• facebook
  • whatsapp
  • telegram

విదేశాలు.. విద్యావకాశాల నెలవులు

ద్వితీయ ప్రాధాన్యం ఉన్న దేశాల వివరాలు

విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల గురించి తెలుసుకుంటూ... ఇప్పటివరకూ ప్రధాన దేశాలు అన్నింటి గురించి చర్చించుకున్నాం. ఇప్పుడిక విద్యార్థులు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్న దేశాల గురించి కూడా తెలుసుకుందామా!

సింగపూర్‌

సింగపూర్‌లో చదవాలని నిర్ణయించుకునేందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఈ దేశ ఆర్థికవ్యవస్థ బలమైన పునాదులు కలది.. ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలు అందించడమే కాదు, అద్భుతమైన అవకాశాలకూ ఇది వేదిక. టెక్నాలజీపరంగా ఈ దేశం చాలా అభివృద్ధి చెందింది. పరిశోధనలు చేసే ఆసక్తి ఉన్నవారికి ఇది చక్కటి ఎంపిక. గ్రంథాలయాలు, రిసెర్చ్‌ సెంటర్లు, క్రీడావసతులు.. ఇలా ఏ సౌకర్యమైనా ఇక్కడ సులభంగా, వేగంగా అందుతుంది. ఈ దేశంలో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్‌ మాట్లాడటం వల్ల విద్యార్థులు నేర్చుకోవడానికీ, అక్కడ ఉండటానికీ సౌలభ్యంగా ఉంటుంది. 

అంతేకాదు.. ఈ దేశానికి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.  పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చులోనే సౌకర్యవంతంగా బతకొచ్చు. స్థిరమైన రాజకీయ వాతావరణం, తక్కువ నేరాల రేటుతో ప్రపంచంలో సురక్షితమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది.

ప్రవేశాలు

ఇక్కడ ప్రధానంగా రెండు ఇన్‌టేక్స్‌ ఉన్నాయి. 

స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌: ఈ సమయంలో ప్రవేశాలు పొందినవారికి తరగతులు జనవరిలో మొదలవుతాయి. దీనికి అందుకోవాలనుకునే విద్యార్థులు ముందు ఏడాది ఆగస్టు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. నవంబర్‌ నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. 

ఫాల్‌ ఇన్‌టేక్‌: ఈ సీజన్‌లో తరగతులు ఆగస్టు నుంచి మొదలవుతాయి. అంటే మార్చి-ఏప్రిల్‌ నుంచి ప్రక్రియ ప్రారంభించాలి. చాలామంది విద్యార్థులు ఈ ఇన్‌టేక్‌ను తీసుకునేందుకు ఇష్టపడతారు. జులై నెలాఖరు నాటికి ఇది ముగుస్తుంది. 

ఇవికాక కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఏ పరీక్షలు? 

సింగపూర్‌ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

ఐఈఎల్‌టీఎస్, టోఫెల్, పీటీఈ... వీటిలో ఏదైనా అనుమతిస్తారు. 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదవాల నుకునే విద్యార్థులు ఎస్‌ఏటీ రాయాలి. అయితే చాలా యూనివర్సిటీలు ఇప్పుడు దీన్ని తప్పనిసరి అని చెప్పడం లేదు, ఆప్షనల్‌గా మార్చేశాయి. 

బిజినెస్‌ స్కూల్స్‌లో చేరాలి అనుకునే విద్యార్థులు మాత్రం జీమ్యాట్‌ రాయాల్సి ఉంటుంది. చాలావరకూ విద్యాసంస్థలు జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోరును అడుగుతున్నా.. ఇవి తప్పనిసరి కాని యూనివర్సిటీలు కూడా ఉన్నాయి.

యూనివర్సిటీలు - కోర్సులు

సింగపూర్‌లో 34 యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్నాయి. వీటిలో..

లోకల్‌ అటానమస్‌ యూనివర్సిటీలు.. ఇవి పరిశోధన ఆధారిత విద్యాసంస్థలు. 

ప్రైవేటు విద్యాసంస్థలు - ఇవి ప్రైవేట్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ నియంత్రణలో నడుస్తాయి. మరికొన్ని వర్సిటీలు విదేశీ సంస్థల స్థానిక శాఖలుగా కూడా ఉన్నాయి. 

అధిక శాతం మంది విద్యార్థులు ఇక్కడ ఇంజినీరింగ్‌ అండ్‌ సైన్స్, లా, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ కోర్సులు చదవడానికి వస్తుంటారు. 

2-4 ఏళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివేందుకు సగటున ఫీజు రూ.14 లక్షల నుంచి రూ.22 లక్షలు ఉంటుంది. ఒకటి నుంచి ఒకటిన్నర ఏడాది కాలవ్యవధితో చదివే పీజీ కోర్సులకు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వరకూ ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

మొదట నచ్చిన యూనివర్సిటీకి దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. ఇంగ్లిష్‌ ప్రొఫిÆషియన్సీ టెస్ట్‌ స్కోరు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ లెటర్, రికమెండేషన్‌ లెటర్లు వంటివన్నీ పంపితే.. విద్యార్థికి అన్‌కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ వస్తుంది. తర్వాత క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి హాజరుకావాలి. ఇది పాసైతే ఎన్‌రోల్‌మెంట్‌ డిపాజిట్‌ చేయమని అడుగుతారు. ఆ తర్వాత యాక్సెప్టెన్స్‌ లెటర్‌ వస్తుంది.

వీసా కోసం..

యాక్సెప్టెన్స్‌ లెటర్‌ రాగానే విద్యార్థి వీసా ప్రక్రియ మొదలుపెట్టాలి. 

వీసా అప్లికేషన్‌ ఫామ్‌తో పాటుగా - ఐసీఏ ఫామ్‌ 16, ఫామ్‌ వి36, లోన్‌ వచ్చినట్లు ధ్రువపత్రం, అప్లికేషన్‌ ఫీజు రసీదు, 8,400 సింగపూర్‌ డాలర్లు (దాదాపు రూ.5 లక్షలు) నిల్వ ఉన్నట్లు చూపే బ్యాంక్‌ స్టేట్‌మెంట్, యాక్సెప్టెన్స్‌ లెటర్, టెస్ట్‌ స్కోర్‌ రిపోర్ట్, ఎడ్యుకేషన్‌ డాక్యుమెంట్లు, వసతి - రవాణా ఖర్చులకు సంబంధించి... ఇలా అన్ని వివరాలు అందించాల్సి ఉంటుంది.

ఈ దరఖాస్తులను స్టూడెంట్‌ పాస్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ (ఎస్‌ఓఎల్‌ఏఆర్‌ - సోలార్‌) సిస్టమ్‌ ద్వారా పంపాలి. 

విద్యార్థి ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేయాలంటే.. అతడికి యాక్సెప్టెన్స్‌ లెటర్‌ ఇచ్చిన కాలేజీ ముందుగానే విద్యార్థిని అందులో నమోదు చేయాలి. 

కాలేజీ నమోదు చేశాక విద్యార్థి అందులోకి లాగిన్‌ అయ్యి 30 (దాదాపు రూ.1800) సింగపూర్‌ డాలర్ల ప్రాసెసింగ్‌ ఫీజుతో ఈ-ఫామ్‌ 16 సబ్మిట్‌ చేయాలి. 

అలా సబ్మిట్‌ చేశాక ఒక కాపీ ప్రింట్‌ తీసుకోవాలి. దీన్ని ఐసీఏ - స్టూడెంట్‌ పాస్‌ యూనిట్‌ వద్ద అందించాలి.  

సాధారణంగా వీసా ప్రక్రియ 10 రోజుల్లో అయిపోతుంది. జులై నెలలో మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. 

దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యి అప్రూవ్‌ అయితే.. విద్యార్థికి ఐసీఏ నుంచి అప్రూవల్‌ లెటర్‌ వస్తుంది. 

విద్యార్థి ఈ లెటర్‌తో సింగపూర్‌ వెళ్లొచ్చు. అక్కడికి చేరుకోగానే ఐసీఏకు వెళ్లి ఫార్మాలిటీస్‌   పూర్తి చేసి స్టూడెంట్‌ పాస్‌ తీసుకోవాలి.

ఉద్యోగావకాశాలు

చదువు పూర్తికాగానే విద్యార్థికి ఇచ్చిన స్టూడెంట్‌ పాస్‌ రద్దు అవుతుంది, తర్వాత షార్ట్‌ టర్మ్‌ విజిట్‌ పాస్‌ జారీ అవుతుంది. ఈ వీసా గడువు మూడు నెలలు. ఆలోగా వారు నచ్చిన ఉద్యోగం వెతుక్కోవచ్చు (ఈ వీసాపై ఉద్యోగావకాశాలు మాత్రమే చూసుకోవాలి, ఉద్యోగంలో చేరకూడదు.)

ఆ తర్వాత షార్ట్‌ టర్మ్‌ విజిట్‌ పాస్‌ గడువు పూర్తవ్వడానికి కనీసం 10 రోజుల ముందు ఎల్‌టీవీపీ (లాంగ్‌టర్మ్‌ వీసా పాస్‌)కు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగం వచ్చాక ఎంప్లాయర్‌ అభ్యర్థికి వర్క్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేస్తారు.

ఎల్‌టీవీపీను రెండేళ్ల వరకూ మూడేసి నెలల చొప్పున పొడిగిస్తారు. ఆలోగా అభ్యర్థి వర్క్‌ పర్మిట్‌ లేదా ఎంప్లాయిమెంట్‌ పాస్‌ తెచ్చుకోగలగాలి.

ఫ్రాన్స్‌

ఫ్రాన్స్‌.. అందమైన దేశమే కాదు, చదువరుల చిరునామా కూడా! ఉన్నత విద్యను ఉత్తమ ప్రమాణాలతో అందిస్తుందని ఈ దేశానికి మంచి పేరుంది. ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అందించే సైన్స్, ఇంజినీరింగ్, ఆర్ట్, బిజినెస్, హ్యుమానిటీస్‌ డిగ్రీలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఐరోపాలో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజు కాస్త తక్కువనే చెప్పాలి. చాలా బహుళజాతి సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉండటం వల్ల మంచి అవకాశాలను అందుకోవడానికీ, జాబ్‌ మార్కెట్‌ను తెలుసుకోవడానికీ కాస్త సులభంగా వీలవుతుంది.

ప్రవేశాలు

ఫ్రాన్స్‌లో ప్రధానంగా రెండు ఇన్‌టేక్స్‌ ఉన్నాయి. 

స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌: ఇది జనవరిలో ఉంటుంది. ముందు ఏడాది ఆగస్టు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టాలి. నవంబర్‌కల్లా ఈ సీజన్‌ ముగుస్తుంది. 

ఫాల్‌ ఇన్‌టేక్‌: ఇది ఆగస్టులో వచ్చే ఇన్‌టేక్‌. దరఖాస్తు ప్రక్రియ మార్చి-ఏప్రిల్‌ నుంచి మొదలుపెట్టాలి. జులై నెలాఖరుకు ఈ ప్రవేశాలు ముగుస్తాయి.

ఏ పరీక్షలు? 

ఈ యూనివర్సిటీలకు ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్ష స్కోరు ఉండాలి. 

ఇవి ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష స్కోరు మాత్రమే అనుమతిస్తాయి. కొన్ని వర్సిటీలకు ఈ స్కోరు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు. కొన్నింటికి మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ లెటర్‌ ఉంటే సరిపోతుంది. 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఎస్‌ఏటీ పరీక్ష స్కోరు ఉండాలి, కొన్ని సంస్థలకు ఇది తప్పనిసరి కాదు. 

బిజినెస్‌ స్కూళ్లకు జీమ్యాట్‌ స్కోరు మాత్రమే అనుమతిస్తారు. ఇది లేకుండా కూడా కొన్ని సంస్థలకు దరఖాస్తు చేయవచ్చు.

యూనివర్సిటీలు - కోర్సులు

ఈ దేశంలో దాదాపు 3500 పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో టాప్‌ వర్సిటీలను ఎంచుకుని సీటు తెచ్చుకోగలిగిన విద్యార్థులు మంచి అవకాశాలను అందుకోగలరు. వీటిలో ప్రధానంగా 3 కేటగిరీలు ఉన్నాయి. 

పబ్లిక్‌ యూనివర్సిటీలు: ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో దాదాపు 80 శాతం మంది వీటిలోనే చదువుతారు. ఇవి ప్రభుత్వ నిధులతో నడుస్తాయి. చాలా తక్కువ ఫీజుతో ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యాభ్యాసం అందిస్తాయి. స్థానిక, విదేశీ విద్యార్థులకు ఒకే ఫీజు విధానం అమల్లో ఉంటుంది. 

ద గ్రాండీస్‌ ఎకోల్స్‌: ఇవి దాదాపు 250 వరకూ ఉంటాయి. వీటిలో తక్కువ విద్యార్థులను తీసుకోవడం వల్ల వారు అధ్యాపకులతో దగ్గరగా మెలిగే వీలుంటుంది. ఇది పబ్లిక్‌ వర్సిటీలకు సమాంతరంగా నడిచే వ్యవస్థ. ఇవి ప్రధానంగా బిజినెస్, ఇంజినీరింగ్, పొలిటికల్‌ సైన్సెస్‌ కోర్సులు అందిస్తున్నాయి. సెకండరీ స్కూల్‌ పూర్తిచేసుకున్నాక రెండేళ్ల సన్నద్ధత అనంతరం పోటీ పరీక్ష రాయడం ద్వారా ఈ సంస్థల్లో ప్రవేశాలు అందిస్తారు.

బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌:  ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వాతావరణానికి తగిన విధంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ఇవి ముందంజలో ఉంటాయి. చాలా కోర్సులు ఇంటర్న్‌షిప్, ఉపాధి అవకాశాలకు గ్యారెంటీ ఇచ్చే విధంగా నిర్వహిస్తున్నారు. 

ఫ్రాన్స్‌లో మేనేజ్‌మెంట్, ప్యూర్‌ సైన్సెస్, ఇంజినీరింగ్, ఫిలాసఫీ కోర్సులకు అధిక ప్రాధాన్యం ఉంది. 

అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఏడాదికి రూ.4.5 లక్షల నుంచి రూ.27 లక్షలు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు రూ.లక్షా 30 వేల నుంచి రూ.30 లక్షల వరకూ ఫీజు ఉంటుంది. 

ఇక్కడ చదవాలి అనుకునే విద్యార్థులు ఫ్రెంచ్‌ భాష నేర్చుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.  ఆ ధ్రువపత్రం కాలేజీ దరఖాస్తుతో కలిసి సబ్మిట్‌ చేస్తే నచ్చిన కోర్సులో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

యూనివర్సిటీని ఎంచుకున్నాక విద్యార్థి అప్లికేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్ష స్కోరు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ లెటర్, రికమెండేషన్‌ లెటర్‌ వంటివన్నీ అందించాలి. తదుపరి యూనివర్సిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఎదుర్కోవాలి. అందులో పాసైతే అడ్మిషన్‌ పొందేందుకు కొంత ఫీజు చెల్లించాలి. అనంతరం యాక్సెప్టెన్స్‌ లెటర్‌ వస్తుంది.

ఉద్యోగావకాశాలు

లాంగ్‌స్టే స్టూడెంట్‌ వీసాతో విద్యార్థులు చదువుకుంటూనే వారానికి 20 గంటలు పనిచేయవచ్చు. సమ్మర్, సెమిస్టర్‌ సెలవుల్లో ఫుల్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. పీజీ విద్యార్థులు తమ కోర్సు పూర్తికాగానే టెంపరరీ రెసిడెన్స్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఏడాది కాలానికి ఇస్తారు. ఆలోగా పూర్తిస్థాయి ఉద్యోగం వెతుక్కోవాలి.

వీసా కోసం..

విద్యార్థులు ‘క్యాంపస్‌ ఫ్రాన్స్‌’ వెబ్‌సైట్‌ నుంచి వీసా దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్ని నింపాలి. పాస్‌పోర్ట్, లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఫామ్స్, కవర్‌ లెటర్‌ వంటివన్నీ జత చేయాలి. క్యాంపస్‌ ఫ్రాన్స్‌ అనేది అక్కడి ప్రభుత్వ అధికారిక సంస్థ. ఇది తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు ఇమిగ్రేషన్‌ పనుల సహాయకారిగా వ్యవహరిస్తుంది. వీసా ఫీజు 32.20 యూరోలు (దాదాపు రూ.2,800) చెల్లించి డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత వీసా ఇంటర్వ్యూకి హాజరుకావాలి. బయోమెట్రిక్స్‌ కూడా అవసరం అవుతాయి. వీఎల్‌ఎస్‌-టీఎస్‌ (లాంగ్‌స్టే స్టూడెంట్‌ వీసా)తో విద్యార్థులు రెసిడెంట్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒక ఏడాదికి మాత్రమే ఇస్తారు, తర్వాత రెన్యువల్‌ చేసుకోవాలి. వీసా అపాయింట్మెంట్‌ను ఫ్రెంచ్‌ కాన్సలేట్‌లో వెళ్లడానికి కనీసం మూడు నెలల ముందు తీసుకోవాలి. మూడు వారాల్లోగా వీసా ప్రక్రియ ముగుస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్యోగార్థులూ.. పారా హుషార్‌!

‣ సీడాట్‌లో 156 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

‣ మీడియా సంస్థల్లో ఆహ్వానం

‣ కోల్‌ఫీల్డ్స్‌లో కొలువులు

Posted Date : 14-04-2023


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం