• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమాచార విశ్లేషణకు ‘క్విక్‌సైట్‌’

ఉద్యోగావకాశాలకు బాటలు వేసే కొత్త అప్లికేషన్‌

గుట్టలకొద్దీ డేటా.. వివిధ మార్గాల నుంచి వచ్చి పడుతూనే ఉంటుంది.. దాన్ని సరైన పద్ధతిలో విశ్లేషించడం, భద్రంగా నిల్వ చేయడం సవాలే! ఆ పనిని చాలా సులభంగా, వేగంగా, ప్రభావవంతంగా చేస్తుంది ‘క్విక్‌సైట్‌’. నేటి మార్కెట్‌లో ఇది డిమాండ్‌ ఉన్న డేటా మేనేజింగ్‌ టూల్‌. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ అప్లికేషన్‌ను నేర్చుకోవడం కొత్త ఉద్యోగావకాశాలకు  బాటలు వేస్తుంది!

నేటి కాలంలో సమాచారం అత్యంత విలువైన నిధి. దాన్ని చూడగానే అర్థమయ్యే రీతిలో, విజువల్‌గా చెప్పే టూల్స్‌కు అందుకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ అవసరానికి తగినట్టు అవి కూడా కొత్తకొత్తగా, నూతన సాంకేతికతతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. అన్ని రకాలైన వ్యాపార సంస్థల్లోనూ వీటి వినియోగం అధికమవుతోంది. 

ముఖ్యంగా బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌లో నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ‘ఇన్‌సైట్స్‌’ను తయారు చేసేందుకు క్విక్‌సైట్‌ వంటి అప్లికేషన్ల అవసరం చాలా ఉంది. ఇందులో సృష్టించే డ్యాష్‌ బోర్డ్స్‌లో చాలా విధాలైన విజువలైజేషన్స్, గ్రాఫికల్‌ ఫార్మాట్స్‌ ఉంటాయి. అవన్నీ సమాచారాన్ని చూడగానే అర్థమయ్యేలా చెప్పేందుకు ఉపకరిస్తాయి. డేటాను అప్‌డేట్‌ చేస్తే ఈ డ్యాష్‌ బోర్డ్‌ కూడా ఆటోమేటిక్‌గా  అప్‌డేట్‌ అవుతుంది. పైగా ఇది పూర్తిగా క్లౌడ్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఏ మాత్రం పద్ధతిలో లేని డేటాను సైతం పూర్తిస్థాయిలో విశ్లేషించగలిగే సత్తా ఉన్న ప్లాట్‌ఫామ్‌ ఇది.

ఇన్‌-మెమరీ ఇంజిన్‌

దీనికి స్పైస్‌ (ఎస్‌పీఐసీఈ - సూపర్‌ఫాస్ట్, పార్లల్, ఇన్‌-మెమరీ కాలిక్యులేషన్‌ ఇంజిన్‌) అనే పేరుతో ఒక ఇన్‌-మెమరీ ఇంజిన్‌ ఉంది. దీని ద్వారా అత్యంత వేగంగా డేటాను విశ్లేషించడం కుదురుతుంది. అంతేకాదు.. వేల మంది ఒకేసారి, ఒకే డేటాతో పనిచేసే వెసులుబాటు కల్పిస్తుంది. క్లౌడ్‌లో ఉండటం వల్ల ఎవరు ఎక్కడి నుంచైనా దీన్ని ఉపయోగించవచ్చు, ఎలాంటి ఇబ్బందీ రాదు. అత్యంత రక్షణతో డేటాకు కాపలా కాస్తుంది.

ఉద్యోగాలు 

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగ నియామకాల్లో క్విక్‌సైట్‌ వినియోగం తెలిసినవారికి అధిక ప్రాధాన్యం దక్కుతోంది. కేవలం ఈ సర్టిఫికేషన్‌తోనే డెవలపర్‌గా కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతోపాటు డేటా ఇంజినీర్, డేటా అనలిస్ట్, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌ వంటి కొలువులు ఉన్నాయి. ఈ టెక్నీషియన్లకు రిపోర్ట్స్‌ డిజైనింగ్, కోడింగ్, ఆటోమేటింగ్, కాన్‌ఫిగరింగ్, టెస్టింగ్, ఇంప్లిమెంటేటింగ్, సపోర్టింగ్‌ వంటి విధులుంటాయి. వీరు టెక్నికల్‌ ఆర్కిటెక్ట్స్, డేటా ఇంజినీర్స్, డేటా అనలిస్ట్స్‌ లతో కలిసి పనిచేస్తారు. విదేశాల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.

నేర్చుకోవడం ఎలా..?

దీన్ని నేర్చుకునేందుకు చాలా రకాలైన ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కోర్సెరా, యుడెమీ, ప్లూరల్‌సైట్‌ వంటి వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తున్నాయి. ‘క్విక్‌సైట్‌ గెట్టింగ్‌ స్టార్టెడ్, మాస్టరింగ్, విజువలైజింగ్‌ డేటా, ఫండమెంటల్స్, హ్యాండ్స్‌ ఆన్‌ సెషన్స్‌’ వంటి కోర్సులు విద్యార్థి అవసరాన్ని బట్టి ఎంచుకునేలా వివిధ స్థాయుల్లో ఉన్నాయి.

డేటాను క్రమపద్ధతిలో అమర్చేందుకు.. తనకు ఏది ఎప్పుడు అవసరమో నిర్ణయించుకునేలా క్విక్‌సైట్‌ అల్గారిదమ్స్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో అనేక రకాలైన సోర్సుల నుంచి సమాచారాన్ని తీసుకోవడమే కాదు.. దాన్ని వడపోయడానికి కూడా వివిధ మార్గాలున్నాయి. బార్‌ చార్ట్స్, పై చార్ట్స్, స్కాటర్‌ మాప్స్‌ వంటివెన్నో ఇందులో తయారుచేయవచ్చు. డ్యాష్‌బోర్డ్స్‌ అన్నీ ఇంటరాక్టివ్‌ విధానంలో ఉంటాయి. దీని ద్వారా డేటా సోర్సులతో నేరుగా అనుసంధానం కావొచ్చు. డేటాసెట్స్‌ను ఎడిట్‌ చేయడం, విజువల్‌ అనాలిసిస్‌ తయారుచేయడం, నివేదికలను పబ్లిష్‌ చేయడం వంటి పనులు చాలా సులభంగా చేయవచ్చు. ఇక డేటాను అప్‌లోడ్‌ చేసే విషయానికి వస్తే విభిన్న రకాలైన సాధారణ లేదా క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ నుంచి తీసుకోగలదు. సేల్స్‌ఫోర్స్, స్క్వేర్, సర్వీస్‌నౌ, ట్విటర్, గిట్‌హబ్, మైఎస్‌క్యూఎల్, అన్నిరకాలైన అమెజాన్‌ వెబ్‌సర్వర్ల నుంచి అప్‌లోడ్‌ చేసుకోగలదు. ఎక్సెల్, సీఎస్‌వీ, జేఎస్‌ఓఎన్‌ వంటి విభిన్న రకాల ఫార్మాట్లతో పనిచేస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 7,500 కొలువుల భర్తీ

‣ తెలంగాణ ఎన్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాలు

‣ విదేశాలు.. విద్యావకాశాల నెలవులు

‣ షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

Posted Date : 15-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌