• facebook
  • whatsapp
  • telegram

అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

యూఎస్‌ యూనివర్సిటీల్లో ప్రవేశ వివరాలు



భారత్‌లో యూజీ (బీటెక్‌).. యూఎస్‌లో పీజీ (ఎంఎస్‌).. ఇదీ నేటి యువతరం క్రేజీ ధోరణి! ఉత్తమ బోధన, విస్తృత అవకాశాలు, గరిష్ఠ వేతనాలు, ప్రపంచ ప్రమాణాలు, మేటి సౌకర్యాలు, సామాజిక హోదా.. ఇవన్నీ అమెరికా దిశగా అడుగులేయిస్తున్నాయి. అగ్ర రాజ్యంలో చదవాలనే ఆకాంక్ష తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఏటా బాగా పెరుగుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహమూ లభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని మేటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఏ అంశాలు ప్రామాణికమో తెలుసుకుందామా..


ఏ సంస్థ సర్వే నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని టాప్‌-10, టాప్‌-200, టాప్‌-500 విశ్వవిద్యాలయాల జాబితాలో అగ్ర రాజ్యానిదే ఆధిపత్యం. సగం కంటే ఎక్కువ సంస్థలు ఈ దేశం నుంచే ఉంటాయి. అందుకే మనవాళ్లు అమెరికాలో చదవడానికీ, స్థిరపడటానికీ ప్రాధాన్యమిస్తున్నారు. ఆ దేశం ఆకర్షిస్తోన్న విదేశీ విద్యార్థుల్లో ప్రథమ స్థానం మన దేశానిదే. వారిలో సుమారు 21 శాతం భారతీయులే. ఏటా 2 లక్షల కంటే ఎక్కువమంది మనదేశం నుంచి చదువుల నిమిత్తం వెళ్తున్నారు. వీరిలో సింహభాగం.. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇల్లినాయిస్, మసాచ్యుసెట్స్‌ల్లో విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యాసంస్థలకూ, పరిశ్రమలకూ మధ్య సమన్వయం ఉండటమే దీనికి కారణం.  


స్కోరు సరిపోదు 

మన దగ్గర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే ఐఐటీలో చేరిపోవచ్చు. నీట్‌లో మెరిసి ఎంబీబీఎస్‌ చదువుకోవచ్చు. గేట్‌ రాసి ఎంటెక్‌ పూర్తిచేయొచ్చు. కానీ విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎంఎస్‌ చదవాలంటే.. జీఆర్‌ఈ స్కోరు ఒక్కటే సరిపోదు. టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌తో పాటు మరెన్నో ప్రామాణికాలను అక్కడి విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకుంటాయి. ఇందుకోసం స్థిరమైన విధానమంటూ ఉండదు. ఒక్కో విద్యాసంస్థ ఒక్కో పద్ధతిని పాటిస్తుంది. అవి విద్యార్థుల ఎంపికలో వైవిధ్యాన్ని అనుసరిస్తాయి. వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి? కోర్సులో చేరిన తర్వాత ఒత్తిడిని తట్టుకుని, విజయవంతంగా పూర్తిచేయగలుగుతారా? లేదా? అంచనా వేస్తారు. దరఖాస్తులను పూర్తిగా విశ్లేషిస్తారు. వాళ్లు యూజీ పూర్తిచేసుకున్న విద్యాసంస్థల పేరు ప్రఖ్యాతులు, గత తరగతుల్లో చూపిన ప్రతిభనూ గమనిస్తారు. ప్రవేశానికి అవకాశం కల్పిస్తే.. విశ్వవిద్యాలయ దృక్పథాన్ని తెలుసుకోగలరా, దాని నుంచి నేర్చుకుని అభివృద్ధి చెందగలరా, నేర్చుకున్న, ఆర్జించిన దానినుంచి కొంతైనా సమాజానికి ఇచ్చే స్వభావం ఏ మేరకు ఉంది.. ఇవన్నీ బేరీజు వేసుకునే ప్రవేశం కల్పిస్తారు. 


ఇవీ గమనిస్తారు.. 

విద్యార్థులు ఎంచుకున్న కోర్సుపై దృష్టి సారిస్తారు. అది చదవడానికి సరైనవాళ్లేనా, అందులో రాణించగలరా అనేవి తెలుసుకుంటారు. ఉదాహరణకు.. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో సీటు ఆశించే విద్యార్థుల నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో వారి దృక్పథాన్ని చూస్తారు. ఈ సబ్జెక్టుల్లో మంచి గ్రేడ్‌లు లేదా గతం నుంచి ఇప్పటివరకు చూసినప్పుడు మెరుగుదల కనిపించాలి. విద్యార్థులు కళాశాలల్లో సాధించిన మార్కులు, కరిక్యులమ్‌ స్థాయి, అడ్మిషన్‌ టెస్టులో ప్రతిభ, వివిధ స్టాండర్డ్‌ పరీక్షల్లో సాధించిన స్కోర్లు చూస్తారు. అకడమిక్‌తోపాటు ఇంకా ఏమైనా అంశాల్లో ప్రతిభ పొందితే అందుకు సంబంధించిన సర్టిఫికెట్లనూ పరిశీలిస్తారు. ఆ కోర్సుకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరిలోనూ ఉమ్మడిగా కాకుండా విడిగా ఏమైనా ప్రత్యేకతలు ఉంటే వాటికీ ప్రాధాన్యం లభిస్తుంది. 


రికమెండేషన్‌ లెటర్లు: ప్రవేశాల్లో ముఖ్యమైనవీ, ప్రాధాన్యమున్నవీ- రికమెండేషన్‌ లెటర్లు. అందువల్ల ఇవి మామూలుగా ఉంటే ఉపయోగం ఉండదు. మీ గురించి బాగా తెలిసినవారు, మీ ప్రత్యేకతలు, నైపుణ్యాలు ప్రభావవంతంగా చెప్పగలిగేవారి నుంచి వీటిని పొందాలి. వారికి హోదా, గుర్తింపు ఉంటే మంచిది. ఇలాంటి వారిని మెంటర్‌గా ఎంచుకుని, ఈ లెటర్లు పొందాలి. ఒక వ్యక్తిగా మీరు ఎలాంటివారు, పాటిస్తున్న విలువలు, మీలోని బలాలు, నైపుణ్యాలు, సమర్థత ఇవన్నీ అందులో స్పృశించాలి. ప్రవేశం పొందాలనుకున్న విద్యా సంస్థను అనుసరించి రెండు లేదా మూడు రికమెండేషన్‌ లెటర్లు ఉండాలి. 


ఎక్స్‌ట్రా అంశాలు: విదేశీ విద్యాసంస్థలు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తాయి. ప్రతి కళాశాలలోనూ స్పోర్ట్స్, మ్యూజిక్, ఎడిటోరియల్, డిబేట్, వాలంటీర్‌... ఇలా పలు బృందాలు ఉంటాయి. వీటన్నింటి సమూహంతోనే అక్కడి తరగతులు రూపొందుతాయి. అందువల్ల ప్రవేశాల్లో వీటిని గమనిస్తారు. వేటిపై ఆసక్తి ఉంది, అనుభవం ఎలాంటిదో చూస్తారు. అందువల్ల యూజీలో ఉన్నప్పుడే ఏదైనా అంశంలో ఆసక్తి ఏర్పరచుకోవడం, అందులో రాణించడం మంచిది. ప్రవేశంలో అది ఉపయోగపడుతుంది. మేటి విశ్వవిద్యాలయాలు ప్రవేశాల్లో.. సమతౌల్యానికీ, హోలిస్టిక్‌ అప్రోచ్‌కూ ప్రాధాన్యమిస్తున్నాయి. 


నాయకత్వ లక్షణాలు: ప్రతి సంస్థా మంచి విద్యార్థులనే కోరుకుంటుంది. అలాగే వాళ్లు మేటి పౌరులుగా ఉండాలని ఆశిస్తాయి. వారి నుంచి సమాజానికి మంచి జరగాలని కోరుకుంటాయి. అందువల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు, సంఘాభివృద్ధికి ఉపయోగపడే పనులు చేపట్టినవారికి ప్రవేశాల్లో సహజంగానే ప్రాధాన్యమిస్తారు. అలాగని.. ప్రవేశానికి ముందు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు హడావిడిగా పూర్తిచేసి, వాటి గురించి చెప్పి లబ్ధి పొందడాన్ని మేటి విద్యాసంస్థలు పట్టించుకోవు. కొన్నేళ్లగా మీ తపన, మీరు అందులో చూపుతోన్న చొరవతోపాటు జరిగిన మంచి (ప్రగతి)ని గమనించి, అంచనాకు వస్తాయి. 


వ్యాసాలు, సమాధానాలు: మీరు సాధించిన గ్రేడ్‌లు/స్కోర్లకు కొంత ప్రాధాన్యముంటుంది. లెటర్‌ ఆఫ్‌ రికమెండేషన్లు కొంత అవగాహన తెప్పిస్తాయి. అయితే మీ గురించి తెలుసుకోవడానికి మీరు రాసే వ్యాసం చాలా కీలకం. దీనిద్వారా మీరెలాంటివారో అంచనాకు వస్తారు. మీరు రాసిన వ్యాసంలో మీ లక్ష్యాలు, ఆశయాలు, విలువలు చూస్తారు. ఈ రోజు మీరు ఇలా ఉండడానికి ఏ అంశాలు ప్రభావితం చేశాయో గమనిస్తారు. కొన్ని విద్యా సంస్థలు ఏదైనా అంశం/ అంశాల్లో వ్యాసం రాయమని అడగవచ్చు. మరికొన్ని మీకు నచ్చిన అంశంలో రాయమనవచ్చు. ఈ వ్యాసాలు 1 నుంచి 3 వరకు ఉంటాయి.


వైవిధ్యం: మేటి సంస్థలు వైవిధ్యమైన విద్యార్థుల సమూహాన్ని తరగతి గది నుంచి ఆశిస్తాయి. ప్రతి విద్యార్థి ఎవరికి వారే ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాయి. అందువల్ల మీలో ప్రత్యేకతలు గుర్తించి, వాటిలో మీ ప్రతిభను చూపితే ప్రవేశానికి అవకాశం ఉంటుంది. మీరు రాసిన ఎస్‌ఓపీ మీకు మాత్రమే ప్రత్యేకం కావాలి. అందులోని అంశాలు మీ ఆసక్తులు, ఆలోచనలను ప్రతిబింబించాలి. ఉన్నత చదువులు, భవిష్యత్తుపై మీ తపనను తెలిపేలా ఉండాలి. దీన్ని నిశితంగా గమనిస్తారు. ఇంటర్నెట్‌ నుంచి కాపీ చేస్తే సీటు దక్కదు. కొన్ని సంస్థలు బయోడేటా లేదా సీవీ కూడా అడగొచ్చు. ఈ వివరాలు వాస్తవికంగా, సహజంగా ఉండాలి. వీటిలో మీ హృదయాన్ని ఆవిష్కరించాలి. దరఖాస్తు, ఎస్‌ఓపీల ద్వారా ఆంగ్లభాష నైపుణ్యాన్నీ గమనిస్తారు. కోర్సు ఫీ, ఇతర ఖర్చులు భరించగలిగే స్థాయిలో ఉన్నారా లేదా పరిశీలిస్తారు. పని అనుభవం ఉంటే కొంత ప్రాధాన్యం దక్కుతుంది. 



సంస్థల ఎంపిక

అమెరికాలో దాదాపు 4000 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో ఎందులో చేరాలి, మన స్కోరుకు ఏది అనువైనది, చేరాలనుకున్న కోర్సులో ఏవి ఉత్తమ సంస్థలో తెలుసుకోవడానికి కొంత కసరత్తు చేయాలి. క్యూఎస్, టైమ్స్‌.. తదితర సంస్థలు విడుదల చేసిన ర్యాంకుల జాబితాను పరిశీలించి, నిర్ణయించుకోవచ్చు.  


ముందు ఏ కోర్సులో చేరాలో కచ్చితమైన నిర్ణయానికి రావాలి. ఆ కోర్సుకు సంబంధించి పరిశ్రమలు/ సంస్థలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో పరిశీలించాలి. అవకాశం బట్టి ఆ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. తెలిసినవారు చెప్పారని చేరిపోవడం, ఏమాత్రం అవగాహన లేకుండా నిర్ణయం తీసుకుంటే నష్టపోతారు. విద్యాసంస్థలను.. అవి ఉన్న ప్రాంతం, అక్కడ వాతావరణ పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు, ఖర్చులు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఎంచుకోవాలి. సీటు వస్తే తప్పకుండా చేరతాను అని నిర్ణయించుకున్న సంస్థలనే ఎంచుకోవాలి. చేరాలనుకున్న కళాశాలకు సంబంధించి ఇంటర్నెట్‌ ద్వారా ఎంతో సమాచారం లభిస్తుంది. ఆ కళాశాలలకు వివిధ ర్యాంకింగ్‌ సంస్థలు ఇస్తోన్న రేటింగ్‌ గమనించవచ్చు. 


నచ్చిన సంస్థలన్నింటికీ దరఖాస్తు చేస్తే సమయం, పెద్ద మొత్తంలో డబ్బులూ వృథా. మీ స్కోరు ప్రకారం 10-15 సంస్థల జాబితా ముందుగా సిద్ధం చేసుకోవాలి. వీటిలో డ్రీమ్‌ సంస్థలు 4 ఉండాలి. అంటే సీటు వచ్చే అవకాశాలు పరిమితంగా ఉన్నవి. అలాఅని తక్కువ స్కోరు ఉన్నప్పటికీ స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, యేల్‌ లాంటివి ఎంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీ జీఆర్‌ఈ స్కోరు, అకడమిక్‌ సీజీపీఏలకు అనుగుణంగా దరిదాపుల్లో ఉన్న సంస్థలనే ఎంచుకోవాలి. టార్గెట్‌ సంస్థలు 4 ఉండాలి. వీటిలో సీటు రావడానికి 40 శాతం అవకాశం ఉంటుంది. 2 లేదా 3 సేఫ్టీ సంస్థలు అంటే సీటు రావడానికి 75 శాతం అవకాశం ఉన్నవి ఉండాలి. 


ఎక్కువమంది విద్యార్థులు ప్రవేశాలకు గడువు తేదీ సమీపిస్తున్నప్పుడు తొందరపడతారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. గడువు తేదీకి కనీసం నెల రోజుల ముందైనా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఓపీ రాయడానికి 4 వారాలు కేటాయించుకోవాలి. ఆ తర్వాత విడిగా సంస్థల వారీ ఎస్‌ఓపీ కోసం కనీసం 3-4 రోజులైనా అవసరమవుతాయి. రికమెండేషన్‌ లెటర్లు, సపోర్టు డాక్యుమెంట్లు మొదలైనవన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి.


15 నెలల ప్రణాళికతో..

డిగ్రీ (బీటెక్‌) పూర్తికాగానే యూఎస్‌ వెళ్లి చదువుకోవాలంటే బీటెక్‌ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే సన్నాహాలు ప్రారంభించాలి. ఈ సమయంలో జీఆర్‌ఈ, టోఫెల్‌ల సన్నద్ధతకు కేటాయించాలి. నాలుగో సంవత్సరం కోర్సులో ఉన్నప్పుడు జూన్‌ నుంచి విదేశీ విద్యకు ప్రణాళిక రూపొందించుకోవాలి. 

జులై: జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం, వాటిని రాయడం

ఆగస్టు: పరీక్షల్లో సాధించిన స్కోరు ప్రకారం అందుకు తగ్గ విశ్వవిద్యాలయాల జాబితా రూపొందించుకోవాలి.

సెప్టెంబరు: ఎస్‌ఓపీ, వ్యాసాలు, రికమెండేషన్‌ లెటర్లు పకడ్బందీగా సిద్ధం చేసుకోవాలి.అక్టోబరు: దరఖాస్తుల తుదిమెరుగులకు కేటాయించాలి.

నవంబరు, డిసెంబరు, జనవరి: ఫాల్‌ దరఖాస్తులకు గడువు ముగుస్తుంది. ప్రాధాన్యం ప్రకారం ఒక్కో సంస్థకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.

ఫిబ్రవరి, మార్చి: దరఖాస్తు చేసుకున్న సంస్థల నుంచి సీటుకు సంబంధించిన వర్తమానం అందుతుంది.

ఏప్రిల్, మే: డబ్బుకోసం ఏర్పాట్లు చేసుకోవాలి. స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకోవడం, విద్యారుణాలు పొందడం లాంటివి పూర్తిచేసుకోవాలి.

జూన్‌: స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

జులై: విదేశీయానం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి కావాలి.

ఆగస్టు/ సెప్టెంబరు: అమెరికాలోని కోరిన సంస్థలో కాలుమోపేది ఇప్పుడే. ఫాల్‌ సీజన్‌ ప్రారంభం
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

‣ డిగ్రీ విద్యార్థులకు ‘రిలయన్స్‌’ సాయం

‣ నవోదయల్లో లేటరల్‌ ఎంట్రీ

‣ కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్ట్‌ కొలువులు

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

Posted Date : 03-10-2023


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం