• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యానికి పెనుముప్పు

కనుమరుగవుతున్న వృక్ష జంతు జాతులు

భూగోళం ఎన్నో రకాల జంతు, వృక్షజాతులకు నిలయం. ప్రకృతి ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో వైవిధ్యాలను కలిగి ఉంది. దీన్నే జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ)గా వ్యవహరిస్తాం. మానవ మనుగడకు దోహదపడే పర్యావరణ వ్యవస్థకు పలు కారణాల వల్ల పోనుపోను ముప్పు తీవ్రత అధికమవుతోంది. ఆ ప్రభావం జీవ వైవిధ్యంపై పడుతోంది. ఏటా పలు వృక్ష, జంతు జాతులు కనుమరుగవుతున్నాయి. దాన్ని గుర్తించిన చాలా దేశాలు ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టాయి. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే  భూమిపై భవిష్యత్తు తరాల జీవనానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న చర్యల వల్లే జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతోందని, ఇంతకు ముందెన్నడూ లేనంతగా పుడమికి తీవ్రస్థాయిలో ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.

తీవ్ర నష్టం

జీవవైవిధ్యం అనేది పర్యావరణ పరిరక్షణపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణంలో సమతౌల్యం దెబ్బతినడంవల్లనే ప్రకృతి విపత్తులు అధికమయ్యాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనా, అమెరికాతోపాటు పలు దేశాల్లో సంభవించిన వరదలు, తీవ్రమైన తుపానులు, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కరవు పరిస్థితులకు పర్యావరణ మార్పులే కారణం. భారత్‌లోనూ ఆకస్మిక కుండపోత వర్షాలు, వరదలు, పంటలపై చీడపీడల ఉద్ధృతి ఏటా పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నో ఔషధ గుణాలున్న వేపచెట్లు తెగుళ్ల బారినపడి చనిపోతున్న తీరు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇవన్నీ జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టానికి సూచనలే. పర్యావరణ మార్పుల కారణంగా మన దేశంలో ఉన్న వృక్షజాతుల్లో 28శాతం అంతరించే దశలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇటీవల వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

భూమ్మీద కోటికిపైగా జీవ జాతులు ఉన్నట్లు అంచనా. వాటిలో చాలా వరకు కీటకాలు, సూక్ష్మజీవులే. ఇప్పటిదాకా దాదాపు 17లక్షల జీవ జాతులను గుర్తించారు. జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే, పర్యావరణానికి అంత ప్రయోజనం. జీవుల అంతర్ధానంవల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా మానవ కార్యకలాపాలు అనేక జాతుల సహజ ఆవాసాలకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయం, మైనింగ్‌, అటవీ నిర్మూలన, కార్చిచ్చులు, రోడ్లు, ఆనకట్టల నిర్మాణం, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు, వరదలు, అగ్ని పర్వతాల విస్ఫోటం, భూకంపాలు, వివిధ రకాల కాలుష్యాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోంది. వేటసైతం జీవుల మనుగడకు శాపంగా మారింది. 95శాతం ఆఫ్రికన్‌ నల్ల ఖడ్గమృగాలను వేటగాళ్లు అంతమొందించారు. 1990ల్లో దంతాల కోసం సాగిన వేటలో పెద్ద సంఖ్యలో ఆఫ్రికా ఏనుగులు మృత్యువాత పడ్డాయి. నదులు, సముద్రాల కాలుష్యంవల్ల వాటిలో జీవించే అనేక జాతులకు ముప్పు ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన జీవజాతుల్లో దాదాపు 7.8శాతానికి భారత్‌ ఆలవాలం. దేశీయంగా పశ్చిమ కనుమలు, నల్లమల, శేషాచలం కొండలు, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతం విభిన్న జీవజాతులకు నిలయాలు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. కొన్ని దేశాలు ఈ విషయంలో అర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని వర్ధమాన, పేద దేశాలు మాత్రం సరైన దృష్టి సారించడం లేదు.

ఆగని విధ్వంసం

భారత్‌ సైతం జీవ వైవిధ్య పరిరక్షణకు పలు చర్యలు చేపట్టింది. వణ్యప్రాణి సంరక్షణ, అటవీ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు చట్టాలను తీసుకొచ్చింది. అంతరించిపోతున్న వివిధ జాతులను కృత్రిమ పద్ధతుల్లో ఉత్పత్తిచేసి పరిరక్షిస్తోంది. ఇవి కొద్దిమేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే మానవ చర్యల కారణంగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. పట్టణీకరణ నానాటికీ పెరిగిపోతున్నందువల్ల అక్కడ ఉండే నీటి వనరులు, వాటి సమీపంలోని అడవులకు నష్టం వాటిల్లుతోంది. నగరాల సమీపంనుంచి ప్రవహించే నదులు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. గంగ, యమున లాంటి నదులు ఒకప్పుడు ఎలా ఉండేవో, ప్రస్తుతం ఎలా మారిపోయాయో చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్‌లోని మూసీ నదీ మరో ఉదాహరణ. అడవుల పరిరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, వాటి విధ్వంసం మాత్రం ఆగడంలేదు. వేసవిలో చోటుచేసుకుంటున్న కార్చిచ్చులవల్లా జీవ జాతులకు నష్టం జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణకోసం కఠిన చట్టాలను రూపొందించి పకడ్బందీగా అమలుచేయడం, విత్తన బ్యాంకుల ఏర్పాటు, అంతరించిపోతున్న జీవజాతుల రక్షణ వంటి చర్యల ద్వారా జీవ వైవిధ్యాన్ని చాలావరకు కాపాడుకోవచ్చు. దానికి సంబంధించి అంతర్జాతీయ తీర్మానాలనూ ప్రతి దేశం చిత్తశుద్ధితో అమలు చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వాలతోపాటు ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్యం తోడైతేనే అసలు లక్ష్యాన్ని సాధించడానికి ఆస్కారం లభిస్తుంది.

- దేవవరపు సతీష్‌బాబు
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గిట్టుబాటుకాని మద్దతుధర

‣ రహస్యాల అన్వేషణలో కీలక అడుగు

‣ ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు

‣ భద్రతా విధానంలోనూ పెడపోకడే

‣ యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం