• facebook
  • whatsapp
  • telegram

విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

* యూఎస్‌, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో ఉపాధి అవకాశాలు

విదేశీ కొలువులు విదేశాల్లో విద్య, ఉద్యోగం అంటే ఘనంగా చెప్పుకునే పరిస్థితులు మారిపోతున్నాయి. సరిహద్దులు దాటి లక్షలు ఖర్చు చేసి వివిధ దేశాల్లో కోర్సులు పూర్తిచేశాక ఉద్యోగం వస్తుందో లేదో తెలియని స్థితి. ఒకవేళ వచ్చినా.. ఎంతకాలం ఉంటుందో, వీసా గడువు పొడిగిస్తారో లేదో, పీఆర్‌ దొరుకుతుందో లేదో .. ఇలా అనేక భయాలు, సందేహాలు. విదేశీ కొలువుల కలలు చెదిరిపోతున్న వర్తమాన సందర్భంలో విద్యార్థులు ఏం గమనించాలి? ఏ మెలకువలు పాటించాలి?  


సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశీ కల లేని విద్యార్థి ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌కు ఆదరణ, అవకాశాలు పెరిగి, కంప్యూటర్‌ కోర్సులు మార్కెట్‌ను ఆక్రమించిన ఈ తరుణంలో అధికశాతం మంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటూ ఉండటంతో పోటీ విపరీతంగా పెరిగింది. అక్కడ పీజీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదిస్తే ఖర్చులు పోగా లక్షల్లో డబ్బు మిగిలే అవకాశం ఉండటంతో ఎంతో మంది ఆ దిశగా అడుగులు వేయాలి అనుకుంటున్నారు. ఇంతకాలం ఇదే జరిగింది.. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. భారతీయ విద్యార్థులు అధికంగా ఎంచుకునే కంప్యూటర్‌ కోర్సులతో ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొంది. అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఐటీ ఉద్యోగాలకు కోత పడుతోంది. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు భారతీయులకు ఇస్తుంటే.. అక్కడి స్థానికుల నుంచి విమర్శలు వస్తుండటంతో కంపెనీలు వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో మన వారికి దొరికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆఖరికి ఉద్యోగాలు రాకపోగా.. వీసాల కోసం కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్లు చూపించాల్సిన దుస్థితి నెలకొంది. 


ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో కొన్ని సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో ఐటీకి స్వర్ణయుగం ముగిసిందనీ, అక్కడ చదువు - ఉద్యోగం కావాలనుకునే విద్యార్థులు బాగా ఆలోచించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలనీ వీటి సారాంశం. కాలేజీ ఫీజు భారం పెరగడం, దొరికే ఉద్యోగాలేమో తక్కువ జీతాలవి కావడం, లాటరీలో హెచ్‌1బీ దొరకడం కష్టం అవుతూ ఉండటం.. ఇలా అభ్యర్థులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రీన్‌ కార్డు పొందే అవకాశం రావడమే లేదని వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం అయితే.. వివిధ దేశాల విధానపరమైన నిర్ణయాలను అనుబంధ కారణాలుగా చెప్పవచ్చు. 


అమెరికా: ఇక్కడ ఉండే అవకాశాలను పెంచుకునేందుకు.. అభ్యర్థులు గతంలో వీసా కోసం వివిధ మార్గాల ద్వారా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వేసేవారు. దాని ద్వారా లాటరీలో వీసా వచ్చేందుకు ఎక్కువ చాన్స్‌ ఉండేది. కానీ ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే దాఖలు చేసేలా పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు కార్డుల ద్వారా నిబంధనలు కఠినతరం చేశారు. 2025 సంవత్సరానికి జారీ చేసే వీసాల వద్ద నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 


హెచ్‌1బీ వీసా ఫీజును సైతం అమెరికా భారీగా పెంచింది. 460 డాలర్లుగా ఉన్న ఫీజును 780 డాలర్లకు, ఎల్‌1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1385 డాలర్లకు పెంచింది. పైగా ఈ ఏడాది అమెరికాలో జరగనున్న ఎన్నికలు అక్కడికి వెళ్లదలచిన మన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. పోటీ పడుతున్న పార్టీల మ్యానిఫెస్టోలో ‘విదేశీ విద్యార్థులు - స్థానికులకు అవకాశాలు’ అన్న అంశం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏర్పడే ప్రభుత్వాలు మన విద్యార్థుల రాక పట్ల మరింత కఠినవైఖరి అవలంబిస్తే వారికి ఉద్యోగావకాశాలు ఇంకా సన్నగిల్లే ప్రమాదం ఉంది. 


కెనడా: ఈ దేశంలో కూడా పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. తీవ్రవాద అంశం భారత్‌-కెనడా సంబంధాలపై భారీగా ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఇక్కడ ఎంఎస్‌ పూర్తయ్యాక మూడేళ్ల వర్క్‌ పర్మిట్‌ ఇస్తారు, ఆ సమయంలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఒక ఏడాది పనిచేశాక పీఆర్‌కు దరఖాస్తు చేసే వీలుంటుంది. ఇక్కడ పీఆర్‌ను పాయింట్ల ఆధారంగా ఇస్తారు. గతంలో ఈ దేశంలో పర్మినెంట్‌ రెసిడెన్సీ కాస్త త్వరగా వచ్చేది. దీంతో క్రమంగా అక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇలా వారి తాకిడి అధికం కావడంతో ఆ దేశం నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం మూడేళ్ల వర్క్‌ పర్మిట్‌ పూర్తయినా పీఆర్‌ రానివారు ఎందరో ఉన్నారు, పర్మిట్‌ పెంచుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా పీఆర్‌ కటాఫ్‌ పాయింట్లు తగ్గకపోవడంతో విద్యార్థులకు ఆందోళన తప్పడం లేదు. నిజానికి ఇక్కడ పీఆర్‌ ఉన్నవారు సైతం అనేకమంది దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. నివసించేందుకు ఆర్థికంగానూ సామాజికంగానూ భద్రంగా భావించకపోవడం వల్లే ఈ వలసలు అని ఒక అభిప్రాయం. 


యు.కె.: లండన్‌లో మాస్టర్స్‌ తర్వాత రెండేళ్ల వర్క్‌ పర్మిట్‌ ఇస్తారు. ఆ సమయం తర్వాత అక్కడ ఉండాలంటే అక్కడి ఎంప్లాయర్‌ స్పాన్సర్‌షిప్‌ అవసరం. అలా స్పాన్సర్‌షిప్‌ దొరక్కపోతే యువత మళ్లీ టైర్‌-2 వీసా తీసుకుంటున్నారు. దీనికి వారు సొంతంగా 20 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇలా ఎక్కువమంది వెళ్తుండటంతో లండన్‌లో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలు దొరకడం లేదు. అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టమైపోతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతోపాటు జీవన వ్యయం అధికమవుతోంది. నాలుగేళ్ల క్రితం యూకే వెళ్లిన చాలా మంది ఇప్పుడు వీసా ఇబ్బందులతో వెనక్కి రావాల్సి వస్తోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. 


ఆస్ట్రేలియా: ఇక్కడ కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్నాళ్లూ ఇచ్చిన గోల్డెన్‌ వీసాలను ఆ దేశం రద్దు చేసింది. ఇవి దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో, వాటి స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాల సంఖ్య పెంచింది. అయితే ఇలా ఇచ్చే వీసాలతో భారతీయులకు పోటీ పెరగనుంది. మామూలుగానే ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియా వీసా ప్రక్రియ కొంత కష్టంగా ఉంటుంది. ప్రస్తుత మార్పులతో అది మరికొంత కష్టంగా పరిణమించనుంది. 



ఈ సూచనలు పాటించాలి 

ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు స్థిరంగా ఉంటూ కెరియర్‌ను నిర్మించుకోవాలంటే కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో పరిశీలిస్తే..


1 విద్యార్థికి తాను ఎదుర్కోబోయే పరిస్థితులపై అవగాహన ఉండాలి, పూర్తిగా అన్నివిధాలా సన్నద్ధమై వెళ్లాలి. దేశాలు సాధారణంగా వాటి ఆర్థిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలు ఎలా ఉన్నా.. అక్కడ నిలదొక్కుకునే లాంటి నైపుణ్యాలతో బయల్దేరాలి. ఒకే దేశానికి విద్యార్థులు అనేకచోట్ల నుంచి తండోపతండాలుగా వస్తున్నప్పుడు పోటీ, రద్దీ ఎలా ఉంటుందో ఊహించి తగిన విధంగా సిద్ధం కావాలి. 


2 వీసాలు, ఉద్యోగాలు తగ్గిన మాట వాస్తవమే అయినా.. పూర్తిగా లేకుండా ఏమీ లేవు. కానీ ఉన్న కొద్దిపాటి అవకాశాలు అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారినే వరిస్తున్నాయి. అలాంటి స్థిరమైన నైపుణ్యాలు కలిగి ఉండేలా సాధన చేయాలి. అలా చేసిన వారే స్థిరపడగలరు. 


3 కొందరు డిపెండెంట్‌ వీసాలతో వెళ్లి కూడా అక్కడి ప్రభుత్వ శాఖల్లో సైతం ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరికొందరు అన్నీ మొదటి నుంచి పద్ధతిగా ఉన్నా నిలదొక్కుకోలేకపోతున్నారు. తేడా నైపుణ్యాల్లోనే! 


4 వీసా రావడంలో ఫైనాన్షియల్‌ డాక్యుమెంటేషన్, ఇంటర్వ్యూ సమయంలో సమయస్ఫూర్తి కీలకపాత్ర పోషిస్తాయి. వాటిపై దృష్టిపెట్టాలి. 


5 అవకాశాలు తగ్గిన మాట వాస్తవం, అదే సమయంలో పోటీ కూడా పెరిగింది.. ఏ కారణంతోనైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ప్లాన్‌-బి తప్పనిసరిగా ఉండాలి, అప్పుడే ఒత్తిడి లేకుండా ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

Posted Date : 29-02-2024


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం