• facebook
  • whatsapp
  • telegram

పచ్చదనం భస్మీపటలం

మానవ తప్పిదాలతో కార్చిచ్చులు

జీవ వైవిధ్య పరిరక్షణలో అడవులది కీలక భూమిక. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ప్రత్యక్షంగా అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు. భూతాపానికి అంటుకట్టే కర్బన ఉద్గారాల తగ్గింపులో అరణ్యాల పాత్ర ఎనలేనిది. అటువంటి అడవుల విస్తీర్ణం క్రమేణా తగ్గిపోతోంది. పారిశ్రామికీకరణకు ముందు ప్రపంచ అటవీ విస్తీర్ణం 590 కోట్ల హెక్టార్లు. అది క్రమేణా తగ్గుతూ ప్రస్తుతం 390 కోట్ల హెక్టార్లకు చేరింది. తాజా అంచనాల ప్రకారం 1990నుంచి ఏటా 1.79 కోట్ల హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి. భారత్‌లో 2019నాటికి అటవీశాఖ లెక్కల ప్రకారం 7.2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో- అంటే ఇక్కడి మొత్తం భూభాగంలో 21.67 శాతంమేర అడవులు విస్తరించి ఉన్నాయి. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు తదితర మౌలిక వసతుల నిర్మాణం కోసం భారీగా అటవీ భూమిని వినియోగించడంవల్ల అరణ్యాలు కుంచించుకుపోతున్నాయి. కార్చిచ్చుల వల్ల సైతం వాటి విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోంది.

శాపమవుతున్న నిర్లక్ష్యం

కార్చిచ్చులకు 90శాతం మానవ తప్పిదాలే కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పోడు వ్యవసాయంకోసం వనాలను తగలబెడుతున్నారు. బీడీ ఆకుల సేకరణకు వెళ్ళేవారు, పశువుల కాపరులు, పర్యాటకులు నిర్లక్ష్యంగా బీడీలు, సిగరెట్లు కాల్చి పారేయడంవల్ల అగ్ని ప్రజ్వలిస్తోంది. చలి కాచుకునేందుకు, వంటలు చేసుకునేందుకు మంటలు వేసి వాటిని ఆర్పకుండా వదిలేయడం... తదితర కారణాలవల్ల అడవులు ఎక్కువగా దగ్ధమవుతున్నాయి. 2011నుంచి 2020వరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 63వేల ప్రమాదాలు చోటు చేసుకోగా- 75 లక్షల హెక్టార్ల చొప్పున అడవి భస్మీపటలమైంది. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన దేశాలు సైతం సకాలంలో మంటలను అదుపులోకి తేలేక ప్రకృతి ప్రతాపం ముందు తలవంచాయి. భారత్‌లోనూ ఏటా మానవ తప్పిదాల కారణంగా వెలకట్టలేని స్థాయిలో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. 2020లో 57వేల కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. 2020 మార్చి 22-ఏప్రిల్‌ 11 మధ్య కాలంలో తెలంగాణలోనే 6,500కు పైగా అగ్ని ప్రమాదాలు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 22- మార్చి ఒకటి తేదీల మధ్య అడవుల్లో 1,292 అగ్ని ప్రమాదాలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో శేషాచలం, నల్లమల, ఆదిలాబాద్‌, ఖమ్మం అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చులు తరచూ భయపెడుతున్నాయి. వేసవిలో రాలిన ఆకులు, ఎండిపోయిన పొదలు అడవుల దగ్ధానికి కారణమవుతున్నాయి. భారత అటవీ విస్తీర్ణంలో     36శాతం (6.57లక్షల చదరపు కిలోమీటర్ల) పరిధిలో తరచూ ప్రమాదాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ‘ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ)’ చెబుతోంది. మొత్తం విస్తీర్ణంలో 21శాతం అత్యధికంగా అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తాజా అటవీ సర్వేలో వెల్లడైంది. దేశంలో మొత్తంగా 2.78 లక్షల ఫైర్‌ పాయింట్లు ఉండగా- ఒక్క మిజోరంలోనే దాదాపు 33వేల వరకు ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల తరవాత తెలంగాణలోని అటవీ ప్రాంతాలకే అత్యధిక ప్రమాదం పొంచి ఉందని ఎఫ్‌ఎస్‌ఐ వెల్లడించింది.

పునరుద్ధరణ చర్యలేవీ?

అడవులు దగ్ధమయ్యే సమయంలో ఉత్పన్నమవుతున్న వాయుకాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. భూతాపంతో ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో వీచే వడగాలులు ఈసారి బాగా ముందుగానే వచ్చాయి. ఇందుకు భూతాపమే కారణమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతోనే భారత్‌లో 2005 తరవాత ప్రకృతి వైపరీత్యాల తాకిడి పెరిగిందని ‘యునైటెడ్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (యూసీఈఈడబ్ల్యూ)’ తాజా నివేదిక వెల్లడించింది. 2015 నుంచి 2019 మధ్య అటవీ విస్తీర్ణంలో పెరుగుదల     0.33 శాతానికే పరిమితమైంది. 2030 నాటికి నిర్దేశించుకున్న అటవీ విస్తీర్ణ లక్ష్యం 33శాతానికి చేరాలంటే ఈ తొమ్మిదేళ్లలో అడవుల పరిమాణం 11.33 శాతం పెరగాల్సి ఉంది. దీంతో పాటు పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను అనుకున్న మేరకు సాధించినప్పుడే పెరుగుతున్న కాలుష్యానికి, భూతాపానికి అడ్డుకట్ట వేయడం కుదురుతుంది. ఆ రకంగా ప్యారిస్‌ ఒప్పందానికీ భారత్‌ కట్టుబాటు చాటినట్లవుతుంది.

ఉత్తరాఖండ్‌ అడవుల్లో దావానలం

తాజాగా ఉత్తరాఖండ్‌ అడవుల్లో రేగిన కార్చిచ్చులు ఆందోళనకరంగా మారాయి. నైనిటాల్‌, తెహ్రీ, అల్మోరా, పౌరీ తదితర జిల్లాల అటవీ ప్రాంతాల్లో రాజుకున్న మంటలకు ఇప్పటివరకు నలుగురు వ్యక్తులు, కొన్ని అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. మంటలను ఆర్పేందుకు కనీసం 12వేల మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)’ బృందాలు హెలికాప్టర్‌ల ద్వారా సహాయక చర్యలు ప్రారంభించాయి. సాధారణంగా వేసవిలో సంభవించే దావానలాలు... ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది శీతాకాలం నుంచే మొదలయ్యాయి. అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంవల్ల పెరిగిన ఉష్ణోగ్రతలే ఈ ప్రమాదాలకు కారణమని భావిస్తున్నారు.

- ఎంఎస్‌వీ త్రిమూర్తులు 
 

Posted Date: 06-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం