• facebook
  • whatsapp
  • telegram

అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

ఆర్థిక వ్యవస్థ కొంతకాలం ఉన్నత స్థితికి చేరి ఆ తరవాత క్షీణతకు లోనవడాన్ని చక్రభ్రమణం అంటారు. ఈ చక్రీయ ప్రక్రియను 2022 సంవత్సరం మన అనుభవంలోకి తీసుకొచ్చింది. సంవత్సరారంభంలో పెరుగుతున్న ధరలు, వడ్డీ రేట్లు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు ధరలు పడిపోయి ఆర్థిక మాంద్యం వచ్చిపడుతుందా అనే భయాలు రేగుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చైనాలో మళ్ళీ కొవిడ్‌ విజృంభణ, సరఫరా గొలుసుల విచ్ఛిన్నం, ఆహార ధాన్యాలు, చమురు, లోహాల వంటి వ్యాపార సరకుల ధరలు పెరగడం, పెరుగుతున్న వడ్డీరేట్లు, ధరలు... ఇవన్నీ ఈ ఏడాది ప్రపంచార్థికాన్ని అతలాకుతలం చేశాయి. ఉక్రెయిన్‌లో సత్తా చూపలేక రష్యా అగ్రరాజ్య హోదాను కోల్పోతోంది. భారత్‌ కొవిడ్‌ తాకిడి నుంచి 2022లో విముక్తమైనట్లే కనిపించినా చైనా నుంచి మళ్ళీ మహమ్మారి వచ్చిపడుతుందేమోననే ఆందోళన పెరుగుతోంది. సంవత్సరం మొదట్లో రష్యాపై ఆంక్షల వల్ల చమురు సరఫరా పడిపోయి ధరల పెరుగుదలకు కారణమైంది. క్రిప్టోల పతనంతో అధికార కరెన్సీలకు అవి ప్రత్యామ్నాయం కాలేవని తేలిపోయింది. ప్రపంచమంతటా దిగుమతులు పడిపోతున్నాయని, రాబోయే నెలల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుందని ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా. కొవిడ్‌ విజృంభణతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. వచ్చే ఆరు నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర మందగతిలోకి జారిపోనుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినందువల్ల స్థిరాస్తి రంగం దెబ్బతిన్నది. గడచిన పది నెలలుగా కొత్త ఇళ్ల విక్రయాలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. పారిశ్రామికోత్పత్తులకు గిరాకీ పడిపోతుంటే దిగుమతులూ తగ్గిపోతున్నాయి. ఫలితంగా 2023 ప్రథమార్ధంలో అమెరికాలో భారీగా ఉద్యోగ నష్టం సంభవించనున్నది. ఆర్థిక మాంద్యం ఏర్పడినట్లు ఆ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యంత భారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), చైనా మాంద్యం బారిన పడితే వస్తుసేవలకు గిరాకీ తగ్గి ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. 2022లో 8.8 శాతంగా ఉన్న ప్రపంచ ద్రవ్యోల్బణం 2023లో 6.5 శాతానికి, 2024లో 4.1 శాతానికి తగ్గవచ్చు. అంతమాత్రాన ద్రవ్యోల్బణం పూర్తిగా ముగిసిపోతుందనుకోవడానికి వీల్లేదు. సంపన్న దేశాల్లో 2022లో 2.4 శాతంగా ఉన్న ఉత్పత్తి వృద్ధి రేటు 2023లో 1.1 శాతంగా ఉండబోతోంది. యావత్‌ ప్రపంచంలో ఈ రేటు 3.2 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గనున్నది. ప్రపంచంలో అతి పెద్ద ఫండ్‌ మేనేజర్లలో ఆర్థికాభివృద్ధి పట్ల ఆశాభావం సన్నగిల్లింది. 1994లో ఈ మేనేజర్ల సర్వే మొదలైన తరవాత ఎన్నడూ లేనంతగా ఆశాభావ క్షీణత ఈ ఏడాది కనిపించింది. 2008 ఆర్థిక సంక్షోభంలోనూ ఇంత నిరాశ వ్యక్తం కాలేదు.

భారత్‌పై ప్రభావం

అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు భారతదేశంపై కాస్త తక్కువ ప్రతికూల ప్రభావాన్ని ప్రసరించాయి. 2022లో భారత ఆర్థికాభివృద్ధి రేటు అనుకున్నదానికన్నా తక్కువగా నమోదైంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ పెరుగుదల లేకపోతే ఎక్కువ వృద్ధిరేటును సాధించగలిగేది. ద్రవ్య లభ్యత తగ్గుదల, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల 2023 మొదటి ఆరు నెలల్లో భారత్‌ వృద్ధిరేటు తగ్గవచ్చు. ఫలితంగా ఉపాధి అవకాశాలు తగ్గి కొత్తగా ఉద్యోగ మార్కెట్‌లోకి వచ్చే యువత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సంఘటిత రంగంలో ఉపాధి కల్పన రేటు 17 నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిందని భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గణాంకాలు తెలుపుతున్నాయి. దేశార్థికానికి దీర్ఘకాలంలో మేలు చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. ప్రైవేటీకరణ, ప్రైవేటు పెట్టుబడులను నమ్ముకుని కూర్చోవడమే దీనికి కారణం. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చెబుతున్నంత ఆశావహంగా లేదనేది వాస్తవం. కొవిడ్‌ మహమ్మారి ప్రభావం నుంచి దేశార్థికం కొంత కోలుకున్న మాట నిజమే కానీ, ఆర్థికాభివృద్ధి మాత్రం ప్రభుత్వం చెబుతున్నంత అద్భుతంగా లేదు. ముఖ్యంగా కొవిడ్‌ ముందునాళ్ల వృద్ధి రేటును ఇంకా అందుకోలేదు. ఉదాహరణకు 2022లో దేశంలో విద్యుదుత్పాదన 2021కన్నా కాస్త ఎక్కువగానే ఉన్నా, కొవిడ్‌ విరుచుకుపడటానికి ముందు కాలంతో పోలిస్తే మాత్రం తక్కువే. అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థికాన్నీ వెనక్కులాగుతున్నాయి. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత గడ్డు పరిస్థితులను అధిగమించడానికి కావలసిన సంస్కరణలను ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు. పైగా వినియోగదారుల రక్షణకు ఉద్దేశించిన చట్టాలను నీరుగార్చింది. ధనస్వాముల విజృంభణకు అడ్డుకట్ట వేసే చట్టాలను తొలగించింది. 2014 నుంచి ప్రభుత్వం మన ఆర్థిక భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని చెబుతూ వర్తమాన అవసరాలను నిర్లక్ష్యం చేసింది.

2023లో ఎదురయ్యే సమస్యలు

గడచిపోతున్న సంవత్సరంలో ప్రజలను పీడించిన సమస్యలు కొత్త సంవత్సరంలో మాయమైపోతాయని భావించలేం. వడ్డీ రేట్లు పెరగడం వల్ల సరకుల ధరలు దిగివస్తున్నందువల్ల రష్యాకు చమురు ఎగుమతుల ద్వారా లభించే ఆదాయం కోసుకుపోతుంది. దానివల్ల ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం రష్యాకు కష్టమవుతుంది. గత 30 ఏళ్లలో మొదటిసారిగా అమెరికా-చైనా వాణిజ్యం ఎదుగూబొదుగూ లేకుండా స్తంభించిపోయింది. చైనా ఇతర దేశాలకు, ముఖ్యంగా రష్యాకు వాణిజ్యాన్ని విస్తరిస్తోంది. వడ్డీరేట్ల పెరుగుదల వల్ల అమెరికా రుణభారం పెరిగిపోయింది. భారత్‌లో కూడా కేంద్రం, రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు చేశాయి. అయినా ప్రజారోగ్యానికి మాత్రం కేటాయింపులు పెంచలేదు. ప్రపంచంలో వ్యవసాయ వృద్ధి రేటు 1960ల తరవాత ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. దీనివల్ల పోనుపోను వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పెరిగి సామాన్యుడికి భారమవుతాయి. ఏతావతా 2022లో ప్రపంచాన్ని పీడించిన సమస్యలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతాయి. నేటి అనిశ్చితి కొత్త సంవత్సరంలోనూ కొనసాగనున్నది!

బాదుడు తగ్గాలి

భారతీయులు వలస పాలన మనస్తత్వం నుంచి బయటకురావాలంటూ ఉద్బోధించడం దృష్టి మళ్లింపు ఎత్తుగడ తప్ప మరేమీ కాదు. ఆర్థిక వికాస సాధనపై పాలకులకు కొత్త ఆలోచనలు తట్టనప్పుడు ప్రజల మనస్తత్వం మారాలని మాట్లాడుతుంటారని చరిత్ర చెబుతోంది. గతమెంతో ఘనకీర్తి అంటూ వర్తమాన, భవిష్యత్తులను పక్కనపెట్టేస్తుంటారు. భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లడం వల్లనే విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు. రానున్న మూడు నాలుగు నెలల్లో దేశంలో ధరలు కాస్త తగ్గుముఖం పట్టవచ్చు. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలో అదే కాస్త ఊరట కలిగించే అంశం. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల బాదుడును తగ్గిస్తే తప్ప ధరలు దిగిరావు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

‣ జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

‣ పొంచి ఉన్న ఆహార అభద్రత

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Posted Date: 31-12-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం