• facebook
  • whatsapp
  • telegram

కాగ్‌కు కీలక బాధ్యత

జీ20 ఆడిట్‌ సంస్థలకు సారథ్యం

జీ20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేపట్టడం మనందరికీ గర్వకారణం. అదే సమయంలో ఆ కూటమి దేశాల్లోని అత్యున్నత ఆడిట్‌ సంస్థలకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నేతృత్వం వహిస్తుంది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను, ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఆయా దేశాలకు కాగ్‌ మార్గనిర్దేశకాలను అందిస్తుంది.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో అగ్రగాములు జీ20 కూటమిగా ఏర్పడ్డాయి. ప్రపంచ జీడీపీలో 80శాతానికి జీ20 దేశాలే ఆధారం. 67శాతం ప్రపంచ జనాభా ఈ రాజ్యాల్లోనే నివసిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతం జీ20 సొంతం. భావి ప్రపంచ ఆర్థికాభివృద్ధి, సర్వతోముఖ వికాస సాధనలో జీ20 కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే క్రమంలో జీ20 కూటమి సభ్య దేశాల అత్యున్నత ఆడిట్‌ సంస్థ(ఎస్‌ఏఐ)లు సైతం ఒక అనుసంధాన సంఘంగా ఏర్పడ్డాయి. దాన్ని ఎస్‌ఏఐ20గా వ్యవహరిస్తున్నారు. ఆధునిక కాలంలో ఎదురవుతున్న బహుముఖ సవాళ్లను పాలనా సంస్థలు సమర్థంగా ఎదుర్కొనగలిగేలా ఎస్‌ఏఐ20 తోడ్పడుతుంది. ఉదాహరణకు కొవిడ్‌పై పోరాటానికి ప్రపంచ దేశాలు భారీగా నిధులు ఖర్చు చేశాయి. అవి సక్రమంగా వినియోగమయ్యేలా చూడటం ఆయా దేశాల అత్యున్నత ఆడిట్‌ సంస్థల బాధ్యత. పౌరులకు మంచి జీవన ప్రమాణాలను అందించడంలో ప్రభుత్వాలకూ ఎస్‌ఏఐ20 సహకరిస్తుంది. అభివృద్ధి సాధనలో సభ్య దేశాలను మమేకం చేస్తుంది. ప్రజా కేంద్రిత విధానాలను అనుసరించేలా పాలనా సంస్థలను ప్రోత్సహిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాలను పెంపొందిస్తుంది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు...

ఈ ఏడాది డిసెంబరు ఒకటిన జీ20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేపట్టింది. ఈ క్రమంలో భారత అత్యున్నత ఆడిట్‌ సంస్థ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) జీ20 ఎస్‌ఏఐ అనుసంధాన సంఘానికీ అధ్యక్షత వహిస్తుంది. ఆ సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో, పరస్పర సహకారాలే పునాదిగా పనిచేసేలా కాగ్‌ పాటుపడుతుంది. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్‌ వసుధైవ కుటుంబం అని నినదిస్తోంది. మనది ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అని చాటుతోంది. బ్లూ ఎకానమీ (నీలి ఆర్థిక వ్యవస్థ), బాధ్యతాయుత కృత్రిమ మేధ కోసం జీ20 దేశాల ఎస్‌ఏఐలు చేయీచేయీ కలిపి పనిచేయాలని కాగ్‌ పిలుపిస్తోంది. సముద్రాలు, నదీనదాలు, చెరువులలోని మత్స్య వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం, వాటి ఆవాసాలను పరిరక్షించడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చు. జల వనరులతో ఆహారం, ఇంధన ఉత్పత్తి ద్వారా ప్రజలకు దీర్ఘకాలం జీవనాధారాలను కల్పించవచ్చు. తద్వారా ఆర్థికాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పునాది వేయవచ్చు. దీన్నే బ్లూ ఎకానమీ అంటారు. ఈ విషయంలో సమన్వయంతో ముందుకు సాగే విధానాలను, నిర్వహణ ప్రక్రియలను జీ20 దేశాలు చేపట్టాలి. అందుకే గ్లాస్గో నగరంలో జరిగిన కాప్‌26 శిఖరాగ్ర సదస్సులో మానవాళి పర్యావరణహితకరమైన జీవన శైలిని అనుసరించాలని భారత్‌ పిలుపిచ్చింది. బ్లూ ఎకానమీ అందులో అంతర్భాగం. సముద్రాలు, నదీనదాలు, జలాశయాల్లోని మత్స్య, తదితర వనరులను విచ్చలవిడిగా వినియోగించడం తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుంది. దీన్ని నివారిస్తూ వివేచనతో, అవసరాల మేరకు ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడమే బ్లూ ఎకానమీ పరమార్థం. దీన్ని సాధించడానికి జీ20 ఎస్‌ఏఐ అనుసంధాన సంఘం కృషి చేస్తుంది.

ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ), ముఖ్యంగా మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన పద్నాలుగో లక్ష్యాన్ని అందుకోవడంపై ఎస్‌ఏఐ20 శ్రద్ధ వహిస్తుంది. అందరికీ ప్రయోజనకరమైన బ్లూ ఎకానమీ కోసం తగిన ఆడిటింగ్‌ విధానాలను, కార్యక్రమాలను రూపొందించడానికి తోడ్పడుతుంది. జల వనరులను పర్యావరణానికి నష్టం కలగని రీతిలో ఉపయోగించుకుంటూ అభివృద్ధి సాధించడానికి జీ20 దేశాలను, అక్కడి సామాజిక బృందాలను, వివిధ రంగాలను అనుసంధానిస్తుంది. తద్వారా సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. జీ20 కూటమికి ఇండియా అధ్యక్షత వహించే క్రమంలో ఆయా దేశాల అత్యున్నత ఆడిట్‌ సంస్థలకు కాగ్‌ సారథిగా వ్యవహరిస్తుంది.

బాధ్యతాయుతంగా ఏఐ వినియోగం

పోనుపోను కృత్రిమ మేధ(ఏఐ) ప్రజల జీవితాల్లో విడదీయరాని భాగంగా మారుతోంది. దాన్ని దుర్వినియోగం చేస్తే విపరీత పరిణామాలు తప్పవు. ఏఐతో వ్యక్తుల ఆంతరంగిక గోప్యతకు భంగం కలగవచ్చు. దాని ఆల్గారిథమ్‌లు సామాన్యులకు అర్థం కావు. ఒక మోస్తరు నిపుణులకూ దాని ఆనుపానులు అంతుపట్టవు. ఇక ఏఐ వల్ల తలెత్తే సమస్యలను ఎదుర్కోవడం సామాన్యులకు అలవికాని పని. అందుకే ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించాలనే జాగరూకతను ప్రభుత్వాలు, వ్యాపార, పౌర సంస్థలు అలవరచుకోవాలి. పరస్పర నమ్మకం ఆధారంగా డిజిటల్‌ సమాజాన్ని నిర్మించాలని 2019 జూన్‌లో జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం తీర్మానించింది. నిరుడు నవంబరులో యునెస్కో వెలువరించిన కృత్రిమ మేధ నైతిక ప్రమాణాలు సైతం ఇదే విషయాన్ని తెలియజెప్పాయి. ఏఐ సక్రమ వినియోగానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఏఐ20 పిలుపిస్తోంది. ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించుకుంటూ విస్తృత ఏకాభిప్రాయం సాధించడానికి కాగ్‌ కృషి చేస్తుంది. దీనికి కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఎస్‌ఏఐ20కి అందిస్తుంది. సాటి ఎస్‌ఏఐలతో కలిసి ఏఐని నిర్మాణాత్మకంగా వినియోగించుకోవాలనే అవగాహనను అందరిలో పెంపొందిస్తుంది. ఏఐ ఫలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు దుర్వినియోగాన్ని అరికట్టడంలోనూ అవసరమైన జాగ్రత్తలు సూచిస్తుంది. జీ20 ఎస్‌ఏఐలకు సమర్థ మార్గదర్శకత్వం, నాయకత్వాన్ని కాగ్‌ అందిస్తుంది!

విలువైన మార్గదర్శకాలు

జీ20 సభ్య దేశాల్లో ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను, ఆర్థికాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని సాధించడానికి ఆయా దేశాల అత్యున్నత ఆడిట్‌ సంస్థలకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తగిన మార్గనిర్దేశకాలను అందిస్తుంది. ఏకాభిప్రాయంతో నిర్దిష్ట ప్రమాణాలను నిర్దేశిస్తుంది. సర్వతోముఖ అభివృద్ధి సాధనకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు ఈ మార్గదర్శకాలు, ప్రమాణాలు తోడ్పడతాయి. ఎస్‌ఏఐలు, ఇతర భాగస్వాముల మధ్య సన్నిహిత సహకారం పెంపొందించడానికి కాగ్‌ కృషి చేస్తుంది. పరిశోధనా ఫలాలు, ఉత్తమ కార్యాచరణల ద్వారా గడించిన అనుభవాలను పంచుకోవడంతోపాటు, సరైన ఆడిట్‌ మార్గదర్శకాల రూపకల్పనకు తోటి ఎస్‌ఏఐలతో కలిసి కాగ్‌ పనిచేస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవాళికి జలగండం

‣ ద్రవ్యోల్బణ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

‣ ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

Posted Date: 10-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం