• facebook
  • whatsapp
  • telegram

మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఎన్నికల ప్రక్రియలోనూ వారి భాగస్వామ్యం పెరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం స్త్రీలు వెనకబడే ఉన్నారు. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కొన్నేళ్లుగా లోక్‌సభలో పెండింగులోనే ఉండిపోయింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనూ దానిపై కదలిక వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

లోక్‌సభ, శాసనసభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తరవాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాములోనూ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఆ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దవడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందితేనే అది చట్టరూపం దాలుస్తుంది. లోక్‌సభలో మెజారిటీ ఉండే పాలక పార్టీ లేదా కూటమి తలచుకుంటేనే అది సాధ్యమవుతుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో సభామోదం కోసం ప్రభుత్వం సమర్పించదలచిన 16 బిల్లుల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు లేదు. దాంతో ఆ బిల్లుకు మరెప్పుడు ఆమోదం లభిస్తుందో తెలియడంలేదు.

విజేతల నిర్ణేతలుగా మహిళా ఓటర్లు

ఒడిశాలో ఒక గిరిజన పాఠశాల ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించి, కౌన్సిలర్‌గా ఎన్నికై, నేడు ప్రథమ గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె భారతీయ నారీ లోకానికి విశిష్ట ప్రతీక. అవకాశమిస్తే వనిత ఎంతటి ఉన్నత శిఖరాలను అధిష్ఠించగలదో ముర్ము విజయ గాథ చాటిచెబుతోంది. కానీ, భారతీయ మహిళకు రాజకీయంగా సముచిత అవకాశాలు లభించడం లేదనేది జగమెరిగిన సత్యం. 2022 అంతర్జాతీయ లింగ వ్యత్యాస నివేదికలో అంతర్భాగమైన రాజకీయ సాధికారత ఉప సూచీలో భారత్‌ 48వ స్థానంతో సరిపెట్టుకోవడం దీనికి నిదర్శనం. మన లోక్‌సభలో మహిళా సభ్యుల వాటా కేవలం 14.94 శాతం. రాజ్యసభలో వారి ప్రాతినిధ్యం 14.05శాతమే. ఇటీవల ముగిసిన గుజరాత్‌ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధుల్లో మహిళల వాటా 8.2శాతం మాత్రమే. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఇవన్నీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల లోక్‌సభకు వెల్లడించిన గణాంకాలే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 19 రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ప్రతినిధుల వాటా 10శాతం లోపే ఉంది. ఎన్నికల్లో ఓటు వేసే మహిళల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. చట్టసభల్లో అదే స్థాయిలో వారి వాటా పెరగకపోవడం శోచనీయం. 1962 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన మహిళలు        46.7 శాతం. 2019 ఎన్నికలకు వచ్చేసరికి వారు 67.18 శాతానికి పెరిగారు. 20శాతం వృద్ధి నమోదైంది. అదే కాలంలో పురుష ఓటర్ల వాటా కేవలం అయిదు శాతం (62.1శాతం నుంచి 67.08శాతానికి) పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల (67.08 శాతం)కన్నా మహిళా ఓటర్లు (67.18 శాతం) కాస్త ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. కుటుంబంలో పురుషుల నిర్దేశం మేరకే స్త్రీలు ఓటు వేస్తారని గతంలో అనుకునేవారు. అది వట్టి అపోహ అని 2014లో అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం (సీఎస్‌డీఎస్‌) సర్వే తేల్చింది. ఈ సంస్థ సర్వేలో పాల్గొన్న 70శాతం మహిళలు ఎవరికి ఓటు వేయాలో తామే నిర్ణయించుకుంటామని తేల్చి చెప్పారు. ఆ విషయంలో తమ భర్తల ప్రమేయం ఉండదన్నారు. పోనుపోను ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయికి మహిళా ఓటర్లు చేరుకొంటున్నారు. 2020 బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల చలవతోనే నీతీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి అతి స్వల్ప మెజారిటీతో అధికారం చేజిక్కించుకోగలిగింది. అప్పట్లో ఎన్‌డీఏ గెలిచిన 125 సీట్లలో 99 సీట్లు పురుషులకన్నా కాస్త ఎక్కువ సంఖ్యలో మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్న స్థానాలే. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయానికి మహిళల ఆదరణే మూల కారణం. దిల్లీలో భారతీయ జనతా పార్టీ కన్నా ఆమ్‌ ఆద్మీకి ఆరు శాతం అధికంగా పురుషుల ఓట్లు దక్కాయి. మహిళల ఓట్ల పరంగా ఈ ఆధిక్యం ఏకంగా 25శాతం.

విపక్షాల ఒత్తిడి

గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించిన జేడీ(యు) సైతం ఇప్పుడు దానికి మద్దతు తెలుపుతోంది. బిల్లు ఆమోదం కోసం భాజపా నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు జరిగిన అఖిల పక్ష సమావేశంలో, సభా కార్యక్రమాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ వచ్చింది. బిల్లుకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు అనేక ఇతర పార్టీలూ మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ (108వ రాజ్యాంగ సవరణ) బిల్లును ప్రవేశపెట్టాలని బీజేడీ కోరింది. అయినా, బిల్లుకు ఆమోదం లభించే పరిస్థితి కనిపించడంలేదు. మరెంతకాలం ఆ బిల్లు పెండింగులో ఉండిపోతుందో తెలియని స్థితి నెలకొంది. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ బిల్లు అన్ని పార్టీల ఎన్నికల అజెండాలో ముఖ్యాంశం కావాల్సిన అవసరం ఉంది.

ఒడిశా  ఆదర్శం

దేశీయంగా ఓట్లలో కనిపిస్తున్న మహిళా ఆధిక్యం ఎన్నికల్లో పోటీచేసే సీట్లలో కనిపించకపోవడం మన ఎన్నికల ప్రజాస్వామ్యంలోని పెద్ద లోపం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 726 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 575 మంది ధరావతు కోల్పోయారు. పార్లమెంటు స్థాయిలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలంటే మొదట గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మహిళల వాటా పెరగాలి. ఒడిశా రాష్ట్రం 1991లోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించింది. పంచాయతీరాజ్‌ సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను 33శాతం నుంచి 50శాతానికి పెంచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 33శాతం సీట్లను మహిళా అభ్యర్థులకు ప్రకటించిన ఏకైక పార్టీగా ఒడిశా పాలక పక్షమైన బిజూ జనతాదళ్‌ (బీజేడీ) నిలిచింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి పోరాడతానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇటీవల ప్రకటించారు.

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మధ్యాసియాతో మైత్రికి అఫ్గాన్‌ అడ్డంకి

‣ హుందాగా జీవించే హక్కుకు భంగం

‣ పౌర భాగస్వామ్యంతోనే కాలుష్యం కట్టడి

‣ కాగ్‌కు కీలక బాధ్యత

Posted Date: 21-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం