• facebook
  • whatsapp
  • telegram

పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

దేశ రాజధాని దిల్లీలో ఇటీవల వాయు నాణ్యత భారీగా పడిపోయింది. ఫలితంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నానాటికీ పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం పెను ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

దేశీయంగా నానాటికీ కట్టలు తెంచుకుంటున్న వాయుకాలుష్యం భారతదేశ అభివృద్ధి లక్ష్యాలకు అడ్డంకిగా మారింది. గత రెండు దశాబ్దాలుగా ఇండియాలో వాయునాణ్యత గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇది ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తోంది. దేశంలో దాదాపు 130 కోట్ల జనాభా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశిత ప్రమాణాల కన్నా అధికంగా సూక్ష్మ ధూళికణాలు (పీఎం2.5) నిండిన ప్రాంతాల్లో జీవిస్తోంది. వాయుకాలుష్యం వల్ల తలెత్తే అనారోగ్యం, కార్మికుల ఉత్పాదకత తగ్గడం, వ్యవసాయ దిగుబడులు పడిపోవడం వంటివి భారతదేశ ఆర్థిక రంగంపై ఏటా దాదాపు రూ.12 లక్షల కోట్ల భారం మోపుతున్నాయని అంచనా. 

తీవ్ర నష్టం

ప్రపంచ వాయు నాణ్యతా సూచీ-2021 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యం నిండిన అయిదు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. దిల్లీ వరసగా నాలుగోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన రాజధాని నగరాల జాబితాలో తొలి స్థానం సాధించింది. ఇటీవలి ప్రపంచ వాయు నివేదిక ప్రకారం ప్రపంచంలో అతి సూక్ష్మ ధూళికణాలుగా పేర్కొనే పీఎం 2.5 తీవ్రస్థాయిలో పేరుకుపోయిన ఇరవై నగరాల్లో భారత్‌ నుంచి న్యూదిల్లీ, కోల్‌కతా, ముంబైలు నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నాలతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వంటి జిల్లాలూ కాలుష్యం కోరల్లో చిక్కాయి. వాయు కాలుష్యం కారణంగా ఎన్నో రకాల క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. గుండె ఆరోగ్యమూ దెబ్బతింటుంది.

వాయు కాలుష్యం 2019లో 16 లక్షల మందికి పైగా ప్రాణాలు తోడేసినట్లు లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. వారిలో 1.16 లక్షల మంది పసికందులే. భాగ్యనగరంలోనూ వాయు కశ్మలం కారణంగా 2020లో 11 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వాయు కశ్మలం కారణంగా దిల్లీలో సగటున 9.7 సంవత్సరాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 9.5 ఏళ్ల మేర ఆయుర్దాయం తెగ్గోసుకుపోతున్నట్లు గతంలో పలు అధ్యయనాలు ఆందోళనకర విషయాలను వెల్లడించాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉత్తర భారతదేశంలో 51 కోట్ల మంది సగటున ఎనిమిదిన్నరేళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నది పరిశోధనల సారాంశం. మరోవైపు గృహ వాయు కాలుష్యమూ పెద్ద సంఖ్యలో ప్రాణాలకు పొగపెడుతోంది. దానివల్ల 2019లో ఇండియాలో దాదాపు ఆరు లక్షల మంది అసువులు బాసినట్లు అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. దేశీయంగా 2019లో 25.7శాతం సూక్ష్మ ధూళి కణాలకు ఇళ్లలో ఘన జీవ ఇంధన దహనమే కారణమని నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.

దేశీయంగా వాయు కాలుష్యాన్ని నివారించడానికి మూడేళ్ల క్రితం జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 122 నగరాల్లో స్వచ్ఛ వాయు ప్రణాళికలను అమలు చేయాలని భావించారు. 2024 నాటికి పీఎం 2.5, పీఎం10లను 20-30 శాతం తగ్గించే లక్ష్యంతో మొదలైన ఈ కార్యక్రమం- అమలులో లోపాలతో చతికిలపడింది. మరోవైపు పంజాబ్‌, హరియాణా వంటి చోట్ల రైతులు రబీ పంటకు తమ పొలాలను సిద్ధం చేసేందుకు శీతాకాలంలో పెద్దయెత్తున వరి వ్యర్థాలను తగలబెడుతున్నారు. ఈ ధూమం దిల్లీ నగరాన్ని ముంచెత్తి రాజధాని ప్రజలు ఏటా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు వరి వ్యర్థాలను కాల్చకుండా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నా, అవి సక్రమంగా అమలు కావడంలేదు.

పటిష్ఠ చర్యలు కీలకం

వాయు కాలుష్యానికి వాహనాలు సైతం అధికంగా కారణమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్తు వాహనాల (ఈవీల) వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేక పోతున్నారు. పైగా విద్యుత్తు వాహనాల బ్యాటరీలు తరచూ పేలిపోతుండటం వాటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. దీన్ని నివారించేలా ఈవీలపై విస్తృతంగా పరిశోధనలు జరగాలి. వాటి ధరల్ని నియంత్రించాలి. మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు పర్యావరణాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఉజ్జ్వల పథకం కింద పెద్దమొత్తంలో గ్యాస్‌ సిలిండర్లు అందించారు. ఇటీవలి కాలంలో గ్యాస్‌ బండ ధరలు చుక్కలనంటుతున్నాయి. దానివల్ల గ్రామీణంలో ప్రజలు మళ్ళీ కట్టెలపొయ్యిల వైపు మళ్ళే ప్రమాదం ఉంది. ఫలితంగా వాయు కాలుష్య కట్టడిలో సాధించిన ప్రగతి నీరుగారిపోయే ప్రమాదం నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించాలి. ఉత్తరాదిన రైతులు పంట వ్యర్థాలను దహనం చేయకుండా వారు సరైన ప్రత్యామ్నాయాలు అనుసరించేలా పాలకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. వాయు కాలుష్యం కట్టడిలో ప్రజల భాగస్వామ్యం సైతం తప్పనిసరి. ఈ మేరకు వాయు కశ్మలం వల్ల తలెత్తే అనర్థాలపై పెద్దయెత్తున అవగాహన కల్పించాలి.

- మైత్రేయ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కాగ్‌కు కీలక బాధ్యత

‣ మానవాళికి జలగండం

‣ ద్రవ్యోల్బణ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

‣ ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

Posted Date: 10-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం