• facebook
  • whatsapp
  • telegram

కృత్రిమ మేధ ఎంత లాభం.. ఎంత నష్టం?

బ్రిటన్‌ కేంద్రంగా 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ స్వరూపం సమూలంగా మారిపోయింది. అప్పటిదాకా మానవ శ్రమపై ఆధారపడి సాగిన ఉత్పత్తి, రవాణా, ఇతర సేవా కార్యకలాపాలను యంత్రాలు నిర్వహించడం మొదలైంది. ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. పాత ఉద్యోగాలు పోయాయి. యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి. అలాంటి అనూహ్యమైన పరిణామం మరొకటి ఇప్పుడు రాబోతోంది. అదే కృత్రిమ మేధ! అది తెచ్చే మార్పులకు మనమంతా సన్నద్ధం కావాల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఇకపై మనిషి చేసే ప్రతి పనినీ చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల తీరుతెన్నులు, సమాజ గమనం, ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోక తప్పదు. ఇప్పటిదాకా మనం చూస్తున్న, చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వచ్చే కొన్నేళ్లలో కనుమరుగవుతాయి. ఆ స్థానంలో కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి. నైపుణ్యం, శిక్షణ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సాధారణ, మానవ శ్రమ ఆధారిత ఉద్యోగాలు తగ్గిపోతాయి. దీనికి సన్నద్ధంగా ఉన్నవారికి సరికొత్త అవకాశాలు అందివస్తాయి. సన్నద్ధత లేనివారు సంక్షోభం అంచుకు చేరినట్లే. ఇది వ్యక్తులతోపాటు సంస్థలకూ వర్తిస్తుంది. అయితే, ఈ సరికొత్త మార్పుల్ని ఎంతమేరకు స్వాగతించవచ్చు, పరిమితులు అవసరం లేదా... తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నింటినీ కంప్యూటర్లకు అప్పగించేసి మనుషులు ఏం చేయాలనే సందేహమూ రాకమానదు. అందుకే, కొన్ని పరిమితులు నిర్దేశించుకోవడమే పరిష్కారం. కృత్రిమ మేధ విషయంలో మానవాళికి అదే శ్రేయస్కరం.

అందరూ అదే దారిలో..

మనిషి చేసే పనులన్నీ కంప్యూటర్లే నిర్వహించేలా చేయడమే కృత్రిమ మేధ. ఇంకా చెప్పాలంటే మనిషి కంటే చక్కగా, సమర్థంగా, తక్కువ సమయంలో పనులు చేసేలా కంప్యూటర్లను సన్నద్ధం చేయడమే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత. అయిదు అగ్రగామి టెక్నాలజీ సంస్థలైన ఫాంగ్‌ (ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌) కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్‌ సైతం కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిష్కారాల ఆవిష్కరణలో తలమునకలైంది. 2021 నుంచి ఇప్పటిదాకా టెక్నాలజీ కంపెనీలు, ముఖ్యంగా అంకుర సంస్థలు కృత్రిమ మేధ ప్రాజెక్టులపై దాదాపు రూ.7.71 లక్షల కోట్లదాకా పెట్టుబడి పెట్టినట్లు అంచనా. తత్ఫలితంగా వైద్యం, విద్య, ఆర్థిక సేవలు, నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో ఎన్నో మార్పులతో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల వినియోగంలోకి వచ్చిన ‘ఛాట్‌ జీపీటీ’ పరిజ్ఞానం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇది సేవా, సలహా రంగాలను అమితంగా ప్రభావితం చేయనుంది. వైద్య సమస్యకు, సంక్లిష్టమైన న్యాయ సందేహాలకు ‘ఛాట్‌ జీపీటీ’లో సమాధానాలు లభిస్తాయి. కంప్యూటర్‌కు అనుసంధానమయ్యే రోబో- శస్త్రచికిత్సల్ని చేపట్టే పరిస్థితి వస్తోంది. వాటంతట అవే వెళ్ళే వాహనాలు, సైనికుల అవసరం లేని కాపలా పోస్టు, జబ్బుల్ని నిర్ధారించే స్కానింగ్‌ యంత్రాలు వంటి ఎన్నో రకాల వినూత్న మార్పులను త్వరలోనే చూడబోతున్నాం. కృత్రిమ మేధ, ఆటొమేషన్‌, డేటా మైనింగ్‌ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలతో కంప్యూటర్లు- గతం, వర్తమానాల్ని పరిశీలించి, తగిన పరిష్కారాలు సూచించే స్థాయికి చేరాయి. సమీపకాలంలో భవిష్యత్తును సైతం పసిగట్టే సత్తానూ సమకూర్చుకుంటాయేమో! అదే జరిగితే మానవ సమాజం, మనిషి జీవన విధానం సమూలంగా మారిపోతాయి. అందుకే ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాల్ని ఎంతవరకు అనుమతించాలి, ఎలాంటి పనులకు పరిమితం చేయాలనేవి శాస్త్ర సాంకేతిక వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఇప్పటిదాకా మనుషులు నిర్దేశించిన పనులను మాత్రమే కంప్యూటర్లు చేయగలుగుతున్నాయి. విభిన్న పరిస్థితుల్లో మనిషి స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తరహాలో యంత్రాలు సైతం వ్యవహరించగలుగుతాయా తదితర సందేహాలు ఉన్నాయి. అదే జరిగితే కంప్యూటర్లు మనుషులను మించిపోయినట్లే. మరో పదేళ్ల తరవాత మనుషుల జీవన విధానం ఇప్పటి మాదిరిగా అయితే ఉండదని చెప్పవచ్చు.  

ఉద్యోగాలు పోతాయా?

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చు. మెకిన్సే సంస్థ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి వస్తుంది. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను సముపార్జించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతమూ ఒకటి రెండు తరాలు మార్పులను తట్టుకొనే విషయంలో ఇబ్బందులు పడవచ్చు. ఏదిఏమైనా కృత్రిమ మేధ, ఆటొమేషన్‌లతో తలెత్తే పరిణామాలకు అందరూ సిద్ధపడాల్సిందే. అవసరమైన నైపుణ్యాలను సమకూర్చుకోవడం ద్వారా ఉద్యోగ నష్టం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే!  

తప్పులు జరిగితే?

ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైనా యంత్రాలు తప్పులు చేయవచ్చు. కీలకమైన తరుణంలో మొరాయించవచ్చు. పని మధ్యలో సాంకేతిక సమస్యలు ఏర్పడవచ్చు. దానివల్ల అపార నష్టం వాటిల్లుతుంది. యుద్ధ రంగంలోకి పంపిన డ్రోన్‌ శత్రు సైన్యానికి సంబంధించి తప్పుడు సమాచారం తీసుకొచ్చినా, శస్త్రచికిత్సకు సిద్ధమైన రోబో గతితప్పిన అల్గారిథమ్‌ వల్ల వేరే ఆపరేషన్‌ చేసినా, స్వయంచోదిత వాహనం కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లో వైరస్‌లు చొరబడినా... అనూహ్య ప్రమాదాలు చోటుచేసుకొనే ముప్పుంటుంది. మరోవైపు- కృత్రిమ మేధ, ఆటొమేషన్‌ వంటివాటి ఊతంతో మనుషుల్నే శాసించే స్థాయికి యంత్రాలు చేరతాయనే ఆందోళనా లేకపోలేదు. అదే జరిగితే మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్యా ఎలాంటి ముప్పులకు తావు లేకుండా మనిషి హితానికి, మెరుగైన సామాజిక జీవనానికి వీలుకల్పించే విధంగా కృత్రిమ మేధను ఆవిష్కరించడమే ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాలు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

‣ పుడమి తల్లికి గర్భశోకం

‣ కోకో దీవుల్లో డ్రాగన్‌ పాగా

‣ సత్వరన్యాయం కోసం కృత్రిమమేధ

‣ భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

Posted Date: 24-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం