• facebook
  • whatsapp
  • telegram

డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

వ్యక్తిగత మొబైల్‌ డేటా వినియోగంలో భారత్‌ దూసుకెళ్తోంది. చౌక ధరలకే డేటా, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడం ఇందుకు ఊతమిచ్చింది. విజ్ఞానం, వినోదంతోపాటు దైనందిన కార్యకలాపాలకు అంతర్జాలాన్ని వినియోగించేవారు అంతకంతకూ పెరుగుతున్నారు. 5జీ రాకతో దేశంలో మొబైల్‌ డేటా వినియోగం మరింత జోరందుకోనుంది.

భారత్‌లో ప్రతి మొబైల్‌ ఫోన్‌ వినియోగదారు నెలకు సగటున 12 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ డేటా వాడకంలో ఇండియా వాటా 21శాతం. పదేళ్ల కిందట ఇది రెండు శాతమే ఉండేది. డేటా వినియోగంలో దాదాపు సగం చైనా (27శాతం), భారత్‌లదే కావడం విశేషం. ఆసియాలోని ఇతర దేశాలతో పాటు అమెరికా, ఐరోపా రాజ్యాల కన్నా చైనా, భారత్‌ల మొబైల్‌ డేటా వినియోగమే చాలా అధికం. అందుకే అమెరికా అత్యధిక ఇంటర్నెట్‌ వినియోగ శకానికి తెరపడింది అని పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ ఇటీవల ట్వీట్‌ చేశారు. జనాభాపరంగా పెద్ద దేశాలైన చైనా, ఇండియాలు మొబైల్‌ డేటా వినియోగంలో ముందువరసలో ఉండటం వింతగా అనిపించకపోవచ్చు. కానీ పదేళ్ల కిందట వాటి మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 12శాతం లోపే ఉండేది. దశాబ్దకాలంలోనే అది నాలుగింతలు పెరిగి 48శాతానికి చేరడం ఆషామాషీ విషయమేమీ కాదు. అమెరికా, ఐరోపా దేశాలకు దీటుగా టెలికాం మౌలిక వసతులను సమకూర్చుకుని, వాటిని అందుబాటు ధరలకే చేరువ చేయడంతో భారత్‌, చైనాల్లో మొబైల్‌ డేటా వినియోగం రాకెట్‌ వేగంతో దూసుకెళుతోంది.

డిజిటల్‌ ఇండియాకు ఊతం

భారత్‌లో 120 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయని, వాటిలో సగం స్మార్ట్‌ఫోన్లేనని సమాచార ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఇటీవల అబూధాబీలో జరిగిన తొలి గ్లోబల్‌ మీడియా కాంగ్రెస్‌ సదస్సులో వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరిగింది. పీసీలు, ల్యాప్‌టాప్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ల దిశగా డేటా వినియోగం పరుగులు పెడుతోంది. భారత్‌ సహా డేటాను అత్యంత చౌకగా అందిస్తున్న తొలి అయిదు దేశాల్లో ఒక జీబీ డేటా సగటు ఖరీదు అయిదు రూపాయల కంటే తక్కువే. జియో రాకతో మొబైల్‌ డేటా ధరలు మరింత తగ్గి సగటు వినియోగదారుడికీ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌ ధరలూ దిగి వచ్చాయి.

డిజిటల్‌ ఇండియా లక్ష్య సాధనలో చౌక డేటా కీలక పాత్ర పోషిస్తుంది. పెద్దనోట్ల రద్దు నాటి నుంచి నగదుకు బదులుగా డిజిటల్‌ చెల్లింపులు తెరపైకి వచ్చాయి. కరోనా తరవాత అవి మరింత పుంజుకొన్నాయి. ఇప్పుడు చిన్న టీ కొట్లలో అమ్మకాల నుంచి లక్షల్లో నగదు బదిలీల వరకూ అన్నింటికీ యూపీఐ ద్వారా చెల్లింపులు దేశవ్యాప్తమయ్యాయి. గత నెలలో ఇండియా వ్యాప్తంగా 730 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.11.90 లక్షల కోట్లు. నిరుడు నవంబరులో వాటి విలువ రూ.7.68 లక్షల కోట్లే. అప్పటితో పోలిస్తే గత నెలలో 60 శాతం వృద్ధి నమోదయ్యింది. మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు, ఆన్‌లైన్‌లో టికెట్లు, సేవల బుకింగ్‌, రుసుముల చెల్లింపు, క్రయవిక్రయాలు అన్నీ డిజిటల్‌ బాటలో దూసుకుపోతున్నాయి. విద్య, విజ్ఞాన, వినోద రంగాల్లోనూ స్మార్ట్‌ఫోన్లు గణనీయ మార్పులు తీసుకొచ్చాయి. వాట్సాప్‌ లాంటి మెసేజింగ్‌ యాప్‌లు, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాలను కోట్ల మంది వినియోగిస్తున్నారు. టీవీ కార్యక్రమాలు, సినిమాలను తోసిరాజని నయా సంచలనంగా మారిన ఓటీటీలూ చౌక డేటా వల్లే దరిచేరాయన్నది వాస్తవం. ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే కావాల్సిన వస్తువులు, ఆహారం వంటివి వేగంగా చేతికి అందుతున్నాయి. ఇవన్నీ మొబైల్‌ డేటా వినియోగంలో భారత్‌ను ముందుంచుతున్నాయి.

5జీతో అధికం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4జీ వినియోగదారులే అధికం. 2024 కల్లా మన 4జీ చందాదారుల సంఖ్య 93 కోట్లకు చేరుతుందని ఎరిక్సన్‌ మొబిలిటీ తాజా నివేదిక వెల్లడించింది. ఇటీవలే దేశంలో ప్రవేశపెట్టిన 5జీ సాంకేతికతను ఈ ఏడాది చివరి నాటికి మూడు కోట్ల మంది అందిపుచ్చుకొంటారని చెప్పింది. 2028 నాటికి 4జీ వినియోగదారుల్లో దాదాపు 69 కోట్ల మంది 5జీ చందాదారులుగా మారతారని అంచనా వేసింది. 5జీ వినియోగం పెరిగితే అధిక వేగంతో, మరింత సమర్థంగా పనిచేసే అంతర్జాలం అవసరమవుతుంది. 4జీ నెట్‌వర్క్‌ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి 40 నుంచి 100 ఎంబీపీఎస్‌ వేగం కావాలి. 5జీకి వచ్చేసరికి 700 ఎంబీపీఎస్‌ అవసరమవుతుంది. 4జీతో పోలిస్తే 5జీకి అదనపు డేటా అవసరమేమీ ఉండదని టెలికాం సంస్థలు చెబుతున్నాయి. కానీ, అధిక వేగంతో డేటా ఖర్చవుతుంది కాబట్టి అది మరింతగా అవసరమవుతుంది. మరోవైపు ఫీచర్‌ ఫోన్లను వినియోగించేవారు క్రమంగా స్మార్ట్‌ఫోన్లకు చేరవవుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో దేశంలో మొబైల్‌ డేటా వినియోగం మరింత పెరగనుంది.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం