• facebook
  • whatsapp
  • telegram

ఈశాన్యంలో కొత్త కాంతులు

భారత్‌లో దాదాపు ఎనిమిది శాతం భూభాగంతో ఎత్తయిన కొండలు, దట్టమైన అడవులు, నదులు, సహజ వనరులకు ఈశాన్య రాష్ట్రాలు నెలవు. రెండు వందలకు పైగా స్థానిక తెగల ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. దశాబ్దాలుగా మౌలిక వసతులకు ఈశాన్య ప్రాంతం దూరంగా ఉండిపోయింది. ఇటీవలి కాలంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకొన్నాయి.

ఈశాన్య భారతం అభివృద్ధికి సంబంధించి అన్ని అడ్డంకులను తొలగించినట్లు ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పశ్చిమ్‌ బెంగాల్‌లో చికెన్‌నెక్‌గా పిలిచే ఇరుకైన సిలిగుడి కారిడార్‌ ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారత భూభాగంతో అనుసంధానిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడు దశాబ్దాల పాటు ఈశాన్య రాష్ట్రాలన్నీ అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడాయనే చెప్పాలి. 1962 చైనా యుద్ధం తరవాత వాటిపై మన పాలకుల ఆలోచనాధోరణి మారింది. అప్పటి పోరులో చైనా పైచేయి సాధించింది. సరిహద్దు ప్రాంతాలకు రోడ్ల మార్గాల అనుసంధానం లేక భారత ప్రధాన భూభాగం నుంచి యుద్ధసామగ్రి అందడంలో జరిగిన జాప్యమే దానికి కారణమని విశ్లేషకులు చెబుతారు.

తొలగనున్న ఇబ్బందులు

పార్లమెంట్‌ చట్టం ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మండలి ఏర్పాటుతో 70వ దశకంలో ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. 90వ దశకంలో లుక్‌ ఈస్ట్‌ విధానంతో పలు కార్యక్రమాలకు పునాదులు పడినా వనరుల కొరత, తీవ్రవాద కార్యకలాపాలు తదితర కారణాల వల్ల అభివృద్ధి మందకొడిగా సాగింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాలు చురుకందుకొన్నాయి. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.34 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈశాన్యంలో శాంతి, పర్యాటకం, ప్రకృతి వ్యవసాయం, సంస్కృతి, క్రీడలు, 5జీ అనుసంధానత తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

గత ఎనిమిదేళ్లలో ఈశాన్య భారతంలోని విమానాశ్రయాలు తొమ్మిది నుంచి పదహారుకు పెరిగాయి. 2014-19 మధ్య 2731 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను ఆ ప్రాంతంలో నిర్మించారు. అరుణాచల్‌ సరిహద్దు హైవే ఆ రాష్ట్రంలో తూర్పు చివరన ఉన్న చాంగ్లాంగ్‌ జిల్లాలోని విజయనగర్‌ నుంచి పశ్చిమాన తవాంగ్‌ జిల్లాలోని మాగో-థింగ్బూ వరకూ సాగుతుంది. భారతమాల పరియోజనలో భాగంగా 2023 చివరికి ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 90శాతం రోడ్డు అనుసంధానత పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌తో కలిపే అగర్తలా-అఖౌడా రైల్వే ప్రాజెక్టు సైతం ఈ ఏడాదే పూర్తి కానుంది. భారత్‌, మయన్మార్‌ భాగస్వామ్యంతో కోల్‌కతా నౌకాశ్రయాన్ని మయన్మార్‌లోని రఖాయిన్‌ రాష్ట్రంలోని సిత్వే ఓడరేవుతో అనుసంధానించే కలాదాన్‌ మల్టీ మోడల్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ ప్రాజెక్ట్‌ అనేక కారణాల వల్ల జాప్యమవుతోంది. 2024 కల్లా దాన్ని పూర్తి చెయ్యాలని ఇరు దేశాల ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే చికెన్‌నెక్‌ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు, వాటి నుంచి దేశంలో మిగతా ప్రాంతాలకు సరకుల రవాణాకు ఏర్పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం ద్వారా అక్కడ పర్యాటకాభివృద్ధి జోరందుకుంటుందని, సేంద్రియ, ఇతర ఉత్పత్తులకు విపణి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. తద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని విశ్లేషిస్తోంది. భారత్‌లో జరిగే జీ20 సమావేశాల్లో కొన్నింటికి ఈశాన్య రాష్ట్రాలు వేదిక కానున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈశాన్య భారత సంస్కృతిలో ఉన్న వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రపంచానికి చాటడానికి ఈ సమావేశాలు దోహదపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

స్థానికులకు ప్రాధాన్యం

అంతర్జాతీయ సరిహద్దు వివాదాలతో పాటు, వివిధ రాష్ట్రాల మధ్య అంతర్గత, పొలిమేర తగాదాలు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి పెను సవాళ్లుగా మారాయి. స్థానికంగా ఉన్న తెగల మధ్య ఆది నుంచి పొరపొచ్చాలు నెలకొన్నాయి. ఈశాన్యంలోని పలు ప్రాంతాల్లో అమలవుతున్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం స్థానిక యువతలో కొంత అసహనానికి కారణమవుతోంది. అభివృద్ధి పేరుతో సాగుతున్న కార్యకలాపాలు వనరుల దోపిడికి దారితీస్తాయని స్థానికులు భయపడుతున్నారు. ఇతర రాష్ట్రాలు, పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ప్రజల వల్ల తమదైన సంస్కృతి, ఆచార వ్యవహారాలను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులకు పెద్దపీట వేసినప్పుడే ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇరుగు పొరుగుల మధ్య నమ్మకం, సద్భావన స్థిరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పునాదులుగా నిలుస్తాయి. వాటిని మరింత దృఢపరచాల్సిన అవసరం పాలకులపై ఉంది.

- గొడవర్తి శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

‣ పాకిస్థాన్‌పై తాలిబన్‌ తిరుగుబావుటా

‣ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

‣ జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

Posted Date: 06-01-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం