• facebook
  • whatsapp
  • telegram

మితిమీరిన ఎరువులతో నేల నిస్సారం

భూమిపై జీవజాలం పోషణకు ఆధారమైన నేలలు నానాటికీ నిస్సారమవుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం, అస్తవ్యస్త వ్యవసాయ పద్ధతులు సాగుభూమి ఆరోగ్యాన్ని, ఆహార నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా విపరీత పరిణామాలు ముమ్మరిస్తున్నాయి.

ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) లెక్కల ప్రకారం మానవాళికి అవసరమయ్యే ఆహారం, పోషకాలలో 99శాతం నేలల నుంచే లభిస్తున్నాయి. వస్త్రాలు, ఔషధాలు వంటి వాటి ఉత్పత్తికీ భూమే ఆధారం. మానవాళి ఆరోగ్యం, అందరికీ సరిపడా ఆహారోత్పత్తి, ఆకలి కేకలను నియంత్రించడం వంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాకారం కావాలంటే సారవంతమైన నేలలు అత్యావశ్యకమని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటించింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన దుర్వినియోగం, నిర్లక్ష్యం కారణంగా సాగు భూముల సారం నానాటికీ తెగ్గోసుకుపోతోంది. ఫలితంగా ఉత్పాదకత తరిగిపోయి ఆహార అభద్రత ముప్పు ముమ్మరిస్తోంది. సాగుభూముల నాణ్యత దెబ్బతినడం వల్ల పోషకాహార లోప వ్యాధులు సైతం పట్టి పీడిస్తున్నాయి.

ఆహార అభద్రత

పంటల ఎదుగుదలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు ప్రాథమికంగా నేల నుంచే అందుతాయి. నత్రజని ధాతువు నేలలోని సేంద్రియ పదార్థాలతోపాటు రైజోబియం, అజటోబాక్టర్‌ వంటి సూక్ష్మ జీవుల ద్వారా భూమిలో స్థిరీకరణ పొంది మొక్కల వేళ్లకు అందుతుంది. మైకోరైజా వంటి కొన్ని రకాల సూక్ష్మజీవులు భూమిలోని భాస్వరం, పొటాష్‌, జింకు వంటి ధాతువులను మొక్కల వేళ్లకు చేరవేస్తాయి. రైతులు పొలానికి వేసే ఎరువుల్లో నత్రజని- మొక్కలు నేరుగా సంగ్రహించలేని ఎమైడ్‌ రూపంలో ఉంటుంది. నేలలోని సూక్ష్మజీవులు దాన్ని మొక్కల సంగ్రహణకు అనువైన అమ్మోనియా, నైట్రేట్‌ రూపాల్లోకి మారుస్తాయి. రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకం వల్ల నేలలోని సూక్ష్మ జీవుల సాంద్రత తగ్గిపోతోంది. పోషక ధాతువుల సమతుల్యత దెబ్బతింటోంది. మొత్తంగా నేల సహజ స్వభావం నాశనమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా గత అయిదు దశాబ్దాల్లో ఒక హెక్టారు పంటభూమికి వినియోగించే రసాయన ఎరువుల పరిమాణం 16.6 కిలోల నుంచి 209 కిలోలకు పెరిగినట్లు పరిశీలనలు చెబుతున్నాయి. మరోవైపు ఎరువులను నేల వినియోగించుకొనే సామర్థ్యం మాత్రం గణనీయంగా తగ్గింది. అధిక మోతాదులో వాడే రసాయన ఎరువులు, పురుగు మందులు, అశాస్త్రీయ సాగునీటి వాడకం, నేలకోత వల్ల భూసారం తగ్గి, నేల ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 33శాతం మేర పంట భూములు సారం కోల్పోయినట్లు ఎఫ్‌ఏఓ గతంలోనే తేల్చి చెప్పింది. నేలల్లో నత్రజని ధాతువు వినియోగ సామర్థ్యం గత 50 ఏళ్లలో 44శాతానికి తగ్గిపోయింది. 33శాతం పంట భూముల్లో భాస్వర ధాతులోపం ఉన్నట్లు పరిశీలనలు నిర్ధారించాయి. నేలల్లో పొటాషియం నిల్వలు సైతం క్రమంగా సన్నగిల్లుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయన ఎరువులను వాడటం వల్ల నేలలో ఆమ్లత్వం పెరిగి పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు నేల కింది పొరల్లోకి కొట్టుకుపోతున్నాయి. ఈ పోషక లోపాల ప్రభావం ఆహార భద్రతకు ముప్పుగా పరిణమించింది. ఆహార నాణ్యత సైతం క్రమంగా దెబ్బతింటోంది. ఆ ప్రభావం మానవుల ఆరోగ్యంపై పడుతోంది. ఉదాహరణకు, ఇనుము ధాతులోపం ఉండే నేలలో పండించే ఆహారధాన్యాలు తినేవారిలో రక్తహీనత ముమ్మరిస్తోంది. ఇలాంటి పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది తీవ్ర పోషక లోపాల బారిన పడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగేళ్ల కిందటే హెచ్చరించింది.

పక్కాగా భూసార పరీక్షలు

నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి, మట్టి రేణువుల నుంచి పోషకాలు కరిగించడానికి, భూమిలో నీరు, పోషకాల నిల్వకు సేంద్రియ కర్బనం అత్యావశ్యకం. దీని తరుగుదల వల్ల పంటభూములు బీళ్లుగా మారుతున్నాయి. ఈ తరుణంలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించే సాగు విధానాలపై రైతులు దృష్టి సారించాలి. ఇందుకోసం పంటల వ్యర్థాలను కుళ్ళించి నేలలో కలియదున్నవచ్చు. పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల్ని వాడటం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి. అంతర పంటల సాగుతో పాటు పంట మార్పిడి విధానాన్నీ పాటించాలి. దానివల్ల భూసారం పెరగడంతో పాటు నేల కోత సైతం నియంత్రణలోకి వస్తుంది. పట్టణాల్లో సేంద్రియ వ్యర్థాలను సేకరించి, విలువైన ఎరువుగా మార్చి పంట భూములకు వినియోగిస్తే ఉత్పత్తి వ్యయం దిగివస్తుంది. నేల ఆరోగ్యమూ పెంపొందుతుంది. ఈ చర్యల వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి సుస్థిర దిగుబడులు సాధ్యమవుతాయి. సాగులో ఎంత మోతాదులో రసాయన ఎరువులను వినియోగించాలో నిర్ధారించడానికి భూసార పరీక్షలు తోడ్పడతాయి. వాటిని పక్కాగా నిర్వహించి, ఆ ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును రైతులకు సిఫార్సు చెయ్యాలి. రసాయన ఎరువుల విపరీత వినియోగం వల్ల తలెత్తే సమస్యలపై అన్నదాతలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యతా ప్రభుత్వాలపై ఉంది.

- ప్రొఫెసర్‌ పి.గురుమూర్తి

(నేలల విజ్ఞాన శాస్త్ర విభాగాధిపతి, వ్యవసాయ కళాశాల, నైర, శ్రీకాకుళం జిల్లా)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీఎస్టీ సరళీకరణకు సమయమిది

‣ చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

‣ డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

Posted Date: 07-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం