• facebook
  • whatsapp
  • telegram

ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి

దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి చర్చ సాగుతోంది. భాజపా గతంలోనే ఎన్నికల ప్రణాళికల్లో దానిపై హామీ ఇచ్చింది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు  ఈ అంశంపై నిపుణుల సంఘాలనూ నియమించాయి. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన చట్టాలను రాష్ట్రాలు రూపొందించుకోవచ్చని తాజాగా రాజ్యసభలో కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టీకరించడం గమనార్హం.

పరిణత ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఒకే విధమైన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. వ్యక్తిగత అంశాలకూ ఏకరూపత అవసరం. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య దేశంగా పురోగమిస్తున్న భారత్‌ కాలక్రమంలో అన్ని మతాలవారికీ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని చేపట్టాలని రాజ్యాంగం ఉద్దేశించింది. అది ఒక్క రోజులో జరిగే పని కాదని రాజ్యాంగ నిర్మాతలకు తెలుసు. విస్తృత చర్చలు, ఏకాభిప్రాయ సాధన అవసరమని వారు భావించారు. భారతదేశంలో విభిన్న మతాలకు విభిన్న వైయక్తిక చట్టాలు ఉన్నాయి. వీటిని న్యాయ పరిభాషలో ‘పర్సనల్‌ లా’గా వ్యవహరిస్తున్నారు. వివాహం, విడాకులు, వారసత్వం, మనోవర్తి చెల్లింపు, దత్తత, సంరక్షకత్వం వంటి వ్యక్తిగత వ్యవహారాల్లో ప్రతి మతం అనాదిగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తోంది. భారతదేశంలో మత ప్రభావం ఇప్పటికీ బలంగా ఉన్నందువల్ల ఒక్కసారిగా అన్ని మతాలకూ ఒకే పౌర స్మృతిని తీసుకురావడం అభిలషణీయం కాదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అన్ని మతాలు, వర్గాల మధ్య పరస్పర అవగాహన, ఏకాభిప్రాయం కుదిరేవరకు ఆగాలని నిర్ణయించారు. అందుకే యూసీసీ సాధన లక్ష్యాన్ని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దీనివల్ల కోర్టు ప్రమేయంతో పర్సనల్‌ లాను మార్చడం కానీ, యూసీసీని తీసుకురావడం కానీ సాధ్యపడదు. బ్రిటిష్‌ హయాములో కూడా హిందువులకు, ముస్లిములకు ‘పర్సనల్‌ లా’గా పేర్కొనే వేర్వేరు వైయక్తిక చట్టాలు ఉండేవి. బ్రిటిష్‌ వలస పాలకులు హిందువుల్లో సతీసహగమన నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నా, మొత్తం మీద ఏ మతం ‘పర్సనల్‌ లా’లోనూ అతిగా జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించారు. భారతీయుల్లో తమపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడంతోపాటు హిందువులు, ముస్లిములను విభజించి పాలించడానికి ఇది తోడ్పడింది.

దీర్ఘకాలంగా సమాలోచనలు

యూసీసీపై దీర్ఘకాలంగా సమాలోచనలు, చర్చలు జరుగుతూనే ఉన్నా అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వ సూచనపై ‘కుటుంబ చట్టాల సంస్కరణ’ అనే శీర్షికతో ఒక సంప్రతింపుల పత్రాన్ని 21వ న్యాయ సంఘం 2018 ఆగస్టు 31న తన వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టింది. అదేరోజు న్యాయ సంఘం పదవీ కాలమూ తీరిపోవడంతో 22వ న్యాయసంఘం ఆ పత్రాన్ని పరిశీలిస్తోంది. న్యాయసంఘం సిఫార్సును సమర్పించిన తరవాత కేంద్రం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొంటుంది. లింగపరమైన అసమానతలు, దుర్విచక్షణను తొలగించడానికి యూసీసీ అవసరమని మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ వెర్సస్‌ షాబానో బేగం (1985), సరళా ముద్గల్‌ వెర్సస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1995), లిలీ థామస్‌ వెర్సస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివిధ మతాలవారిలో వివాహం, విడాకుల కేసులకు సంబంధించి సమన్యాయం జరగడానికి యూసీసీ తోడ్పడుతుందని సావిత్రీ పాండే వెర్సస్‌ ప్రేమ్‌చంద్ర పాండే (2002) కేసుల్లో పేర్కొంది. అయితే సుప్రీం యూసీసీ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చిందే తప్ప చట్టసభల పరిధిలో జోక్యం చేసుకోలేదు. దేశ ప్రజలందరికీ యూసీసీని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని 2014లో దిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచి కొట్టేసింది. దేశ పౌరులందరికీ వర్తించే యూసీసీని తీసుకురావాలా వద్దా అనే అంశంపై పార్లమెంటు, శాసనసభలకే అంతిమ అధికారం ఉందని రాజ్యాంగం స్పష్టం చేయడమే దీనికి కారణం.  

భావి కార్యాచరణ

యూసీసీ ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి దీని రూపకల్పనలో పార్లమెంటు, శాసనసభలు సహకరించుకోవాలి. యూసీసీపై చట్టం చేయదలిస్తే అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ప్రజాతంత్ర, లౌకిక విలువలను ప్రతిబింబించాలి. సమానతా సూత్రానికి పట్టం కట్టాలి. ప్రతి మతంలోని మానవతా విలువలను శిరసా వహించాలి. కుల, మత, ప్రాంతీయ, లైంగిక భేదాలకు అతీతంగా ఉండాలి. సామాజికంగా, భావోద్వేగపరంగా సంఘీభావాన్ని పెంపొందించాలి. మానవ హక్కులకు పట్టం కట్టాలి. మతపరమైన విలువలకు, రాజ్యాంగ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తితే రాజ్యాంగం ప్రబోధించిన నైతికతనే శిరోధార్యంగా స్వీకరించాలి. ఇంతవరకు మతపరంగా వివిధ ‘పర్సనల్‌ లా’లను అనుసరిస్తున్న ప్రజలు లౌకిక, ప్రజాతంత్ర విలువలను, సూత్రాలను పాటించేలా యూసీసీ ఉమ్మడి వేదికగా నిలవాలి. భారత్‌ ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఉండాలి. వివిధ మతాల వైయక్తిక చట్టాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి, ఆయా మతాలవారిని భాగస్వాములుగా తీసుకుని, వారితో లోతైన చర్చలు జరపాలి. విశాల అంగీకారాన్ని సాధించిన తరవాతనే యూసీసీ రూపకల్పనను చేపట్టాలి. అది రాజ్యాంగ విలువలను ప్రతిబింబించాలి. తొందరపాటుకు తావివ్వకుండా ఆచితూచి అడుగులు వేయాలి. యూసీసీని అరకొరగా రూపొందించి హడావుడిగా అమలు చేయాలని చూస్తే అది సామాజిక ఐక్యతను దెబ్బతీస్తుంది. భిన్న వర్గాల మధ్య చిచ్చు పెడుతుంది. ఇలాంటి అవాంఛనీయ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాల్సిందే!

రాజ్యాంగం కల్పించిన అధికారం

అన్ని మతాల వైయక్తిక చట్టాలూ మహిళల పట్ల దుర్విచక్షణ చూపుతాయనేది నిర్వివాదాంశం. అది రాజ్యాంగం ప్రవచించే పౌరుల సమానతా హక్కుకు వ్యతిరేకం. 44వ రాజ్యాంగ అధికరణ భారతదేశమంతటా పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని అమలు చేయడానికి ప్రభుత్వం పూనిక వహించాలని నిర్దేశిస్తోంది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి వ్యక్తిగత అంశాల్లో యూసీసీని తీసుకురావడానికి 246(2) రాజ్యాంగ అధికరణ పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు అధికారమిస్తోంది. ఇది ఉమ్మడి జాబితాలోని అంశమే అయినా కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ యూసీసీని తీసుకురావడానికి చొరవ తీసుకోలేదు. భారతదేశంలో గోవా, దమన్‌ దీవ్‌ ప్రాంతాల్లో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉంది. పోర్చుగీస్‌ వలస పాలకులు తెచ్చిన యూసీసీ అక్కడ ఇప్పటికీ కొనసాగుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవాళికి జలగండం

‣ ద్రవ్యోల్బణ కట్టడికి పటిష్ఠ కార్యాచరణ

‣ ఎరువుల భారం... సేంద్రియ మార్గం!

‣ ఇకనైనా ధరలు దిగివస్తాయా?

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం