• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగార్థులూ.. పారా హుషార్‌!

పోటీ పరీక్షల ప్రశ్నల ధోరణిలో మార్పులు

మారుతున్న పరిస్థితులు, ప్రశ్నల ధోరణులూ గమనించి, తగినవిధంగా తయారైతేనే పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ప్రశ్నపత్రాల్లో పరీక్ష ఏది అనేదానితో సంబంధం లేకుండా ప్రశ్నల ధోరణిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు వీటిని ఒడిసిపట్టుకొని సన్నద్ధతను మార్చుకుంటేనే ఆశించిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు!

ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో ఇటీవలి మార్పులు తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షతో మొదలయ్యాయని చెప్పవచ్చు. తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 ప్రిలిమినరీ, ఎండోమెంట్‌ ఆఫీసర్స్, ఇటీవల జరిగిన గ్రూప్‌-4 మెయిన్స్‌ పరీక్షల్లో ఈ ధోరణి స్పష్టంగా ప్రతిఫలించింది.  

గ్రూప్‌-1 లాంటి ఉన్నత స్థాయి పరీక్ష అయినా, గ్రూప్‌-4 లాంటి దిగువ స్థాయి పరీక్ష అయినా ప్రశ్నల ధోరణిలో మాత్రం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే తెలంగాణ గ్రూప్‌ 4, 2, తిరిగి నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆశిస్తున్న గ్రూప్‌-2, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో కూడా ఈ ధోరణి కనిపించే అవకాశం ఉంది. ఇంతకీ ప్రశ్నల తాజా ధోరణి ఏమిటి? సమర్థంగా ఆ ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి?.. తెలుసుకుందాం. 

ఈ తరహా ప్రశ్నల ప్రయోజనం

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు కొత్త ధోరణిలో అడుగుతున్న ప్రశ్నల లక్ష్యం- అదృష్టం పాత్రను తగ్గించడం కావచ్చు. గతంలో ఏక వాక్యాల్లో అడిగే బహుళైచ్ఛిక ప్రశ్నల వల్ల ఎలిమినేషన్‌ టెక్నిక్‌తో చాలామంది అభ్యర్థులు సరైన సమాధానాన్ని గుర్తించేవారు. ప్రస్తుతం అడుగుతున్న ఎసర్షన్‌- రీజనింగ్‌ ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలకైతే ఎంతో లోతుగా చదివితే తప్ప సమాధానాల్ని గుర్తించటం కష్టం. ముఖ్యంగా అభ్యర్థుల విశ్లేషణ శక్తిని అంచనా వేయటానికి ఈ తరహా ప్రశ్నలు ఉపయోగపడతాయి. బట్టీ సంస్కృతికి కూడా ఈ తరహా ప్రశ్నలు చెక్‌ పెడతాయని చెప్పవచ్చు. అందువల్ల సరైన అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేసే అవకాశం ఉంది. సమయ నిర్వహణ, అభ్యర్థి కష్టపడే తత్వం, క్లిష్ట పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం మొదలైన లక్షణాలను కూడా పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. ఇటీవలికాలంలో మానసిక, మనో వైజ్ఞానిక సామర్థ్యాల పరీక్షల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంటోంది.

ఇదీ తాజా ధోరణి 

1) గత ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో ఎసర్షన్‌ - రీజనింగ్‌ ప్రశ్నలు చాలా అరుదుగా మాత్రమే కనిపించేవి. యూపీఎస్సీ పరీక్షల్లో కూడా 10 - 20 శాతం ప్రశ్నలు కనిపించేవి. అలాంటిది తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నుంచి తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-4 పరీక్ష వరకు ఈ తరహా ప్రశ్నలు విస్తృత స్థాయిలో కనిపిస్తున్నాయి. ఏపీ గ్రూప్‌-4 పరీక్షలో ఈ తరహా ప్రశ్నలను ఎక్కువగా అడిగారు. ఈ ప్రశ్నల్లో ఎసర్షన్‌ కింద ఒక స్టేట్మెంట్, రీజనింగ్‌ కింద ఒక ముగింపు లాంటిది ఇవ్వటం, ఈ రెండిటినీ చదివి కింద ఇచ్చే బహుళైచ్ఛిక సమాధానాల్లో సరైనదాన్ని ఎంపిక చేసుకోవటం అనే ప్రక్రియ ఉంటుంది.

2) గతానికి భిన్నంగా జతపరిచే ప్రశ్నల సంఖ్య కూడా రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఎక్కువైంది. ఈ తరహా ప్రశ్నలు మరింత క్లిష్టత పెంచుతూ సమాధానాల్లో అధిక సంభావ్యత, అల్ప సంభావ్యత అనే కోణంలోనూ సమాధానాలు తయారు చేయడంతో అభ్యర్థులు సరైనదాన్ని గుర్తించేందుకు తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

3) గత పరీక్షల్లో ప్రశ్న అంటే ఒకటి లేదా రెండు లైన్లు మాత్రమే ఉండేది. ఇటీవల మారిన ధోరణిలో భాగంగా ప్రశ్న సుదీర్ఘంగా ఉంటూ కొన్ని సందర్భాల్లో నాలుగైదు లైన్ల వరకు విస్తరిస్తూ ఉంది. ఇలాంటి ప్రశ్నల క్లిష్టత ఏమిటంటే మొత్తం ప్రశ్నను మెదడులో క్రోడీకరించుకుంటూ సమాధానం కోసం ఆలోచించాలి. ఈ క్రమంలో ఎక్కువ సమయం పడుతుంది. అభ్యర్థుల్లో తికమకకు కూడా ఎక్కువే అవకాశం ఉంటుంది. దానితో నిర్దిష్ట సమయంలో అన్ని ప్రశ్నలనూ ఎదుర్కొనేందుకు కావలసిన సమయం అభ్యర్థులకు ఉండటం లేదు.

4) ఎప్పుడో ఒకటి రెండు పరీక్షల్లో తప్ప గత పరీక్షల్లో సిలబస్‌లో ఇచ్చిన అన్ని అంశాలకూ కొద్దిగా అటు ఇటుగా సమ ప్రాధాన్యం ఉండేది. అలాంటి వెయిటేజిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ముందుగా ప్రిపేర్‌ అయ్యేవారు. పరీక్షల్లో మంచి స్కోరింగ్‌ చేసే అవకాశమూ ఉండేది. కానీ తాజా ధోరణుల ప్రకారం కొన్ని విభాగాలకు అధిక ప్రశ్నలు కేటాయిస్తూ కొన్ని విభాగాల నుంచి నామమాత్ర ప్రశ్నలిస్తూ కొన్ని విభాగాలలో అసలే ప్రశ్నలూ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రూప్‌-4 పరీక్షలో భారత రాజ్యాంగం నుంచి ఒక ప్రశ్న, భారత ఎకనామిక్‌ సర్వే నుంచి రెండు ప్రశ్నలు, వర్తమానాంశాలపై 25 ప్రశ్నల వరకు, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి దాదాపు 30 ప్రశ్నలు అడిగారు. ‘పోటీ పరీక్షల్లో సిలబస్‌లోంచే ప్రశ్నలు అడగాలి, ఇన్ని ప్రశ్నలే అడగాలి’ అంటూ నిర్దేశించే అధికారం ఎవరికీ లేదు. అందువల్ల ఇలాంటి ధోరణిని తప్పు పట్టలేము కానీ అందుకు తగిన రీతిలో సన్నద్ధమవటం అభ్యర్థుల కర్తవ్యం.

5) ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-4 పరీక్షలో డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ విభాగంలో మీన్, మోడ్, మీడియన్‌లకు మాత్రమే పరిమితం కాకుండా గతంలో ఎన్నడూ అడగని డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ మెలకువపై వచ్చాయి. పర్సంటైల్, క్వార్టైల్‌ డీ…వియేషన్, మీన్‌ డీవియేషన్‌ మొదలైన అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. అదేవిధంగా డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో జతపరిచే ప్రశ్నలు వచ్చాయి.

ప్రిపరేషన్‌ను ఇలా మార్చుకోండి!

ఎప్పటి మాదిరిగానే పాఠశాల స్థాయిలో ఉండే పాఠ్యపుస్తకాల నుంచి బేసిక్‌ సమాచారం చదవాలి. ప్రశ్నల ధోరణి మారింది కదా అని నేల విడిచి సాము చేస్తే అసలుకే మోసం వస్తుంది

సిలబస్‌ ఆధారంగానే ఆయా టాపిక్స్‌ను లోతుగా చదవాలి. అంటే సంబంధిత అంశాలను కనీసం గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు ఉన్న పుస్తకాల ఆధారంగా చదవాల్సి ఉంటుంది. 

విస్తృతంగా అధ్యయనం చేయటం  ఎక్స్‌టెన్సివ్‌ స్టడీ. సిలబస్‌ టాపిక్స్‌ను లోతుగా చదవటమే కాదు, ఆ టాపిక్స్‌కు ఇతర సబ్జెక్టులతో అనుసంధానం ఉంటే గమనించి చదవటం, వర్తమాన, అనువర్తన అంశాలతో కలిపి చదవటం అవసరం. 

చదివే ప్రతి అంశం వెనుకున్న నేపథ్యం - సమస్య - కారణాలు - ఫలితాలు అనే కోణాల్లో అధ్యయనం చేస్తేనే ఈ తరహా ప్రశ్నలు ఎదుర్కోవటానికి కావాల్సిన సామర్థ్యం బలపడుతుంది.

కేవలం బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ప్రాక్టీస్‌ చేయకుండా సంక్షిప్త సమాధాన ప్రశ్నలను సాధన చేయటం ద్వారా ఈ కొత్త తరహా ప్రశ్నలను తేలికగా ఎదుర్కోవచ్చు.

బట్టీ ద్వారా జ్ఞాపకముంచుకోవటం కంటే విశ్లేషణ, అవగాహనల ద్వారా ఒక విషయాన్ని స్మృతిగా ఏర్పరచుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం తేలికగానే గుర్తించవచ్చు.

స్వల్పకాలిక సన్నద్ధత ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు ఇప్పటికైనా మేల్కొని సుదీర్ఘ ప్రిపరేషన్‌ ద్వారా విషయ అవగాహన పెంచుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు వర్తమాన అనువర్తన విషయాలతో అనుసంధానం ఏర్పరచుకుంటే ఈ ప్రశ్నలను ఎదుర్కోవచ్చు.

వేగంగా చదవడం అలవాటు చేసుకున్నప్పుడే నాలుగైదు లైన్లుగా ఇస్తున్న ప్రశ్నలను ఎదుర్కోవచ్చు. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా వేగంగా చదివే అలవాటు చేసుకోవాలి. 

సమూహ చర్చలు, వాద ప్రతివాదనలు అనే మెలకువల ద్వారా కూడా ఇలాంటి ప్రశ్నల్ని సులభంగా సాధించవచ్చు.

పర్యావరణం, విపత్తు నిర్వహణ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ అధిక ప్రాధాన్యం పొందుతున్న పరిస్థితుల్లో ఆయా విషయాల మీద బేసిక్‌ నుంచి నూతన విషయాల వరకు అధ్యయనం చేయాలి.

డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో తాజాగా అడుగుతున్న అంశాలపై మరింత సాధన చేయటం అవసరం.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మీడియా సంస్థల్లో ఆహ్వానం

‣ కోల్‌ఫీల్డ్స్‌లో కొలువులు

‣ ఇస్రోలో 62 టెక్నికల్‌ ఉద్యోగాలు

‣ లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

Posted Date : 12-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌