• facebook
  • whatsapp
  • telegram

అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య ప్రత్యేకతలు

ఆస్ట్రేలియా.. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించే విద్యార్థులకు కాస్త సులభంగానే ఆ అవకాశం కల్పించే దేశం. ఇక్కడి చదువులకు అధిక మార్కెట్‌ విలువ ఉండటమే కాదు.. మిగతా దేశాలతో పోలిస్తే స్టూడెంట్స్‌కు అదనపు సదుపాయాలున్నాయి. ఈ కంగారూల దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రత్యేకతలు, విశేషాలు.. మనమూ చూసేద్దామా..

సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్‌.. వంటి అందమైన నగరాలతో ఆస్ట్రేలియా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆహ్వానిస్తోంది. టాప్‌ యూనివర్సిటీలు, ఉత్తమ విద్యాబోధన, రక్షణ వ్యవస్థతో ప్రపంచవ్యాప్తంగా చదువరులను ఆకర్షిస్తోంది. యూఎస్‌ఏ, యూకే తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న ‘స్టూడెంట్‌ డెస్టినేషన్‌’గా ఈ దేశం పేరుగాంచింది.

ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, యూఎన్‌ఎస్‌డబ్ల్యూ (యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌), యూడబ్ల్యూఏ (యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా) వంటి అనేక ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. అధికశాతం మంది విద్యార్థులు ఈ దేశంలో ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెడిసిన్, బయోటెక్నాలజీ, హెల్త్‌ సైన్స్, అకౌంటింగ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్‌ సైన్స్, యానిమేషన్‌ వంటి కోర్సులు చదవడానికి వస్తుంటారు.

విద్యాసంస్థలు

ఆస్టేల్రియాలో ప్రధానమైన యూనివర్సిటీలు 43 వరకూ ఉన్నాయి. వీటిలో 41 ప్రభుత్వ నిధులతో నడిచేవైతే 2 ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు దాదాపుగా వీటిలోనే చేరుతుంటారు. ఇక్కడ ఉన్న టాప్‌ 8 యూనివర్సిటీలను జి-8 అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ 200 యూనివర్సిటీల జాబితాలో ఇవి కచ్చితంగా ఉంటాయి.

ఇన్‌టేక్స్‌

ఆస్ట్రేలియాలో ప్రధానంగా 3 ఇన్‌టేక్స్‌ ఉన్నాయి. వీటిలో ఫిబ్రవరిలో జరిగే ప్రవేశాలు ప్రధానమైనవి. ఈ సమయంలో దాదాపు అన్ని కోర్సులు, విద్యాసంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి పోటీ ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లడానికి కనీసం నాలుగైదు నెలల ముందు నుంచి ప్రక్రియ మొదలుపెట్టాలి. దీని తర్వాత జులైలో మరో ఇన్‌టేక్‌ ఉంటుంది. ఇది కూడా మేజర్‌ సీజన్‌. ఈ సమయానికి చాలావరకూ ప్రవేశాలు పూర్తవుతాయి. దీని తర్వాత నవంబర్‌లో మరో ఇన్‌టేక్‌ ఉంటుంది. అయితే ఇది మైనర్‌ సీజన్‌. కోర్సులు, విశ్వవిద్యాలయాలు అన్నీ అందుబాటులో ఉండవు.

పని అనుమతి

మన దేశం నుంచి అధికశాతం మంది అక్కడకు పీజీ చేయడానికి వెళ్తుంటారు. అక్కడ రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేశాక తొలుత మూడేళ్లకు పని అనుమతి (వర్క్‌ పర్మిట్‌) దొరుకుతుంది. దాన్ని తర్వాత మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువనే చెప్పాలి.

అంటే చదువు రెండేళ్లు, పని ఐదేళ్లు.. దాదాపు ఏడేళ్లు అక్కడ ఉండొచ్చు. ఈలోపు ఇంకేదైనా మాస్టర్‌ డిగ్రీకి దరఖాస్తు చేస్తే మరింత సులభంగా అనుమతులు లభిస్తాయి. చాలామంది విద్యార్థులు ఈ సమయంలోపే చక్కగా స్థిరపడుతున్నారు. ఆ తర్వాత పీఆర్‌ (పర్మినెంట్‌ రెసిడెన్స్‌) కోసం దరఖాస్తు చేయవచ్చు.

ఖర్చులు

మిగతా దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ట్యూషన్‌ ఫీజు కాస్త ఎక్కువే. రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసేందుకు కనీసం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ అచ్చంగా ఫీజుకే వెచ్చించాలి. అక్కడ ఉండేందుకు, భోజనం, మిగతా అన్ని ఖర్చులకూ ఏడాదికి రూ.12 నుంచి రూ.13 లక్షల వరకూ అవసరం కావొచ్చనేది సాధారణ అంచనా. విద్యార్థుల జీవన విధానం, ఉండే ప్రాంతాన్ని బట్టి ఇది తగ్గొచ్చు, పెరగొచ్చు. అక్కడ స్టూడెంట్‌ అకడమిక్‌ మెరిట్‌ను బట్టి స్కాలర్‌షిప్‌ కూడా లభిస్తుంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 65 శాతం మార్కులున్న వారికి 10 శాతం వరకూ, ఆపైన స్కోరు ఉన్న వారికి దాదాపు 25 నుంచి 30 శాతం వరకూ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

వీసా ప్రక్రియ

ఆస్ట్రేలియన్‌ వీసా ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పుడు వీసా కూడా సులభంగానే ఇస్తున్నారు.

వీసా అప్లికేషన్‌కు 652 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (సుమారు రూ.36 వేలు - 37 వేలు) ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసిన ఒక రోజు నుంచి ఒక నెలలోపు ఎప్పుడైనా వీసా రావొచ్చు.

నియమ నిబంధనలు

ఇక్కడి యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షలో తగిన స్కోరు ఉండాలి. ఐఈఎల్‌టీఎస్, టోఫెల్, పీటీఈ.. ఏదైనా సరిపోతుంది. నిర్దేశిత మార్కులు తప్పనిసరి.

కొన్ని ప్రధానమైన యూనివర్సిటీల్లో ఎంబీఏ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులను మాత్రం జీమాట్‌ స్కోరు అడుగుతారు.

ఇవి, ఇతర డాక్యుమెంట్లతో దరఖాస్తు చేస్తే.. 4 నుంచి 5 వారాల్లో విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్‌ లెటర్‌ వస్తుంది. ఆ తర్వాత తదుపరి పనులు మొదలుపెట్టాలి.

ఆఫర్‌ లెటర్‌ అందుకున్న విద్యార్థులను ఒక ఏడాది ట్యూషన్‌ ఫీజు, ఒక ఏడాది ఖర్చుల డబ్బు నిల్వ చూపించాలి. తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి.

నిబంధనల ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

పీజీ ప్రోగ్రామ్స్‌లో 4 సెమిస్టర్లు ఉంటాయి. అక్కడికి వెళ్లే ముందే ఒక సెమిస్టర్‌ ఫీజు చెల్లించాలి.

- బి.రామ్‌కుమార్, కో-ఫౌండర్, ఐవీవై ఓవర్సీస్‌.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ నామ‌మాత్ర ఫీజుతో నాణ్య‌మైన విద్య‌

‣ న్యాయ విద్య క‌ల నెర‌వేరేలా!

‣ ఇగ్నోలో ఉద్యోగాలు

‣ ఈపీఎఫ్‌ఓలో స్టెనో కొలువులు

Posted Date : 05-04-2023


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం