• facebook
  • whatsapp
  • telegram

నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

 

 

పవిత్ర గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ పథకానికి ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న పది మేటి జీవవైవిధ్య పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఒకటిగా ఈ పథకం నిలిచింది. ఐరాస పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ పురస్కారం వరించడంతో- గంగానది శుద్ధీకరణకు నిధులు, సాంకేతిక సహకారం అందే వీలుంది. ఈ స్ఫూర్తితో మిగతా నదులనూ సంరక్షించుకోవాలి.

 

గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. 2,500 కిలోమీటర్ల పొడవున్న ఈ నదితోపాటు, దీని ఉప నదుల్లోకి పెద్దయెత్తున చేరుతున్న కాలుష్యాన్ని నిలువరించాలని ప్రభుత్వం లక్షించింది. భారతీయులు దైవంగా పూజించే ఈ జీవనదిని స్వచ్ఛంగా మార్చడంతోపాటు- నది పరిసరాల్లో పచ్చదనం పెంపొందించడం ద్వారా పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చాలని యోచించింది. ఇందుకు రూపొందించిన ‘నమామి గంగే’ పథకాన్ని ఐరాస ప్రశంసించింది. కెనడాలోని మాంట్రియల్‌లో గత నెలలో జరిగిన 15వ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌-15) సదస్సులో నమామి గంగే డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్‌కు ‘యూఎన్‌ వరల్డ్‌ రెస్టోరేషన్‌ ఫ్లాగ్‌షిప్‌’ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

 

పెరిగిన జల నాణ్యత

గంగానది ప్రక్షాళన పనులకు ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.10,792 కోట్లు వెచ్చించిందని అంచనా. మొత్తం 230 సంస్థల సహకారంతో 1,500 కిలోమీటర్ల మేర నదిని శుద్ధిచేయగా, ఈ క్రతువులో భాగంగా కొత్తగా కోటిన్నర ఉద్యోగాలు కల్పించారని గణాంకాలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ నదీజలాల నాణ్యత పెరిగిందని, పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా నిలువరిస్తుండటం వల్ల స్నాన ఘట్టాల వద్ద పరిస్థితి మెరుగుపడిందని పలు శాస్త్రీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. నదిని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేందుకు ఇంకా పెద్ద మొత్తంలో నిధులు, మరింత సమయం వెచ్చించాల్సిందే. కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ నానాటికీ నీటి నాణ్యత తీసికట్టుగా మారుతున్న నదులు దేశంలో అనేకం ఉన్నాయన్నది కఠోర వాస్తవం. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ 23 రాష్ట్రాల్లో కాలుష్య కోరల్లో చిక్కుకున్న 13 నదులను గుర్తించింది. కొన్ని హిమాలయ నదులతోపాటు యమున, బ్రహ్మపుత్ర, నర్మద, గోదావరి, మహానది, కృష్ణ, కావేరి తదితర నదుల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.1,900 కోట్ల ప్రతిపాదనలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. కొన్నేళ్లుగా ఈ పనులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి.

 

గంగానది శుద్ధీకరణలో భాగంగా నీటి ఉపరితలంపై పేరుకున్న చెత్తను తొలగించడంతో పాటు అవసరమైన చోట్ల జలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లో జీవవైవిధ్య సంరక్షణ, మొక్కల పెంపకం చేపడుతూ, నదిని సంరక్షించుకోవడం పట్ల ప్రజలకు అవగాహన పెంపొందిస్తున్నారు. మిగతా నదుల విషయంలోనూ ఇలాంటి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా, ఆ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధుల్లోని ఇతర నదులను కాపాడుకునేందుకు చిత్తశుద్ధితో నడుం బిగిస్తేగానీ వాటి శుద్ధీకరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు!

 

తెలుగు రాష్ట్రాల్లో అధ్వానం

తెలుగు రాష్ట్రాల్లోని నదుల దుస్థితి మరీ తీసికట్టుగా ఉంది. కాలుష్య నియంత్రణ మండళ్లు గతంలో కృష్ణా, గోదావరి నదుల నీటి నమూనాను పరీక్షించి ఇవి తాగడానికి ఏమాత్రం పనికిరావని తేల్చేశాయి! వీటిలో కోలిఫామ్‌ బ్యాక్టీరియా అధిక మోతాదులో ఉందంటూ ప్రమాద ఘంటికలు మోగించాయి. ఈ నదుల తీరప్రాంతాల్లో అనేక పట్టణాలు అభివృద్ధి చెందగా, ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు యథేచ్ఛగా కృష్ణా, గోదావరి నదుల్లో కలుస్తున్నా- కాలుష్య నియంత్రణ మండళ్లు నోరు మెదపడంలేదు. దాంతో ఈ నదులు మరింతగా కలుషితం అవుతున్నాయి. ఈ నదుల వద్ద కనీసం తగినన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలనైనా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీనదిని సమూలంగా ప్రక్షాళించి, పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. ఇందుకు ప్రతిపాదనలు తయారుచేసినా ఆచరణ మాత్రం ఊపందుకోలేదు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర, కుందు, నాగావళి నదులు అత్యంత కాలుష్యమయంగా మారాయని పార్లమెంటు వేదికగా గతంలో కేంద్ర జలశక్తి అభియాన్‌ మంత్రి స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగు నీరందించే జల వనరులు కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం ఎంతో ఆందోళన కలిగించే అంశం. నమామి గంగే పథకం స్ఫూర్తితోనైనా దేశంలోని మిగిలిన అన్ని నదులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకుకదలాలి!

 

- గుండు పాండురంగశర్మ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జపాన్‌లో జనాభా సంక్షోభం

‣ మితిమీరిన ఎరువులతో నేల నిస్సారం

‣ అటు సవాళ్లు... ఇటు అవకాశాలు!

‣ ఆర్మీనియాతో ఉభయతారక బంధం

‣ న్యాయవ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

‣ డిజిటల్‌ ప్రపంచంలో కొత్త వాణిజ్యం

‣ ఉక్రెయిన్‌పై యుద్ధంలో భారత్‌ ఎటు?

Posted Date: 13-01-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం