• facebook
  • whatsapp
  • telegram

జగడాల చైనాకు దీటైన జవాబు

భారత్‌, చైనాల సరిహద్దు వివాదం వల్ల 1962లో యుద్ధం జరిగింది. అప్పటి నుంచి గత ఆరు దశాబ్దాల్లో వివాదం పరిష్కారమే కాలేదు. తరచూ రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి.

తాజాగా డిసెంబరు తొమ్మిదిన అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలో భారత్‌, చైనా సైనికులు గాయపడ్డారు. 2020 జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికులు ఇలాగే తలపడటంతో పలువురు మరణించారు. ఆ తరవాత మళ్ళీ ఘర్షణ నెలకొనడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్‌ పర్వతాల్లోని ఔలిలో భారత్‌, అమెరికా దళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహించడంపై చైనా అభ్యంతరపెట్టిన దరిమిలా తవాంగ్‌ ఘటన చోటుచేసుకోవడం గమనించాల్సిన విషయం. ఈ యుద్ధ విన్యాసాలు 1993, 1996 సరిహద్దు ఒప్పందాలకు విరుద్ధమని చైనా చెబుతోంది.

పోటాపోటీగా నిర్మాణాలు

అక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని పూర్వ జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగంగా అర్డాగ్‌-జాన్సన్‌ రేఖ చూపుతోంది. దీనితోపాటు, టిబెట్‌కు బ్రిటిష్‌ ఇండియాలోని అస్సాముకు మధ్యనున్న మెక్‌మహన్‌ రేఖను భారత్‌ అధికారికంగా గుర్తిస్తోంది. అక్సాయ్‌ చిన్‌ను చైనాలో అంతర్భాగంగా చూపే మెకార్టినీ-మెక్‌డొనాల్డ్‌ రేఖను బీజింగ్‌ పరిగణనలోకి తీసుకుంటోంది. ఇదే భారత్‌-చైనా సరిహద్దు సంఘర్షణలకు మూలం. 1962 తరవాత 1967లో నాథూలా, చోలాలలో రెండు దేశాల సైనికులు పోరాటానికి దిగారు. అప్పుడు చైనా సైనికులను భారత జవాన్లు విజయవంతంగా తరిమివేశారు. ఆ తరవాత సుందోరోంగ్‌ చూ (1986-87), చుమార్‌ (2014), బుర్ట్సె (2015), డోక్లాం (2017) ఘర్షణలు జరిగాయి. 2020లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో అయిదుగురు యువకులను చైనీయులు అపహరించారు.

భారత్‌, చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందులో 523 కిలోమీటర్లు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా వెళ్తుంది. మొత్తం సరిహద్దును పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్లుగా విభజించారు. పశ్చిమ సెక్టార్‌లో 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల అక్సాయ్‌ చిన్‌ను 1962 యుద్ధంలో చైనా ఆక్రమించింది. దాన్ని షింజియాంగ్‌ రాష్ట్రంలో భాగంగా పరిగణిస్తోంది. అక్సాయ్‌ చిన్‌ ద్వారానే టిబెట్‌, షింజియాంగ్‌లతో చైనా అనుసంధానమవుతుంది. తూర్పు సెక్టార్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంతం తనదేనని డ్రాగన్‌ చెబుతోంది. అంటే, అరుణాచల్‌ ప్రదేశ్‌ మొత్తం తనదేనన్నది బీజింగ్‌ వాదన.

సరిహద్దు వివాదం రావణకాష్ఠంలా రగులుతున్నందువల్ల రెండు దేశాలూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి రోడ్లు, వంతెనలు ఇతర మౌలిక వసతులను పోటాపోటీగా నిర్మిస్తున్నాయి. చైనా 1980ల నుంచే టిబెట్‌లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. భారతదేశ సరిహద్దు వరకు హైస్పీడ్‌ రైల్వేలైనును సైతం బీజింగ్‌ వేసింది. మొత్తం 97,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది. అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇంకా టిబెట్‌లో ఎత్తయిన పర్వతాల్లో విమాన స్థావరాలూ నిర్మించింది. అక్కడ దాదాపు రెండు లక్షలా 30వేలమంది సైనికులను, 157 యుద్ధ విమానాలను మోహరించింది. తన సేనలకు వేగవంతమైన వాహనాలను, యుద్ధ ట్యాంకులకు ఆధునిక కాల్పుల వ్యవస్థను సమకూర్చింది. స్వల్ప శ్రేణి, దూర శ్రేణి క్షిపణులను సిద్ధంగా ఉంచింది. వాస్తవాధీన రేఖ వద్ద ట్రక్కుపై నుంచి ఏకకాలంలో పలు రాకెట్లను ప్రయోగించగల పీహెచ్‌ఎల్‌03 ఎంఎల్‌ఆర్‌లను మోహరించింది. భారత్‌ సైతం 2005 నుంచి సరిహద్దులో మౌలిక వసతులను విస్తరిస్తోంది. హిమాలయాల్లో రహదారులు, విమాన స్థావరాలను నిర్మించింది. ఈ ఏడాది చివరికల్లా చైనా సరిహద్దులో 61 కీలక రహదారుల నిర్మాణం పూర్తిచేయడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. 2009లో భారత్‌ సుఖోయ్‌30ఎంకెఐ యుద్ధ విమానాలను అస్సాములో సిద్ధంగా ఉంచింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2011లో బ్రహ్మోస్‌ క్షిపణులను మోహరించింది.

సామరస్య పరిష్కారం కీలకం

వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న చైనీయులను అన్ని చోట్లా భారత్‌ నిరోధిస్తోంది. 2020 ఏప్రిల్‌కు ముందున్న ప్రదేశాలకు డ్రాగన్‌ సైన్యాన్ని నెట్టివేయడం, సరిహద్దు వివాదాలను సంప్రదింపులతో శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఇండియా విధానం. సెప్టెంబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైనికులు తూర్పు లద్దాఖ్‌లోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ సరిహద్దు నుంచి వెనక్కు మళ్ళారు. పాంగోంగ్‌త్సోకు ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచీ ఉపసంహరించుకున్నారు. దానికి బదులుగా కైలాస్‌ పర్వత శ్రేణిలోని కొన్ని శిఖరాలను ఖాళీ చేయాల్సి రావడం వల్ల భారత దళాలు భవిష్యత్తులో పట్టుకోల్పోతాయి. చైనీయులు చొచ్చుకొచ్చిన ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేసిన తరవాతనే భారత్‌ కైలాస్‌ శిఖరాల నుంచి వైదొలగి ఉండాల్సింది. సియాచిన్‌ హిమనదానికి సమీపంలోని దెప్సాంగ్‌ మైదానంలో తనకు చెందినవని భారత్‌ ప్రకటించిన ప్రాంతాల్లో చైనీయులు ఇంకా తిష్ఠవేసి ఉన్నారు. ఆ ప్రాంతాలు భారత్‌, చైనా, పాక్‌ కూడలిలో ఉన్నాయి. వివాదాస్పద ప్రాంతాలను వదులుకోవడానికి భారత్‌, చైనాలు రెండూ సిద్ధంగా లేవు. అందువల్ల సరిహద్దులో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది. పరిస్థితి చేజారిపోయి అణ్వస్త్ర రాజ్యాలైన ఇరు దేశాల మధ్య యుద్ధమే వస్తే తీవ్ర వినాశనం తప్పదు. ఆ విపత్తును నివారించడానికి దౌత్య, సైనిక వర్గాల మధ్య సంప్రంతింపులు కొనసాగాలి. సమస్యకు సామరస్యంతో పరిష్కారం కుదరాలి.

అత్యాధునిక సౌకర్యాలు

చైనా దాడిచేస్తే కాచుకోవడానికి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం రెండు పర్వత దళాలను సమీకరించింది. ఒక్కో దళంలో అరవై వేల మంది సైనికులు ఉంటారు. చైనాపై ఎదురుదాడి చేయడానికీ ముప్ఫై వేల మంది సైనికులతో మరో దళాన్ని సిద్ధం చేసింది. గత సర్కారు ఏర్పాట్లను నరేంద్ర మోదీ ప్రభుత్వమూ కొనసాగిస్తోంది. సరిహద్దు వద్ద సైనికులు, ఫిరంగులు, ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలతో కూడిన సమగ్ర సైనిక దళాలను మోహరిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో నిఘాకు డ్రోన్లను నియోగిస్తోంది. సరిహద్దు గస్తీ కేంద్రాలను పెద్దయెత్తున ఏర్పాటు చేసింది. చైనా తన సరిహద్దు వెంబడి అధునాతన గ్రామాలను నిర్మిస్తోంది. దానికి ప్రతిగా భారత్‌ సైతం సరిహద్దుకు దగ్గరి గ్రామాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. అక్కడ పర్యాటక కేంద్రాలను విస్తరిస్తోంది. లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు అధునాతన రాడార్లను ఏర్పాటు చేస్తోంది. సైనిక దళాలను వేగంగా తరలించడానికి వీలుగా అరుణాచల్‌, లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌లలో 12 సొరంగాలను తవ్వుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

‣ డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం