• facebook
  • whatsapp
  • telegram

డేటా కేంద్రాల విపణిగా భారత్‌

భారత్‌లో డేటా కేంద్రాల మార్కెట్‌ విస్తృతికి భారీ అవకాశాలు ఉన్నాయి.  డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాలూ ఇందుకు ఊతమిస్తున్నాయి. 

ఇటీవలి కాలంలో డేటా ఉత్పాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల నిల్వ సౌకర్యాల కోసం భారీ గిరాకీ నెలకొంది. చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు కూడా క్లౌడ్‌, బిగ్‌డేటా అనలిటిక్స్‌ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో డేటా నిల్వ అవసరాలు పెద్దయెత్తున పెరిగాయి. భారత్‌ 2025-26 నాటికి లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, ఇది ఆరు నుంచి ఆరున్నర కోట్లమందికి డిజిటల్‌ సంబంధిత ఉద్యోగాలు దక్కేలా తోడ్పడుతుందని కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంచనా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం వంటి ప్రగతిశీల విధానాలు- దేశీయంగా, ప్రపంచ డేటా కేంద్రాల సర్వీసు ప్రొవైడర్లు గత రెండేళ్ల కాలంలో భారీ పెట్టుబడులతో భారత్‌కు తరలిరావడానికి మార్గం సుగమం చేశాయని భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు సైతం సంప్రదాయ సేవల నుంచి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తరహా వేదికలకు మారడం వంటి పరిణామాలు కూడా దేశంలో డేటా కేంద్రాల మార్కెట్‌ వ్యాప్తికి దోహదపడుతోంది. భారత డేటా కేంద్రాల మార్కెట్‌ పరిమాణం 2021లో సుమారు నాలుగువందల కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులతో ఉండగా, 2027నాటికి సుమారు వెయ్యికోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులకు చేరనుంది. 2022-2027 మధ్య 15.07శాతం వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌)ను సాధించే అవకాశం ఉంది.

పెరుగుతున్న పెట్టుబడులు

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ తాజా నివేదిక ప్రకారం- హైదరాబాద్‌ మహానగరం చెన్నై, న్యూదిల్లీలతోపాటు ప్రపంచంలో అతిపెద్ద డేటా మార్కెట్‌ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారీ డేటా కేంద్రాల మార్కెట్‌గా ఎదుగుతోంది. అమెజాన్‌ తరవాత, మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రం రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌కు వస్తోంది. రెడ్‌మండ్‌ తరవాత ఆ సంస్థకు ఇదే అతిపెద్ద డేటా కేంద్రంగా భాసిల్లనున్నది. 2025 నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ కారణంగా విభిన్న బహుళ జాతి సంస్థల నుంచి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ కొత్తగా ఏర్పాటు చేసే డేటా కేంద్రంతో క్లౌడ్‌, డేటా సొల్యూషన్స్‌, కృత్రిమ మేధ, వినియోగదారుల సంబంధాల నిర్వహణలతోపాటు, పలు సంస్థలు, కంపెనీలకు అత్యాధునిక భద్రతను కల్పించే అవకాశం ఉంది. త్వరలోనే రాబోయే ఈ డేటా కేంద్రం స్థానికంగా వ్యాపార అవకాశాలను, ఉద్యోగ కల్పన, నెట్‌వర్కింగ్‌, డేటా సెక్యూరిటీ తదితర కార్యకలాపాలను ఇనుమడింపజేయనుంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థకు ఇప్పటికే విభిన్న ప్రాంతాల్లో 160 డేటాకేంద్రాల నెట్‌వర్క్‌ ఉంది. భారత్‌లో డేటా కేంద్రాల పరిశ్రమ అత్యధిక వృద్ధిని సాధించే అవకాశం ఉందని నైట్‌ఫ్రాంక్‌ నివేదిక స్పష్టంచేస్తోంది. ప్రభుత్వ విధానాల్లో భాగంగా పరపతి సౌకర్యాలు తేలికగా అందుబాటులో ఉంటూ, ఇతరత్రా ప్రోత్సాహకాలు అందుతుండటంతో ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.

డేటా కేంద్రాల మార్కెట్‌ను భారీగా ఆకర్షిస్తున్న మరో ప్రధాన గమ్యస్థానంగా విశాఖపట్నం పేరొందింది. మధురవాడ సమీపంలో అతిపెద్ద సమీకృత డేటా సెంటర్‌ పార్క్‌ను రూ.14,634 కోట్ల పెట్టుబడితో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్‌ సన్నద్ధమవుతోంది. ఇదే ప్రాంగణంలో సమీకృత ఐటీ, బిజినెస్‌ పార్క్‌, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం రిక్రియేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి. వైజాగ్‌ టెక్‌ పార్క్‌ పేరిట అదానీ గ్రూప్‌ ఇప్పటికే స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది గ్రూప్‌నకు వందశాతం అనుబంధ సంస్థ. వచ్చే ఏడేళ్ల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేయాలనేది వీరి లక్ష్యం. భారత సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, గ్రీన్‌ డేటా కేంద్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా వందశాతం పునరుత్పాదక సౌరవిద్యుత్తుతో ఏర్పాటయ్యే ప్రాజెక్టుగా పేరొందనుంది.

ఉద్యోగాల వెల్లువ

డేటా కేంద్రాల పరిమాణం, సామర్థ్యం పెరుగుతుండటంతో భారత్‌లో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డేటా కేంద్రాల ఆపరేషన్‌ మేనేజర్లు, నెట్‌వర్క్‌ ఇంజినీర్లు, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ సూపర్‌వైజర్లు, డేటా కేంద్రాల ఎలెక్ట్రికల్‌ నిపుణులు, మెకానికల్‌ ఇంజినీర్లు వంటి ఉద్యోగాలెన్నో అందివచ్చే అవకాశం ఉంది. వినియోగదారులతో సంబంధాలు, ఇతరత్రా అనుబంధ విభాగాలకు సంబంధించి సాంకేతికేతర ఉద్యోగాలూ అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత కాలంలో ఏ దేశంలోనైనా డేటా కేంద్రాలు కీలక మౌలిక సదుపాయాల వంటివి. భారత్‌లో డేటా కేంద్రాల్ని నిర్వహిస్తున్న సంస్థల్లో డెల్‌, యాక్సెంచర్‌, ఎన్‌టీటీ గ్లోబల్‌, ఐబీఎం, ఫ్లిప్‌కార్ట్‌, ఐసీఐసీఐ, కేప్‌జెమిని, వెల్స్‌ఫార్గో, ఒరాకిల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలున్నాయి. గూగుల్‌, అమెజాన్‌ వంటి క్లౌడ్‌ సేవలను అందించే సంస్థలు సైతం ఇండియాలో సొంతంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. డేటాకేంద్రాలు, ఇంధన నిల్వ వ్యవస్థలను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుగా గుర్తిస్తున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేట్లతో సులభతర రుణాల లభ్యత పెరిగితే పెట్టుబడుల ప్రవాహం మరింతగా అధికమయ్యే అవకాశం ఉంది. దేశంలో డేటా కేంద్రాల పరిశ్రమ రూ.70 వేల కోట్ల నుంచి రూ.72 వేల కోట్లదాకా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఇదే వేగంతో వృద్ధి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో దేశంలోని డేటా కేంద్రాలు వేలకొద్దీ ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయనడంలో సందేహం లేదు.

దిగ్గజాల ఉత్సాహం

కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో డేటాకు భారీస్థాయిలో డిమాండ్‌ ఏర్పడింది. అది డిజిటల్‌ సాంకేతికత, డేటా కేంద్రాల ప్రాధాన్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే 2022-2032 మధ్య 7.5శాతం వార్షిక వృద్ధిరేటుతో గిరాకీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో క్లౌడ్‌ సౌంకేతికతను వినియోగించడం ఊపందుకోవడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ సాంకేతిక దిగ్గజ కంపెనీలు దేశంలోని పలు సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. చాలా వాణిజ్య సంస్థలు తమ డిజిటల్‌ పరివర్తనలను వేగవంతం చేశాయి. గతంలో పెద్దగా పట్టించుకోని నగరాల్లో సైతం క్లౌడ్‌ సేవల డిమాండ్‌ విస్తృతంగా పెరుగుతోంది.

- నీరజ్‌కుమార్‌ సైబేవార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నేపాల్‌ చెలిమితో డ్రాగన్‌కు ముకుతాడు

‣ అటవీ నేరాలకేదీ అడ్డుకట్ట?

‣ ఈశాన్యంలో సరిహద్దుల నెగళ్లు

‣ వర్ధమాన వాణి... విశ్వశ్రేయ శ్రేణి!

Posted Date: 03-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం