రియలపై, సంస్థలపై మంచి పట్టు ఉండాలి. ముఖ్యంగా నాలుగు, ఐదు చాప్టర్లలో ఉండే అంశాల్ని జాగ్రత్తగా రాయగలిగితే మార్కులు పెరుగుతాయి. ఎథిక్స్ అండ్ లా అనే విభాగంలో మొదటి మూడు చాప్టర్లు పూర్తిగా సైద్ధాంతిక అంశాలే. అందువల్ల ఆయా విషయాలు రెండు వందల పదాల్లో రాయగలిగిన నేర్పరితనం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు. ఐదో చాప్టర్లో కాన్‌స్టిట్యూషన్ లా పాలిటీలో అంతర్భాగమే కాబట్టి ఆ చాప్టర్‌ని తక్కువ సమయంతో వదులుకోవచ్చు. జీఎస్‌టీ, సైబర్ లా, క్రిమినల్ లా ప్రాథమిక అంశాలపై అవగాహన సరిపోతుంది. ఇటీవలి లేబర్ లాలో వచ్చిన మార్పులూ గమనించుకుంటే మంచిది. ఇప్పటివరకు ఈ అంశాల్ని పకడ్బందీగా చదివి ఉండకపోతే ఈ సమయంలో పట్టు సాధించటం సాధ్యమే కాబట్టి సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.
‣ పేపర్-4లో ప్రశ్నలకు మంచి మార్కులు రావాలంటే అనువర్తనం ప్రధానం. ప్రతి విషయాన్నీ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అనే రెండు కోణాల్లో చదివితే సిలబస్‌లోని అన్ని చాప్టర్లూ కవరవుతాయి. ప్రతి పాఠ్యాంశానికి సంబంధించీ బేసిక్స్, స్టాక్ అంశాలు ఇప్పటికే బాగా చదివుంటే ఇబ్బంది లేదు. పట్టు లేకుంటే ఇప్పుడైనా ప్రయత్నించాలి.
‣ పేపర్-5లో శాస్త్ర సాంకేతిక విషయాలపై బేసిక్స్ నుంచి వర్తమానం వరకు ఎక్కడైనా ప్రశ్నలడిగే అవకాశం ఉంది. రెండు, మూడు, నాలుగు, ఐదు, పది మార్కులకు సమాధానం రాసే నైపుణ్యం అవసరం. ఒక ప్రశ్నలోనే నాలుగు ఉప ప్రశ్నలు ఇవ్వవచ్చు. ఫలితంగా నాలుగింటికి సమాధానం ఇచ్చే క్రమంలో మొత్తం సమయాన్ని క్లుప్తంగా సమాధానమిచ్చే ధోరణితో విభజించుకుని రాయాలి. గతంలో చాలామంది అభ్యర్థులు శాస్త్ర సాంకేతిక పేపర్లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దానికి కారణం ఉప ప్రశ్నలకు తగిన సమయంలో, తగిన రీతిలో, తగిన పరిమాణంలో రాయలేకపోవటమే!
వర్తమాన అంశాల నేపథ్యంలో..
ప్రధానంగా వర్తమానంతో అనుసంధానమయ్యే ప్రశ్నలే అధికం. లేదా అలాంటి వర్తమాన అంశాల నేపథ్యంలో ప్రశ్నలుంటాయి. పట్టు సాధించాలనుకుంటే భారత సర్వే 2022-23, బడ్జెట్ 2023- 24, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2022-23, బడ్జెట్ 2023-24లోని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకోవాలి. బడ్జెట్ వనరుల సమకూర్పు, వ్యవసాయం, పారిశ్రామిక సేవ, ద్రవ్య వ్యవస్థ, మౌలిక రంగం... ఈ చాప్టర్లన్నీ వర్తమానంతో అనుసంధానించి అధ్యయనం చేయాలి. సర్వే, బడ్జెట్లే కాకుండా వివిధ విధాన నిర్ణయాలు కూడా అధ్యయనం చేసి సమాధానాల్లో మిళితం చేయాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం గురించి రాయాల్సి వస్తే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, పారిశ్రామిక విధానం 2023-27 గురించి కూడా పట్టు ఉన్నప్పుడే సంబంధిత ప్రశ్నలకు సంపూర్ణంగా సమాధానాలు ఇవ్వగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎకానమీ సిలబస్‌లో ఉన్న అంశాలకు వర్తమాన ధోరణి జోడిస్తేనే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు.
అందువల్ల సంక్షిప్త సమాధాన ప్రశ్నలు కూడా సాధన చేసినప్పుడే ఇటువంటి పరిస్థితి ఎదురైతే బయటపడవచ్చు. ఈ పేపర్‌లో కూడా సమాధానాలు రాసేటప్పుడు గ్లోబల్ ఉదాహరణలతో పాటు వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
సివిల్స్ తరహా ప్రశ్నలు
1. ప్రిలిమ్స్ అనుభవాల నేపథ్యంలో మెయిన్స్‌లో కూడా సివిల్స్ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని భావించవచ్చు. ఆయా ప్రశ్నలు సేకరించుకుని సమాధానాలు సాధన చేయటం శ్రేయస్కరం.
2. సివిల్స్ అభ్యర్థులు స్థానిక పరిజ్ఞానం- భౌగోళిక, చారిత్రక, పరిపాలన, ఆర్థిక, ప్రభుత్వ అంశాలపై పట్టు సాధించాలి. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసేటప్పుడు పాటించే ప్రమాణాలపై అవగాహనతో సమాధానాలు రాయాలి.
3. సమాధానాలను నిర్దిష్ట సమయంలోగా రాసే రైటింగ్ ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలి. తద్వారా సమయ నిర్వహణ సులభమవుతుంది. వివిధ అంశాలు చక్కగా జ్ఞాపకం ఉంటాయి కూడా.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్కిటెక్చర్ ప్రవేశానికి మార్గం.. నాటా
‣ సమాచార విశ్లేషణకు ‘క్విక్‌సైట్’
‣ కేంద్రంలో 7,500 కొలువుల భర్తీ
‣ తెలంగాణ ఎన్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాలు
‣ విదేశాలు.. విద్యావకాశాల నెలవులు