• facebook
  • whatsapp
  • telegram

జీఎస్టీ సరళీకరణకు సమయమిది

నిర్ణీత సమయం దాటిపోయినా కొంతకాలంగా భేటీకి దూరంగా ఉన్న జీఎస్టీ మండలి త్వరలో సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా పన్ను శ్లాబుల సరళీ కరణకు ఇది కీలక తరుణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జీఎస్టీ మండలి సమావేశం కావాలి. గతంలో చండీగఢ్‌లో సమావేశమైన తరవాత అయిదున్నర నెలలు గడచిపోయినా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి భేటీ కాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. సమావేశం ఆలస్యం కావడంపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. జీఎస్టీకి సంబంధించి ఏడాది కాలంగా రెండు మంత్రుల స్థాయి బృందాల (జీఓఎం) వద్ద పెండింగులో ఉన్న సమస్యలను ఏకాభిప్రాయంతో పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అమిత్‌ మిత్రా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. చివరకు ఈ నెల 17న 48వ జీఎస్టీ మండలి సమావేశం జరగనుండటంతో అనిశ్చితికి తెరపడింది. ఈ సమావేశం పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో కొనసాగనుంది.

పన్ను చెల్లింపుదారుల తికమక

జీఎస్టీ చట్టం కింద ప్రస్తుతం నేరాలుగా పరిగణిస్తున్న వాటిలో కొన్నింటిని ఆ పరిధి నుంచి తప్పించే విషయమై మండలి చర్చిస్తుందని భావిస్తున్నారు. మండలి తీసుకునే నిర్ణయాలు రాబోయే కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలుగానూ మారవచ్చు. ప్రస్తుతం అయిదు కోట్ల రూపాయలకు మించి ఇన్‌పుట్‌ పన్ను క్రెడిట్లను దుర్వినియోగం చేసినా, పన్ను ఎగవేతకు పాల్పడినా వారిపై అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించవచ్చు. రాబోయే సమావేశంలో ఆ పరిమితిని రూ.20 కోట్లకు పెంచే అవకాశం ఉంది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) పరిధిలోకి వచ్చే నేరాలను జీఎస్టీ చట్టం పరిధి నుంచి తప్పించవచ్చు.

జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునళ్ల ఏర్పాటు, క్యాసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై జీఎస్టీ రేటు నిర్ణయించడంపై రెండు జీఓఎంలు ఇచ్చిన నివేదికపైనా మండలి చర్చిస్తుందంటున్నారు. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణపై ఒక జీఓఎం జూన్‌లో సమర్పించిన నివేదిక సైతం చర్చకు రానుంది. జీఎస్టీ అధికారుల ఉత్తర్వులపై అప్పీళ్లను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ విచారిస్తుంది. రూ.50 లక్షల వరకు జీఎస్టీకి సంబంధించిన కేసులపై అప్పీళ్లను ఏక సభ్యుడు విచారిస్తారు. అంతకు మించిన అప్పీళ్లను డివిజన్‌ బెంచి విచారిస్తుంది. హైకోర్టుల్లో చాలా కేసులు పెండింగులో ఉన్నందువల్ల అప్పిలేట్‌ ట్రైబ్యునళ్ల అవసరం ఏర్పడింది.

జీఎస్టీ చట్టం పూర్తిగా కొత్తది కావడం వల్ల దాని అన్వయం, వస్తుసేవల వర్గీకరణ, పన్ను రేట్లపై వివాదాలు తలెత్తాయి. ఆన్‌లైన్‌ క్రీడలు అదృష్టం లేదా నైపుణ్యం దేనిపై ఆధారపడినా, అన్నింటికీ 28శాతం జీఎస్టీ విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల స్థాయి బృందం (జీఓఎం) సిఫార్సు చేసింది. ఆ పన్నును గేమింగ్‌ పోర్టల్‌ వసూలు చేసిన ఫీజుపైనే విధించాలా లేక గేమర్‌ చెల్లించిన పందెం మొత్తంతోపాటు విజేత గెలిచిన మొత్తాలపైనా పన్ను వేయాలా అనేదానిపై స్పష్టత లేదు. జీఓఎం దీన్ని జీఎస్టీ మండలి పరిశీలనకు నివేదించింది. ఈ అంశాన్ని ఎటూ తేల్చకుండా నానబెట్టడం వల్ల గేమింగ్‌ పరిశ్రమలో అనిశ్చితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మొత్తం గేమింగ్‌ ఆదాయంపై పన్ను విధిస్తున్నారని, భారత్‌ సైతం అదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య బీమా ప్రీమియాలపై ప్రస్తుతం విధిస్తున్న 18శాతం జీఎస్టీనీ తగ్గించాలన్న డిమాండు వినిపిస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా, ప్రయోజనకరంగా చట్టంలో పలు మార్పుచేర్పులు చేసే అంశాన్ని జీఎస్టీ మండలి చర్చిస్తుంది.

జీఎస్టీలో పలు రకాల రేట్లు ఉండటంతో తమ వస్తుసేవలు ఏ శ్లాబులోకి వస్తాయో తెలియక పన్ను చెల్లింపుదారులు తికమకపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తోంది. దానిపై వ్యాజ్యాలు తలెత్తుతున్నాయి. ఈ చిక్కులను తొలగించి, మరింతమందిని పన్ను చెల్లింపుదారులుగా మార్చడానికి జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం గుర్తించింది. దానిపై 2021 సెప్టెంబరు 24న జీఓఎంను ఏర్పాటు చేసింది. జీఎస్టీ కింద పేరుకు 5, 12, 18, 28శాతం పన్ను శ్లాబులు ఉన్నా- వాస్తవంలో ప్రత్యేక రేట్లనూ కలుపుకొంటే శ్లాబులు 10కి పైనే లెక్కతేలుతాయి. వాటిని సరళీకరించాల్సిన సమయం వచ్చింది.

రేట్లు దిగివస్తే...

కొవిడ్‌ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వ్యాపారాలకు అధిక పన్నులు, అనేకానేక సుంకాలు ఇబ్బందికరంగా మారాయి. చిన్న వ్యాపారాలకు ఎప్పుడూ నిర్వహణ మూలధనానికి కొరతే కాబట్టి సకాలంలో పన్నులు చెల్లించలేక, తరవాత వడ్డీతో సహా వాటిని కట్టాల్సి వస్తోంది. దానివల్ల చిన్న పరిశ్రమలు, వ్యాపారాల నుంచి సరకులు, సేవలు కొనుగోలు చేసే పెద్ద సంస్థలు ఇన్‌పుట్‌ క్రెడిట్లు పొందలేకపోతున్నాయి. ఫలితంగా అవి చిన్న సంస్థలకు చెల్లింపులు జరపలేవు. పన్ను రేట్లు దిగివస్తే చిన్న వ్యాపారాలు సకాలంలో పన్నులు కట్టగలుగుతాయి. సాధారణ ప్రజానీకం వినియోగించే నిత్యావసర సరకులు, సేవలను మినహాయించి మిగిలిన వస్తుసేవలపై మూడు శ్లాబుల్లో జీఎస్టీని ఖరారు చేయడం అవసరం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ మండలి పన్నుల వ్యవస్థలో సంక్లిష్టతలను తొలగించి మరింత సమర్థంగా వ్యవహరించాలి.

భారీగా ఆదాయం

జీఎస్టీ చట్టాన్ని 2017లో ప్రవేశపెట్టిన తరవాత నుంచి పన్నుల యంత్రాంగం డిజిటలీకరణ చెందింది. ఆర్థిక వ్యవస్థలో సంఘటిత వ్యాపారాల నమోదు పెరిగి ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరిగింది. 2017లో 65 లక్షలుగా ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రస్తుతం 1.38 కోట్లకు చేరుకుంది. నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.46 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం వసూళ్లు గత ఏడాదికన్నా 11శాతం పెరిగాయి. గత తొమ్మిది మాసాల నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లకు మించుతున్నాయి. పెద్ద వ్యాపారాలు, పరిశ్రమల నుంచి కొనుగోళ్లు జరిపే చిన్న సంస్థలు తమకు తాముగా జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నాయి. ఫలితంగా అవి ఇన్‌పుట్‌ పన్ను క్రెడిట్లను పొందగలుగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రత్యక్ష పన్ను వసూళ్లను రికార్డు స్థాయికి తీసుకెళ్ళాయి. జీఎస్టీ చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని భారత పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (సీఐఐ) సూచిస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చమురు తెట్టు... జీవావరణానికి గొడ్డలిపెట్టు

‣ డాలరు స్థానాన్ని యువాన్‌ ఆక్రమిస్తుందా?

‣ డేటా వినియోగంలో భారత్‌ దూకుడు

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 17-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం