• facebook
  • whatsapp
  • telegram

మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

 

 

వాణిజ్యం, భౌగోళిక వ్యూహాత్మకత కోణంలో మధ్య ఆసియా దేశాలతో బలమైన బంధాన్ని భారత్‌ ఆకాంక్షిస్తోంది. వాటితో అనుసంధానత కోసం చాబహార్‌ రేవు అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించింది. తాలిబన్ల రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది.

 

మధ్య ఆసియాతో శతాబ్దాలుగా ఉన్న వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇండియా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ ప్రాంతంలోని కజకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌లతో అనుసంధానతను పెంపొందించుకొనేందుకు కృషి చేస్తోంది. ఉగ్రవాదంపై పోరు సహా పలు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలను పరిరక్షించాలని ఆకాంక్షిస్తోంది. ఇటీవల దిల్లీ వేదికగా జరిగిన భారత్‌, మధ్య ఆసియా దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) తొలి సదస్సులోనూ ఈ అంశాలపైనే విస్తృతంగా చర్చ చేపట్టారు. తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.

 

ముష్కర మూకల అడ్డాగా...

ఒకప్పుడు మధ్య ఆసియాతో భారత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. సిల్కు రోడ్డు ద్వారా వాటి మధ్య వాణిజ్య కార్యకలాపాలు కొనసాగేవి. పాకిస్థాన్‌ సంకుచిత స్వభావం కారణంగా భారత్‌, మధ్య ఆసియా దేశాల సంబంధాల్లో కొన్నేళ్లపాటు స్తబ్దత నెలకొంది. వాటి మధ్య రవాణా కార్యకలాపాలు తమ దేశం మీదుగా జరగకుండా ఇస్లామాబాద్‌ అడ్డుకుంది. దాంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ ప్రారంభించిన దిల్లీ- ఇరాన్‌లో ప్రతిష్ఠాత్మక చాబహార్‌ ప్రాజెక్టు బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకుంది. 2018లో ఓడరేవు నుంచి రవాణా కార్యకలాపాలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సహజ వాయువు, పెట్రోలియం వనరులు పుష్కలంగా కలిగి ఉండటంతోపాటు వ్యూహాత్మకంగానూ కీలకమైన మధ్యాసియా దేశాలతో ఇండియా అనుసంధానానికి చాబహార్‌ ప్రాణాధారం వంటిది. ఈ ఓడరేవుతో అఫ్గాన్‌ను అనుసంధానించడం ద్వారా మరింత మేలు చేకూరుతుందని దిల్లీ గ్రహించింది. అందుకే అఫ్గాన్‌-చాబహార్‌లను కలిపే జరంజ్‌-డెలారాం రహదారి కోసం 15 కోట్ల డాలర్లు వెచ్చించింది. మధ్య ఆసియాతో అనుసంధానం కోసం 2012లో ఇండియా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. 2015లో మోదీ ఆయా దేశాల్లో పర్యటించారు. చాబహార్‌ ఓడరేవు సైతం దాదాపుగా అందుబాటులోకి రావడంతో అంతా సవ్యంగా సాగుతున్నట్లు కనిపించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు పాలనా పగ్గాలు దక్కించుకోవడంతో పరిస్థితులు మారిపోయాయి. తాలిబన్ల రాకతో ఇండియా, మధ్యాసియా దేశాలకు రవాణా సంబంధిత సమస్యలే కాకుండా భద్రతాపరమైన తలనొప్పులూ మొదలయ్యాయి. గతేడాది ఆగస్టులో కాబూల్‌ను ఆక్రమించిన తాలిబన్లు- అంతర్జాతీయ ప్రమాణాలు, 2020 నాటి దోహా ఒప్పందానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. ఇతర దేశాలపై కుట్రలు పన్నేందుకు తమ భూభాగాన్ని విద్రోహశక్తులు ఉపయోగించుకోకుండా అడ్డుకుంటామన్నారు. అది కార్యరూపం దాల్చలేదు. అఫ్గాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ (ఐఎస్‌కేపీ) కార్యకలాపాలు ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి. అల్‌ఖైదాతో సంబంధాలనూ తాలిబన్లు వదులుకోలేదు. పాక్‌కు చెందిన తెహ్రీకే- తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) ముష్కర ముఠా అఫ్గాన్‌లో బాగా బలపడింది. లష్కరే- తొయిబా(ఎల్‌ఈటీ), జైషే మొహమ్మద్‌(జేఈఎం), ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఉజ్బెకిస్థాన్‌(ఐఎంయూ), ఇస్లామిక్‌ జిహాద్‌ యూనియన్‌(ఐజేయూ) వంటి మరో డజనుకుపైగా ఉగ్ర సంస్థల ఉనికి అఫ్గాన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. వాటిలో అత్యధిక ముఠాలతో తాలిబన్లకు సత్సంబంధాలున్నాయి. ఈ పరిణామాలు అఫ్గాన్‌కు పొరుగున్న ఉన్న మధ్యాసియా దేశాలతోపాటు ఇండియాకూ ఆందోళనకరంగా మారాయి.

 

ఉమ్మడి కృషి అవసరం

జమ్మూకశ్మీర్‌లో భద్రతాదళాలు నిరుడు 182 మంది ముష్కరులను హతమార్చాయి. వారిలో 20 మంది విదేశీ ఉగ్రవాదులు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అక్కడ 118 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో 32 మంది విదేశీయులని తేలింది. అఫ్గాన్‌ నుంచి భారత్‌కు ముష్కరుల రాక అధికమవుతోందనడానికి ఇది నిదర్శనం. ప్రధానంగా జేఈఎం, ఎల్‌ఈటీ ఇండియాలో విధ్వంసానికి కాచుకు కూర్చున్నాయి. ఐఎంయూ, ఐజేయూలతో మధ్యాసియా దేశాలకు ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ, వారిని అంతం చేసేందుకు భారత్‌, మధ్య ఆసియా దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి. దిల్లీ వేదికగా ఈ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చర్చించిన అంశాలను తాలిబన్లు స్వాగతించడం ప్రస్తుతం శుభ పరిణామం. చాబహార్‌ ఓడరేవు ద్వారా కార్యకలాపాలు కొనసాగేందుకు వసతులు కల్పిస్తామనీ వారు భరోసా ఇచ్చారు. ఇటీవల జీ20 పగ్గాలను చేపట్టిన దిల్లీ- 2023 సెప్టెంబరు దాకా షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)కూ నేతృత్వం వహించబోతోంది. ఈ తరుణంలో ఇండియా క్రియాశీలకంగా వ్యవహరించాలి. తాలిబన్లతో అవసరమైన మేరకు సన్నిహితంగా మెలగుతూ, అఫ్గాన్‌లో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పునరుద్ధరించాలి. మధ్య ఆసియాతో అనుసంధానతను పెంచుకోవడం ద్వారా బలమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలి.

 

- నవీన్‌ కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

‣ మానవాళికి జలగండం

‣ ద్రవ్యోల్బణ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

‣ ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

Posted Date: 10-12-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం