• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

ఐరోపా సంఘం (ఈయూ)తో ఆర్థిక సంబంధాలను ఇండియా మరింత బలోపేతం చేసుకునేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దోహదపడుతుంది. దాన్ని ఖరారు చేసుకునేందుకు దిల్లీ ఎంతమాత్రమూ తొందరపడటం లేదు. భారత పాడి పరిశ్రమతోపాటు కొన్ని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం పడేలా ఈయూ పలు ప్రతిపాదనలు చేయడమే అందుకు కారణం.

ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రస్తుతం ఇండియా, ఈయూ రెండు బలమైన శక్తులు. తమ మధ్య వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో 2007లోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) చర్చలను అవి ప్రారంభించాయి. అయితే, ఉభయతారక ఒప్పందాన్ని కుదుర్చుకొనే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. కొన్ని సరకులపై కస్టమ్స్‌ సుంకం విధింపు సహా పలు అంశాలపై సయోధ్య కుదరకపోవడంతో 2013లో చర్చలు నిలిచిపోయాయి. ఉభయపక్షాలకు చెందిన రాజకీయ వర్గాల చొరవతో 2022 జూన్‌లో తిరిగి సంప్రతింపులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇండియాకు ఈయూ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ 27 ఐరోపా దేశాల సంఘంతో అత్యధిక వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల జాబితాలో ఇండియా పదో స్థానంలో ఉంది. ఈయూ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల విలువ కంటే అక్కడికి భారత్‌ ఎగుమతి చేస్తున్న సరకుల విలువే ఎక్కువగా ఉండటం ఆసక్తికర అంశం.

అపార అవకాశాలు

కేవలం వాణిజ్య కార్యకలాపాలకే పరిమితం కాకుండా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కుదుర్చుకోవాలని ఇండియా, ఈయూ భావిస్తున్నాయి. ఇందులో భాగంగా పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచిక (జీఐ)కు సంబంధించిన ఒప్పందాలపైనా దృష్టిపెట్టాయి. వీటిపై నాలుగో విడత చర్చలు బ్రసెల్స్‌లో గత నెలలో పూర్తయ్యాయి. తదుపరి దఫా సంప్రతింపులు జూన్‌లో జరగనున్నాయి. కొవిడ్‌ విజృంభణ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ఇండియా మెరుగ్గా పురోగమించింది. మన దేశంలో వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం, దిల్లీ అనుసరిస్తున్న అలీన విధానం ఈయూను ఆకర్షిస్తున్నాయి. అందుకే మన దేశాన్ని తమ ప్రధాన వ్యూహాత్మక వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా చేసుకోవాలని ఈయూ అభిలషిస్తోంది. ఎఫ్‌టీఏ కుదిరితే ప్రధానంగా డ్రోన్లు, యంత్రాలు, విమాన తయారీ, ఔషధాల ఉత్పత్తి, ఐటీ పరిశోధన వంటి రంగాల్లో ఉభయ పక్షాలకు గణనీయ లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. చైనాకు బదులు మరో తయారీ కేంద్రం కోసం అన్వేషిస్తున్న ఈయూకు భారత్‌ మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుందనడంలో సందేహం లేదు. వచ్చే పదేళ్లలో పెద్దసంఖ్యలో వాణిజ్య విమానాలను కొనుగోలు చేయాలని ఇండియా భావిస్తోంది. స్థానికంగా విమానాల తయారీకి ఇది సరైన తరుణం. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈయూ ముందుకొస్తే ఇరువర్గాలకూ ప్రయోజనం కలుగుతుంది. టెలికమ్యూనికేషన్‌, ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, వ్యవసాయ రంగాల్లో భారత ప్రయోజనాలకు ఇబ్బందికరంగా మారే ముప్పున్న కొన్ని ప్రతిపాదనలను ఈయూ తీసుకొచ్చినట్లు చెబుతు న్నారు. పలు భారతీయ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు తమ విపణిలో తగిన గుర్తింపునిచ్చేందుకు సైతం అది సుముఖంగా లేదని తెలుస్తోంది. 2026 నుంచి లోహాల వంటి కొన్ని రకాల దిగుమతులపై 20-35శాతం పన్ను విధించాలన్నది ఈయూ యోచన. అది కార్యరూపం దాలిస్తే భారత్‌ నుంచి ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 2022లో భారత్‌ నుంచి మొత్తం ఇనుము, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల ఎగుమతుల్లో 27శాతం ఈయూ దేశాలకే వెళ్ళాయి.

పాడి పరిశ్రమకు నష్టం

భారతీయ నాణ్యతా ప్రమాణాలకు ఈయూ గుర్తింపునివ్వాలని ఎఫ్‌టీఏ చర్చల్లో దిల్లీ గట్టిగా కోరుతోంది. అప్పుడే విపణిలో వాటి ప్రవేశం సులువవుతుందని సూచిస్తోంది. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తులకు అక్కడ అనేక సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్న సంగతిని గుర్తుచేస్తోంది. పాల ఉత్పత్తులను ఎఫ్‌టీఏ పరిధిలోకి తీసుకురావాలన్న ఈయూ ప్రతిపాదనపై భారత్‌ తన ఆలోచనను ఇంకా బయటపెట్టలేదు. ప్రపంచంలో డెయిరీ ఉత్పత్తుల అతిపెద్ద ఎగుమతిదారు ఈయూ. వాటిని ఇండియాకూ భారీగా ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం- ప్రస్తుతం తమ ఉత్పత్తులపై విధిస్తున్న కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గించాలని కోరుతోంది. ఈయూ నుంచి పాల ఉత్పత్తులు పోటెత్తితే దేశీయంగా రైతులు, పాడి పరిశ్రమకు నష్టం వాటిల్లే ముప్పుండటంతో దిల్లీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈయూలోకి భారతీయ నిపుణులు/విద్యార్థుల ప్రవేశం, మేధాహక్కుల వంటి అంశాల్లోనూ ఉభయపక్షాల మధ్య ఇంకా పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదరలేదు. వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో ఇండియా పనిచేస్తోంది. సమీప భవిష్యత్తులో భారత్‌లో వృద్ధి పథాన్ని ఈయూ గుర్తించి సమగ్ర, ఉభయతారక ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశాలున్నాయి.

- ఎం.నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుడమి తల్లికి గర్భశోకం

‣ కోకో దీవుల్లో డ్రాగన్‌ పాగా

‣ సత్వరన్యాయం కోసం కృత్రిమమేధ

‣ భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

Posted Date: 22-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం