• facebook
  • whatsapp
  • telegram

సత్వరన్యాయం కోసం కృత్రిమమేధ

క్లిష్టమైన నేరాల విశ్లేషణలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని మరింత పెంచాలని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. ఇది నేర న్యాయవ్యవస్థలో ఐటీ వినియోగాన్ని పెంచడానికి ఊతమిస్తుంది. కృత్రిమ మేధ  ప్రవేశంతో న్యాయవ్యవస్థలోని పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, సాధారణ ప్రజలకు ఏఐ పరిజ్ఞానం మరింత వెసులుబాటు కల్పించనుంది.

కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానంతో భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండల్లా పేరుకుపోయిన కేసులను వేగంగా పరిష్కరించడానికి, మేలైన తీర్పులు వెలువడటానికి, పేద-ధనిక భేదం లేకుండా అందరూ సమన్యాయం పొందడానికి ఏఐ తోడ్పడుతుంది. అందుకే సుప్రీంకోర్టు కృత్రిమ మేధపై ఒక కమిటీని నియమించింది. ‘సుపేస్‌’, ‘ఎస్‌.సి.ఐ-ఇంటరాక్ట్‌’ వంటి సాధనాలను రూపొందించినా వాటి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియవు. 2022 డిసెంబరు 31 నాటికి జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య 4.32కోట్లకు చేరింది. వీటిని వేగంగా పరిష్కరించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్లే. ఫలితంగా కోర్టులపై ప్రజల్లో నమ్మకం సడలిపోతుంది. భారతీయ ఐటీ పరిశ్రమ ఎంతో పరిణతి చెంది కృత్రిమ మేధ రంగంలోనూ ముందడుగు వేస్తోంది. న్యాయవ్యవస్థ రూపాంతరానికి ఐటీ రంగం తోడ్పడే అవకాశం ఉంది. 

అపార సమాచార రాశి

భారత న్యాయవ్యవస్థ ఇప్పటికే ఏఐని వినియోగించడం మొదలుపెట్టింది. 2021లో సుప్రీంకోర్టు ప్రత్యేక శోధన పోర్టల్‌ను ప్రారంభించింది. కేసులను సమర్థంగా పరిశీలించడానికి అది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు ఉపయోగపడుతోంది. నూరేళ్ల నుంచి ఎన్నో కేసుల్లో వెలువడిన తీర్పులను విశ్లేషించి, న్యాయ సమాచార (డేటా) వర్గీకరణకు ఉపకరిస్తోంది. వివిధ కేసులకు సంబంధించి సముచిత సమాచారాన్ని, కొత్త కోణాలనూ అందించగలుగుతోంది. అపరిష్కృత కేసుల భారాన్ని తగ్గించడానికి దిల్లీ హైకోర్టు ఇటీవల ఏఐ సాయం తీసుకుంది. పేటెంట్‌ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి భారతీయ పేటెంట్ల కార్యాలయం ఏఐ ఆసరా తీసుకొంటోంది. ఇటువంటి పేటెంట్ల కోసం దరఖాస్తులను ఇంకెవరైనా పెట్టారా, గతంలో ఈ తరహా పేటెంట్లు వేరెవరికైనా మంజూరయ్యాయా అనేది వేగంగా తేల్చడానికి ఏఐ సాయపడుతోంది. ఈ సమాచారం ఆధారంగా అధికారులు పేటెంట్‌ దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలను వేగంగా పూర్తి చేయగలుగుతున్నారు. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ పరిజ్ఞానం పేటెంట్ల సమాచారాన్ని విశ్లేషించి, వర్గీకరించి అధికారులకు అందించడం వల్ల పేటెంట్‌ దరఖాస్తులను శీఘ్రంగా పరిశీలించి అనుమతి మంజూరు చేయడం వీలవుతుంది. బడుగు వర్గాలకు శీఘ్ర న్యాయం కోసం ఏఐ అంకురాలు రంగంలోకి దిగాయి. ‘వకీల్‌ సాహెబ్‌’ అనే న్యాయసాంకేతిక అంకుర సంస్థ ఒక ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించింది. న్యాయవాది సేవలను పొందే స్థోమత లేని పేదలకు ఈ చాట్‌బాట్‌ న్యాయ సలహాలిస్తోంది. ‘లాబాటిక్స్‌’ అనే మరో అంకుర సంస్థ ఆరోగ్య సేవ అనే చాట్‌బాట్‌ను రూపొందించింది. అది గ్రామీణ పేదలకు న్యాయ సలహాలు, సేవలు అందిస్తోంది. గ్రామీణ పేదలకు హక్కులు, బాధ్యతల గురించి బోధించి సరైన మార్గదర్శకత్వం వహిస్తోంది. మున్ముందు ఇలాంటి నవీకరణలెన్నో రానున్నాయి. ప్రస్తుతం కోర్టుల్లో విచారణ కార్యకలాపాలను మానవ సిబ్బంది లిఖితపూర్వకంగా నమోదు చేస్తున్నారు. ఇది తీవ్ర కాలహరణానికి దారితీస్తోంది. పలు తప్పులు దొర్లడానికీ ఆస్కారం ఉంది. ఇలాంటి ప్రక్రియ మొత్తాన్ని ఏఐ చాట్‌బాట్లు సమర్థంగా నమోదు చేయగలవు. ‘చాట్‌ జీపీటీ’, ‘చాట్‌ సోనిక్‌’, ‘బార్డ్‌’ వంటి ఏఐ చాట్‌బాట్లు ఇప్పటికే రంగ ప్రవేశం చేయగా, మరిన్ని కొత్తవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అవి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు చేదోడువాదోడుగా ఉంటాయి. అమెరికాలో చిన్నచిన్న కేసుల్లో కక్షిదారుల తరఫున ఏఐ వకీళ్లు రంగంలోకి దిగే రోజు ఎంతో దూరంలో లేదు. చాట్‌ జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్లు చట్టాలకు సంబంధించి అపార సమాచార రాశిని ఇట్టే ఒడిసిపడతాయి. పూర్వ కేసు పత్రాలను, తీర్పులను సమీక్షించి సంగ్రహ సమాచారాన్ని అందిస్తాయి. దీనివల్ల న్యాయవాదులు తమ కక్షిదారుల తరఫున సమర్థంగా వాదించగలుగుతారు. న్యాయమూర్తులు పూర్వ తీర్పుల్లో తమకు కావలసిన సమాచారాన్ని వేగంగా అందిపుచ్చుకొని తీర్పులను వెలువరించగలుగుతారు.

నైతిక ప్రశ్నలు

న్యాయసాధనకు ఏఐని ఉపయోగించడం చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పారదర్శకత, నిష్పాక్షికత, వ్యక్తుల గోప్యతకు పూచీ ఉంటుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. వీటిని నివృత్తి చేసి, సత్వర న్యాయం అందించడానికి న్యాయవ్యవస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానవులు అందించే సమాచారం లేదా డేటా ఆధారంగానే ఏఐ పనిచేస్తుంది కాబట్టి సమాచారంలోని లోటుపాట్లు ఏఐకీ పరిమితులు విధిస్తాయి. అందుకని కచ్చితత్వంతో పక్షపాతానికి తావు లేని విధంగా డేటా ప్రామాణీకరణ జరగాలి. సముచిత నియమనిబంధనలు, నైతిక ప్రమాణాలను పాటించాలి. నిర్ణయ ప్రక్రియలో జవాబుదారీతనం ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం మానవ మేధకు చేదోడు వాదోడుగా ఉంటుందే తప్ప మానవుడి స్థానాన్ని అది భర్తీ చేయలేదు, చేయకూడదు కూడా. ఏఐ కానీ, మరే సాంకేతికతను కానీ సమాజహితం కోసమే ఉపయోగించాలి. ఏదిఏమైనా క్రమేణా మానవ మేధ, కృత్రిమ మేధ కలసికట్టుగా పనిచేయకతప్పదు. ఏఐని సమర్థంగా ఉపయోగించుకునే విధంగా మానవుడు సామర్థ్యం, నైపుణ్యాలను పెంచుకోవాలి. నిష్పాక్షికత, నైతిక ప్రమాణాలను అలవరచుకోవాలి. న్యాయ సాధనలో కృత్రిమ మేధ పొరపాట్లు చేస్తే తప్పు ఆ సాంకేతికతది కాదు- మనుషులదే!

ఉపయోగాలెన్నో..

కేసుల నిర్వహణ, పత్రాల పరిశీలన, సమీక్ష, న్యాయ పరిశోధనకు ఏఐ ఎంతగానో ఉపకరిస్తుంది. దీనివల్ల న్యాయమూర్తులకు వెసులుబాటు చిక్కి సంక్లిష్ట కేసుల పరిష్కారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు. ఏఐ సాధనాలు వేలకొద్దీ కోర్టు పత్రాలను, పూర్వ తీర్పులను పరిశీలించి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందించగలవు. పాత కేసులు, వాటిలో తీర్పులను పరిశీలించిన మీదట కొత్త కేసుల్లో తీర్పులు ఎలా ఉండవచ్చో ఏఐ అంచనా వేయగలదు. అలాంటి కేసులేవో ముందే గుర్తించి పరిష్కరించడం ద్వారా న్యాయమూర్తులు పెండింగ్‌ కేసుల కొండను కరిగించగలుగుతారు. దీర్ఘకాలం విచారణ ప్రక్రియ అవసరమవుతుందనుకున్న కేసులపై ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. అవసరమైతే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధించడానికి కక్షిదారులను ఏఐ సిద్ధం చేయగలుగుతుంది. అయితే డేటా ప్రామాణీకరణ జరగకపోవడం న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగానికి సమస్యగా పరిణమించవచ్చు.

- పీవీఎస్‌ శైలజ

(సహాయ ఆచార్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

‣ డాలరుతో డిజిటల్‌ కరెన్సీ ఢీ?

‣ నిలువునా సంక్షోభంలో పాక్‌

‣ వాణిజ్య విధానం.. ఎగుమతులకు ఊతం

‣ భారత భాగ్య విధాత డాక్టర్‌ అంబేడ్కర్‌

Posted Date: 22-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం