• facebook
  • whatsapp
  • telegram

కోకో దీవుల్లో డ్రాగన్‌ పాగా

అండమాన్‌లోని భారత నావికా దళం కార్యకలాపాలపై నిఘాకు చైనా పావులు కదుపుతోంది. అందుకోసం సమీపంలోని మయన్మార్‌కు చెందిన గ్రేట్‌ కోకో దీవుల్లో పాగా వేస్తోంది. ఇప్పటికే భారత్‌పై నిఘాకు శ్రీలంక, నేపాల్‌ భూభాగాలను డ్రాగన్‌ వినియోగించుకుంటోంది. కొత్తగా మయన్మార్‌ భూభాగాన్నీ స్థావరంగా మార్చుకునే ప్రయత్నాల్లో చైనా ఉంది.

హిందూ మహాసముద్రంలో భారత్‌కు ఉన్న వ్యూహాత్మక ఆధిక్యానికి గండికొట్టేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. అండమాన్‌ దీవులకు 55 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రేట్‌ కోకో దీవుల్లో ఏడాది క్రితమే నావికాదళ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను చైనా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏకంగా సైనిక స్థావరం నిర్మిస్తున్నదన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన అంతరిక్ష సాంకేతిక సంస్థ ‘మాక్సర్‌ టెక్నాలజీస్‌’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో కోకో దీవుల దక్షిణ కొనపై కొత్తగా ఒక కాజ్‌వే, వసతి సముదాయం తదితరాలను నిర్మిస్తున్నట్టు తేలింది. 2,300 మీటర్ల రన్‌వే, రాడార్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఇవన్నీ ఉన్నాయి. భారత యుద్ధనౌకల కదలికలను క్షుణ్నంగా గమనించడమే ఈ స్థావరం ఉద్దేశం. ఈ పరిణామం భారత్‌కు ఆందోళనకరమే. ఇండియా సైనిక కార్యకలాపాలకు అండమాన్‌ దీవులు ప్రధాన వేదిక. చైనా కొంతకాలంగా తన ప్రత్యర్థి దేశాలపై నిఘాను విస్తృతం చేస్తోంది. ఇటీవల అమెరికా గగనతలంపైకి చైనా నిఘా బెలూన్‌ పంపి సంచలనం రేపింది.

కోకో దీవుల్లో చైనా నిఘా కార్యకలాపాల ఆధారాలను భారత అధికారులు మయన్మార్‌ వద్ద ప్రస్తావించారు. ఆ వాదనలను మయన్మార్‌ తోసిపుచ్చింది. తమ భూభాగంలో ఏ విదేశీ సైనిక స్థావరాన్నీ అనుమతించబోమని చెప్పింది. కోకో దీవుల్లో మయన్మార్‌ దళాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చింది. నిన్నటిదాకా శ్రీలంకలో చైనా నావికాదళ స్థావరం ఏర్పాటు కాకుండా భారత దౌత్యాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతం బీజింగ్‌ ప్రలోభాలకు మయన్మార్‌ లొంగకుండా చూసుకోవడంలో వారు నిమగ్నమయ్యారు. చైనా తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)ను భారత్‌కు వ్యతిరేకంగా ఓ రాజకీయ సాధనంగానూ ఉపయోగిస్తోంది. ఈ క్రమంలోనే భారత నావికాదళ కార్యకలాపాలను ఓ కంట కనిపెట్టేందుకే శ్రీలంకలోని కొలంబో నౌకాశ్రయం ఆధునికీకరణకు ముందుకొచ్చింది. ఇటీవలే నేపాల్‌లో రైల్వేలైన్‌ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. చైనా తన ఎగుమతులకు వీలుగా పలు దక్షిణాసియా దేశాల్లో రవాణా వసతులు మెరుగుపరుస్తోంది. ఈ సౌకర్యాలను చైనా ప్రజా విమోచన సైన్యం సైతం అవసరమైనప్పుడు వాడుకుంటుంది.

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వ పాలన నడుస్తోంది. రెండు దశాబ్దాలుగా అక్కడి సైన్యం సొంత పౌరులపైనే దమనకాండకు పాల్పడుతోంది. సైనిక పాలకులకు డ్రాగన్‌ మద్దతు కొనసాగిస్తోంది. గతంలో శ్రీలంకలో తమిళుల మారణహోమం సందర్భంలోనూ అక్కడి పాలకులకు చైనా ఇలాగే అండగా నిలిచింది. తన ప్రయోజనాల కోసం ఎక్కువగా నియంత పాలకులకే డ్రాగన్‌ మద్దతు ఇస్తుంది. ప్రతిగా దౌత్యపరమైన అంశాల్లో తన మాట చెల్లుబాటయ్యేలా చూసుకుంటుంది. మరోవైపు మయన్మార్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మయన్మార్‌ నాలుగింట ఒక వంతు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చైనా నుంచే వస్తాయి. చైనా-మయన్మార్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీఎంఈసీ)లో డ్రాగన్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. గ్యాస్‌ గిడ్డంగులు, ఓడరేవుల నిర్మాణం సహా రైలు, రోడ్డు మార్గాల ఆధునికీకరణ పనులు చేపడుతోంది. అయితే, చైనా ఉద్దేశాలూ దీర్ఘకాలిక ప్రణాళికలన్నీ మయన్మార్‌కు స్పష్టంగా తెలుసు. శ్రీలంక దివాలా తీయడానికి చైనాయే ప్రధాన కారణమన్న స్పృహ మయన్మార్‌కు ఉంది. అందుకే ఇటీవల చైనా నిధులతో చేపట్టిన జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసింది. ఇంకా పలు ప్రాజెక్టులు చేపడతామంటున్న బీజింగ్‌ విజ్ఞప్తులను తిరస్కరిస్తోంది. చైనాతో పోలిస్తే మయన్మార్‌తో భారత్‌కు ఆర్థిక, వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలు తక్కువే. అయితే చారిత్రక, సాంస్కృతిక కారణాల దృష్ట్యా మయన్మార్‌పై భారత్‌ గణనీయ ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా అనేక సమస్యల పరిష్కారంలో మయన్మార్‌కు భారత్‌ మద్దతు తప్పనిసరి. మయన్మార్‌కు పాశ్చాత్య పెట్టుబడులు ఎంతో అవసరం. ఇండియాతో సఖ్యంగా లేకుంటే ఆ పెట్టుబడులు రావన్న విషయం సైనిక పాలకులకు బాగా తెలుసు. ఈ సానుకూలతే అవకాశంగా కోకో దీవుల్లో చైనా నిఘాను ఇండియా నిరోధించాలి. దక్షిణాసియాలో బీఆర్‌ఐ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్ఠం చేయాలి.

- సీహెచ్‌ మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సత్వరన్యాయం కోసం కృత్రిమమేధ

‣ భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

‣ డాలరుతో డిజిటల్‌ కరెన్సీ ఢీ?

‣ నిలువునా సంక్షోభంలో పాక్‌

‣ వాణిజ్య విధానం.. ఎగుమతులకు ఊతం

‣ భారత భాగ్య విధాత డాక్టర్‌ అంబేడ్కర్‌

Posted Date: 22-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం