• facebook
  • whatsapp
  • telegram

ఉరుముతున్న అణు విలయం

ప్రపంచం మెల్లిగా అణుయుద్ధం వైపు అడుగులు వేస్తోందా? వివిధ దేశాలకు సంబంధించి తాజా పరిణామాలు ఇలాంటి ప్రశ్నలకు తావిస్తున్నాయి. నిజంగా అణు యుద్ధమే అనివార్యమైతే వినాశనం కోరి తెచ్చుకున్నట్లే. అణు ఆలోచనలు మానితేనే ప్రపంచం సురక్షితం. అన్ని దేశాలూ సంయమనం ప్రదర్శించడమే ప్రస్తుతావసరం.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తమ అణు బలగాలు వివిధ క్షిపణులతో జరిపిన యుద్ధ అభ్యాసాలను ఇటీవల వీక్షించారు. ఉక్రెయిన్‌పై దాడి అదుపు తప్పి అణు యుద్ధంగా మారవచ్చని పుతిన్‌ హెచ్చరించిన నేపథ్యంలో ఈ అభ్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తన సరిహద్దు సమీపంలో అమెరికా, దక్షిణ కొరియాలు జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాలపై మండిపడుతున్న ఉత్తర కొరియా సైతం అణ్వస్త్రాలకు పదునుపెడుతోంది. ఇక భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య అంతులేని ఉద్రిక్తతలు ఎక్కడ అదుపు తప్పి అణు యుద్ధానికి దారితీస్తాయోనని అంతర్జాతీయ సమాజం భయపడుతోంది. ఈ క్రమంలో రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించిన అణ్వస్త్రాలు సృష్టించిన విలయం వంటిది మళ్ళీ సంభవిస్తుందేమోననే ఆందోళన పెరుగుతోంది.

పెను విధ్వంసం

అణు బాంబు పేలగానే విస్ఫోటన అల చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. భరించలేనంత వేడి, రేడియోధార్మిక ధూళి విరుచుకుపడతాయి. అవి మానవ దేహంలో భయంకర మార్పులు కలిగిస్తాయి. వాటి బారిన పడే కోట్లమందికి చికిత్సచేసే సామర్థ్యం ప్రస్తుత ఆరోగ్య సేవల యంత్రాంగానికి లేదు. అణ్వస్త్రం పేలిన చోట నుంచి 20 మైళ్ల దూరం వరకు విపరీతమైన ఉష్ణం జనించి ప్రచండమైన మంటలు రేగుతాయి. ఆ పరిధిలోని మానవుల దేహాలు అగ్నికి ఆహుతి అవుతాయి. ఒక్క అణు బాంబు విస్ఫోటం వల్ల కనీసం పదివేల మంది మనుషుల శరీరాలు తీవ్రంగా కాలిపోతాయి. అదే ఒక్కపెట్టున పలు అణు బాంబులు వచ్చిపడితే పెను విలయం తప్పదు. అణ్వస్త్రాలు వెలువరించే రేడియోధార్మికత రకరకాల క్యాన్సర్లను కలిగిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలు నిర్వీర్యమవడంతో చిన్న చిన్న వ్యాధులు సైతం ప్రాణాంతకమవుతాయి. రేడియో ధార్మికత కలిగించే వ్యాధులకు అవసరమైన ప్రత్యేక చికిత్సా సౌకర్యాలు అందుబాటులో ఉండవు. జలవనరులు కలుషితమవుతాయి. మందులు అందుబాటులో ఉండవు. రేడియో ధార్మికతను పసిగట్టే పరికరాలు, వాటిని ఉపయోగించడంలో తర్ఫీదు పొందిన సిబ్బంది లభించరు. పర్యావరణానికి తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు ప్రపంచంలోని అణ్వస్త్ర దేశాల వద్ద ఉన్న అణు బాంబుల్లో కేవలం ఒక్క శాతాన్ని ప్రయోగించినా భూ వాతావరణం విచ్ఛిన్నమవుతుందని అణ్వస్త్ర నిర్మూలనకు కృషి చేస్తున్న ‘ఐకాన్‌’ సంస్థ హెచ్చరించింది. వాతావరణ, పర్యావరణాలు దెబ్బతినడం వల్ల 200 కోట్ల ప్రజానీకాన్ని ఆకలి బాధ చుట్టుముడుతుంది. ఆకలి చావులు సర్వసాధారణమవుతాయి.

హిరోషిమా నగరాన్ని బూడిద చేసిన 100 కిలోటన్నుల అణు బాంబుల వంటి 4,400 అణ్వస్త్రాలను అమెరికా, రష్యాలు ప్రయోగించినా; భారత్‌, పాకిస్థాన్‌లు అలాంటి 500 అణు బాంబులను పేల్చినా పెను విధ్వంసం తప్పదు. వాటివల్ల నగరాలు, పారిశ్రామిక కేంద్రాలు, సైనిక స్థావరాలు భస్మీపటలమవుతాయి. అణు బాంబు విస్ఫోటాల వల్ల అగ్ని తుపానులు చెలరేగి దుమ్ము, పొగ భూ వాతావరణం ఎగువ పొరల్లోకి విస్తరిస్తాయి. అవి సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల ప్రపంచమంతటా పంటల వైఫల్యం సంభవిస్తుందని అమెరికాలోని లూసియానా స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం హెచ్చరించింది. అణ్వస్త్రాలు పేలగానే విరుచుకుపడే మంటల నుంచి ఎగసే పొగమేఘాలు సూర్యకాంతిని అడ్డుకోవడం వల్ల వాతావరణం విపరీతంగా చల్లబడిపోతుంది. అణు యుద్ధం సంభవించిన నెల రోజుల్లోనే సగటు భూ ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్‌ మేర పడిపోతుంది. మూడేళ్లలో 10 డిగ్రీలకు పరిమితమవుతుంది. చివరి హిమయుగంలోనూ ఇంతటి శీతల వాతావరణం లేదు. అంతేకాదు సముద్రాలు పొంగి తీరప్రాంతాలను, అక్కడి నగరాలను ముంచెత్తుతాయి. అణు విలయం వల్ల జలచరాలు పెద్దయెత్తున నాశనమవుతాయి. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణు యుద్ధం సంభవించినా రుతు పవనాల్లో విపరీతమైన మార్పులు వస్తాయని నాసా అనుబంధ సంస్థ ‘గొడార్డ్‌’ అంతరిక్ష అధ్యయన సంస్థ హెచ్చరించింది. అణు యుద్ధం సంభవించిన అయిదేళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి 13శాతం, గోధుమ ఉత్పత్తి 11శాతం, సోయా ఉత్పత్తి 17శాతం పడిపోతాయి. ఫలితంగా 100 కోట్లమందికి ఆహార సరఫరా దెబ్బతింటుంది. ప్రజలు తాగునీరు, ఆహారం, మౌలిక వసతులు కరవై అల్లాడిపోతారు. డేటా నిల్వ, వినియోగ వసతులు భగ్నమై ఆర్థికాభివృద్ధిని పునరుద్ధరించడమూ కష్టమవుతుంది. వ్యవసాయంతోపాటు పెట్రోలియం, ఎలెక్ట్రానిక్స్‌, ఔషధ పరిశ్రమలు ఛిన్నాభిన్నమవుతాయి. రవాణా రంగం అస్తవ్యస్తమై నిత్యావసర సరకులను సైతం ప్రజలకు చేరవేయలేని దుస్థితి దాపురి స్తుంది. అగ్నిమాపక, విద్యుదుత్పాదన, తాగునీటి సరఫరా, ఇంధన రవాణా, అత్యవసర కమ్యూనికేషన్లు మటుమాయమవుతాయి.

నివారణే కర్తవ్యం

అణు యుద్ధం వల్ల ఉత్పన్నమయ్యే విచ్ఛిన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. అణు విస్ఫోటాల్లో దెబ్బతినే ప్రాంతాలను స్వల్ప, మధ్యతరహా, భారీ నష్టాలకు గురయ్యే మండలాలుగా వర్గీకరించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. భారత్‌లోనూ జాతీయ విపత్తు పర్యవేక్షణ సంస్థ వంటివి ఇలాంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. దీనికన్నా అసలు అణు యుద్ధం రాకుండా చూడటం మానవాళి మొదటి కర్తవ్యం. 2021 నుంచి అమలులోకి వచ్చిన ఐక్యరాజ్య సమితి అణ్వస్త్ర నిషేధ ఒప్పందంపై అణ్వస్త్ర రాజ్యాలు ఇంతవరకు సంతకం చేయలేదు. అవి తమ పంథాను వెంటనే మార్చుకోవాలి.

దీర్ఘకాల ప్రభావం

ఇప్పుడు అణ్వస్త్రాలు చేతిలో ఉన్న దేశాల్లో ఎవరు ఎవరిపై దాడి చేసినా, అణు బాంబులు సైనిక స్థావరాలు, నగరాలపై పడినా అది అందరి వినాశనానికే దారితీస్తుంది. జనసమ్మర్ద ప్రాంతాల్లో అణుబాంబు పేలితే అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. బతికి బయటపడిన మానవుల ఆరోగ్యంపై దీర్ఘకాలం విషమ ప్రభావం ప్రసరిస్తుంది. పర్యావరణం, మౌలిక వసతులు, ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. అణు బాంబుల పేలుళ్ల ధాటికి కొన్ని గంటల్లోనే ప్రపంచమంతటా 10 కోట్ల మంది మరణిస్తారు. భారత్‌, పాక్‌ల మధ్య అణు యుద్ధం సంభవిస్తే కోటీ 20 లక్షల మంది మరణిస్తారని, అంతేసంఖ్యలో జనం గాయపడతారని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది.

- బి.కె.కిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

‣ డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 21-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం