• facebook
  • whatsapp
  • telegram

పొంచి ఉన్న ఆహార అభద్రత

మానవాళి మనుగడ సాగించడానికి ఆహారం చాలా ముఖ్యం. ఆహారోత్పత్తికి సారవంతమైన నేల అవసరం. జంతు, వృక్షజాలం జీవించడానికీ భూమే ఆధారం. అది ఆరోగ్యంగా ఉండటం అత్యావశ్యకం. పలు కారణాల వల్ల భూసారం క్రమంగా క్షీణిస్తోంది.

భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 29శాతం నేల క్షీణతకు గురైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శతాబ్దాలుగా నిలకడలేని వ్యవసాయ పద్ధతులు, మైనింగ్‌, అటవీ నిర్మూలన భూ క్షీణతకు ప్రధాన కారణాలు. భూసార క్షీణత ఇలాగే కొనసాగితే మరో 60ఏళ్లలో నేల పెద్దమొత్తంలో నిస్సారంగా మారుతుందని శాస్త్రీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఫలితంగా తీవ్రమైన ఆహార అభద్రత తలెత్తుతుంది. ఇది వివిధ జాతుల వినాశనానికి దారితీస్తుంది. దీన్ని అరికట్టడంతోపాటు ఇప్పటికే క్షీణతకు గురైన భూమిని సారవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. ఇందుకు ప్రకృతి అనుకూల ఆహార ఉత్పత్తిని చేపట్టాలి. క్షీణతకు గురైన భూమిని పునరుద్ధరించాలి. వృక్ష సంపదను రక్షించాలి. నేల ఆరోగ్యాన్ని పెంచే పద్ధతులను అవలంబించాలి.

ప్రకృతి వ్యవసాయంతో మేలు

ఈ దశాబ్దం చివరి నాటికి క్షీణతకు గురైన 100కోట్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ఐక్యరాజ్య సమితి సమావేశంలో అన్ని దేశాలు అంగీకరించాయి. భారత్‌ తనవంతుగా 2030 నాటికి 2.6 కోట్ల హెక్టార్ల భూమిని సారవంతంగా మార్చేందుకు కృషి చేస్తోంది. పైగా 2030 నాటికి భూసార క్షీణతను పూర్తిగా అరికట్టాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకొంది. అందుకోసం ఎరువులు, పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ చర్యలతో పాటు సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం వల్ల ప్రకృతి వ్యవసాయం ఏటికేడు పెరుగుతోంది. ఈ విధానం అన్నదాతలను స్థిరమైన వ్యవసాయ పద్ధతులవైపు నడిపిస్తుంది. ప్రకృతి వ్యవసాయం నేలలో సారాన్ని నిలపడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని సాధించడానికి తోడ్పడుతుంది. వ్యవసాయదారుల ఆదాయాన్ని ఇతోధికం చేస్తుంది. దేశంలో అమలు చేస్తున్న ‘సాయిల్‌ హెల్త్‌ కార్డు’ పథకం ఉద్దేశం సైతం భూసార క్షీణతను తగ్గించడమే. ఇది రైతులకు నేల స్థితిని తెలియజేయడంతో పాటు భూసార పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తుంది. నేలలో సారాన్ని పునరుద్ధరించడానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ఒక మార్గం.

ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి సదస్సు (యూఎన్‌సీసీడీ)లకు సంబంధించిన గ్లోబల్‌ ల్యాండ్‌ అవుట్‌లుక్‌ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40శాతం భూమి క్షీణతకు గురైంది. దానివల్ల 50శాతం మానవాళి ప్రభావితమైంది. ఈ క్షీణత వల్ల ప్రపంచ జీడీపీలో సగానికి ముప్పు ఏర్పడింది. 2030 నాటికి 100కోట్ల హెక్టార్ల భూమిని పునరుద్ధరించేందుకు రూ.1.6 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల భారీ విస్తీర్ణంలో వనాలు కనుమరుగయ్యాయి. జనాభా పెరుగుదల, పట్టణాల విస్తరణ, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి వాటివల్లా అడవులు తరిగిపోతున్నాయి. ఫలితంగా వరదలు ముంచెత్తి నేల పైపొర కోతకు గురవుతోంది. భూమిలో సేంద్రియ కార్బన్‌ నష్టం, నేల కోత, ఆమ్లీకరణ, పోషకాల అసమతుల్యత, లవణీకరణ వంటి కారణాలతో నేల సారహీనంగా మారుతోంది. భూసారం తగ్గిపోవడం వల్ల ఆహారంతో పాటు పోషకాహార అభద్రత, పేదరికం, వలసలు వంటి విపరిణామాలు తలెత్తుతాయి.

వర్షాధార భూమే అధికం

శాస్త్రీయ, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) రూపొందించిన భారత వాతావరణ స్థితిగతుల నివేదిక-2022 ప్రకారం దేశ రాజధాని దిల్లీలో 62శాతం భూమి క్షీణతకు గురైంది. ఇండియాలోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో 30శాతం నేల దెబ్బతింది. భారత్‌లో వ్యవసాయ భూమి 46శాతం, అటవీ భూమి 22శాతం మేర సారం కోల్పోయినట్లు అంచనా. 2003-19 మధ్య దేశీయంగా 14 రాష్ట్రాల్లో భూ క్షీణతలో పది శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇది అధికంగా ఉంది. అదే కాలంలో దేశవ్యాప్తంగా 30 లక్షల హెక్టార్లకు పైగా భూమి క్షీణతకు గురైంది. నేల క్షీణత కారణంగా కార్బన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌లు వాతావరణంలోకి విడుదల అవుతాయి. ఇవి మానవాళిపై విపరీత ప్రభావాలు చూపిస్తాయి. ఇండియాలో సారం కోల్పోయిన మొత్తం వ్యవసాయ భూమిలో సగానికిపైగా వర్షాధారమే. భారత్‌లో భూసార క్షీణతకు నేల కోత ప్రధాన కారణంగా నిలుస్తోంది. అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు భూసారం క్షీణించడంపై తరచూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రైతులు సైతం కడుం కట్టాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అందిపుచ్చుకోవాలి. నేల కోత నివారణలో కీలకంగా నిలిచే వనాలను విస్తృతంగా పెంచాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రతను సాధించాలంటే ఇవి ఎంతో కీలకం.

- డి.సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

‣ సాగు యాంత్రీకరణతో గిట్టుబాట

‣ అటు ఘర్షణలు... ఇటు వాణిజ్యం!

‣ పర్యావరణ మార్పుల సెగ

‣ ఉరుముతున్న అణు విలయం

Posted Date: 27-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం