• facebook
  • whatsapp
  • telegram

  భూవినియోగం... అయోమయం!

* విధానం లోపించి విపరిణామాలు


    భూమిని మానవులు వినియోగిస్తున్న తీరులో ఉన్న లోపాలు ప్రకృతి విపత్తులకు కారణమౌతున్నాయి. ఏ భూమిని ఏ విధంగా వినియోగించాలనే విధానమే మనకు లేదు. వ్యవసాయ భూముల్లో భవనాలు పుట్టుకొస్తున్నాయి! చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. లేఅవుట్లు వెలుస్తున్నాయి. అడవులు మాయమవుతున్నాయి. పల్లెలు పట్టణాలవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు మారుతున్నాయి. ఈ భూగోళంపై ఉన్న భూమి అయిదోవంతు మాత్రమే. భారత్‌లో 1950-51 సంవత్సరంలో తలసరి భూమి 0.48 హెక్టార్లు (1.18 ఎకరాలు). ఇది కాస్త 2007-08 నాటికి 0.16 హెక్టార్ల(0.39 ఎకరాల)కు పడిపోయింది.


కార్యాచరణ అవసరం
    భూ వినియోగ ప్రణాళికలు తక్షణ అవసరమని కేంద్రప్రభుత్వం 2009లో ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూ సంస్కరణల’ కమిటీ పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ 1988లో జాతీయ భూ వినియోగ విధాన మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. ఈ మార్గదర్శకాలు ఎలాంటి ఫలితాలను సాధించలేదు. 170 దేశాలు అంగీకరించిన ‘సుస్థిర అభివృద్ధి వ్యూహం అజెండా’లో భూవినియోగ ప్రణాళికలు కీలకం. ప్రపంచ దేశాలు 2030 నాటికి సాధించాలని నిర్దేశించుకున్న 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలోనూ భూవినియోగ ప్రణాళికలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భూమి వినియోగం ప్రణాళికాబద్ధంగా లేనట్లైతే ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుంది. జీవనోపాదులకు నష్టం కలుగుతుంది. నీరు, వాయు కాలుష్యం పెరుగుతుంది. జీవవైవిద్యం దెబ్బతింటుంది. పారిశ్రామిక, పర్యావరణ ప్రమాదాలు పెరుగుతాయి. జాతీయ భూ వినియోగ విధానంపై కేంద్రం 2013లో ముసాయిదాను రూపొందించింది. రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా భూ వినియోగ విధానాలు రూపొందించుకోవడానికి మార్గదర్శకంగా ఉండటంకోసం ఈ ముసాయిదా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు, చట్టాలు, ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ మార్గదర్శక సూత్రాల్లో మనుషులు పర్యావరణహితకరమైన విధానాలను అనుసరిస్తూ జీవించడం ప్రధానం. ప్రస్తుత, రాబోయే తరాల ఆర్థిక, సామాజిక, పర్యావరణ అవసరాలను సమతుల్యపరచుకొంటూ అభివృద్ధికి బాటలు వెయ్యాలి. సాధ్యమైనంతవరకు వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలే భూమికి రక్షణ కల్పించాలి. పారదర్శకమైన, సమగ్ర భూ విధానాల రూపకల్పనకు కావలసిన చట్టాలను, విధానాలను రాష్ట్రాలు రూపొందించుకోవాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను, విధానాలను సమన్వయ పరుచుకోవాలి. ఈ ముసాయిదా ప్రకారం దేశాన్ని ఆరు ప్రధాన భూ వినియోగ జోన్లుగా విభజిస్తారు. ఈ జోన్లలో ఉన్న భూమిని నిర్దేశించిన అంశంకోసమే వినియోగించాలి. ఉదాహరణకు, వ్యవసాయ జోన్లు భూమిని ప్రధానంగా సాగుకోసమే వినియోగించాలి. ఈ విధానం అమలు చెయ్యడానికి కేంద్రంలో ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో భూ వినియోగ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలోనూ భూవిధాన కమిటీ ఏర్పాటవుతుంది.
 

ముప్పు తెస్తున్న పద్ధతులు
    ఇప్పుడు ఉన్న చట్టాలకు లోబడే- ఎవరైనా ఫీజు కట్టి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భుమిగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించి ప్రజాప్రయోజనాలకోసం ఏవిధంగానైనా వినియోగించవచ్చు. అటవీ భూమికి హక్కు పత్రం పొంది అడవుల్లో సాగు చేపట్టవచ్చు. పారిశ్రామిక ప్రాంతంలో ఇల్లు కట్టుకోవచ్చు. నివాసాల మధ్య పరిశ్రమలు ఏర్పాటు కావచ్చు. మరోవైపు చట్టవిరుద్ధంగా భూవినియోగం ఎన్నో విధాలుగా మార్పు చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగనిస్తే కల్లోల పరిస్థితులు తప్పవు. కరోనా ముందు ప్రపంచం, కరోనా తరవాత ప్రపంచం ఒకలా ఉండదని నిపుణులంతా చెబుతున్నారు. ఆర్థిక నష్టాన్ని పూడ్చటానికి అభివృద్ధిని మరింత వేగిరం చెయ్యాల్సి ఉంది. అందుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. ఆర్థికాభివృద్ధిని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే ప్రయత్నంలో మళ్ళీ పాత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. పుడమిని కాపాడుకునే ప్రయత్నాలకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటివరకు భూ వినియోగ నిర్ణయాలన్నీ అధిక ఆదాయం కోసమో, వ్యక్తిగత లేదా సంస్థల అవసరాలమేరకో జరుగుతున్నాయి. అలా కాకుండా రాష్ట్ర, దేశ పరిస్థితులను, ఆర్థిక, సామాజిక అవసరాలను, ప్రజల మనుగడను, ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణనను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా నిర్దేశించిన పద్దతిలో భూవినియోగం జరగాలి. అందుకు తగ్గ విధానాలను, చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాలి. వాటిని కఠినంగా అమలు చేయాలి. అప్పుడే భూమికి రక్షణ.


కొనసాగని ప్రయత్నాలు
    భారత దేశ మొత్తం బౌగోళిక విస్తీర్ణం 32.87 కోట్ల హెక్టార్లు. ఇందులో నికర సాగు భూమి 46.1 శాతం, అడవులు 22.8 శాతం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి 8.5 శాతం. బంజర్లు, ‘ఫాలో ల్యాండ్స్‌’, సాగు చెయ్యని భూములు, ఇతర భూములు కలిపి 22.6 శాతం. వ్యవసాయ-పారిశ్రామిక అభివృద్ధికి, పట్టణీకరణకు, ఇతర అన్ని రకాల అవసరాలకు ఈ భూమే ఆధారం. ఇంతటి కీలక అంశంపై మనకు ఒక సమగ్ర విధానమే లేదు. భూవినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు కొంతమేరకు ప్రయత్నాలు జరిగాయి. పట్టణ ప్రాంతాలకు ప్రణాళికల రూపకల్పన; పారిశ్రామిక అభివృద్ధి జోన్లు, సున్నిత పర్యావరణ ప్రాంతాలు, మైనింగ్‌ ప్రాంతాలు, వాటర్‌ షెడ్స్‌, తీరప్రాంత అభివృద్ధి మండలాలు మొదలైనవి ప్రణాళికాబద్ధ భూవినియోగానికి చేసిన కొన్ని ప్రయత్నాలు. 1970 దశకంలో అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సారథ్యంలో భూ వినియోగ బోర్డులను ఏర్పాటు చేశాయి. కానీ ఈ ప్రయత్నాలు ఆశించిన మేరకు కొనసాగలేదు. కాలక్రమేణా కనుమరుగైపోయాయి.
 

 

 ఎం. సునీల్ కుమార్‌
ర‌చ‌యిత‌- భూ చ‌ట్టాల నిపుణులు
నల్సార్ న్యాయ విశ్వ‌విద్యాల‌య 
అనుబంధ ఆచ్యారులు

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం