• facebook
  • whatsapp
  • telegram

వీడియో జర్నలిస్టులు

సమాచార విప్లవంతో మీడియా వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీంతో ఈ రంగంలోని వివిధ విభాగాలకు సంబధించిన ఉద్యోగాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒకటి వీడియోజర్నలిజం. సునిశిత పరిశీలన, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు వీడియోజర్నలిజం వృత్తిలో చక్కగా రాణిస్తారు. రాజకీయ ప్రసంగాలు, మీడియా సమావేశాలు, ప్రదర్శనలు, ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని, వీడియో దృశ్యాలను టీవీ ఛానళ్లకు లేదా వార్తా సంస్థలకు వీడియోజర్నలిస్టులు అందజేస్తారు. వార్తకు సంబంధించిన ఏ ఒక్క ముఖ్యమైన అంశాన్నీ అశ్రద్ధ చేయకూడదు.పని చేసే సమయంలో కళ్లకు - చేతులకు మధ్య సమన్వయం అవసరం. సాంకేతిక పరికరాలను సమర్థంగా వాడటంలోనూ, ప్రముఖుల సమక్షంలో ప్రవర్తించే విధానంలోనూ నైపుణ్యంతో వ్యవహరించాలి. వార్తాకథనాలను సేకరిస్తున్నప్పుడు, వాటిని ఎడిట్ చేస్తున్న సందర్భాల్లో వీడియోజర్నలిస్టులు కొన్నిసార్లు స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఈ వృత్తిలో కచ్చితమైన పనివేళలంటూ ఉండవు. రోజులో ఎప్పుడైనా, ఎక్కడికైనా సమాచార సేకరణకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణం అనేది వీడియో జర్నలిజం వృత్తిలో ప్రధానమైనది. దూరప్రాంతాలకు వెళ్లడానికీ సంసిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఇతర రాష్ట్రాలు లేదా ఇతర దేశాలకూ వెళ్లాల్సి ఉంటుంది. 1965లో మొదటి సారిగా మనదేశంలో అరగంట నిడివితో వార్తాకదంబం ప్రసారమైంది. నేడు 24 గంటలూ వార్తలను అందించే ఛానళ్లు అందుబాటులోకి వచ్చాయి.

వృత్తి స్వభావం  

వీడియోజర్నలిస్టుగా వార్తలను సేకరించాలంటే అతనికి సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. లెన్సులు, ట్రైపాడ్‌లు, ఫిల్టర్లు, లైటింగ్‌లాంటి వీడియోపరికరాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. నేడు మార్కెట్‌లో ఎన్నో సదుపాయాలున్న 'వార్తాసేకరణ ఎలక్ట్రానిక్ కెమెరాలు (ఈఎన్‌జీ)' అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా విలేకరులు వారున్న ప్రదేశం నుంచే వార్తలను వేగంగా ప్రసారకేంద్రాలకు పంపే అవకాశం ఉంటుంది. 

వీడియో దృశ్యాలను తీసేటప్పుడు, ఇంటర్వూలను నిర్వహించే సమయాల్లో , వార్తాకథనాలను అభివృద్ధి చేసేటప్పుడు సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంటుంది. సమయానికి వాటిని అందించటమే ఈ వృత్తిలో ప్రధాన లక్షణం. ఈ వృత్తిలో కచ్చితంగా ఓపిక ఉండి తీరాల్సిందే. లేకపోతే ఇందులో రాణించటం కష్టమవుతుంది. వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకుంటూ ఉండాలి. టీవీ వార్తలకు సంబంధించి అన్ని రకాల వార్తలను సేకరించడానికి సిద్ధంగా ఉండాలి. వార్తలకు సంబంధించిన ఆడియో, వీడియోదృశ్యాలను తీసేటప్పుడు నిపుణతతో వ్యవహరించాలి. దీని కోసం నిరంతర సాధన చేయాల్సి ఉంటుంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా, అభ్యంతరం లేని విధంగా చిత్రాలను తీయాలి.

ఉండాల్సిన లక్షణాలు

స్పష్టమైన కంటిచూపు, కళాత్మక నైపుణ్యం, ఫొటోజర్నలిజం పట్ల అవగాహన అనేవి వీడియో జర్నలిస్టుకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. వార్తాసేకరణకు అవసరమైన కెమెరా, ట్రైపాడ్, మైక్రోఫోన్, లైటింగ్ లాంటి పరికరాల వాడకంలో నైపుణ్యం ఉండాలి. వీడియోజర్నలిస్టులు వృత్తిపరంగా వార్తల సేకరణ కోసం ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది.

ఎన్నో ఉద్యోగావకాశాలు

వార్తా ఛానళ్లు, సంస్థలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వీడియోజర్నలిస్టులకు ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగం ప్రాధాన్యత సంతరించుకుంటున్న క్రమంలో ఉద్యోగం కోసం పోటీ పెరుగుతోంది. వార్తా వెబ్‌సైట్ల సంఖ్య పెరుగుతుండటంతో 'వెబ్‌జర్నలిజం' రూపంలో వీడియోజర్నలిస్టులకు మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. చాలా మంది 'ఫ్రీలాన్సర్ వీడియోజర్నలిస్టులు'గా వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నారు.

వృత్తి నియమాలు

వీడియోజర్నలిస్టులకు ఒకే విధమైన వృత్తి నియమాలంటూ ఏమీ ఉండవు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వార్తా ఛానళ్లలో, సంస్థల్లో సాధారణంగా వారానికి ఆరు రోజులు పనిచేయాలి. కొన్నిసార్లు ఎక్కువ సమయాన్ని కేటాయించైనా నిర్ణీత గడువులోపు ఇచ్చిన పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎక్కువ కాలం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, రాజకీయ ర్యాలీలు లాంటి భిన్న రకాల వాతావరణాల్లో పని చేయడానికిసిద్ధంగా ఉండాలి.

శిక్షణ

జర్నలిజం లేదా వీడియోగ్రఫీలో డిగ్రీ/డిప్లొమా ఉన్న వారిని వీడియోజర్నలిస్టులుగా ఎంపిక చేస్తారు. వీడియోజర్నలిస్టు ఎన్ని డిగ్రీలు చేశాడనే దానికంటే వారికున్న సాంకేతిక పరిజ్ఞానమెంత? అనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోడానికి స్వల్పకాల శిక్షణలు పొందాలి. విస్తృత స్థాయిలో పనిచేయాలి. వివిధ జర్నలిజం పాఠశాలలు, కళాశాలలు,విశ్వవిలయాలు, ఇతర శిక్షణసంస్థలు వీడియోజర్నలిజానికి సంబంధించిన పలు అంశాలను బోధిస్తున్నాయి. పేరున్న వార్తా ఛానళ్లు ఔత్సాహికులకు వీడియోజర్నలిజంలో తగిన శిక్షణనిచ్చి వారిని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాయి.

ఆదాయం

కెరీర్ ఆరంభంలో వీడియోజర్నలిస్టులు ఇతర భత్యాలతో కలిపి రూ. 10వేల నుంచి రూ. 15వేల జీతాన్ని పొందుతారు. అనుభవాన్ని బట్టి జీతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వృత్తిలో మంచి ప్రతిభ చూపిన వారికి జీతం ఎక్కువగానే ఉంటుంది. జీతాల చెల్లింపు అనేది వారు పనిచేస్తున్న టీవీ ఛానళ్ల యాజమాన్యాల మీద ఆధారపడి ఉంటుంది. వార్తాసేకరణ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అయ్యే మొత్తం ఖర్చును ఆయా టెలివిజన్ సంస్థలే భరిస్తాయి. సీనియర్ వీడియోజర్నలిస్టులు నెలకు లక్ష రూపాయలు లేదా అంతా కంటే ఎక్కువ జీతాన్ని పొందుతారు. టీవీ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు వాటికి అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాలలో ఫ్రీలాన్స్ వీడియోజర్నలిస్టుల ద్వారా వార్తలను సేకరిస్తాయి. ఇందుకు గాను వారికి కొంత డబ్బును ఇస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్టులు వారికి అవసరమైన పరికరాలను వారే సమకూర్చుకొని సదరు సంస్థలకు సేవలందిస్తారు.

'న్యూమీడియా'

టీవీ వార్తాఛానళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వీడియోజర్నలిస్టులకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. శాటిలైట్ టెక్నాలజీ, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ కారణంగా వీడియోజర్నలిజం మరింత విస్తరించింది. రాబోయే కాలంలో వార్తాకార్యక్రమాలు, పంపిణీ అన్నీ డిజిటల్ టెక్నాలజీ పైనే ఆధారపడి ఉంటాయి. దీన్నే 'న్యూ మీడియా'గా అభివర్ణిస్తున్నారు. ఓబీ వ్యాన్‌ల సహాయంతో శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకుని కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఈ విధానంలో సరి కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడంలో టీవీ ఛానళ్లు వినూత్నమైన పాత్రను పోషిస్తున్నాయి. వీడియోజర్నలిస్టుగా కొనసాగుతున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలి.
 

Posted Date: 08-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌