• facebook
  • whatsapp
  • telegram

36 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమేనా?

డిగ్రీ అర్హతతో గ్రూప్‌-బీ, సీ కొలువులు

ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్‌ ప్రకటన విడుదల

కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే వివిధ శాఖల్లోని గ్రూప్‌- బీ, సీ పోస్టులు భర్తీ చేయడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది. వీటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 36 శాఖల్లోని ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఖాళీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. వివిధ అంచెల్లో నిర్వహించే పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఈ పరీక్షతో గెజిటెడ్‌ ఉద్యోగాలైన అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులనూ పొందవచ్చు.

మొత్తం నాలుగంచెల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు చేపడతారు. టైర్‌-1లో అర్హత సాధించినవారికి టైర్‌-2కు అవకాశం కల్పిస్తారు. టైర్‌-2లో అర్హులకే టైర్‌-3 ఉంటుంది. ఇందులో విజయవంతమైనవారికి టైర్‌-4లో భాగంగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు లేదా డేటా ఎంట్రీ స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. టైర్‌-4లో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. మిగిలిన 3 అంచెల్లోనూ సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపడతారు. 

టైర్‌-1 ఇలా..

200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున వంద ప్రశ్నలు అడుగుతారు. వీటిని గంటలో పూర్తి చేయాలి. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.5 మార్కులు తగ్గిస్తారు.


టైర్‌-2

ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అయితే జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు పేపర్‌-1, 2లతోపాటు పేపర్‌-3 (స్టాటిస్టిక్స్‌) రాయాల్సి ఉంటుంది. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు పేపర్‌-1, 2లతోపాటు పేపర్‌-4 (ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌) రాయాలి. 

పేపర్‌-1 క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్‌లో వంద ప్రశ్నలుంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి రెండు గంటలు. తప్పు సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గిస్తారు.  

పేపర్‌-2 ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. 2 గంటల్లో పూర్తి చేయాలి. తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

పేపర్‌-3 స్టాటిస్టిక్స్‌ నుంచి వంద ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి అర మార్కు చొప్పున కోత ఉంటుంది. 

పేపర్‌-4 ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ నుంచి 200 మార్కులకు వంద ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 2 గంటలు. తప్పుగా గుర్తిస్తే అర మార్కు చొప్పున తగ్గిస్తారు. 

టైర్‌-3 

ఈ పరీక్షకు వంద మార్కులు కేటాయించారు. ఒక గంట వ్యవధి ఉంటుంది. దీనికోసం ఇంగ్లిష్‌ లేదా హిందీ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. లెటర్, ఎస్సే, ప్రెసీ రైటింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు పేపర్‌పై పెన్నుతో రాయాలి. 

టైర్‌-4 

దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్ష లేదా టైప్‌ పరీక్ష నిర్వహిస్తారు. 

ఇవి గమనించండి

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులకు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. 

వయసు: జనవరి 1, 2022 నాటికి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఇంటలిజెన్స్‌ బ్యూరో మినహాయింపు), ఎస్‌ఐ సీబీఐ పోస్టులకు 30 ఏళ్లలోపు ఉండాలి. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు 32, మిగిలిన గ్రూప్‌-బి పోస్టులకు 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. అన్ని గ్రూప్‌-సి పోస్టులకు 27 ఏళ్లలోపువారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసు మినహాయింపు లభిస్తుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 23, 2022

టైర్‌-1 పరీక్షలు: ఏప్రిల్, 2022.

టయర్‌-2, టయర్‌ 3 పరీక్షలు: వెల్లడించాల్సి ఉంది. 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

జనరల్‌ ఇంటలిజెన్స్‌

అభ్యర్థులందరూ ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్న విభాగమిది. నాన్‌ వెర్బల్‌ సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్, ఆడ్‌మన్‌ అవుట్‌ విభాగాల నుంచే దాదాపు 70 శాతం ప్రశ్నలు ఉంటాయి. క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్, సీక్వెన్స్‌ నుంచి మిగిలిన 30 శాతం ప్రశ్నలు ఉంటాయి. ప్రతి అంశంలోనూ ఒక ప్రశ్న వస్తుంది. 

ఇచ్చిన సమాచారం ఆధారంగా కామన్‌సెన్స్‌ ఉపయోగించి సమాధానం గుర్తించవచ్చు. లాజిక్‌ పట్టుకుంటే సమాధానం తేలికగానే తెలుసుకోవచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు, గతంలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌-1 ప్రశ్నపత్రాలు సాధన చేయడం ద్వారా అధిక మార్కులు పొందవచ్చు. 

జనరల్‌ స్టడీస్‌

ఎక్కువ సబ్జెక్టు, వర్తమానాంశాలు ఉండడం వల్ల అభ్యర్థులు ఎక్కువ సమాచారం చదవాలి. నేర్చుకోవాలి. ముఖ్యమైనవాటిని నోట్సు రాసుకోవాలి. పత్రికల్లో ముఖ్యాంశాలు రాసుకుంటే గుర్తుంటాయి. జనరల్‌ సైన్స్‌లో ఇన్‌వర్షన్, డిస్కవరీ, మెజర్‌మెంట్స్, థీరీస్, కెమిక్‌ ఫార్ములా, మొక్కలు, హ్యూమన్‌ బాడీస్, వ్యాక్సీన్లు, వైరస్‌ తదితర అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్‌ జనరల్, గాంధీయుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. భూగోళశాస్త్రం నుంచి నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ, పరిరక్షణ..సంబంధిత అంశాలు చదువుకోవాలి. పాలిటీలో పౌరులు, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంట్, అధికరణలు, సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీలో డిమాండ్‌- సప్లై, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్‌ రకాలు, జాతీయ, అంతర్జాతీయ సమకాలీనాంశాలపై దృష్టి సారించాలి. వర్తమాన వ్యవహారాల్లో వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, పథకాలు, దేశాలు- రాజధానులు, కరెన్సీలు, ప్రధాని/అధ్యక్షుడు, రాజధాని..మొదలైనవి చూసుకోవాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌/ కాంప్రహెన్షన్‌

దీన్ని ముఖ్యమైన విభాగంగా చెప్పుకోవచ్చు. టైర్‌-1లో 50, టైర్‌-2లో 200 మొత్తం 250 మార్కులు ఇంగ్లిష్‌ నుంచే ఉంటాయి. ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- మ్యాథమేటిక్స్‌ల్లో పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఈ రెండింటికీ కలిపి 500 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్‌ నుంచి అయిదారు, క్లోజ్‌ టెస్టు నుంచి 4, జంబుల్డ్‌ సెంటెన్స్‌లో 3, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌ నుంచి 3 ప్రశ్నలు వస్తాయి. మిగిలినవి వ్యాకరణాంశాల నుంచి ఉంటాయి. వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సిననిమ్స్‌-యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ అంశాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులకు అవకాశం ఉంటుంది. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

సింప్లిఫికేషన్‌పై దృష్టి సారించి సమయం వృథా కాకుండా చూసుకోవచ్చు. అలాగే ఫార్ములాలు కాకుండా లాజిక్‌ ఉపయోగించి సమాధానం గుర్తించడం అలవాటు చేసుకోవాలి. డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీల నుంచి 7-10 వరకు ప్రశ్నలు ఉంటాయి. శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ,  కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. వైశాల్యాలు, వాల్యూమ్స్‌ నుంచి 3-4 ప్రశ్నలు ఉంటాయి. సమాధానం త్వరగా గుర్తించడానికి మాదిరి ప్రశ్నల సాధన, లాజిక్, షార్ట్‌ కట్స్‌ ఉపయోగించాలి.

ప్యూర్‌ మ్యాథ్స్‌లో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. అవి బీజగణితం, త్రికోణమితి, జ్యామితి. టైర్‌-1, 2ల్లో ఈ విభాగానికి ప్రాధాన్యం ఉంది. సాధన ద్వారా ఈ విభాగంపై పట్టు దక్కించుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ విభాగంలో ప్రశ్నలు కొంచెం కఠినంగా వస్తున్నాయి. టైర్‌-1లో 8 నుంచి 10, టైర్‌-2లో 35-40 ప్రశ్నలు ప్యూర్‌ మ్యాథ్స్‌ నుంచి రావచ్చు. వీటిల్లో జామెట్రీ నుంచి అధిక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో త్రిభుజాలు, త్రిభుజ కోణాలు, అంతర, పరివర్తన, లంబ, గురుత్వ కేంద్రాలు, సరూప త్రిభుజాలు ముఖ్యమైనవి. వృత్తాల్లో జ్యా, స్పర్శరేఖ, చక్రీయ చతుర్భుజం, ఆల్టర్నేట్‌ సెగ్మెంట్‌ థీరంపై ప్రశ్నలు వస్తాయి. త్రికోణమితుల్లో నిష్పత్తులు, ఐడెంటిటీస్, విలువల పట్టిక నుంచి ప్రశ్నలు వస్తాయి. సూత్రాలు, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ గుర్తుంచుకోవాలి. ఎత్తులు-దూరాల్లో కనీసం ఒక ప్రశ్న అయినా టైర్‌-1లో అడిగే అవకాశం ఉంది. టైర్‌-2లో ఈ విభాగానికి ప్రాధాన్యం ఉంది. ఆల్జీబ్రా ప్రశ్నలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఆల్జీబ్రా ప్రశ్నల్లో ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానం రాబట్టడానికి ప్రయత్నించాలి.

అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే విభాగంగా చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలిగే నైపుణ్యం ఉన్నవారే విజేతలవుతారు. 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉన్నత రక్షణకు... ఉమ్మడి పరీక్ష!

‣ ఉద్యోగ వేటలో... నాయకత్వ నైపుణ్యాలు

‣ రక్షణ దళాల్లో దూసుకుపోదాం!

‣ అవే పాఠాలు.. అలాగే మరోసారి!

Posted Date : 29-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌