• facebook
  • whatsapp
  • telegram

డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైంది మొదలు అమెరికా, సౌదీ అరేబియాల నడుమ దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో బీజింగ్‌కు రియాద్‌ దగ్గరవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిన్‌పింగ్‌ ఇటీవల సౌదీలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా, సౌదీ అరేబియాల మధ్య దీర్ఘకాలంగా పటిష్ఠ మైత్రీబంధం ఉంది. అది ఉభయ ప్రయోజనకరమైన చెలిమి. వాషింగ్టన్‌ చమురు అవసరాలను రియాద్‌ తీరుస్తుంటుంది. మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం ఆధిపత్యం చలాయించడంలోనూ సహకరిస్తుంటుంది. అందుకు ప్రతిగా- ఇరాన్‌ సహా పలు ప్రాంతీయ శక్తుల నుంచి భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సౌదీకి అమెరికా అండగా నిలుస్తుంటుంది. ఈ మేరకు దశాబ్దాలపాటు సజావుగా సాగిన స్నేహబంధం కొన్నాళ్లుగా ఒడుదొడుకులకు లోనవుతోంది. పాత్రికేయుడు జమాల్‌ ఖషోగీ హత్య వెనక సౌదీ యువరాజు, ప్రస్తుత ప్రధానమంత్రి మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌) హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. సౌదీలో మానవహక్కుల ఉల్లంఘనలపైనా అమెరికా చట్టసభ్యులు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. యెమెన్‌లో ఆ దేశం విచక్షణారహితంగా బాంబుదాడులకు పాల్పడిందని నిందిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక పరిస్థితులు మరింత దిగజారాయి. రష్యాపై ఆంక్షల విషయంలో రియాద్‌ తమతో కలిసి నడవకపోవడం వాషింగ్టన్‌కు మింగుడుపడటం లేదు. దీనికితోడు అమెరికా వారిస్తున్నా, సౌదీ నేతృత్వంలోని ఒపెక్‌+ కూటమి ధరల స్థిరీకరణ కోసమంటూ ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చొప్పున తగ్గించింది. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరిగాయి. అది రష్యాకు కలిసివస్తోందని అమెరికా ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సౌదీలో పర్యటించడం దానికి ఎంతమాత్రమూ రుచించడం లేదు.

వాణిజ్య కార్యకలాపాల విస్తరణ

అమెరికాతో సన్నిహిత సంబంధాలున్నా, చైనాతోనూ సౌదీ చిరకాలంగా పటిష్ఠ వాణిజ్య బంధాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం రియాద్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బీజింగే. 2021లో వాటి మధ్య వాణిజ్య బంధం విలువ 8,730 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఇందులో సౌదీకి చైనా ఎగుమతుల వాటా 3,030 కోట్ల డాలర్లు. దాని దిగుమతుల విలువ 5,700 కోట్ల డాలర్లు. 2022 తొలి 10 నెలల్లో చైనా దిగుమతి చేసుకున్న ముడి చమురులో 18శాతం సౌదీ నుంచి వచ్చిందే. చమురు, రసాయన రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య కార్యకలాపాలను విస్తరించుకోవాలని బీజింగ్‌, రియాద్‌లు యోచిస్తున్నాయి. జిన్‌పింగ్‌ తాజా పర్యటనలో ఇరు దేశాల మధ్య హరిత ఇంధనం, ఫొటోవోల్టాయిక్‌ ఎనర్జీ, సమాచార సాంకేతికత, క్లౌడ్‌ సర్వీసెస్‌, రవాణా, హౌసింగ్‌ తదితర రంగాల్లో 34 ఒప్పందాలు కుదిరాయి. సౌదీ సహా పలు పశ్చిమాసియా దేశాలతో డాలర్లలో కాకుండా తమ కరెన్సీ ‘యువాన్‌’లలో లావాదేవీలు జరపాలన్నది చైనా దీర్ఘకాల వాంఛ. చైనా- గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ) సదస్సులో జిన్‌పింగ్‌ తాజాగా దీన్ని ప్రతిపాదించారు. చమురే ప్రధాన ఆదాయవనరైన కువైట్‌, ఇరాక్‌, ఖతర్‌, యూఏఈ, ఒమన్‌ తదితర దేశాల నుంచీ చైనాకు ముడిచమురు ఎగుమతులు ఎక్కువే. ఆ దేశాలు యువాన్‌లలో లావాదేవీలకు అంగీకరిస్తే అమెరికాకు గట్టి దెబ్బ తప్పదు. నిజానికి జీసీసీలోని కొన్ని దేశాలు ఇప్పటికే చైనా కరెన్సీలో ఆ దేశంతో స్వల్పస్థాయి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇండియాకు సవాళ్లు

జిన్‌పింగ్‌ సౌదీ పర్యటనతో ప్రస్తుతానికి ఇండియాపై ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చు. రియాద్‌, బీజింగ్‌లు బాగా దగ్గరైతే దీర్ఘకాలంలో దిల్లీకి ఇబ్బందులు తప్పవు. 12 అరబ్‌ దేశాలతో చైనాకు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. జిన్‌పింగ్‌ తన కలల ప్రాజెక్టు- బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ)తో పశ్చిమాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటికే 20 అరబ్‌ దేశాలు బీఆర్‌ఐలో చేరాయి. ఆయా దేశాలపై చైనా ప్రాబల్యం పెరిగితే భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లు ఎదురుకావచ్చు. కాబట్టి దిల్లీ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. రియాద్‌తో సంబంధాలకు మరింత ప్రాధాన్యమివ్వాలి. ఆ దేశం కాంక్షిస్తున్నట్లుగా నిర్మాణం, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి రంగాల్లో మెరుగైన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలి. చైనా తరవాత సౌదీ నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశం మనదే. కాబట్టి ఇండియా వ్యతిరేక పోకడలకు రియాద్‌ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు- చైనాతో చెలిమి బలపడినా అమెరికాను పూర్తిగా విస్మరించడం సౌదీకి సాధ్యం కాదు. భద్రత విషయంలో వాషింగ్టన్‌పైనే అది ఇప్పటికీ ఆధారపడి ఉంది. అమెరికాను దూరం పెట్టాలన్న ఉద్దేశంతో కాకుండా, 2016లో ప్రకటించిన తమ విజన్‌-2030లో భాగంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకే చైనాతో మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సన్నిహితంగా మెలగుతున్నారన్నది పలువురు నిపుణుల విశ్లేషణ. బీజింగ్‌కు దగ్గరవుతున్నట్లు కనిపించడం ద్వారా వాషింగ్టన్‌ను ఒకింత బెదిరించినట్లవుతుందని; తద్వారా సౌదీ వ్యవహారాల్లో అమెరికా మెతకగా వ్యవహరిస్తుందన్నది ఆయన వ్యూహం కావచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం-2 తరహా పరిస్థితులు నెలకొన్న వేళ జిన్‌పింగ్‌ సౌదీ పర్యటన సర్వత్రా ఉత్కంఠను పెంచిందనడంలో సందేహం లేదు.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం