• facebook
  • whatsapp
  • telegram

జపాన్‌లో జనాభా సంక్షోభం

జననాల తగ్గుదలతో జపాన్‌ తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టోక్యో తదితర నగరాలు వలసలతో కిక్కిరిసిపోతుంటే, యువత జాడలేక గ్రామాలు బోసిపోతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య జనాభా సమతౌల్యం సాధించడంతో పాటు దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను నవతరంతో పరిపుష్టం చేయడం జపాన్‌కు సవాలుగా మారింది.

రాజధాని టోక్యోను వీడి దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడే యువ జంటలకు ఒక్కో బిడ్డకు సుమారు రూ.6 లక్షల (పది లక్షల యెన్‌ల) చొప్పున నజరానా అందిస్తామని జపాన్‌ సర్కారు తాజాగా ప్రకటించింది. టోక్యోతో పాటు సైతామా, చిబా, కనగావా నగరాలకు పెరుగుతున్న వలసలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని పక్కాగా అమలుచేసే స్ఫూర్తితో- కొత్త ప్రాంతాలకు వెళ్ళేవారు అక్కడ కనీసం అయిదేళ్లు నివాసం ఉండాలన్న నిబంధన విధించింది. నిజానికి ఇలాంటి పథకం ఇప్పటికే అమలవుతోంది. ఈ నగరాల నుంచి మకాం మార్చేవారికి పునరావాస సాయంగా సుమారు రూ.2 లక్షలు అందిస్తున్నారు. ఇప్పుడు దీన్ని మూడింతలు చేయడం వెనక ఎంతో ముందుచూపు ఉంది.

జపాన్‌ జనసంఖ్య 2022 గణాంకాల ప్రకారం సుమారు 12.39 కోట్లు. ఇందులో ఒక్క టోక్యోలోనే రమారమి 30 శాతం (3.70 కోట్ల జనాభా) నివసిస్తున్నారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ పెద్దసంఖ్యలో యువత టోక్యో, సైతామా, చిబా, కనగావాలకు చేరుకుంటున్నారు. దాంతో ఆ నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. జనం తరలిపోతుండటంతో గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా పట్టణవాసులు, గ్రామీణుల ఆదాయవ్యయాలు, ఆర్థిక స్థితిగతుల్లో అంతరాలు పెరుగుతున్నాయి. జపాన్‌ జనాభా 14 సంవత్సరాలుగా ఏటికేడు తగ్గుతూ వస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే 2060 నాటికి జనసంఖ్య 8.67 కోట్లకు పడిపోతుందని అంచనా! గర్భధారణ మొదలు పిల్లల్ని కనిపెంచడం వరకు అయ్యే ఖర్చుల్లో ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నా జనాభా పెరగడంలేదు. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న జపాన్‌లో జీవన వ్యయం ఎక్కువ. ముఖ్యంగా పట్టణాల్లో వస్తున్న ఆదాయం ఏమూలకూ సరిపోవడం లేదు. ఖర్చులు పెరుగుతున్నా, వేతనాలు మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. కొత్త ఉద్యోగం దొరకడమూ గగనమవుతోంది. ఆలుమగలు కష్టపడినా తమ కాళ్లపై తాము నిలబడటమే ఒక సాహసంగా మారింది. దాంతో పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, కుటుంబాన్ని పోషించడం తమ వల్ల కాదన్న భావన యువతలో పాతుకుపోయింది.

దేశంలో యువజనాభా అంతకంతకు కుంచించుకుపోతుండగా, వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో మానవ వనరులు కొరవడితే ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. దాంతో దేశార్థికానికి ఒడుదొడుకులు తప్పవు. మరోవైపు జగడాలమారి చైనా దుందుడుకు వైఖరి కారణంగా జపాన్‌ తన దేశ రక్షణను పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరముంది. ఇందుకు యువత భాగస్వామ్యం కావాలి. జనరాశిని పెంచుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ ఆశాజనక ఫలితాలను ఇవ్వలేదు. ఇందుకు దారితీస్తున్న కారణాల అన్వేషణకు ఏర్పాటైన కమిటీ ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై సమీక్షించిన మీదట టోక్యోను వీడే కుటుంబాలకు పునరావాస ప్రోత్సాహకాన్ని పెంచి ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది.

టోక్యో మెట్రోపాలిటన్‌ ప్రాంతానికి వచ్చీపోయేవారి సంఖ్యను 2027 నాటికి సమం చేయాలని జపాన్‌ లక్ష్యంగా పెట్టుకొంది. చిన్న పట్టణాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చన్న యోచనతో ఒక నిర్ద్దిష్ట విధానాన్ని రూపొందించింది. దాని ప్రకారం- ప్రధాని కిషిద మానస పుత్రిక వంటి పథకమైన ‘డిజిటల్‌ గార్డెన్‌ సిటీ నేషన్‌’ను విస్తృతంగా అమలుచేస్తారు. 2023 నుంచి అయిదేళ్లపాటు అమలుచేసే ఈ పథకం ద్వారా చిన్న పట్టణాల్లో శాటిలైట్‌ కార్యాలయాలను తెరుస్తారు. ఆధునిక మౌలిక వసతులనూ సమకూరుస్తారు. దీంతో టోక్యో వంటి నగరాల నుంచి యువత తమ సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మెట్రోనగరాలకు వెళ్ళదలచినవారూ తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. సొంత ప్రాంతాల్లో ఖర్చులు తక్కువే కాబట్టి వారి ఆదాయంలో మిగులు కనిపిస్తుంది. పిల్లల చదువులు, పెంపకానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం కొంతమేర భరిస్తున్నందు వల్ల వివాహం చేసుకోవాలన్న తలంపు వారికి కలుగుతుంది. ఈ వ్యూహం ఫలిస్తే జనాభా తగ్గుదల, వలసల సమస్యను ఎదుర్కొంటున్న దేశాలకు- పరిష్కారం లభించినట్టే!

- టి.రఘుబాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈశాన్యంలో కొత్త కాంతులు

‣ సిరిధాన్యాలతో ఆహార భద్రత

‣ డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

Posted Date: 07-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం