• facebook
  • whatsapp
  • telegram

మీడియా సంస్థల్లో ఆహ్వానం

వేదికలు విస్తృతం.. అవకాశాలు అద్భుతం

సమాచార స్రవంతిలో.. వార్తాపత్రికలే కాకుండా టెలివిజన్‌ ఛానెళ్లు, వెబ్‌సైట్లు, యాప్‌లు, వెబ్‌ టీవీలూ భాగమయ్యాయి. విస్తరిస్తున్న వేదికలన్నీ ఆదరణ పొందుతున్నాయి. భిన్న తరాల నేపథ్యం ఉన్న పాఠకులే ఇందుకు కారణం. అభిరుచికి తగ్గట్టుగా కావాల్సిన సమాచారాన్ని కోరుకున్న మాధ్యమాల్లో వీరంతా పొందుతున్నారు. వేదికలు పెరగడంతో ఉపాధి అవకాశాలూ విస్తరించాయి. దీంతో సమర్థ జర్నలిస్టులు, కంటెంట్‌ ప్రొవైడర్లు, కాపీ రైటర్ల కోసం సంస్థలు ఎదురుచూస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు విద్యా సంస్థలు జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్, మల్టీ మీడియా కోర్సులు అందిస్తున్నాయి. తెలుగు మీడియా సంస్థలు ఉచితంగా విద్యనందిస్తూ.. స్టైపెండ్‌ చెల్లించి, ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మీడియా సంస్థల్లో చేరాలనే ఆసక్తి ఉన్నవారికి ఆహ్వానం పలుకు  తున్నాయి. 

ప్రతి ఒక్కరికీ అవసరమైన సమాచారాన్ని అందిస్తూ.. చైతన్యవంతం చేయడంలో నేటి జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. వార్తలు సేకరించి రాయడానికి మాత్రమే జర్నలిజం పరిమితం కాలేదు. వివిధ అంశాలపై ప్రజల ఆలోచనలను విస్తరించడం, స్పష్టతను పెంపొందించడం, మంచి మార్పు దిశగా అడుగులు పడేలా స్ఫూర్తిదాయక కథనాలు అందించడం జర్నలిస్టుల కర్తవ్యం. మేటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, విస్తృత పరిజ్ఞానం సొంతం చేసుకుని, తేలిక పదాలతో సరళంగా రాయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లు తక్కువ వ్యవధిలోనే మెరుగైన స్థాయిని అందుకోవచ్చు. ఏ వేదికను ఎంచుకున్నప్పటికీ భాషపై పట్టు, సామాజిక స్పృహ, తెలుసుకోవాలనే ఆసక్తి, సునిశిత పరిశీలన, తార్కికంగా ఆలోచించడం, పుస్తకాల అధ్యయనం, తప్పులు లేకుండా రాయడం.. తప్పనిసరి. 

నేపథ్యం ఏదైనా..

జర్నలిజం, మీడియా కోర్సుల్లో చేరడానికి విద్యా నేపథ్యంతో సంబంధం లేదు. ఒకప్పుడు ఎక్కువగా బీఏ, ఎంఏ, భాషాశాస్త్రాలు చదివినవారే మీడియాలో ఎక్కువమంది ఉండేవారు. ప్రస్తుతం బీటెక్, బీఎస్సీ నేపథ్యంతో ఈ రంగంలో ప్రవేశిస్తోన్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్మీడియట్‌ తర్వాత జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులు అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనే చదువుకోవచ్చు. అయితే అన్ని చోట్లా ఇవి అందుబాటులో లేవు. పీజీ స్థాయిలో మాత్రం దాదాపు విశ్వవిద్యాలయాలన్నీ మాస్టర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం (ఎంసీజే), జర్నలిజం అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌... తదితర పేర్లతో కోర్సులు అందిస్తున్నాయి. యూజీలో చదువుకున్న సబ్జెక్టులు/ గ్రూపులతో సంబంధం లేకుండా వీటిలో ఎవరైనా చేరవచ్చు. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ సంస్థలూ యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నాయి. 

ఉపాధి అవకాశాలు

సుశిక్షితులైనవారు మీడియా సంస్థల్లోనే కాకుండా.. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో పీఆర్వోలుగా, ప్రైవేటు సంస్థల్లో కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో మేనేజర్లుగా రాణించవచ్చు. 

ప్రింట్‌ మీడియా సంస్థలు, వార్తా ఛానెళ్లు ప్రత్యేకంగా వెబ్‌సైట్లు, యాప్‌లను తీసుకొచ్చాయి. ఇవేకాకుండా పేరొందిన మీడియా సంస్థలెన్నో ప్రాంతీయ భాషల్లోనూ వెబ్‌సైట్లు నడుపుతున్నాయి. దీంతో స్థానిక భాషల్లో ప్రావీణ్యం, విషయ పరిజ్ఞానం ఉన్నవారికి అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే బీబీసీ తెలుగు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సమయం, హిందూస్థాన్‌ టైమ్స్, ఏబీపీ, వే టూ న్యూస్‌.. ఇలా పదుల సంఖ్యలో సంస్థలు తెలుగులో వార్తలు అందిస్తున్నాయి. సమర్థులకు పెద్ద మొత్తంలోనే వేతనాలూ దక్కుతున్నాయి. కంటెంట్‌ ప్రొవైడర్, కంటెంట్‌ రైటర్, కంటెంట్‌ డెవలపర్, కాపీ రైటర్, బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టు తదితర హోదాలతో వీరికి అవకాశం కల్పిస్తున్నారు. భిన్న వేదికలపై (ప్రిజిటల్‌) సేవలందించగలిగే నైపుణ్యం ఉంటే తక్కువ వ్యవధిలోనే రాణించవచ్చు. 

అంతర్జాలంలో వేల సంఖ్యలో వెబ్‌సైట్లు సమాచారం అందిస్తున్నాయి. వీటిలో వాస్తవికత, కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇచ్చేవే ఆదరణ పొందుతున్నాయి. ఎక్కువమందికి చేరుకోవాలని మసాలా వార్తలు రాసి, తప్పుదోవ పట్టించేవి తక్కువ వ్యవధిలోనే మనుగడ కోల్పోతున్నాయి. అందువల్ల ఏదైనా సంస్థలో చేరేముందే వేతనం ఒక్కటే కాకుండా అన్ని కోణాల్లోనూ పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలి. కొంత అనుభవం, పేరుతో ఫ్రీలాన్స్‌ రైటర్‌గానూ రాణించవచ్చు లేదా సొంతంగా వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించి ఆర్జించవచ్చు. అన్ని సంస్థలూ తమ ఉత్పత్తుల వివరాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి కంటెంట్‌ రైటర్లని నియమించుకుంటున్నాయి. సాంకేతిక నేపథ్యం ఉన్నవారు టెక్నికల్‌ రైటర్లుగానూ సేవలందించవచ్చు. రాజకీయ పార్టీలు, నేతలు.. తమ ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రత్యేకంగా పీఆర్‌ నిపుణులను తీసుకుంటున్నారు. 

స్పెషలైజేషన్లు 

ప్రతి విషయం/ రంగం గురించి ఎంతో కొంత తెలుసుకుంటూ, ఏదైనా ఒక విభాగంలో ప్రత్యేకమైన నైపుణ్యం పొందినవారికి గుర్తింపు, ప్రోత్సాహం దక్కుతుంది. ఇలాంటి వారు పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్‌లతోపాటు మరెన్నో వేదికల్లో సేవలు అందించవచ్చు. ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, బిజినెస్, ఫీచర్స్, యూత్, లీగల్, క్రైమ్, పొలిటికల్‌... ఇలా ఎన్నో విభాగాలు మీడియా సంస్థల్లో ఉన్నాయి. ఎందులోనైనా గట్టిపట్టున్నవారు స్పెషలిస్ట్‌ సేవలు అందించవచ్చు. ప్రాంతీయ భాష పత్రికల్లో రాణించడానికి ఆంగ్ల అనువాద నైపుణ్యం ఉపయోగపడుతుంది. 

కోర్సుల్లో..

పీజీ స్థాయిలో..జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ ఇంట్రడక్షన్, ఎడిటింగ్‌ టెక్నిక్స్, మీడియా లాస్, భారత రాజ్యాంగం, రిపోర్టింగ్‌ మెథడ్స్, మీడియా మేనేజ్‌మెంట్, అడ్వర్టైజింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ వీటిపై అవగాహన కల్పిస్తారు. యూజీ కోర్సుల్లో.. రైటింగ్‌ ఫర్‌ మీడియా, కమ్యూనికేషన్‌ ఇంట్రడక్షన్, మీడియా లాస్‌ అండ్‌ ఎథిక్స్, ప్రింట్‌ జర్నలిజం, న్యూమీడియా, టెలివిజన్‌ జర్నలిజం అండ్‌ ప్రొడక్షన్, పబ్లిక్‌ రిలేషన్స్‌ అడ్వర్టైజింగ్‌ ప్రాక్టీసెస్, గ్లోబల్‌ మీడియా... తదితర అంశాల్లో శిక్షణ అందిస్తారు. యూజీ కోర్సుల వ్యవధి మూడేళ్లు. మొత్తం ఆరు సెమిస్టర్లు. పీజీ రెండేళ్ల వ్యవధి. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలో చేరవచ్చు. డాక్టరేట్‌ డిగ్రీ ఉన్నవారు బోధన రంగంలో రాణించగలరు.   

పేరున్న విద్యాసంస్థలు 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, పుణే యూనివర్సిటీ, సింబయాసిస్, సెయింట్‌ జేవియర్, క్రైస్ట్, మణిపాల్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ న్యూ మీడియా, ఇగ్నో తదితర సంస్థలెన్నో యూజీ, పీజీల్లో జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు పేరొందాయి. వీటిలో ఎక్కువ సంస్థలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలే. సీయూసెట్‌లో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. ఏప్రిల్‌ 19లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షల్లో.. జనరల్‌ ఇంగ్లిష్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, లాజికల్‌ రీజనింగ్, కరెంట్‌ అఫైర్స్, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌... అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. 

తెలుగు రాష్ట్రాల్లో..

ఉస్మానియా, ఆంధ్రా, ఆచార్య నాగార్జున, శ్రీవెంకటేశ్వర, కాకతీయ, పద్మావతి మహిళ..ఇలా దాదాపు పాత, కొత్త విశ్వవిద్యాలయాలన్నీ ఎంఏ (జర్నలిజం)/ఎంసీజే కోర్సులు అందిస్తున్నాయి. రాష్ట్రాలవారీ నిర్వహించే పీజీసెట్‌లతో ప్రవేశం లభిస్తుంది. 

మీడియా సంస్థల్లోనూ..

కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం స్కూల్‌/ కాలేజీలను నెలకొల్పి, తమ అవసరాలకు అనుగుణంగా ఔత్సాహిక గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దుతున్నాయి. ఈనాడు, మరికొన్ని తెలుగు పత్రికలు ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఉచితంగా చదివించి, ప్రతి నెలా స్టైపెండ్‌ అందించి ప్రోత్సహిస్తున్నాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారిని ట్రైనీలుగా తీసుకుంటున్నాయి. అనంతరం పనితీరును బట్టి శాశ్వత విధుల్లోకి మారుస్తున్నాయి. 

ఆంగ్ల పత్రికలూ జర్నలిజం కాలేజీలు ఏర్పాటు చేశాయి. ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం(ఏసీజే), చెన్నై ద హిందూ ఆధ్వర్యంలో నడుస్తోంది. మేటి సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏడాది వ్యవధితో అందిస్తోన్న పీజీ ప్రోగ్రాం ఇన్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ మీడియా జర్నలిజం కోర్సు చదవడానికి రూ.4.60 లక్షల ఫీజు చెల్లించాలి. కొంతమందికి స్కాలర్‌షిప్పు అందిస్తారు. ప్రాంగణ నియామకాల ద్వారా పలు జాతీయ మీడియా సంస్థలు వీరికి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రకటన వెలువడింది. మేలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. టైమ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం, మనోరమ జర్నలిజం కాలేజ్‌ కూడా ఇదే తరహాలో కోర్సులు అందిస్తున్నాయి. 

ఈనాడు జర్నలిజం స్కూలు 

మల్టీ మీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈనాడు జర్నలిజం స్కూలు (ఈజేఎస్‌) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాతపరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపినవారికి అవకాశం కల్పిస్తారు. ఏడాది కోర్సులో మొదటి ఆరు నెలలు రూ.14,000, తర్వాత ఆరు నెలలు రూ.15,000 అందిస్తారు. కోర్సు పూర్తిచేసినవారికి శిక్షణ సమయంలో రూ.18,000 చెల్లిస్తారు. ప్రొబేషన్‌లో 20,000 కన్ఫర్మేషన్‌లో రూ.22,000 అందుతాయి.  

అర్హత: ఏదైనా డిగ్రీ. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న, రాసినవారూ అర్హులే. వయసు: జూన్‌ 1, 2023 నాటికి 28 ఏళ్లకు మించరాదు. 

ఎంపిక: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు, బృందచర్చ, ఇంటర్వ్యూలతో.

రాత పరీక్షలో: జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యం తెలుసుకునేందుకు ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం, తాజా సంఘటనలపై వ్యాసం రాయాలి. తెలుగులో రాయగల నేర్పు, ఆంగ్లంపై అవగాహన, లోకజ్ఞానం, వర్తమాన అంశాలపై పట్టు ఉంటే పరీక్షలో రాణించగలరు. నమూనా ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే పరీక్షపై అవగాహన పొందవచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు గడువు: ఏప్రిల్‌ 6

ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 16 (అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు).

దరఖాస్తు రుసుము: రూ.200.

వెబ్‌సైట్లు: https://www.eenadu.net/, https://pratibha.eenadu.net/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇస్రోలో 62 టెక్నికల్‌ ఉద్యోగాలు

‣ లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

Posted Date: 11-04-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌