• facebook
  • whatsapp
  • telegram

చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

సముద్రతీరాల్లో పర్యాటకులకు ఇసుకతిన్నెలపై నల్లటి ముద్దలు కనిపిస్తున్నాయి. ముట్టుకుంటే జిడ్డుగా తగులుతున్నాయి. వీటినే ‘తారు బంతులు’ అంటున్నారు. సముద్రాల్లో ఏర్పడే చమురుతెట్టు ఈ బంతుల రూపంలో ఒడ్డుకు కొట్టుకొస్తోంది.

మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని సాగర తీరాల్లో తారు బంతులు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. సముద్ర జీవులకు హానికరమైన వీటి రసాయన లక్షణాలపై జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐఓ) దశాబ్దకాలంగా పరిశోధన సాగిస్తోంది. గోవాలో తొలిసారి 2010-11 మధ్య కనిపించిన ఈ బంతులు ముంబయి హైఫీల్డ్‌ చమురు క్షేత్రం నుంచి విడుదలైన ముడిచమురు కారణంగానే ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. గుజరాత్‌లో 2012లో కనిపించినవీ దీనివల్లేనని గుర్తించారు. నౌకల నుంచి విడుదలైన చమురు సైతం ఆ తరవాత తారుబంతులుగా మారి అరేబియా సాగరతీరంలో కనిపించడం ఎన్‌ఐఓ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్‌, ఆగస్టు నెలల్లో మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతాల్లో తారుబంతులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు, తుపానులు వచ్చినప్పుడు ఇవి సముద్రం నుంచి తీరానికి కొట్టుకొస్తాయి. కొన్నేళ్ల కిందట ఈ బంతులు చిన్నగానే ఉండేవి. ఇప్పుడు మాత్రం బాస్కెట్‌బాల్‌ పరిమాణంలో ఉంటున్నాయి. ఇవి సహజమైనవి కావని, కచ్చితంగా సముద్రంలో నౌకల నుంచి వెలువడిన చమురుతెట్టు కారణంగా ఏర్పడినవేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం తప్పదంటూ ప్రభుత్వాలని అప్రమత్తం చేశారు. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులు బీచ్‌లను శుభ్రంచేసే క్రమంలో తారుబంతులను సాధారణ చెత్తలా తీసి పారేస్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం సురక్షితంకాదని ఎన్‌ఐఓ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి.

గోవాలోని మోర్జిమ్‌, వాగేటర్‌, అంజునా, ఆరంబోల్‌ బీచ్‌లలో 2021-22 మధ్య అతిపెద్ద తారుబంతులు వచ్చాయని అక్కడ వీటిని శుభ్రంచేసే అటవీశాఖ వలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమతీర బీచ్‌లలో రెండు దశాబ్దాలుగా తారుబంతుల సమస్య తీవ్రమవుతున్నట్లు ఎన్‌ఐఓ విశ్రాంత శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. సాధారణంగా వర్షాకాలంలోనే ఇవి వస్తాయని, ఈసారి సెప్టెంబరు తరవాత కనిపించడం ప్రమాదానికి సంకేతమని భావిస్తున్నారు. దక్షిణార్ధగోళం నుంచి వచ్చే గాలులు భూమధ్య రేఖను దాటి మే, జూన్‌ నెలల్లో భారతదేశాన్ని తాకుతాయి. వాయు దిశలో మార్పుల కారణంగా కెరటాలూ ప్రభావితమవుతాయి. అందుకే జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తీరప్రాంతంలో గాలుల తీవ్రత పెరిగి, సముద్రంలోని చమురుతెట్టు ఇలా తారుబంతుల రూపంలో తీర ప్రాంతాలకు కొట్టుకొస్తోందన్నది మరికొందరు శాస్త్రవేత్తల విశ్లేషణ. సముద్ర ఉపరితలాలపై చమురుతెట్టు కొన్నిసార్లు సహజంగానే ఏర్పడుతుంది. కడలి అంతర్భాగాల్లో ఉండే కర్బన పదార్థాల నుంచి దీర్ఘకాలంలో కొంత ముడిచమురు ఏర్పడుతుంది. వివిధ వాతావరణ పరిస్థితులకు అది తెట్టు రూపంలో నీటి పైభాగానికి చేరుతుంది.  చమురు రవాణా పైపులైన్లు పగిలినప్పుడు, ముడిచమురు నిల్వ కేంద్రాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు, నౌకలు ఢీకొన్నప్పుడు సముద్రంలోకి ఆయిల్‌ భారీగా విడుదల అవుతోంది. తరవాత అది తారుబంతులుగా మారి పర్యావరణానికి పెనుముప్పు విసురుతోంది. దేశవిదేశాల్లో నౌకా ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి వల్ల పెద్ద మొత్తంలోనే చమురు సముద్రం పాలవుతోంది. దీన్ని వీలైనంత తక్కువగా చూపించేందుకు నౌకల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఈ ప్రమాదాలు సముద్ర జీవావరణంపై చూపుతున్న దుష్పరిణామాలు మాత్రం అపారంగా ఉంటున్నాయి. తీరప్రాంతాల్లో తిరిగే తాబేళ్ల మనుగడ, పునరుత్పత్తిని తారుబంతులు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సాగర ప్రాంతాల్లో సంచరించే కొన్ని పక్షి జాతులు సైతం చమురుతెట్టు, తారుబంతుల కారణంగా ముప్పు ఎదుర్కొంటున్నాయి. పొరపాటున వీటిపై వాలే పక్షులు ఆ తరవాత ఎగరడం కష్టమవుతోంది.

భారత పశ్చిమ తీరంలో చమురుతెట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్న ఎన్‌ఐఓ శాస్త్రవేత్తల హెచ్చరికలను ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు గమనంలోకి తీసుకోవాలి. సకాలంలో తొలగించకపోవడం వల్లే ఇవి గాఢతను సంతరించుకుని బంతుల రూపంలో తీరప్రాంతాలకు కొట్టుకొస్తున్నాయి. ప్రమాదవశాత్తు ఏర్పడే తెట్లను వీలైనంత త్వరగా తొలగించాలి. తగిన జాగ్రత్తలతో వీటిని మండించాలి. లేదంటే చమురు పీల్చుకునే దూది, జీవపదార్థాలను ఉపయోగించాలి. డిటర్జెంట్లతో కూడిన ఇతరత్రా విధానాలు సైతం ఇందుకు అనుసరణీయమే.

- రఘురామ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం