• facebook
  • whatsapp
  • telegram

అటు ఘర్షణలు... ఇటు వాణిజ్యం!

చైనా నుంచి దండిగా దిగుమతులు

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఇటీవల డ్రాగన్‌ దుష్ట వైఖరి నేపథ్యంలో భారత్‌-చైనాల వాణిజ్యం మళ్ళీ చర్చకు వచ్చింది. బీజింగ్‌తో వర్తకాన్ని దిల్లీ ఎందుకు మానుకోవడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో సరిహద్దుల్లో ఘర్షణల తరవాత వాణిజ్యం విషయంలో కేంద్రం కొన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆశించిన ఫలితం మాత్రం కరవైంది.

రెండేళ్ల క్రితం గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మన జవాన్లు 20 మంది అసువులు బాశారు.  దాంతో భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తులు, కొన్ని యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా డ్రాగన్‌ ఆర్థిక మూలాలపై భారత్‌ బలమైన దెబ్బ కొట్టిందని అంతా అనుకున్నారు. అసలు వాస్తవం పూర్తిగా దానికి భిన్నం. చైనా నుంచి ఇండియా  దిగుమతులు తగ్గకపోగా మరింత అధికమయ్యాయి.

వేగంగా అభివృద్ధి

గత ఆర్థిక సంవత్సరం భారత్‌-చైనాల ద్వైపాక్షిక వాణిజ్య విలువ పదకొండు వేల కోట్ల డాలర్లను దాటింది.  అందులో బీజింగ్‌ నుంచి దిల్లీ దిగుమతుల వాటాయే అధికం. ఎగుమతులు చాలా స్వల్పం. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో చైనా నుంచి భారత దిగుమతుల విలువ గతేడాది అదే కాలంతో పోలిస్తే 30శాతం పెరిగి 8,970 కోట్ల డాలర్లకు చేరింది. అదే సమయంలో చైనాకు భారత్‌ ఎగుమతుల విలువ 36శాతం తగ్గి 1,397 కోట్ల డాలర్లుగా నమోదయ్యింది. ఏతావతా భారత్‌కు 7,600 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు మిగిలింది. భారత్‌కు ఈ వాణిజ్య లోటు గత అయిదేళ్లుగా  కొనసాగుతోంది. అంతకుముందు కొవిడ్‌ వల్ల   సరఫరాలకు తలెత్తిన అడ్డంకుల వల్ల వాణిజ్య లోటు స్వల్పంగా దిగివచ్చింది. డ్రాగన్‌ దేశం జీరో కొవిడ్‌ విధానాన్ని అమలు చేస్తూ ఎగుమతులను కట్టడి చేసినా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15శాతం ఆక్రమించింది.

డ్రాగన్‌ దేశానికి ఇండియా ఎగుమతుల్లో ఖనిజ లోహాలు, పత్తి, ఇతర ముడి పదార్థాలు  25 శాతం కన్నా ఎక్కువగా ఉన్నాయి. బీజింగ్‌ నుంచి దిల్లీ దిగుమతుల్లో మూడింట రెండొంతులు ఎలెక్ట్రికల్‌ యంత్రాలు, వాటి ఉపకరణాలు, రియాక్టర్లు, బాయిలర్లు, ఇతర యంత్రాలు, సేంద్రియ రసాయనాలు ఆక్రమించాయి. భారత్‌ తన ముడి పదార్థాలను చైనాకు సరఫరా చేస్తుంటే, వాటిద్వారా డ్రాగన్‌ అధునాతన     యంత్రాలు, పరికరాలను రూపొందించి తిరిగి   ఇండియాకు విక్రయి స్తోంది.దీన్నిబట్టి చైనాతో పోలిస్తే తయారీ రంగంలో భారత్‌ ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది. తయారీ విషయంలో బీజింగ్‌ను ఇప్పటికిప్పుడు లేదా రాబోయే స్వల్పకాలంలో దిల్లీ అధిగమించడం చాలా కష్టం. తయారీ రంగంలో చైనా తిరుగులేని శక్తిగా ఎదగడాన్ని అమెరికా సైతం జీర్ణించుకోలేకపోతోంది. ప్రస్తుతం భారత ఫార్మారంగం అనూహ్య ప్రగతి సాధించింది. దానికి కావాల్సిన ముడిపదార్థాలను మాత్రం చైనా నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది.

ఆది నుంచి చైనా పారిశ్రామిక వస్తువుల తయారీపై దృష్టిపెట్టింది. బహుళ జాతీయ సంస్థలను ఆహ్వానించి తద్వారా పెద్దమొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించింది. భారీ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేసి, వాటిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. అవన్నీ భారీగా ఉపాధి కల్పనకు, జీడీపీ పెరుగుదలకు తోడ్పడ్డాయి. భారత ప్రభుత్వం మొదట్లో ఎఫ్‌డీఐలకు అడ్డుకట్ట వేసింది. స్వదేశీ సంస్థలను రక్షించడానికి వాటి మధ్య పోటీతత్వం పెంచకుండా అసమర్థతను ప్రోత్సహించింది. విదేశీ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే రాజకీయ పెద్దలను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి ఉండేది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం చైనా అభివృద్ధికి మరొక కారణం. చైనా 1978లోనే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. 1992 నుంచి అవి ఊపందుకొన్నాయి. సోవియట్‌ యూనియన్‌ స్ఫూర్తితో పంచవర్ష ప్రణాళికలను  చేపట్టినప్పుడు చైనా కన్నా మన దేశమే అభివృద్ధిలో కాస్త ముందుండేది. 2022 నాటికి దిల్లీకన్నా బీజింగ్‌ సుమారు అయిదు రెట్ల అధిక ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. తలసరి ఆదాయం విషయంలో భారత్‌ను చైనా 1985లోనే అధిగమించింది. అక్కడి నుంచి   శరవేగంతో దూకుడు కొనసాగించింది.

ఆత్మనిర్భరత కీలకం

వాస్తవాధీన రేఖ సమీపంలో ఇటీవల ఇండో అమెరికన్‌ దళాలు నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాలను సహించలేని డ్రాగన్‌- తవాంగ్‌ సెక్టార్‌లో తన కుత్సిత బుద్ధిని ప్రదర్శించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ మొత్తం తనదేనని అవాకులు చెవాకులు పేలుతోంది. సరిహద్దుల్లో తరచూ పేచీలకు దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతుల పరంగా డ్రాగన్‌పై భారత్‌ అధికంగా ఆధారపడటం ఎంతమాత్రం మంచిది కాదు. ఫార్మా ఉత్పత్తుల ముడిపదార్థాల విషయంలో దిల్లీ ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలకు ఎంపిక చేసిన 13 కీలక రంగాల్లో ఫార్మాకు సైతం సముచిత స్థానం దక్కడం హర్షణీయం. తయారీ రంగంలో స్వయంసమృద్ధి సాధించేందుకు భారత్‌ వడివడిగా అడుగులు వేయాలి. ఇందుకు పాలకులు పటిష్ఠ ప్రణాళికలు రూపొందించి సమర్థంగా అమలు చేయడం అత్యావశ్యకం.

మూలధన నిల్వలతో ముందంజ

భారత్‌ 1947లో స్వతంత్ర దేశంగా అవతరించింది. చాంగ్‌ కాయ్‌ షేక్‌ నేతృత్వంలోని కొమిటాంగ్‌ పాలన నుంచి డ్రాగన్‌ విముక్తి పొంది 1949లో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాగా ఆవిర్భవించింది. మావో నేతృత్వంలో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. నేడు ప్రపంచంలో ఇండియా, చైనాలు అత్యధిక జనాభా కలిగిన రాజ్యాలుగా నిలుస్తున్నాయి. ఆది నుంచి ఇరు దేశాలు అనుసరిస్తున్న రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనవి. చైనా నిరంకుశ దేశంగా ముద్రపడితే, భారత్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో ముందుకు సాగుతోంది. పంచవర్ష ప్రణాళికలతో ఇండియా గణనీయ అభివృద్ధిని సాధించింది. చైనాతో పోలిస్తే మాత్రం చాలా వెనకబడింది. 1983లో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ ఇంచుమించు సమానంగా ఉండేది. 2022 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ 18.32 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగింది. ఇండియా దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల స్థాయికే పరిమితమైంది. తక్కువ కాలంలో త్వరితగతిన పెరిగిన మూలధన నిల్వలే చైనా ప్రగతికి బాటలు వేశాయి. ఉత్పాదకత వేగం పుంజుకోవడమూ బీజింగ్‌ను మరింతగా ముందుకు నడిపింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉరుముతున్న అణు విలయం

‣ పంటల వైవిధ్యం... పోషకాహార భద్రత!

‣ ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి

‣ జగడాల చైనాకు దీటైన జవాబు

‣ ఒకే దేశం - ఒకే ఎన్నిక... ఉపయుక్తమేనా?

Posted Date: 21-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం