• facebook
  • whatsapp
  • telegram

ఇకనైనా ధరలు దిగివస్తాయా?

నూతన ద్రవ్య విధానం దేశీయంగా నిత్యావసరాల ధరలు నానాటికీ చుక్కలనంటుతున్నాయి. ఫలితంగా సామాన్యుల జీవితాలు ఇక్కట్ల పాలవుతున్నాయి. ఈ క్రమంలో ధరల విజృంభణను, వడ్డీ రేట్లను అదుపు చేసే ప్రణాళికల కోసం కొలువుతీరిన ద్రవ్య విధాన సంఘం నిర్ణయాలు రేపు వెలువడనున్నాయి.

ధరల అదుపు లేనిదే సుస్థిర అభివృద్ధి సాధ్యపడదు. ధరలు, వడ్డీ రేట్లు అదుపులో ఉంటే వినియోగదారుల జీవనం సాఫీగా సాగుతుంది. దేశ అధికార కరెన్సీ విలువ సైతం స్థిరంగా ఉండి అంతర్జాతీయంగా దానిపై నమ్మకం పెరుగుతుంది. అందువల్ల ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల నియంత్రణకు ద్రవ్య విధానం ప్రాధాన్యమిస్తుంది. భారత ద్రవ్య విధాన సంఘ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను ఈ నెల ఏడున ప్రకటిస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఇటీవల వెల్లడించారు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారిగా 2016 జూన్‌లో ద్రవ్య విధాన సంఘాన్ని నెలకొల్పారు. నిత్యావసర సరకుల ధరల అదుపునకు చట్టబద్ధమైన సంస్థాగత చట్రాన్ని అందించడానికి వీలుగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

మదింపులో సవాళ్లు

ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతానికి లోపు పట్టి నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తదనుగుణంగా రెపో రేటును ద్రవ్య విధాన సంఘం నిర్ణయిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు నగదు కొరత ఏర్పడినప్పుడు రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపై వడ్డీని రెపో రేటు అంటారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం, అభివృద్ధి రేటు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి కావాల్సిన కచ్చితమైన సమాచారం భారత్‌లో అందుబాటులో ఉండదు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు సైతం మారిపోతూ ఉంటాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వచ్చే ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం, అభివృద్ధి రేట్లను అంచనా వేసి, వాటిని సాధించడానికి వీలుగా సరైన వడ్డీ రేట్లను నిర్ణయించడం ఏమంత తేలిక కాదు. ఏటా అక్టోబరు మాస ద్రవ్యోల్బణ సమాచారాన్ని, జులై-సెప్టెంబరు మధ్య కాలంలో ఆర్థికాభివృద్ధి గణాంకాలను నవంబరు 30న ద్రవ్య విధాన సంఘానికి అందిస్తారు. ఈ పాత సమాచారం ఆధారంగా భావి ద్రవ్యోల్బణాన్ని, అభివృద్ధి రేటును శాస్త్రీయంగా కచ్చితంగా లెక్కకట్టడం సాధ్యపడదు. ఉదాహరణకు ఈ ఏడాది అనుకోకుండా వచ్చి పడిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం- ఆహార, ఇంధన ధరలను అమాంతం పెంచేసింది. ఇలా అంతర్జాతీయ అవాంతరాలు ఏర్పడినప్పుడల్లా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కష్టమైపోతుంది.

భారతదేశానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాదిరిగానే అన్ని దేశాలకూ కేంద్ర బ్యాంకులు ఉంటాయి. కరెన్సీ జారీ, నియంత్రణ, తగినంత కరెన్సీ నిల్వలను నిర్వహించడం వంటి విధులను అవి నిర్వర్తిస్తాయి. ద్రవ్యపరంగా స్థిరత్వ సాధన, దేశ రుణ, కరెన్సీ పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను కేంద్ర బ్యాంకు చేపడుతుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చట్టబద్ధ ద్రవ్య లభ్యత నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌)లో నిధుల నిల్వను కొనసాగించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడానికి వచ్చే డిమాండుకు, డిపాజిట్లకు మధ్య సమతూకం పాటించడానికి బ్యాంకులు ఎస్‌ఎల్‌ఆర్‌ నిష్పత్తి ప్రకారం నిర్దిష్ట మొత్తంలో నిధులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ నిధుల నిల్వలు సెక్యూరిటీల రూపంలో, బంగారం, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఉంటాయి. యూపీఏ ప్రభుత్వ హయాములో ఎస్‌ఎల్‌ఆర్‌ 24.5 శాతం. ప్రస్తుతం అది 18శాతానికి తగ్గింది. బ్యాంకులకు, ప్రజలకు ప్రభుత్వ బాండ్లను అమ్మడం, కొనడం ద్వారా ఆర్‌బీఐ మార్కెట్లో రుణ ప్రవాహాన్ని పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటుంది. బ్యాంకులు తమ డిపాజిట్లలో నిర్ణీత శాతాన్ని ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. దీన్ని క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (సీఆర్‌ఆర్‌) అంటారు. 1990లో సీఆర్‌ఆర్‌ 15శాతంగా ఉండేది. 2002లో యూపీఏ హయాములో దాన్ని అయిదు శాతానికి తగ్గించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం సీఆర్‌ఆర్‌ను మరింత తెగ్గోసింది. ఈ ఏడాది  సెప్టెంబరు 30 నాటికి సీఆర్‌ఆర్‌ కేవలం మూడు శాతానికి చేరింది.

దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీని నియంత్రించడమూ ద్రవ్య విధానంలో భాగమే. ఆర్‌బీఐ వడ్డీ రేటును పెంచుతోంది అంటే ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నదని అర్థం. కొంతకాలంగా అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఇదే బాటలో సాగుతోంది. వడ్డీ రేటును పెంచడం వల్ల దేశదేశాల నుంచి డాలర్లు అమెరికాకు, ముఖ్యంగా అక్కడి బ్యాంకులకు ప్రవహిస్తున్నాయి. దానివల్ల ఒక డాలర్‌ రేటు నేడు 81 రూపాయలకు పైగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో బ్యాంకు రేటు 6.15శాతం, రెపో రేటు 5.90శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో వినియోగ ధరల సూచీ 8.5శాతానికి పెరిగింది. దాన్ని 2023కల్లా 3.5శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ సూచీ రెండు శాతం నుంచి ఆరు శాతం మధ్యనే ఉండాలని లక్షిస్తోంది.

ఉపాధి అవకాశాలకు మార్గం

ద్రవ్య విధానం కింద ఆర్‌బీఐ బ్యాంకు రేటు పెంచడం వంటి చర్యలు ఎన్ని తీసుకున్నా ద్రవ్యోల్బణం రెండు శాతానికి కాదు కదా... ఆరు శాతానికైనా దిగిరాలేదు. అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్యోల్బణాన్ని ఏడు శాతం పైనుంచి రెండు శాతానికి దించడానికి తంటాలు పడుతున్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. పరిశ్రమలకు, వ్యాపారాలకు తక్కువ వడ్డీపై రుణాలిస్తే ఆర్థికాభివృద్ధి పుంజుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మార్గం ద్వారా మాత్రమే ఆత్మనిర్భర్‌ భారత్‌ స్వప్నం సాకారమవుతుంది. పారిశ్రామికాభివృద్ధిని పెంచడానికి చైనా చేపట్టిన విధానాలను భారత్‌ పరిశీలించాలి. వాటిని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి తేవాలి. దీర్ఘకాలిక అభివృద్ధి, స్వావలంబన సాధనకు మేక్‌ ఇన్‌ ఇండియాను ముమ్మరంగా అమలు చేయాలి. ద్రవ్య విధానం ఈ లక్ష్యాలన్నింటినీ ప్రతిబింబించాలి.

వడ్డీ రేట్ల నిర్ణయం

నష్ట భయం ఎక్కువగా ఉండే షేర్లు, స్థిరాస్తి వ్యాపారాల వంటి వాటికి రుణాలపై ఆర్‌బీఐ పరిమితి విధిస్తూ ఉంటుంది. వ్యవసాయం, గృహ నిర్మాణం, చిన్న రవాణా వాహనదారులకు ప్రాధాన్యతా ప్రాతిపదికపై రుణాలివ్వాలని బ్యాంకులను ఆదేశిస్తుంది. నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘాలు నిర్దేశించిన దీర్ఘకాలిక ప్రగతి లక్ష్యాల సాధనకు రుణాలిచ్చేలా బ్యాంకులను పురిగొల్పుతుంది. వాణిజ్య బ్యాంకులకు రిజర్వు బ్యాంకు నిధులిచ్చినప్పుడు వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అన్నట్లే, ఆ బ్యాంకుల నుంచి తానే నిధులు తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీని రివర్స్‌ రెపో రేటు అంటారు. వీటిని ద్రవ్య విధాన సంఘం నిర్ణయిస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నేల తల్లికి పుట్టెడు శోకం

‣ సహ చట్ట స్ఫూర్తిపై దాడి

‣ మదుపరుల పుట్టిముంచిన క్రిప్టో

‣ డేటా కేంద్రాల విపణిగా భారత్‌

Posted Date: 09-12-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం