• facebook
  • whatsapp
  • telegram

కేంద్రంలో 7,500 కొలువుల భర్తీ

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ - 2023 నోటిఫికేషన్‌

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వివిధ విభాగాల్లో సేవలందించడానికి వేల సంఖ్యలో మానవ వనరులు అవసరం. ఇందుకోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏటా ప్రకటనలు విడుదల చేసి, పోస్టులు భర్తీ చేస్తుంది. అలాంటివాటిలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ (సీజీఎల్‌ఈ) ముఖ్యమైంది. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి మంచి హోదాతోపాటు ఆకర్షణీయ వేతనం అందుతుంది. 

సీజీఎల్‌ఈలో ప్రతిభ చూపినవారు గ్రూప్‌- బీ, సీ పోస్టుల్లో సేవలందించవచ్చు. గెజిటెడ్‌ ఉద్యోగాలైన అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులనూ పొందవచ్చు. ఈ ప్రకటన ద్వారా 36 శాఖల్లోని ఉద్యోగాలు భర్తీ చేస్తారు. మొత్తం 7500 ఖాళీలున్నాయి. విభాగాలవారీ వివరాలను తర్వాత ప్రకటిస్తారు. పోస్టుల సంఖ్య పెరగడానికీ అవకాశం ఉంది. టైర్‌-1, టైర్‌-2 పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. 

టైర్‌-1..

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున వంద ప్రశ్నలు అడుగుతారు. వీటిని గంటలో పూర్తి చేయాలి. 

రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ అర మార్కు తగ్గిస్తారు.

టైర్‌-2..

టైర్‌-1లో అర్హత సాధించినవారికే టైర్‌-2 ఉంటుంది. ఈ పరీక్షనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఇందులో 3 పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 అందరికీ తప్పనిసరి. అయితే జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు పేపర్‌-2 (స్టాటిస్టిక్స్‌) కూడా రాయాలి. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు పేపర్‌-3 జనరల్‌ స్టడీస్‌ (ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌) అదనంగా రాయాలి. 

పేపర్‌-1: ఇందులో రెండు సెషన్లుంటాయి. సెక్షన్‌ 1లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌ 30, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 30 మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు 3 చొప్పున వీటికి 180 మార్కులు.  పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.. సెక్షన్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 45, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 70 ప్రశ్నలకు 210 మార్కులు. వ్యవధి గంట. సెక్షన్‌-3 కంప్యూటర్‌ నాలెడ్జ్‌లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు. వ్యవధి 15 నిమిషాలు. అన్ని సెక్షన్లలోనూ రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ఇదే సెక్షన్‌లో మరో మాడ్యూల్‌లో డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని 15 నిమిషాల్లో టైప్‌ చేయాలి. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. 

పేపర్‌-2: స్టాటిస్టిక్స్‌ నుంచి వంద ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి 2 గంటలు.  

పేపర్‌-3: ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ నుంచి 200 మార్కులకు వంద ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. 

పేపర్‌-2, పేపర్‌-3ల్లో ప్రతి తప్పు సమాధానానికీ అర మార్కు తగ్గిస్తారు. 

ముఖ్య సమాచారం...

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులకు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. 

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో మినహా), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీబీఐ పోస్టులకు 30 ఏళ్లలోపు ఉండాలి. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు 32, మిగిలిన గ్రూప్‌-బి పోస్టులకు 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. అన్ని గ్రూప్‌-సి పోస్టులకు 27 ఏళ్లలోపువాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 3

టైర్‌-1 పరీక్షలు: జులైలో నిర్వహిస్తారు

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

ప్రశ్నలు ఏ అంశాల్లో?

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: అభ్యర్థులందరూ ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్న విభాగమిది. నాన్‌ వెర్బల్‌ సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్, ఆడ్‌మన్‌ అవుట్‌ విభాగాల నుంచే దాదాపు 70 శాతం ప్రశ్నలు ఉంటాయి. క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్, సీక్వెన్స్‌ నుంచి మిగిలిన 30 శాతం ప్రశ్నలు వస్తాయి. ప్రతి అంశంలోనూ ఒక ప్రశ్న అడుగుతారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా బాగా ఆలోచించి, తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలతోపాటు, గతంలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌-1 ప్రశ్నపత్రాలు సాధన చేస్తే, ఎక్కువ మార్కులు పొందవచ్చు.  

జనరల్‌ అవేర్‌నెస్‌: పర్యావరణం, వర్తమాన అంశాలు, రోజువారీ సంఘటనలు, భారతదేశం, పొరుగు దేశాలతో సంబంధాలు... వీటిపైనే ఎక్కువ ప్రశ్నలు సంధిస్తారు. దినపత్రికలు చదివే అలవాటు ఉన్నవారు ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేయవచ్చు. పత్రికల్లోని ముఖ్యాంశాలు రాసుకుంటే గుర్తుంటాయి. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్‌ పాలసీ అండ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ విభాగాల్లోనూ ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో.. భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగం- వీటిని బాగా చదవాలి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్‌ జనరల్, గాంధీయుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. భూగోళశాస్త్రం నుంచి.. నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ, పరిరక్షణ..సంబంధిత అంశాలు అధ్యయనం చేయాలి. పాలిటీలో.. పౌరులు, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంట్, అధికరణలు, సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీలో డిమాండ్‌- సప్లై, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్‌ రకాలు, జాతీయ, అంతర్జాతీయ సమకాలీనాంశాలపై దృష్టి సారించాలి. వర్తమాన వ్యవహారాల్లో వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, పథకాలు, దేశాలు- రాజధానులు, కరెన్సీలు, ప్రధాని/ అధ్యక్షుడు, రాజధాని..మొదలైనవి చూసుకోవాలి. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, తాజా పరిణామాలు ముఖ్యమైనవి. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలిగే నైపుణ్యం ఉన్నవారే ఈ విభాగంలో రాణించగలరు. సూక్ష్మీకరణలపై పట్టు సాధిస్తే సమయం వృథా కాదు. అలాగే ప్రశ్నను బట్టి సూత్రం లేదా తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించడం అలవాటు చేసుకోవాలి. డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీల నుంచి 7-10 వరకు ప్రశ్నలుంటాయి. శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం- ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. వైశాల్యాలు, వాల్యూమ్స్‌ నుంచి 3-4 ప్రశ్నలు ఇస్తారు. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్, షార్ట్‌ కట్స్‌ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.  

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్‌ నుంచి అయిదారు, క్లోజ్‌ టెస్టు నుంచి 4, జంబుల్డ్‌ సెంటెన్స్‌లో 3, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌ నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. మిగిలినవి వ్యాకరణాంశాల నుంచి ఉంటాయి. వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సిననిమ్స్‌- యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ అంశాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులకు ఆస్కారం ఉంటుంది. 

సన్నద్ధత ఇలా..

1. ముందుగా పరీక్ష స్వరూపాన్నిగమనించాలి. 

2. టైర్‌-1, టైర్‌-2ల్లోని ఉమ్మడి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 

3. కొత్తగా సన్నద్ధం అవుతున్నవారు సిలబస్‌లోని విభాగాలవారీ ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. 

4. ఏదైనా విభాగం పూర్తిచేసుకున్న తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం ఆ ఒక్క విభాగం నుంచే మాక్‌ పరీక్ష రాయాలి. అందులో 75 శాతం స్కోరు పొందితే తర్వాత విభాగానికి వెళ్లాలి. ఇదే పద్ధతిని అన్ని సబ్జెక్టులు, విభాగాల్లోనూ కొనసాగించాలి. 

5. పాత ప్రశ్నపత్రాలు బాగా అధ్యయనం చేయాలి. విభాగాల్లోని అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం గుర్తించి, ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

6. పరీక్షకు 20 రోజుల ముందు నుంచి మాక్‌ టెస్టులు రాయాలి. ఒక రోజు పరీక్ష రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. తర్వాత రోజు మొత్తం వెనుకబడిన అంశాల్లో సాధన చేయాలి. ఆ తర్వాత మళ్లీ మాక్‌ పరీక్ష రాయాలి. ఇలా రోజు విడిచి రోజు ఒక మాక్‌ పరీక్ష రాసి, మార్పులు చేసుకుంటూ సన్నద్ధమైతే పరీక్ష నాటికి పది మాక్‌ టెస్టులు పూర్తవుతాయి. వీలైనంత ఎక్కువ స్కోరు పొందవచ్చు. 
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశాలు.. విద్యావకాశాల నెలవులు

‣ షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

‣ ఉద్యోగార్థులూ.. పారా హుషార్‌!

‣ సీడాట్‌లో 156 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

‣ మీడియా సంస్థల్లో ఆహ్వానం

‣ కోల్‌ఫీల్డ్స్‌లో కొలువులు

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌