• facebook
  • whatsapp
  • telegram

కాలుష్యరహిత భారతం... ఎప్పటికి సాధ్యం?

ప్రమాదంలో పర్యావరణం

‘భూమిపై మన అవసరాలకు తగినన్ని వనరులున్నాయి... అత్యాశకు తగినన్ని కావు...’ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రపంచం గుర్తించి, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడానికి చాలాముందే... మహాత్మాగాంధీ చెప్పిన మాటలివి. 1909లోనే ‘హింద్‌ స్వరాజ్‌’ పుస్తకంలో పర్యావరణపరంగా ప్రపంచం ఎదుర్కోబోయే సమస్యల గురించి ప్రస్తావించిన దార్శనికుడాయన. స్వతంత్ర భారత తొలి ప్రధానిగా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1952లో పార్లమెంటులో పర్యావరణ అంశాన్ని లేవనెత్తి, ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఊపందుకొన్నాయి. దాంతో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతూ... ఆందోళనకర స్థాయికి చేరింది. 2030 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో సగభాగం పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తారన్నది ఓ శాస్త్రీయ అంచనా. నగరాల్లో భారీస్థాయిలో పరిశ్రమల విస్తరణ, జనసాంద్రత, వాహనాలు, ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాల వాడకం... ఇవన్నీ కలిసి కర్బన ఉద్గారాలను గణనీయంగా పెంచేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2016నాటి అంచనా ప్రకారం- ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 20 నగరాల్లో పది భారతదేశంలోనే ఉన్నాయి. ఒక ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాములకు మించి పీఎం 2.5 ధూళి కణాలు ఉండకూడదన్నది డబ్ల్యూహెచ్‌ఓ గత ఏడాది నిర్దేశించిన ప్రమాణం. కానీ, 2021 సంవత్సరాంతానికి మన దేశంలో పీఎం 2.5 ధూళి కణాల స్థాయి ఘనపు మీటరుకు ఏకంగా 58.1 మైక్రోగ్రాములకు చేరుకుంది. 2001 నుంచి 2011 మధ్య కాలంలో దేశంలో ఇంధన వినియోగం గణనీయంగా పెరిగింది.

రసాయనాలతో చేటు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే సమయానికి జనాభా సమారు 30 కోట్లుగా ఉండేది. వాళ్లందరి ఆకలి తీర్చడం ఎలా అన్న ప్రశ్న అప్పట్లో తలెత్తింది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా 1960లలో పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో హరితవిప్లవం మొదలై, దేశవ్యాప్తంగా విస్తరించింది. తరవాత అనతికాలంలోనే విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తిని భారత్‌ సాధించింది. ఎడ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. నీటి పారుదల కోసం మోటారు పంపుల వినియోగం పెరిగింది. సేంద్రియ ఎరువుల స్థానే రసాయన ఎరువులు రంగప్రవేశం చేశాయి. వాటితోపాటే పురుగు మందులూ చొరబడ్డాయి. విషపూరిత రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి భూసారం దెబ్బతింది. 1950-51లో దేశవ్యాప్తంగా రైతులు 69 వేల టన్నుల సేంద్రియ ఎరువులు వాడితే, 2006 నాటికి 1.90 కోట్ల టన్నుల రసాయన ఎరువులు వినియోగించారు. గడచిన మూడు దశాబ్దాలుగా పారిశ్రామికీకరణవల్ల ఉపరితల, భూగర్భ జలవనరులు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. వీటిలో యురేనియం, ఆర్సెనిక్‌, క్రోమియం, కాడ్మియం, సీసం లాంటి భారలోహాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ నీటిని తాగితే గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులూ సంభవిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన చాలాకాలం దాకా పరిశ్రమలు పెద్దగా ఏర్పాటుకాలేదు. 1991లో సరళీకరణ సంస్కరణల తరవాత ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. వాటివల్ల నిరుద్యోగ సమస్య కొంతమేర తగ్గినా- కాలుష్య నియంత్రణ ప్రమాణాలను మాత్రం ఈ పరిశ్రమల్లో పాటించిన పాపాన పోలేదు. వ్యర్థాలను శుద్ధిచేసే ప్లాంట్ల ఏర్పాటు ఊసే లేదు. కొన్ని రంగాల పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను జలవనరుల్లోకి వదిలేయడం, వీలుకానిచోట డ్రమ్ముల్లో తీసుకెళ్ళి మరీ గుమ్మరించడం లాంటి ఉదంతాలు నిత్యకృత్యం అయ్యాయి. ఫలితంగా నదులు, కాలువలు రసాయనాలతో నిండిపోయాయి. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి కలుషిత వాయువులతో నీటి ఆవిరి కలిసి ఆమ్లవర్షాలు కురుస్తున్నాయి. వాటి ప్రభావం- శ్వేతవర్ణంలోని తాజ్‌మహల్‌ సైతం పసుపుపచ్చగా మారిపోయేంతగా ఉంది.

కాలుష్య నియంత్రణ కోసం 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేశారు. తొలుత అది జల కాలుష్య నియంత్రణకే పరిమితమైనా, అనంతరం వాయు కాలుష్యాన్నీ దాని పరిధిలో చేర్చారు. తరవాతి కాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ఏర్పడ్డాయి. కాలుష్యం ఏ రూపంలోనూ పరిమితికి మించి వెలువడకుండా చూడటమే వాటి ప్రధాన విధి. నేటికీ అవి లక్షిత ప్రయోజన సాధన కోసం సక్రమంగా పని చేయడంలేదు. తోళ్ల శుద్ధి లాంటి పరిశ్రమల నుంచి అత్యంత తీవ్రస్థాయిలో కాలుష్యం వెలువడుతున్నా ఈ మండళ్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. భూగర్భ జలాలు విషతుల్యమై, అసలు వాడకానికే పనికిరాకుండా పోతున్నాయి. అందుకు కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు బహు స్వల్పం. ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఈటీపీ) లేనిదే కొన్నిరకాల పరిశ్రమలకు అనుమతులే ఇవ్వకూడదని నిబంధనలున్నాయి. అవేమీ లేకుండానే పుట్టగొడుగుల్లా పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయంటే- అందుకు కాలుష్య నియంత్రణ మండళ్ల నిష్క్రియాపరత్వమే ప్రధాన కారణం.

హరిత ట్రైబ్యునల్‌తో ఊరట

స్వాతంత్య్రానికి పూర్వం... అంటే 1850ల నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. పర్యావరణ అంశాల కోసం ప్రత్యేక కోర్టులు ఉంటే మంచిదని 1980లలో సుప్రీంకోర్టు భావించింది. 1984 డిసెంబరులో భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉదంతానికి సంబంధించిన భయాందోళనలు ఇంకా దేశ ప్రజల మదిలోంచి పోలేదు. దిల్లీలోని ఓ కంపెనీ నుంచి 1985లో ఓలియం వాయువు విడుదలై ఒకరు మరణించారు. ఆ ఘటనపై సుప్రీంకోర్టు 1986లో తీర్పు వెలువరించింది. అప్పుడే హరిత ట్రైబ్యునల్‌ అవసరాన్ని నొక్కిచెప్పింది. ఎట్టకేలకు 2010 జూన్‌లో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. వాయు, జలకాలుష్యం, అటవీ సంరక్షణ, పారిశ్రామిక ప్రమాదాల్లో బాధితులకు పరిహారం ఇప్పించడం లాంటి కేసులను ఇది విచారిస్తూ- క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఏడున్నర దశాబ్దాల కాలంలో విచ్చలవిడిగా పరిశ్రమలు రావడం, పట్టణీకరణ ఊపందుకోవడం, వాహనాలు పెరగడం లాంటి పరిణామాలతో కాలుష్యం ఇంతలంతలైంది. దాన్ని అదుపు చేయడానికి మనం రూపొందించుకున్న లక్ష్యాలను మనమే చేరుకోలేకపోవడం విచారకరం. కనీసం స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల నాటికైనా ప్రజలను కాలుష్యభూతం బారి నుంచి కాపాడే పటిష్ఠ కార్యాచరణను ప్రభుత్వాలు పట్టాలకెక్కించాలి.

శిలాజ ఇంధనాలతో ముప్పు

పెరుగుతున్న జనాభా అవసరాల కోసం విద్యుదుత్పత్తిని పెంచాల్సి వచ్చింది. మన దేశం ఎక్కువగా థర్మల్‌ విద్యుత్తుపైనే ఆధారపడుతోంది. ఇందులో బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలను మండించి నీరు వేడి చేసి, దాన్నుంచి వచ్చే ఆవిరితో టర్బైన్లను నడిపిస్తారు. కానీ, బొగ్గును మండించినప్పుడు వెలువడే పొగలో అనేక కలుషిత పదార్థాలుంటాయి. ఇవి భూతాపానికి కారణమవుతున్నాయి. అందుకే థర్మల్‌ విద్యుత్తును 2070నాటికి ఆపివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయంగా సౌర, పవన, జల, అణు విద్యుత్తు ఉన్నా- ఆ దిశగా అడుగులు వేగంగా పడటంలేదు. పెట్రోలు, డీజిలు వినియోగాన్ని తగ్గించాలంటే విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని కొంతమేరకైనా నియంత్రించగలం.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ

 

 


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం