• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ మార్పుల సెగ

వాతావరణ మార్పులతో భారత్‌లో ఇప్పటికే తీవ్ర ఎండలు, కుండపోత వానలు అధికమయ్యాయి. చలి సైతం పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో వడగాడ్పుల ప్రతాపం మరింత విజృంభిస్తుందని ప్రపంచబ్యాంకు నివేదిక తాజాగా హెచ్చరించింది.

రాబోయే రోజుల్లో భారత ఉపఖండం తీవ్రమైన వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి కాక తప్పదని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల సంఘం (ఐపీసీసీ) నివేదిక నిరుడు హెచ్చరించింది. తాజాగా ప్రపంచ బ్యాంకు నివేదిక సైతం అదే విషయమై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. భవిష్యత్తులో వేడిగాలుల వల్ల ఇండియాలో ప్రజల ఆయుర్దాయం తెగ్గోసుకుపోతుందని, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని తెలిపింది. వడగాడ్పుల తాకిడితో ఇండియా 2030 నాటికి తన జీడీపీలో 4.5శాతం మేర నష్టపోవాల్సి వస్తుందని వివరించింది.

సాధారణంగా ఇండియాలో మే-జూన్‌ నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. అదే సమయంలో వడగాలులు వీస్తాయి. కొన్నేళ్లుగా ఏప్రిల్‌ నుంచే ఉష్ణతాపం పెచ్చుమీరుతోంది. ఈ ఏడాది దేశ రాజధాని దిల్లీలో ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సి యస్‌కు చేరుకున్నాయి. భారత పర్యావరణ విభాగం లెక్కల ప్రకారం 1981-1990 మధ్య కాలంలో ఇండియా 413 రోజుల పాటు తీవ్ర వడగాడ్పులను చవిచూసింది. 2011-20 కాలంలో వాటి తీవ్ర తాకిడి ఏకంగా 600 రోజులకు ఎగబాకింది. 1990-2019లో భారత్‌లో వడగాడ్పుల తీవ్రత 15శాతం పెరిగినట్లు లాన్సెట్‌ నివేదిక గతంలో వెల్లడించింది. ఇండియాలో అయిదు అత్యంత ఉష్ణభరితమైన సంవత్సరాలు చివరి దశాబ్దంలోనే నమోదైనట్లు అది తేల్చి చెప్పింది.

ఒక ప్రదేశంలో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ ఉండి, అందులో ఆరు-ఏడు డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదల నమోదైతే వడగాడ్పుల తీవ్రత అధికమైనట్లు పరిగణిస్తారు. వేడిగాలుల కారణంగా రోజువారీ కూలీలు, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పాల దిగుబడిపైనా వాటి ప్రభావం పడుతుంది. దేశీయంగా ఉష్ణతాపం అధికంగా, పాక్షికంగా ఉండే ప్రాంతాల్లో 2100 నాటికి పాల ఉత్పత్తి 25శాతం మేర తెగ్గోసుకుపోతుందని పరిశీలనలు చెబుతున్నాయి. వేడిగాలులతో ఆహార భద్రతకూ పెను ముప్పు పొంచి ఉంది. వాటి వల్ల ఈ ఏడాది భారత్‌లో గోధుమ ఉత్పత్తి 4.5శాతం తగ్గింది. 

వడగాడ్పుల వల్ల ఉత్పాదకత తగ్గి 2030 నాటికి దాదాపు ఎనిమిది కోట్ల మంది దాకా ఉపాధిని కోల్పోతారని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 2030 నాటికి దేశీయంగా దాదాపు 20 కోట్ల మంది తీవ్ర ఉష్ణగాలుల ప్రభావానికి గురవుతారని వెల్లడించింది. ప్రస్తుతం ఉష్ణతాపం వల్ల రవాణా సమయంలో ఏటా 1300 కోట్ల డాలర్ల మేర ఆహార నష్టం సభవిస్తోంది. ఠారెత్తిస్తున్న ఎండల కారణంగా ప్రజలకు చల్లదనం కోసం పెద్దసంఖ్యలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అవసరమవుతాయి. ఔషధాలు, ఆహార ధాన్యాల నిల్వ, రవాణా కోసమూ శీతలీకరణ వసతులు కావాలి. ఈ క్రమంలో 2037 నాటికి ఇండియాలో శీతలీకరణ డిమాండు ఇప్పుడు ఉన్న దానికి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా హరితగృహ వాయు ఉద్గారాలు రానున్న రెండు దశాబ్దాల్లో నాలుగు వందల రెట్లకు పైగా ఎగబాకే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో శీతలీకరణ కోసం ప్రత్యామ్నాయ, వినూత్న ఇంధన సామర్థ్య సాంకేతికతలను వినియోగించడం ద్వారా కర్బన ఉద్గారాలను కట్టడి చేయవచ్చు. ఇందుకోసం 2040 నాటికి 1.6 లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశం లభిస్తుందన్నది ప్రపంచ బ్యాంకు నివేదిక సారాంశం. ఈ క్రమంలో దాదాపు 37 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అది వెల్లడించింది.

సంక్షోభంలో కొత్త అవకాశాలు అందిరావడం ఆహ్వానించదగ్గదే. అయితే పుడమిని, ప్రజాజీవనాన్ని కబళిస్తున్న పరిణామాలతో పోలిస్తే అందివస్తున్న అవకాశాలు ఏపాటి? అందుకే నానాటికీ భూగోళాన్ని పెను విపత్తులోకి ఈడ్చుకుపోతున్న పర్యావరణ మార్పులను నిలువరించాల్సిందే. దానికోసం ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలి. నానాటికీ పెచ్చరిల్లుతున్న కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలి. వడగాడ్పుల వల్ల తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) సమగ్ర మార్గదర్శకాలను రూపొందించింది. పేదలు, దుర్బలురే వేడిగాలులకు అధికంగా బలవుతారని ఎన్‌డీఎంఏ చెప్పింది. దీన్ని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలని సూచించింది. వడగాడ్పుల వల్ల తలెత్తే పరిణామాలపై మరింత అధ్యయనం జరపడం, వాటిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం పాలకుల కర్తవ్యం. 

- ఎం.అక్షర
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉరుముతున్న అణు విలయం

‣ పంటల వైవిధ్యం... పోషకాహార భద్రత!

‣ ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి

‣ జగడాల చైనాకు దీటైన జవాబు

‣ ఒకే దేశం - ఒకే ఎన్నిక... ఉపయుక్తమేనా?

Posted Date: 21-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం