• facebook
  • whatsapp
  • telegram

ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

దేశీయంగా అవసరమైన ఎరువుల కోసం భారత్‌ అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దాంతో విదేశ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఎరువుల రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్‌ కృషి చేస్తోంది. అలాగే సేంద్రియ వ్యవసాయంపైనా అధికంగా దృష్టి సారించాల్సి ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో భారత్‌కు మొదటిసారిగా రష్యా అతిపెద్ద ఎరువుల సరఫరాదారుగా నిలిచింది. ఈ కాలంలో మాస్కో నుంచి దిల్లీ ఎరువుల దిగుమతులు 21 లక్షల టన్నులకు చేరుకున్నాయి. వాటి విలువ 160 కోట్ల డాలర్లు. గత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి 12 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఇండియా దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా క్రెమ్లిన్‌, బెలారస్‌ల నుంచి ఎరువుల దిగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగాయి. రష్యా నిరుడు అంతర్జాతీయంగా అమ్మోనియా ఎగుమతుల్లో 22శాతం, యూరియాలో 14శాతం, మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్‌(ఎంఏపీ)లో 14శాతం వాటా కలిగి ఉంది. ధరలపై క్రెమ్లిన్‌ రాయితీ ఇవ్వడంతో ఇండియా అక్కడి నుంచి అధిక మొత్తంలో ఎరువులు దిగుమతి చేసుకుంది.

దిగుమతులే ఆధారం

ఈ ఏడాది జూన్‌లో రష్యా నుంచి ఒక టన్ను డైఅమ్మోనియం ఫాస్ఫేట్‌ను ఇండియా 920-925 డాలర్లకే పొందింది. అదే సమయంలో ఇతర ఆసియా దేశాలు టన్నుకు వెయ్యి డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాయి. రష్యా నుంచి భారత్‌ ఎరువులు కొనుగోలు చేయడంతో ఈ ఏడాది ప్రథమార్ధంలో చైనా, జోర్డాన్‌, ఈజిప్టు, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతులు తగ్గాయి. 2021-22లో భారత్‌ ఎరువుల దిగుమతుల్లో రష్యా వాటా ఆరు శాతం. చైనా వాటా 24శాతం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రష్యా వాటా 21శాతానికి పెరిగింది. రష్యా నుంచి భారత్‌ ఎరువులను అధికంగా కొనుగోలు చేయడం అంతర్జాతీయంగా ధరలను అదుపులో ఉంచడానికి దోహద పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత్‌ మొత్తం ఎరువుల దిగుమతులు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 2.4శాతం తగ్గి దాదాపు కోటి టన్నులకు చేరుకున్నాయి. దిగుమతుల విలువ 59శాతం పెరిగి 740 కోట్ల డాలర్లకు ఎగబాకింది.

ఎరువుల కోసం భారత్‌ అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. గత ఆర్థిక సంవత్సరం కోటి టన్నులకు పైగా యూరియా, 58 లక్షల టన్నుల డైఅమ్మోనియం ఫాస్ఫేట్‌, 29 లక్షల టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. అన్ని ఎరువుల దిగుమతుల విలువ గతంలో ఎన్నడూ లేనంతగా 1,277 కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఇండియా 2.5 కోట్ల టన్నుల యూరియా, 42 లక్షల టన్నుల డీఏపీ, 83 లక్షల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 33 లక్షల టన్నుల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ను ఉత్పత్తి చేసింది. అందుకోసం ముడిపదార్థాలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొంది. ఎరువుల దిగుమతులకు భారత్‌ అధికమొత్తంలో విదేశ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దాంతో ఈ రంగంలో స్వయంసమృద్ధి సాధించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎరువుల్లో యూరియా దిగుమతులే అధికం. 2024-25నాటికి దానికి ముగింపు పలకాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎనిమిది నానోయూరియా ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. తద్వారా 44కోట్ల నానోయూరియా బాటిళ్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

రైతులకు ప్రోత్సాహం

భారత్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎరువుల సబ్సిడీ రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఎరువుల దిగుమతుల్లో భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. ఇండియాలో విస్తారంగా వ్యవసాయ భూములున్నాయి. ముడిపదార్థాల కొరతతో దేశీయ డిమాండుకు అనుగుణంగా ఎరువుల ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతులు అనివార్యమవుతున్నాయి. భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా, బడ్జెట్‌పై భారం పడకుండా వివిధ దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవాలని కేంద్రం అంచనా వేస్తోంది. అంతేకాకుండా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రియ సాగును పెద్దయెత్తున ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు ఎరువులను విచ్చలవిడిగా వాడకుండా భూసార పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని చెబుతున్నారు. నానాటికీ ఎరువుల ధరలు చుక్కలనంటుతుండటం ప్రభుత్వాల బడ్జెట్లను దెబ్బతీస్తోందని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ క్రమంలో ఎరువుల వినియోగం తగ్గేలా పర్యావరణ అనుకూలమైన సేంద్రియ సాగు విధానాల వైపు రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

- డి.ఎస్‌.బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

‣ నేల తల్లికి పుట్టెడు శోకం

‣ సహ చట్ట స్ఫూర్తిపై దాడి

‣ మదుపరుల పుట్టిముంచిన క్రిప్టో

‣ డేటా కేంద్రాల విపణిగా భారత్‌

Posted Date: 09-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం