• facebook
  • whatsapp
  • telegram

డాలరుతో డిజిటల్‌ కరెన్సీ ఢీ?

అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలరే కీలకం. డాలరు ఆధారంగానే ప్రపంచ దేశాలమధ్య వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. మారిన పరిస్థితుల్లో డాలరుకు ప్రత్యామ్నాయాల కోసం వేట మొదలైంది. పలు దేశాలు ఈ దిశగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంతమేరకు సఫలీకృతమవుతాయనేది ఆసక్తికరం.

రెండు ప్రపంచ యుద్ధాల్లో ఐరోపా దేశాలు ఆర్థికంగా చితికిపోగా, చిట్టచివర బరిలో దూకిన అమెరికా మాత్రం చెక్కుచెదరలేదు. యుద్ధాలకు ముందూ తరవాత ఐరోపాకు సరకులు, ఆయుధాలు అమ్ముకుని, పెట్టుబడులు పెట్టి ఆర్థిక అగ్రశక్తిగా ఎదిగింది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత బ్రిటిష్‌ పౌండుతోపాటు ఇతర ఐరోపా దేశాల కరెన్సీల విలువ కూడా పడిపోయింది. ఈ గడ్డు స్థితి నుంచి గట్టెక్కడానికి 1944లో బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం అమెరికన్‌ డాలర్‌కు బంగారాన్ని పునాదిగా తీసుకుని, ఆ డాలరు విలువతో తమ కరెన్సీల విలువను ముడిపెట్టాలని 44 దేశాలు అంగీకరించాయి. 1971 నుంచి అమెరికా డాలరు బంగారంతో బంధం తెంచుకుని చమురు ఎగుమతులతో ముడిపెట్టుకుంది. అయినా అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రపంచం మళ్ళీ బంగారాన్నే ఆశ్రయిస్తోంది. అమెరికా డాలరు విలువ పెరిగితే బంగారం ధర తగ్గడం, డాలరు తగ్గితే బంగారం రేటు పెరగడం చూస్తూనే ఉన్నాం.

ఆర్థిక ఆయుధం

చమురు లేనిదే ప్రపంచం ముందుకు కదలదు కాబట్టి క్రమంగా అంతర్జాతీయ వ్యాపారానికి, ఆర్థిక విపణికి డాలరే ఆలంబన అయింది. నేడు ప్రపంచ దేశాలు 88 శాతం సరకులు, సేవల క్రయవిక్రయాలకు డాలర్లను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న విదేశీ కరెన్సీ నిల్వల్లో 60 శాతం డాలర్ల రూపంలోనే ఉన్నాయి. డాలర్లలో జమలు, చెల్లింపులకు స్విఫ్ట్‌ పద్ధతి తోడ్పడుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచినప్పుడల్లా విదేశాల్లో చలామణీలో ఉన్న డాలర్లు పెద్దమొత్తాల్లో అమెరికాకు తరలిపోతున్నాయి. దీంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా వర్ధమాన దేశాలకు ఆహారం, చమురు వంటి నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి తగినన్ని డాలర్లు దొరకడం లేదు.

మరోవైపు తనకు గిట్టని దేశాలకు డాలర్లు చిక్కకుండా ఆర్థిక ఆంక్షలు విధించడం, స్విఫ్ట్‌ నుంచి వెలివేయడం వంటి చర్యలతో అమెరికా తన డాలర్‌ను ఆర్థిక ఆయుధంగా మార్చింది. ఉత్తర కొరియా, ఇరాన్‌లపై ఆంక్షలు విధించిన అమెరికా, 2022లో ఉక్రెయిన్‌ యుద్ధం మూలంగా రష్యాపైనా ఆంక్షల కొరడా ఝళిపించింది. వాషింగ్టన్‌ తదుపరి లక్ష్యం చైనాయేననే వాదన బలపడుతోంది. ఈ పూర్వ రంగంలో డాలరుకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారత్‌, చైనాలకు రష్యా తన చమురును రూపాయల్లో, యువాన్లలో విక్రయిస్తూ డాలర్‌ పెత్తనానికి గండికొడుతోంది. ప్రపంచంలో అత్యధిక చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా అతిపెద్ద దిగుమతిదారైన చైనాకు యువాన్లలో చమురు విక్రయాలకు శ్రీకారం చుట్టింది. డాలర్ల కొరతతో సతమతమవుతున్న 18 దేశాలు భారత్‌తో రూపాయల్లో వాణిజ్యం చేయడానికి సుముఖత తెలిపాయి. చైనా ఇటీవల బ్రెజిల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాలూ డాలర్లలో కాకుండా తమ తమ కరెన్సీలలోనే ద్వైపాక్షిక వాణిజ్యం జరపబోతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయాల వేటలో భాగంగా రష్యా, ఇరాన్‌లు క్రిప్టో కరెన్సీలో వ్యాపారం జరిపే అంశం పరిశీలిస్తున్నాయి. ఆ క్రిప్టోలకు బంగారం వెన్నుదన్నుగా ఉంటుంది. అన్నట్టు రష్యా తన చమురుకు బంగారంలోనూ చెల్లింపులు స్వీకరిస్తోంది. అమెరికా, ఐరోపాలు స్వప్రయోజనాల కోసం పదేపదే ఆంక్షలు విధించడం ప్రపంచ దేశాలకు నచ్చక ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. స్విఫ్ట్‌తో నిమిత్తం లేకుండా బ్యాంకుల మధ్య చెల్లింపులు జరగడానికి తోడ్పడే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని రష్యా సృష్టించింది. అలాగే చైనా సీమాంతర బ్యాంకుల మధ్య యువాన్లలో పరస్పర చెల్లింపులకు ఉపయోగపడే మరో యంత్రాంగాన్ని సృష్టించింది. ఒకవైపు అమెరికా, ఐరోపాల గుప్పిట్లోని బ్యాంకు చెల్లింపుల యంత్రాంగాలకు పోటీగా సొంత యంత్రాంగాలను నెలకొల్పుతూనే సొంత కరెన్సీలలో వ్యాపార లావాదేవీలు జరుపుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికీ రష్యా, చైనా, భారత్‌, ఇరాన్‌ తదితర దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. భారత్‌ దీనికోసం రూపాయల్లో ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను సృష్టించింది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచే చైనా విదేశీ ప్రభుత్వాలతో యువాన్లలో లావాదేవీలు ప్రారంభించింది. 2016 నుంచి చైనా కేంద్ర బ్యాంకు ఈ-సి.ఎన్‌.వై. అనే డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తెచ్చింది. భారత్‌ కూడా డిజిటల్‌ రూపాయిని ప్రవేశపెడుతోంది. రష్యా డిజిటల్‌ రూబుల్‌ పైలట్‌ ప్రాజెక్టు చేపడుతోంది.

ప్రత్యామ్నాయం కోసం బ్రిక్స్‌ ప్రయత్నం

బ్రిక్స్‌ సభ్య దేశాలైన బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు డాలరుకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి రిజర్వు కరెన్సీని ప్రవేశపెట్టే విషయం పరిశీలిస్తున్నాయి. దానికి వెన్నుదన్నుగా రష్యా, చైనా, భారత్‌ల వద్దనున్న బంగారం నిల్వలు తోడ్పడవచ్చు. దక్షిణాఫ్రికాలో వచ్చే ఆగస్టులో జరిగే బ్రిక్స్‌ శిఖరాగ్ర సభలో బ్రిక్స్‌ దేశాల కేంద్ర బ్యాంకులు ఉమ్మడి డిజిటల్‌ కరెన్సీని విడుదల చేస్తాయని అంచనాలు వినబడుతున్నాయి. ఇక్కడ డాలరుకు ప్రత్యామ్నాయంగా 1999 జనవరి ఒకటిన ముందుకొచ్చిన యూరో గురించి సమీక్షించాలి. ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని 27 సభ్యదేశాల్లో 20 దేశాలు యూరోను అధికార కరెన్సీగా వినియోగిస్తున్నాయి. వాటిలో జర్మనీ వంటి మిగులు దేశంతో పాటు గ్రీస్‌ వంటి రుణగ్రస్త దేశమూ ఉంది. ఈయూ దేశాల ఆర్థిక, రాజకీయ అజెండాలలో తేడాలు ఉన్నందువల్ల యూరో పటిష్ఠమైన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయింది. బ్రిక్స్‌లో భారత్‌, చైనాల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ తనదేనంటూ అక్కడి ప్రదేశాల పేర్లను మార్చడానికి చైనా ప్రయత్నించడం రెండు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది. ఇది డాలరుకు బ్రిక్స్‌ ప్రత్యామ్నాయం ఆవిర్భవించకుండా అడ్డుపడుతుందా అన్నదే కీలక ప్రశ్న!

బంగారం నిల్వలు

విదేశ మారక ద్రవ్య నిల్వలు 1991లో అడుగంటి పోవడం వల్ల భారత్‌ 20 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌ల వద్ద తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చుకోవలసి వచ్చింది. ఇలా ఆపత్కాలంలో ఆదుకుంటుంది కాబట్టే పలు దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. 1999-2021 మధ్య రష్యా 1,888 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా చైనా 1,552, తుర్కియే 541, భారత్‌ 395, సౌదీ అరేబియా 180 టన్నుల బంగారం కొని నిల్వచేశాయి. 2022 కల్లా రష్యా, చైనా, భారత్‌ల వద్ద మొత్తం 5031 టన్నుల బంగారం పేరుకుపోయింది.

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నిలువునా సంక్షోభంలో పాక్‌

‣ వాణిజ్య విధానం.. ఎగుమతులకు ఊతం

‣ భారత భాగ్య విధాత డాక్టర్‌ అంబేడ్కర్‌

‣ భూటాన్‌తో బంధం భద్రం

‣ న్యాయవాద వృత్తిలో విదేశీ వకీళ్లు

‣ కృత్రిమ మేధ కొత్తపుంతలు

‣ గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం