• facebook
  • whatsapp
  • telegram

ఒకే దేశం - ఒకే ఎన్నిక... ఉపయుక్తమేనా?

దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ఊపందుకొన్నాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’తో దేశం పురోగమిస్తుందని, దీన్ని సాకారం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ ఇటీవల ఉద్ఘాటించారు. తాజా పరిణామాలతో జమిలి ఎన్నికలు అనివార్యం కావచ్చన్న అభిప్రాయాలు, దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

మన దేశ ఎన్నికలు అంతకంతకు ఖరీదు అవుతున్నాయి. ఒక్క 2019 లోక్‌సభ ఎన్నికలకే 55 వేల కోట్ల రూపాయల మేర ఖర్చయిందని, ప్రపంచ దేశాల ఎన్నికల వ్యయాల్లో అప్పటికి అదే గరిష్ఠమని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అధ్యయనం లెక్క తేల్చింది. ఆ మరుసటి ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష, కాంగ్రెస్‌ ఎన్నికల వ్యయం సుమారు లక్షా 15వేల కోట్ల రూపాయలకు (14 బిలియన్‌ డాలర్లు) చేరుకుని యావత్‌ ఎన్నికల వ్యయచరిత్రను తిరగరాసింది. 1998లో తొమ్మిది వేల కోట్ల రూపాయలున్న మన లోక్‌సభ ఎన్నికల ఖర్చు 2019 నాటికి ఆరు రెట్లు దాటిందని ఆ నివేదిక విశ్లేషించింది. గత మూడు దశాబ్దాల్లో లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలు జరగని ఏడాది ఒక్కటైనా లేదని నీతి ఆయోగ్‌ 2017లో వెల్లడించింది. నిత్యం ఏదో ఒకచోట జరిగే ఎన్నికలతో కొన్ని ఇబ్బందులు సహజమే. ముఖ్యంగా ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుంది. ఎన్నికల వ్యూహాలు, గెలుపు యుక్తులపై దృష్టి సారించే క్రమంలో- అభివృద్ధి పనులపై పాలక పక్షాలు పెద్దగా మనసు పెట్టలేవు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. పాలనాపరంగానూ తాత్కాలికంగా సమస్యలు ఎదురవుతాయి. యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నం కావాల్సి రావడంతో చిన్నపాటి సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవు. కేంద్రంలో, రాష్ట్రాల్లో పాలకులను ఒకేసారి ఎన్నుకుంటే ఈ ఇబ్బందులన్నీ సమసిపోతాయని భాజపా చెబుతోంది. తరచూ వచ్చే ఎన్నికలను ఏవగించుకునే పట్టణ ఓటర్లు అయిదేళ్లకు ఒకసారైతే పోలింగ్‌ కేంద్రానికి పెద్దసంఖ్యలో తరలివస్తారని అంటోంది. ఈ కారణాలను ముందుపెట్టి జమిలి ఎన్నికల విషయంలో తన పంతం నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

రాజ్యాంగ సవరణలే కీలకం

రాజ్యాంగంలోని 324వ అధికరణ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలతో పాటు పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల్లోని శాసనసభలు, శాసనమండళ్ల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల సంఘానికి దఖలుపరచింది. 73, 74వ రాజ్యాంగ సవరణలు 31 రాష్ట్ర ఎన్నికల కమిషన్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయి. పురపాలికలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థలు తదితరాలకు ఎన్నికలు నిర్వహించాలని వాటిని నిర్దేశించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, చట్ట, న్యాయశాఖల పార్లమెంటరీ స్థాయీసంఘం అవలోకించింది. కేంద్ర, రాష్ట్రాల చట్టసభలతో పాటే స్థానిక సంస్థలనూ సమన్వయపరచుకొని, ఏకకాలంలో వీటికి ఎన్నికలు నిర్వహించడాన్ని ‘జమిలి’గా భాష్యం చెప్పింది. పార్లమెంటుకు సమర్పించిన తన 79వ నివేదికలో ఇందుకు ఒక ఆచరణాత్మక విధానాన్ని సిఫార్సు చేసింది. దాని ప్రకారం ఒక ఓటరు ఒకేసారి జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు పాలకులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలు అవసరమంటూ న్యాయ కమిషన్‌ 2018లో కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఈ క్రమంలోనే ఏకకాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పాలనాపరంగా సంసిద్ధత ప్రకటించింది.

ప్రాంతీయ పార్టీల వ్యతిరేకత

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే- జాతీయస్థాయి అంశాలకు దక్కేంత ప్రాధాన్యం ప్రాంతీయ ఆకాంక్షలకు లభించదని రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాంతీయ అంశాలపై బలమైన డిమాండ్లు వినిపించి ప్రజాతీర్పు కోరే అవకాశం తమకు ఉండదని, జమిలి ఎన్నికలు వద్దేవద్దని అవి అభ్యంతరం చెబుతున్నాయి. ఎన్నికల వ్యయం, వ్యూహాల పరంగా జాతీయపార్టీలతో పోటీ పడలేక ఉనికి కోల్పోతామంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాయి. అయిదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలంటే ఓట్ల పండగ ముగిసిన తరవాత రాజకీయ పార్టీలు ప్రజల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ప్రమాదముంది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా అప్పటికే అసెంబ్లీ గడువు తీరిన రాష్ట్రాల్లో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. ఆ ఎన్నికల తరవాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినా అదే పరిస్థితి తలెత్తుతుంది. అలా రాష్ట్రాలు కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళడం సమాఖ్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన ఇండియా వంటి దేశంలో ఏ చరిత్రాత్మక నిర్ణయమైనా ప్రజాస్వామ్య విలువలకు, విస్తృత జనస్వామ్యం ఆకాంక్షలకు అద్దం పట్టాలి. కేవలం రాజకీయ స్వప్రయోజనాలను కాంక్షించి ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ను దూకుడుగా అమలులోకి తీసుకురావడం ప్రజాస్వామ్య పునాదులకు ప్రమాదకరం. జమిలి ఎన్నికలతో ఒనగూడే లాభనష్టాలు, దీనిపై వ్యక్తమవుతున్న భయాందోళనలపై రాజకీయ పక్షాలు, నిపుణులు, పౌరుల్లో లోతైన చర్చ జరగాలి.

- నీరజ్‌కుమార్‌ సైబేవార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

‣ డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం