• facebook
  • whatsapp
  • telegram

కొత్త ఖండం అవతరించనుందా?

ఆఫ్రికా ఖండంలో భూమి నిట్టనిలువునా చీలుతోంది. ఇది ఇలాగే కొనసాగి భవిష్యత్తులో కొత్త ఖండం ఆవిర్భవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూఫలకాల కదలికలను అవగాహన చేసుకోవడానికి ఈ పరిణామం తోడ్పడుతుందని వారు విశ్లేషిస్తున్నారు.

భూపటలం మొత్తం ప్రధానంగా పన్నెండు భూఫలకాల(టెక్టానిక్‌ ప్లేట్ల)ను కలిగి ఉంది. ఒకప్పుడు ఈ భూఫలకాలన్నీ ఇంచుమించు ఒకే అతి పెద్ద భూభాగంగా ఉండేవి. భూపటలం కింద ఉన్న పాక్షిక ద్రవం(సెమీ ఫ్లూయిడ్‌)పై తేలుతూ ఉండే ఈ ఫలకాలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ, అవి నిరంతరం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. వాటి వేగం సంవత్సరానికి 13 నుంచి 100 మిల్లీమీటర్లు మాత్రమే. అందువల్ల లక్షల సంవత్సరాలు గడిస్తేగానీ, అవి చాలా దూరం కదిలినట్లు తెలియదు. ఈ కదలికల వల్ల భూఫలకాలు వాటి అంచుల వద్ద ఒకదానితో ఒకటి సంఘర్షణకు లోనవుతాయి. దానివల్లే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పెను విస్ఫోటం, పర్వతశ్రేణులు, లోయలు, సరస్సులు తదితరాలు ఏర్పడతాయి. కొత్త ఖండాల ఏర్పాటుకూ ఇది దారితీస్తుంది. ఈ భూఫలకాలు చాలా నెమ్మదిగా ఒకదానికొకటి దూరమవడం (విడిపోవడం)దాదాపు 18 కోట్ల ఏళ్ల క్రితం ఆరంభమైంది. కాలక్రమేణా అవి ఏడు ఖండాలుగా ఏర్పడ్డాయి. ఆఫ్రికాలోని నైరోబీ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం- ఆఫ్రికా ఖండం తూర్పు భాగం రెండుగా చీలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దానివల్ల ప్రపంచ భూగోళ పటం మారిపోనుంది. అయితే, ఒక ఖండం పూర్తిగా రెండుగా విడిపోవడమన్నది ఇప్పటికిప్పుడు జరిగిపోయే పరిణామం కాదు. అందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.

భూభాగంలో మార్పులు సహజంగా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇప్పడు కనిపిస్తున్న భూమి లక్షల సంవత్సరాల క్రితం చాలా భిన్నంగా ఉండేది. అయితే, అప్పట్లో ఉన్న అతి పెద్ద భూభాగం పలు ఖండాలుగా విడిపోయిన తరవాతా వాటి భౌగోళిక స్థితిగతులకు సంబంధించిన సారూప్య లక్షణాలు ఒకేలా ఉన్నాయి. ఉదాహరణకు దక్షిణ అమెరికా తూర్పు తీరం, ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న రాతి పొరలు ఒకే విధంగా కనిపిస్తాయి. తూర్పు అమెరికాలోని అపలాచన్‌ పర్వతాలు, స్కాట్లాండ్‌లోని కలెడోనియన్‌ కొండలు భౌగోళికంగా ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. అలాగే పురాతన సరీసృప జాతులు దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి ఎన్నో సారూప్య లక్షణాల ఆధారంగానే భూఫలకాలన్నీ ఒకప్పుడు కలిసి ఉండి, తరవాత విడిపోయాయని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఆఫ్రికా ఖండం ఆఫ్రికా భూఫలకంపై ఉంది. దీనికి ఆగ్నేయం వైపు సొమాలి, ఈశాన్యం వైపు అరేబియన్‌ ఫలకాలు ఉన్నాయి. వాటి కదలికలవల్ల ఆఫ్రికా ఖండం తీవ్రమైన భౌగోళిక మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా ఈ భూఫలకాల సరిహద్దుల్లో స్పష్టమైన పగుళ్లను భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. ఆఫ్రికా ఖండం తూర్పున ఉన్న ఇథియోపియా ఎడారిలో 2005లోనే దాదాపు 56 కిలోమీటర్ల పొడవున భారీ పగుళ్లు కనిపించాయి. 2018లో కెన్యాలోనూ ఇలాంటివే చోటుచేసుకున్నాయి. ఇవి 20 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల లోతున ఉన్నాయి. ఈ పగుళ్లు సముద్రం కింది భాగంలో ఉన్న భూఫలకాల కదలికల వల్ల ఏర్పడ్డాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం 2.5 కోట్ల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందన్నది పరిశోధకుల అంచనా.

ఆఫ్రికాలో ప్రస్తుతం సంవత్సరానికి ఆరు నుంచి ఏడు మిల్లీమీటర్ల మేర చీలికలు ఏర్పడుతున్నాయి. వీటి వల్ల సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాల్లో కొన్ని ప్రాంతాలు కలిసి రాబోయే రోజుల్లో కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది. కాలక్రమేణా ఈ చీలికలే లోయగా రూపాంతరం చెందుతాయి. ఇప్పటికే ఈ లోయ ఉత్తరాన ఏడెన్‌ గల్ఫ్‌ నుంచి దక్షిణాన జింబాబ్వే వైపు మూడు వేల కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ లోయలోకి గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, ఎర్ర సముద్రాల నీరు ప్రవహించి కొత్త సముద్రం ఏర్పడటానికి దారి తీస్తుందని పరిశోధనలో తేలింది. అయితే, ఈ సముద్రం ఆవిర్భవించడానికి కనీసం యాభై లక్షల నుంచి కోటి సంవత్సరాలు పట్టవచ్చు. దీనివల్ల ఉగాండా, జాంబియాలకు కొత్తగా సముద్ర తీరం వస్తుంది. ఖండాలు విడిపోవడంపై మరింత స్పష్టమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రస్తుతం ఆఫ్రికాలో నెలకొన్న పరిణామాలు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వృద్ధిపథంలో భారతావని

‣ బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

‣ తైవాన్‌పై చైనా దూకుడు

‣ కదలని పట్టణ ప్రగతిరథం

‣ కృత్రిమ మేధ ఎంత లాభం.. ఎంత నష్టం?

‣ వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

‣ పుడమి తల్లికి గర్భశోకం

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం