• facebook
  • whatsapp
  • telegram

ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

పశ్చిమాసియా దేశమైన తుర్కియేకు గత వైభవం తెచ్చిపెట్టాలని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ తహతహలాడుతున్నారు. ఇస్లామిక్‌ ప్రపంచంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకొనే క్రమంలో భారత్‌తో వైరం కొనితెచ్చుకొంటున్నారు. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్నారు.

ఆట్టమన్‌ సామ్రాజ్యం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు తుర్కియే (టర్కీ) ఇస్లామిక్‌ అగ్రరాజ్యంగా వెలిగిపోయింది. నాటి వైభవాన్ని మళ్ళీ సాధించాలని ప్రస్తుత తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ కలలు కంటున్నారు. బైరక్తార్‌ డ్రోన్లు, హర్‌జెట్‌ యుద్ధ విమానాలు, సొంతంగా యుద్ధ నౌకల నిర్మాణంతో సైనిక శక్తిగా ఎదుగుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో అందరి దృష్టినీ ఆకర్షించిన బైరక్తార్‌ డ్రోన్లతో పాటు యుద్ధ నౌకలనూ పాకిస్థాన్‌కు సరఫరా చేస్తున్నారు. సున్నీ ముస్లిం దేశాలకు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను తోసిరాజని తుర్కియే ఆ స్థానానికి ఎదగాలని ఆరాటపడుతున్నారు.

వ్యతిరేక కార్యకలాపాలు

భారత్‌ 2019లో 370వ అధికరణను రద్దు చేసినప్పుడు కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించాయి. అప్పటి నుంచి కశ్మీర్‌ సమస్యపై పాకిస్థాన్‌కు వత్తాసు పలకడం, ఆర్మేనియాపై పోరులో అజర్‌ బైజాన్‌కు తోడ్పడటం ద్వారా ఇస్లామిక్‌ ప్రపంచంలో ప్రాబల్య విస్తరణకు ఎర్డొగాన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఏడాది నవంబరులో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తుర్కియేని సందర్శించారు. తుర్కియే, పాకిస్థాన్‌, అజర్‌ బైజాన్‌లు ఆర్థికంగా, సైనికంగా పరస్పరం సహకరించుకోవాలని ఆ సమయంలో నిర్ణయించాయి. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌ (సిపెక్‌)లో చేరాలని తుర్కియేను పాక్‌ ప్రధాని ఆహ్వానించారు.

ఈ ఏడాది సమర్కండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌లు భేటీ అయ్యారు. అయినా, రెండు దేశాల మధ్య సౌహార్దం నెలకొనే సూచనలు కనిపించడం లేదు. కశ్మీర్‌ సమస్యపై భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు జరిగేలా ప్రయత్నిస్తామని కొద్ది రోజుల క్రితం ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) ప్రకటించింది. తుర్కియే అందులో సభ్య దేశమే. 2019 నుంచి పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ సమస్యను తుర్కియే లేవనెత్తుతూ వచ్చింది. భారత్‌ సైతం దానిపై ఘాటుగా స్పందించింది. 2019లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఎర్డొగాన్‌ కశ్మీర్‌ సమస్యను లేవనెత్తగానే, ప్రధాని మోదీ తుర్కియే ప్రత్యర్థులైన ఆర్మేనియా, సైప్రస్‌, గ్రీస్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్మేనియాకు భారత్‌ రాకెట్లు, ట్యాంకు విధ్వంసక క్షిపణులు, మందుగుండును సరఫరా చేస్తోంది. ఎజియన్‌ సముద్రంలోని కొన్ని దీవుల సార్వభౌమత్వంపై, తూర్పు మధ్యధరా సముద్రంలో సహజవాయు నిక్షేపాలపై గ్రీస్‌, తుర్కియేల మధ్య వివాదం నడుస్తోంది. 1974లో సైప్రస్‌ దీవిపై తుర్కియే దండెత్తి తుర్కీ సంతతివారు నివసించే మూడోవంతు భూభాగాన్ని ఆక్రమించింది. 2019 అక్టోబరులో ప్రధాని మోదీ తుర్కియే, సౌదీ అరేబియాలను సందర్శించాల్సి ఉంది. కానీ, తుర్కియే పర్యటనను రద్దు చేసుకుని సౌదీ యాత్రకు పరిమితమయ్యారు. 2020, 2021ల్లోనూ సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని తుర్కియే ప్రస్తావించింది. దాంతో తుర్కియే మొదట తన పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండాలని ఇండియా హితవు పలికింది. సమర్కండ్‌లో మోదీతో సమావేశమైన వారం రోజులకు ఎర్డొగాన్‌ సమితి సాధారణసభలో మళ్ళీ కశ్మీర్‌ సమస్యను లేవనెత్తారు. తుర్కియే పోనుపోను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇస్లామీ సంస్థలకు నిధులు సమకూరుస్తోంది. ఇన్సాన్‌ హక్‌ అనే తుర్కియే స్వచ్ఛంద సంస్థకు భారత్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) అనే తీవ్రవాద భావాలు గల సంస్థతో సంబంధాలున్నాయి. ఈ ఏడాది పట్టుబడిన కొందరు పాక్‌ ఉగ్రవాదుల వద్ద తుర్కియేలో తయారైన పిస్తోళ్లు దొరికాయి.

అప్రమత్తత అవసరం

సిరియా అంతర్యుద్ధంలో పాల్గొంటున్న జిహాదీలను జమ్మూకశ్మీర్‌కు పంపాలని తుర్కియేలో ప్రతిపాదనలు వస్తున్నాయి. సాదత్‌ అనే రహస్య పారామిలిటరీ గ్రూపు గత నెల 12న తుర్కియేలో సమావేశం జరిపినప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. అమెరికా, నాటోలు రష్యాతో పోరాడటానికి దేశదేశాల నుంచి స్వచ్ఛంద యోధులను ఉక్రెయిన్‌కు పంపుతున్నాయి. అలాంటప్పుడు ఇస్లామిక్‌ యోధులను జమ్మూకశ్మీర్‌, పాలస్తీనాలకు ఎందుకు పంపకూడదని సాదత్‌ సమావేశంలో ఒక కశ్మీరీ ఉగ్రవాది ప్రతిపాదించగా, దానికి విస్తృత మద్దతు లభించినట్లు కథనాలు వెలువడ్డాయి. తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారైన మెసుట్‌ హక్కీ, పాకిస్థానీ సెనెటర్‌ మహమ్మద్‌ తల్హా మొహమూద్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాదత్‌ సంస్థాపకుడు అద్నాన్‌ తాన్రివెర్డి తుర్కియే అధ్యక్షుడికి మాజీ సైనిక సలహాదారు. ఆయన పదవీ విరమణ పొందిన సైన్యాధికారి కూడా. అతడు ఇప్పటికీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు సైనిక, భద్రతా వ్యవహారాలపై సలహాలు ఇస్తుంటారు. అసలు సాదత్‌ను సృష్టించింది ఎర్డొగానే అని విశ్లేషకులు చెబుతారు. ఈ తరుణంలో కశ్మీర్‌లో తుర్కియే పాత్రపై భారత్‌ అప్రమత్తంగా వ్యవహరించడం తప్పనిసరి.

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!

‣ రూ.51 లక్షల జీతంతో క్యాంపస్‌ ఉద్యోగం!

‣ అంద‌రి కోసం ఆన్‌లైన్ లైబ్ర‌రీ

‣ ఎలా నెగ్గాలి సివిల్స్ ఇంట‌ర్వ్యూ?

Posted Date: 24-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం