• facebook
  • whatsapp
  • telegram

హుందాగా జీవించే హక్కుకు భంగం

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఆర్థిక అస్థిరత, పెచ్చరిల్లుతున్న విద్వేష ప్రచారం, మహిళా హక్కులపై దాడులు వంటివి ప్రజలకు హుందాగా జీవించే అవకాశాన్ని దూరం చేస్తున్నాయి. కొవిడ్‌, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇతర ప్రాంతాల్లో సాయుధ సంఘర్షణలు సైతం మానవ హక్కులను కాలరాస్తున్నాయి. వీటిపై ప్రభుత్వాలు, చట్టబద్ధ సంస్థలు, అంతర్జాతీయ సమాజం మిన్నకుండిపోతున్నాయనే భావన ప్రజల్లో నిరాశా నిస్పృహలను మరింతగా పెంచుతోంది.

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన 1948లో వెలువడినప్పటి నుంచి జనజీవితాల్లో కొంత మేర మార్పు వచ్చింది. అయినా జాత్యహంకారం, స్త్రీల పట్ల ద్వేషం, దుర్విచక్షణ, మత స్వేచ్ఛపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలో వీగర్‌ ముస్లిములపై నిర్బంధం,ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక అల్లర్లు, అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను కాలరాయడం, పాకిస్థాన్‌లో మైనారిటీ మతస్తుల అణచివేత దీనికి ఉదాహరణలు. ఇరాన్‌లో హిజాబ్‌ ధరించలేదనే కారణంతో సెప్టెంబరులో అరెస్టయిన కుర్దు యువతి మాసా అమీనీ పోలీసు హింసను తట్టుకోలేక మరణించింది. దానిపై చెలరేగిన ఆందోళనల్లో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వెలువడ్డాయి. 14,000 మందికి పైగా అరెస్టయ్యారు. ఇరాన్‌తో పాటు సౌదీ అరేబియా సైతం మత స్వేచ్ఛను అతిక్రమిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఆక్షేపించింది. చైనాలోని షింజియాంగ్‌ రాష్ట్రంలో కోటిమంది వీగర్‌ ముస్లిములు నివసిస్తున్నారు. వారి మత స్వేచ్ఛను హరిస్తున్నారని, నిర్బంధ శిబిరాల్లో వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మానవ హక్కుల బృందాలు, పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు ఉక్రెయిన్‌, సిరియా, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లలో పౌరులపై దురాగతాలకు పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపించింది. సాయుధ సంఘర్షణలు, మతపరమైన అసమానతలు పౌరులకు హుందాగా జీవించే హక్కు లేకుండా చేస్తున్నాయి.

కొవిడ్‌ కర్కశ పంజా

భూతాపం పెరిగిపోవడానికి కర్బన ఉద్గారాలే కారణం. వాటిలో మూడింట రెండు వంతులను సంపన్న దేశాలే వెలువరిస్తున్నాయి. దాని గురించి పట్టించుకోకుండా ఉద్గారాలను తగ్గించుకోవాలంటూ వర్ధమాన దేశాలపై అవి ఒత్తిడి తెస్తున్నాయి. పేద దేశాలు అభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసుకోక తప్పదు. ఈ క్రమంలో శిలాజ ఇంధనాల వాడకం పెరిగి కర్బన ఉద్గారాలు అధికమవుతాయి. హరిత సాంకేతికతలతో ఉద్గారాలను నివారించవచ్చు. అందుకోసం భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. అంత ఆర్థిక స్తోమత వర్ధమాన దేశాలకు ఉండదు. ఫలితంగా వాతావరణ మార్పులు పెచ్చరిల్లి ఆ దేశాల పౌరులు హుందాగా జీవించే అవకాశాన్ని కోల్పోతారు. వాతావరణ మార్పులు మానవ హక్కులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ మార్పులను అడ్డుకోవడానికి నూతన సాంకేతికతలను చేపట్టడానికి వీలుగా ధనిక దేశాలు వర్ధమాన రాజ్యాలకు ఆర్థిక సహాయాన్ని పెంచాలి.

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిబంధనావళి సైతం ఆరోగ్యం పౌరులందరి ప్రాథమిక హక్కు అని ఉద్ఘాటిస్తోంది. ఆరోగ్యం లేనిదే న్యాయం, సమానత్వం, హుందాగా జీవించడం సాధ్యపడదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. జాతి, శరీర వర్ణం, జాతీయత, రాజకీయ భావాలు, లింగం, మతపరమైన నమ్మకాలు, సామాజిక, ఆర్థిక హోదా- ఇలాంటి భేదాలేవీ లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందినప్పుడే సరైన న్యాయం జరిగినట్లు లెక్క. వారు హుందాగా జీవించాలంటే శారీరక, మానసిక స్వస్థత ముఖ్యం. కొవిడ్‌ మహమ్మారి సరిగ్గా ఇక్కడే పేదలను దెబ్బతీసింది. పౌరుల జీవితాలను అస్తవ్యస్తం చేసి అన్ని రకాల అసమానతలు పెరగడానికి కారణమైంది. లాక్‌డౌన్ల వల్ల ప్రజల జీవనాధారాలు దెబ్బతిని హుందాగా జీవించే అవకాశం లేకుండా పోయింది. మానవ అక్రమ రవాణా పెరిగిపోయింది. వలస కూలీలపై వేధింపులు శ్రుతిమించాయి. స్త్రీలపైË లైంగిక దోపిడి ఎక్కువైంది. కొవిడ్‌ కాలంలో సంపన్న దేశాలు తమ పౌరులకు రెండు మూడు మోతాదుల టీకాలు అందించాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలలోని పేద దేశాల్లో కోట్ల మంది ఒక్క డోసుకూ నోచుకోలేకపోయారు. కొవిడ్‌ లాక్‌డౌన్ల వల్ల సాధారణ కార్మికులు, మధ్యతరగతి వేతన జీవులు పెద్దయెత్తున ఉపాధి కోల్పోయారు. ఒకవైపు ఆదాయ నష్టం సంభవించగా మరోవైపు ఆహార ధరలు పెరిగిపోయి పౌరులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొన్నారు.

ఆకలి కేకల ఆందోళన

కొవిడ్‌ ఉపశమిస్తుందనుకొంటున్న తరుణంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విరుచుకుపడి ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా పేద దేశాల్లో ఆకలి కేకలు తీవ్రంగా మిన్నంటుతాయనే ఆందోళన పెరుగుతోంది. వారు హుందాగా జీవించాలంటే యుద్ధం తక్షణం నిలిచిపోయి శాంతి నెలకొనాలి. అంతర్జాతీయ సమాజం ఆహార సరఫరాలతో పేద దేశాలను ఆదుకోవడం అత్యావశ్యకం. ప్రపంచంలో ఒక చోట జరిగే పరిణామాలు ఇతర చోట్లా తీవ్ర ప్రభావం చూపుతాయని రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే జీ20 అధ్యక్ష స్థానం నుంచి భారత్‌ వసుధైవ కుటుంబకం అని నినదిస్తోంది. ఈ స్ఫూర్తిని ప్రపంచం ఆకళింపు చేసుకుని సరైన కార్యాచరణకు పూనుకొంటేనే మానవ హక్కుల దినోత్సవ నినాదం ప్రకారం - న్యాయం, సమానత్వం, హుందాగా జీవించడం సాధ్యపడతాయి.

అవగాహనే లక్ష్యం

సార్వత్రిక మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948లో ఆమోదించింది. ఆ తీర్మానంలో ఉటంకించిన హక్కులు, స్వేచ్ఛలపై అందరిలో అవగాహన పెంచి, వాటి అమలుకు రాజకీయ దృఢ సంకల్పాన్ని పెంపొందించడానికి ఏటా డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ ఏడాది నినాదం- అందరికీ న్యాయం, సమానత్వం, హుందాగా జీవించే అవకాశం కల్పించడం. సమితి మానవ హక్కుల ప్రకటన చేసి 2023 డిసెంబరు 10 నాటికి 75 ఏళ్లవుతుంది. అందువల్ల వచ్చే ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఐరాస మానవ హక్కుల  మండలి నిశ్చయించింది. ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన పెంచడానికి, ప్రభుత్వాలు మరింత పటిష్ఠంగా వాటి పరిరక్షణకు పూనుకోవడానికి ఈ కార్యక్రమాలు ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది. ఐరాస 2030 నాటికి సాకారం చేయాలని పిలుపిచ్చిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు మానవ హక్కుల ప్రకటన ఒక పునాదిగా నిలుస్తోంది.

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

‣ మానవాళికి జలగండం

‣ ద్రవ్యోల్బణ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

‣ ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

Posted Date: 10-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం